గ్యాంగ్ రేప్ చేశారు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసులో కీలక మలుపు

‘అభయ’పై దారుణానికి తెగబడిన ఇద్దరు కారు డ్రైవర్లు
తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితికి బాధితురాలు
స్నేహితులు ఆస్పత్రికి తరలించడంతో తప్పిన ప్రమాదం
నిందితుల్ని పట్టిచ్చిన సీసీ కెమెరాలు
వారిపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కిందా కేసు నమోదు

సాక్షి, సిటీబ్యూరో: మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్ ఉదంతం కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్ ఉలిక్కిపడేలా, ఢిల్లీ నిర్భయ కేసును తలపించేలా.. ఇద్దరు కారు డ్రైవర్లు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని కారులో దాదాపు 25 కి.మీ తీసుకువెళ్లి వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిర్ధారణైంది. యువతి నెలసరిలో ఉన్నప్పటికీ కారులోనే పెనుగులాట మధ్య 40 నిమిషాలకు పైగా ఇద్దరూ అత్యాచారం జరపడంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావమైంది. దయనీయమైన స్థితిలో హాస్టల్‌కు చేరిన యువతిని స్నేహితులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. బాధితురాలికి సంబంధించిన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆమెకు ‘అభయ’ అనే పేరు పెట్టారు.

గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ వివరాలు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన అభయ (22) ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చి గౌలిదొడ్డిలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప ని చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విధులు ముగించుకుని.. ఇనార్బిట్ మాల్‌లో షాపింగ్ తర్వాత రాత్రి 7.30 సమయంలో హాస్టల్‌కు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. అర్ధగంట తర్వాత వచ్చిన ఓ బస్సు ఎక్కింది. చిన్న తప్పు.. చాటింగ్ తెచ్చిన ముప్పు: బస్సు ఏమార్గంలో వెళుతుందో అంచనా వేయడంలో చేసిన చిన్న పొరపాటు దారుణానికి నాంది పలికింది. బస్సు తాను వెళ్లాల్సిన మార్గం నుంచి వేరే రూట్‌లోకి మళ్లడంతో అభయ రహేజా మైండ్‌స్పేస్ చౌరస్తా వద్ద దిగిపోయింది. అక్కడినుంచి గౌలిదొడ్డి వెళ్లేందుకు తిరిగి మైండ్‌స్పేస్ చౌరస్తాకు వచ్చింది. 8.40 గంటల ప్రాంతంలో తెల్లరంగు కారు వచ్చింది. డ్రైవర్ ఎక్కడకు వెళ్లాలని అడిగి ఆమెను కారు ఎక్కించుకున్నాడు. కారు వెనక సీట్లో మరో వ్యక్తి ఉన్నాడు.

ఆ ప్రాంతంలో షేరింగ్ ప్రయాణాలు సాధారణం కావడంతో అతడూ తన మాదిరే ఉద్యోగై ఉంటాడని అభయ భావించింది. తర్వాత కారు ఎటు వెళుతున్నదీ గమనించకుండా స్నేహితుడితో సెల్‌ఫోన్ చాటింగ్‌లో మునిగిపోయింది. ఖాజాగూడ జంక్షన్‌కు చేరుకున్న కారు అక్కడ ఎడమ వైపు తిరిగింది. గౌలిదొడ్డి వెళ్లడానికి కుడివైపు తిరగాల్సిన కారు మరోదిశకు మళ్లడాన్ని అభయ చూడలేదు. చివరకు కారు ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఎక్కుతున్నప్పుడు ఆమె గమనించినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. అభయ కేకలు బయటకు విన్పించకుండా కారు అద్దాలను మూసేసి నిందితులు అప్పా జంక్షన్ మీదుగా 22కిమీ దూరంలోని కొల్లూరు జంక్షన్ వరకు రింగ్‌రోడ్ పైనే ముందుకువెళ్లారు. తర్వాత సర్వీస్ రోడ్డులోకి దింపి లింగంపల్లి మార్గంలో ఉన్న బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక దట్టమైన టేకు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. నిన్నూ, నీ తల్లిదండ్రులను కూడా చంపుతామని బెదిరిస్తూ ముందుగా డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి, ఆ తరవాత మరోవ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత హాస్టల్ వద్ద వదిలేశారు. విషయం ఎవరికి చెప్పినా చంపేస్తామని హెచ్చరించారు. హాస్టల్‌కు చేరిన అభయను స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అర్ధగంట ఆలస్యమైతే ఆమెకు ప్రాణహాని జరిగేదని వైద్యులు వెల్లడించారు.

సెల్‌ఫోన్‌లోనే స్నేహితుడికి సమాచారం: డ్రైవర్ దారి మళ్లించి తీసుకెళుతున్నాడని గమనించిన అభయ సెల్‌ఫోన్‌లోనే బెంగళూరులోని తన స్నేహితుడికి విషయం తెలిపింది. అతడి సలహాతో కేకలు పెట్టడంతో ఆమె సెల్‌ఫోన్ లాక్కున్న దుండగులు స్విచ్ఛాఫ్ చేశారు. ఈలోగా మరోసారి కాల్ చేసిన అభయ స్నేహితుడు ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో హైదరాబాద్ బాలానగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు శ్రీనివాస్‌కు విషయం చెప్పాడు. అతను రాత్రి 10.50 గంటలకు మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ నారాయణ గౌడ్, ఏసీపీ కేవీ రాంనర్సింహారెడ్డికి సమాచారమిచ్చాడు. వారు గాలించినా అభయ ఆచూకీ లభించలేదు.

ఇంతలో ఆమె హాస్టల్‌కు చేరుకున్న సమాచారం తెలిసింది. తాను ఎక్కింది తెల్లరంగు కారని, డ్రైవర్ పేరు సతీష్ అని అభయ పోలీసులకు చెప్పింది. దర్యాప్తులో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్‌కు చెందిన సీసీ కెమెరాను పోలీసులు పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి 12.04లకు స్కూల్ ముందు నుంచి తెల్లకారు సమీపంలోని పొదల వైపు వెళ్లినట్లు, తెల్లవారుజామున 1.02 గంటలకు తిరిగి వెనక్కు వెళ్లినట్లు గుర్తించారు. ఆ ఫుటేజ్ అస్పష్టంగా ఉంది. సతీష్ అనే పేరుతో డ్రైవింగ్ లెసైన్సులు కలిగిన వారి వివరాలు ఆరా తీయగా, రాష్ట్రంలో 50 వేల మందికి ఆ పేరుతో లెసైన్సులు ఉన్నట్లు తేలడంతో మరోసారి సీసీ కెమెరా ఫుటే జీని ఆశ్రయించారు. ఎన్‌ఐఏ సహకారంతో అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఫుటేజ్‌ను అభివృద్ధి చేసిన అధికారులకు కీలకాధారాలు లభించాయి. సదరు కారు వోల్వో కంపెనీకి చెందిన ఎస్-60 మోడల్‌గా గుర్తించారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఓల్వో షోరూమ్‌లో విచారించి అది ఏపీ 09 టీవీఏ 2762 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన కారుగా గుర్తించారు.

ఇద్దరూ కారు డ్రైవర్లే: పీయూష్ అనే వ్యక్తి ఈ కారును 24ఁ7 ట్రాన్స్‌లైన్ ట్రావెల్స్‌కు అద్దెకిచ్చాడు. అలెగ్జాండర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సేల్స్‌మేనేజర్‌గా పనిచేస్తున్న సీపీ అగర్వాల్ దానిని వాడుతున్నారు. వరంగల్‌కు చెందిన వెడిచెర్ల సతీష్ (30) డ్రైవర్. ఈ కారు డ్రైవర్ సతీషే నిందితుడిగా రూఢీ చేసుకున్న పోలీసులు అతడికి అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ రోజు కారులో ఉన్నది నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన తన స్నేహితుడు, కారు డ్రైైవర్ నెమ్మడి వెంకటేశ్వర్లు (28)గా సతీష్ వెల్లడించాడు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. సతీష్, వెంకటేశ్వర్లు కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండలో ఉంటున్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించిన సంయుక్త పోలీసు కమిషనర్ యం.శివప్రసాద్, అదనపు డీసీపీ జానకీ షర్మిల, ఎస్‌ఓటీ ఓఎస్డీ యస్.గోవర్ధన్‌రెడ్డి, ఏసీపీ రాంనర్సింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు పి.నారాయణ, కుషాల్కర్, చంద్రశేఖర్, బాలకోటిలను కమిషనర్ అభినందించారు. నిందితులపై ఐపీసీ 363, 364, 365, 366, (కిడ్నాప్) 376 (డి) (గ్యాంగ్‌రేప్) సెక్షన్లు, 2013 నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

వైఎస్ జగన్ దిగ్భ్రాంతి : హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్భయ తరహా సంఘటనలు హైదరాబాద్‌లోనూ చోటు చేసుకోవడం చాలా తీవ్రమైన అంశమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పూర్వాపరాలను పరిశీలించి ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దుండగుల చేతిలో శారీరక, మానసిక హింసకు గురైన బాధితురాలు త్వరగా కోలుకోవాలని జగన్ మంగళవారం నాటి ప్రకటనలో ఆకాంక్షించారు. ప్రభుత్వం ఆమెకు అవసరమైన వైద్య సదుపాయాలను అందించడంతో పాటు ఈ ఘోరానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top