నిరుద్యోగులకు శుభవార్త

≈> 15వేల ఉద్యోగాల భర్తీ ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం
≈> వచ్చేనెల మొదటివారం నుంచి నోటిఫికేషన్లు
≈> గరిష్ట వయో పరిమితిలో పదేళ్ల సడలింపు
≈> 6,500 కానిస్టేబుల్, 1,500 ఎస్సై పోస్టుల భర్తీ
≈> విద్యుత్ శాఖలో 2,681 ఉద్యోగాలు
≈> సాగు, విద్యుత్, వైద్యం, పంచాయతీరాజ్
≈> తదితర రంగాల్లో 4,300 పోస్టులు
≈> పోలీసు, విద్యుత్ మినహా మిగతా పోస్టుల భర్తీ టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే..

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త! ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వచ్చే నాలుగేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏటా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.. తొలివిడతగా 15 వేల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరో 10 వేల పోస్టులకు త్వరలోనే అనుమతి రానుంది. 15 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైల్‌పై సీఎం శనివారం సంతకం చేశారు. గరిష్ట వయోపరిమితిని కూడా పదేళ్లు సడలించారు. సీఎం ఆమోదం తెలిపిన ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు మొదటి వారం నుంచి నోటిఫికేషన్లు వెలువడతాయని, అందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) రంగం సిద్ధం చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. వయోపరిమితి సడలింపుపై రెండ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయి. ప్రస్తుతం ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 34 ఏళ్ల వరకు ఉండగా.. సీఎం తీసుకున్న నిర్ణయంతో 44 ఏళ్లకు పెరగనుంది. గరిష్ట వయో పరిమితిని పదేళ్లు సడలించబోతున్నారంటూ ‘సాక్షి’ శుక్రవారం నాటి సంచికలో ప్రచురించిన సంగతి తెలిసిందే.

పోలీసు శాఖకే అగ్రతాంబూలం
మొదటి దశ నియామకాల్లో పోలీసుశాఖలో 8 వేల ఖాళీలను భర్తీ చేస్తారు. వీటిలో దాదాపు 6,500 కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయని అధికార వర్గాలు వివరించాయి. మిగిలిన 1,500 పోస్టులు సివిల్, రిజర్వుడ్ సబ్-ఇన్‌ప్పెక్టర్ పోస్టులు ఉన్నాయని తెలిపాయి. విద్యుత్ శాఖలో 2,681 పోస్టులతోపాటు వ్యవసాయం, ఉద్యానవన, వైద్య ఆరోగ్యం, పురపాలక, పంచాయతీరాజ్, విద్యుత్, అగ్నిమాపక, ఆర్‌డబ్ల్యూఎస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, రవాణా, జీహెచ్‌ఎంసీ శాఖల్లో మరో 4,300 ఉద్యోగాలనుభర్తీ చేస్తారు. పోలీసు ఉద్యోగాలను స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా, విద్యుత్ శాఖ ఉద్యోగాలను జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల ద్వారా పాత విధానంలోనే భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి, జిల్లా స్థాయి ఉద్యోగాల నియామకాలకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పోలీసు, విద్యుత్ శాఖలు మినహా మిగతా ఉద్యోగాలను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయి. ఆ వెంటనే ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top