సీఎం నిర్వేదం

రాష్ట్ర విభజన అంత సులభం కాదు, తెలంగాణ అంత త్వరగా అయ్యేది కాదు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందంటూ కొంతకాలంగా పార్టీ నేతలకు గట్టిగా చెబుతూ వస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాటతీరులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ‘అధిష్టానం మన మాట వినడం లేదు. ఎన్ని ప్రయత్నాలుచేసినా ప్రయోజనం కనిపించడం లేదు. మన చేతుల్లో ఏమీ లేదు’ అంటూ నిర్వేదం వ్యక్తం చే స్తున్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో తనను కలసిన కొంతమంది మంత్రులు, నేతలతో భేటీలో సీఎం నిస్సహాయతతో మాట్లాడారని ఆయన్ను కలసిన నేతలు పేర్కొంటున్నారు.

మంత్రులు సాకే శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, శత్రుచర్ల విజయరామరాజు, సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు సీఎంతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటన విశేషాలను సీఎం పంచుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే మంత్రులూ రాజీనామాలు చేయాల్సి వస్తుందని, దానివల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. పార్లమెంటులో, అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు మన అభిప్రాయాలు చెప్పుకొనే అవకాశం కోల్పోతామన్నారు. పైగా సభలో వ్యతిరేకించే వారు లేనప్పుడు విభజన మరింత సులభం అయిపోతుందన్నారు. రాజీనామాలు చేయకుండా సభలో ఉండడం వల్ల మన సమస్యలు గట్టిగా వినిపిద్దామని, ఆ తరువాత పరిణామాలను బట్టి రాజీనామాలపై నిర్ణయం తీసుకుందామని పునరుద్ఘాటించారు.

30న విశాఖకు సీఎం: ఈనెల 30న కిరణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top