శాంతిభద్రతలు కేంద్రం చేతికి!

హైదరాబాద్‌లో శాంతిభద్రతల యంత్రాంగాన్ని పూర్తిగా తన పర్యవేక్షణలోకి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం శనివారం జరిపిన సమావేశంలో బృందం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఈ మేరకు స్వయంగా ప్రతిపాదన చేసినట్టు సమాచారం! రెండు రాష్ట్రాల పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైద్రాబాద్ పాలనా వ్యవస్థ, శాంతిభద్ర తల పరిరక్షణ, నగరంతో పాటు తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రుల భద్రతకు తీసుకోవాల్సిన చట్టబద్ధమైన చర్యలపై హోం శాఖ ప్రతిపాదనలతో కూడిన ప్రాథమిక నివేదికను జీవోఎం ముందుంచిన షిండే... నగర శాంతిభద్రతలను పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనను కూడా ఈ సందర్భంగానే తెరపైకి తెచ్చారంటున్నారు. అయితే కీలకమైన రెవెన్యూ విభాగాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చే అంశం మాత్రం ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం.

ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల కేటాయింపులను బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాతిపదికగా నిర్ధారించాలని, దాంతోపాటు వాటి సక్రమ అమలు కోసం అంతర్రాష్ట్ర వివాద పరిష్కార ట్రిబ్యునళ్లకు బదులు చట్టబద్ధమైన నదీజలాల వినియోగ బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా జీవోఎం పరిశీలనకు వచ్చినట్టు చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే క్రమంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఇమిడి ఉన్న న్యాయపరమైన చిక్కులను, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎదురయ్యే అభ్యంతరాలను అధిగమించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై కూడా ప్రాథమిక చర్చ జరిగినట్టు తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై తీసుకోవాల్సిన చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వివరించారు.

విభజనతో ముడివడి ఉన్న కీలకాంశాలపై నవంబర్ 5వ తేదీ దాకా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని జీవోఎం తీర్మానించింది. ఇప్పటిదాకా అందిన ఇ-మెయిళ్లలోని సమాచారాన్ని, నవంబర్ 5 దాకా లభించే సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని సిద్ధం చేసే తుది నివేదికల ఆధారంగానే హైదరాబాద్ ప్రతిపత్తి, నదీజలాలు, విద్యుత్ పంపిణీ, ఆదాయ వనరులు, సిబ్బంది పంపిణీ, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వంటి కీలకాంశాలపై సిఫార్సులను ఖరారు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇ-మెయిల్ ద్వారా ప్రజలు తదితర వర్గాల నుంచి వచ్చే సూచనలు, సిఫార్సులకు తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఇతరుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి అంశాలవారీగా సిఫార్సులు, సూచనలతో నివేదికలు రూపొందించే బాధ్యతను ఆయా శాఖలకు చెందిన కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులకు జీవోఎం అప్పగించింది. నవంబర్ 7న మరోసారి సమావేశమై వారి నివేదికలను కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత పలు అంశాలపై కేంద్ర మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులను ఖరారు చేసేందుకు నవంబర్‌లో బహుశా ఒకట్రెండుసార్లు జీవోఎం సమావేశమయ్యే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. జీవోఎం నివేదిక సమర్పించాక కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో తెలంగాణ బిల్లు తయారవుతుందని, దాన్ని రాష్ట్రపతి ద్వారా బహుశా డిసెంబర్ ఒకటి, రెండు వారాల్లో శాసనసభ అభిప్రాయం కోసం పంపవచ్చని పేర్కొన్నాయి.

పరిశీలనకు సమయం పడుతుంది: షిండే

జీఓఎం రెండో భేటీ శనివారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో షిండే అధ్యక్షతన జరిగింది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మినహా మిగతా సభ్యులు పి.చిదంబరం, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్, వి.నారాయణసామి హాజరై గంటన్నర పాటు చర్చించారు. వివిధ అంశాలపై అందిన సమాచారం ఆధారంగా రూపొందించిన నివేదికలను పరిశీలించారు. అన్ని ప్రాంతాల ప్రజలను సాధ్యమైనంత ఎక్కువగా సంతృప్తిపరచగలిగేలా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. భేటీ అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో కలిసి వచ్చే సమావేశం నాటికి అంశాలవారీగా కూలంకషంగా నివేదికలను సమర్పించాల్సి ఉంటుందని తెలియజేశారు. ‘‘మాకందిన ఇ-మెయిళ్లలోని సూచనలను పరిశీలించడానికి సమయం పడుతుంది. అంశాలవారీగా అందుబాటులోకి వచ్చే నివేదికలను నవంబర్ 7న భేటీలో పరిశీలించి చర్యలకు ఉపక్రమిస్తాం’’ అన్నారు. గతంలో రాష్ట్రాల విభ జన, కొత్త రాష్ట్రాల ఏర్పాటులో అనుసరించిన నిర్దిష్టమైన విధివిధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పదంగా మారిన అన్ని అంశాలపైనా ఆమోదయోగ్యమైన, సముచిత పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు జీవోఎం ప్రయత్నిస్తోందని అందులోని సభ్యుడు ఒకరు వెల్లడించారు.

అభిప్రాయాలు, సూచనలు పంపండి: హోం శాఖ

రాష్ట్రంలోని పలు పార్టీలు, ప్రజాప్రతినిధులు, పౌరులు, ప్రజా సంఘాలు జీవోఎం పరిశీలనాంశాలపై తమ అభిప్రాయాలను నవంబర్ 5 వరకూ తెలియజేయవచ్చని జీవోఎం భేటీ అనంతరం విడుదలైన ఒక అధికార ప్రకటన తెలియజేసింది. వాటిని కేంద్ర హోం శాఖ వెబ్‌సైట్ చిరునామాకు ఇ-మెయిల్ ద్వారా గానీ, న్యూఢిల్లీ జైసింగ్ రోడ్‌లోని ఎన్‌డీసీసీ-11 బిల్డింగ్‌లో ఉన్న హోం శాఖ కేంద్ర-రాష్ట్ర విభాగానికి పోస్టు ద్వారా గానీ పంపవచ్చని పేర్కొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top