వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు బిగించేందుకు యత్నం

ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పేరుతో ఆ పథకం లక్ష్యాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంకు దర్శకత్వంలో ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నగదు బదిలీ పేరుతో కొన్ని యూనిట్లకే ఉచిత విద్యుత్‌ను పరిమితం చేసి రైతులపైనా భారం మోపటంతో పాటు అంతిమంగా వ్యవసాయానికి మీటర్లు బిగించేందుకే ఈ తతంగం నడుస్తోంది. ఇందుకోసం ప్రపంచబ్యాంకు తయారుచేసిన ‘వ్యవసాయానికి నేరుగా నగదు బదిలీ’ ముసాయిదా నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నివేదికపై ఢిల్లీలో ఈ నెల 4వ తేదీన జరిగిన సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహు పాల్గొన్నారు.

ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు తాము సిద్ధమని ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిసింది. దీనిని అమలులోకి తెస్తే.. రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా మీటర్లు బిగిస్తారు. వ్యవసాయానికి వినియోగించుకున్న కరెంటులో నిర్ణీత యూనిట్ల మేరకే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని నిర్ణయిస్తారు. ఆ సబ్సిడీని కూడా.. రైతులు ముందుగా బిల్లు మొత్తం కట్టేయాలని, ఆ తర్వాత తాము సబ్సిడీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్తారు. ప్రస్తుతం వంట గ్యాస్ సబ్సిడీకి నగదు బదిలీ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు గ్యాస్ సిలిండర్‌కు పూర్తి మొత్తం చెల్లించాక.. సబ్సిడీ సొమ్మును బ్యాంకుల్లో జమచేస్తున్నారు. అయితే.. నెలలు గడుస్తున్నా గ్యాస్ సబ్సిడీ సొమ్ము బ్యాంకులో జమకావడం లేదు. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ అమలు చేస్తే ఇదే తరహాలో సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తనుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రాథమిక అధ్యయనం పూర్తి..!
ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ఇంధనశాఖ ప్రాథమిక అధ్యయనాన్ని పూర్తిచేసింది. నాలుగు నెలల కిందట ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి మృత్యుంజయ్‌సాహు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ (ఏపీపీసీసీ) విద్యుత్ సౌధలోసమావేశమయింది. నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నగదు బదిలీ పథకం అమలు చేయాలంటే.. ప్రాథమికంగా ఏయే రైతు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలియాల్సి ఉంటుందని, ఇందుకోసం మీటర్లు బిగించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సమర్పించిన నివేదిక తేల్చింది. తద్వారా ఎంత విద్యుత్‌ను వినియోగించారనే విషయం తేలుతుందని.. మొదట రైతు బిల్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అనంతరం ప్రభుత్వం నేరుగా బ్యాంకు అకౌంటులోకి సబ్సిడీని జమ చేయవచ్చునని చెప్పింది. అంటే కరెంటు భారాన్ని మొదట రైతు చెల్లించిన తర్వాతే సబ్సిడీ వస్తుందన్నమాట.

రైతులపైనా భారం వేసేందుకే..!
రాష్ట్రంలో 31.5 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేవు. కేవలం గుండుగుత్తగా ఇంత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని లెక్కిస్తూ.. ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే.. నగదు బదిలీ పథకం అమలుకు ఇది అడ్డంకిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేకపోవటంతో ఫలానా రైతు కచ్చితంగా ఎంత విద్యుత్‌ను వినియోగించాడనే విషయం తెలియడం లేదు. ప్రస్తుతం ఉచిత విద్యుత్ వినియోగాన్ని ఈ విధంగా లెక్కిస్తున్నారు.. 5 హార్స్ పవర్ (హెచ్‌పీ) మోటారు రోజుకు 7 గంటలు విద్యుత్‌ను వినియోగిస్తే 5.25 యూనిట్ల విద్యుత్ కాలుతోందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదిలో 300 రోజులకు గాను ఒక్కో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ 1,575 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుందని అంచనా కట్టారు. ఇన్ని యూనిట్లకు గాను విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును లెక్కించి.. ఆ మొత్తం సబ్సిడీని విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఇస్తోంది. అయితే.. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు లేకపోవటం వల్ల కచ్చితంగా ఇంత విద్యుత్‌ను వినియోగిస్తున్నారన్న లెక్కలు లేవు. నగదు బదిలీ పథకం పేరుతో వ్యవసాయానికి మీటర్లు బిగించడంతో పాటు కరెంటు బిల్లును మొదట రైతులు చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. అదేవిధంగా మొత్తం భారాన్ని సబ్సిడీగా భరించలేమని.. కొన్ని యూనిట్ల వరకు మాత్రమే సబ్సిడీ ఇచ్చి అంతకు మించితే మొత్తం బిల్లును రైతులే చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధనను కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల తరహాలోనే ఉచిత విద్యుత్‌కూ పరిమితులు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్ భారాన్ని రైతుపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నమాట.

చంద్రబాబు బాటలోనే..!
వాస్తవానికి విద్యుత్ పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రయివేటు పరం చేయాలని ప్రపంచ బ్యాంకు ఎప్పటి నుంచో చెప్తోంది. ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా బ్యాంకు వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ఉచిత విద్యుత్ పథకానికి ప్రపంచ బ్యాంకు ఒప్పుకోదని.. అందుకే ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే.. 2004 ఎన్నికల అనంతరం ప్రపంచ బ్యాంకు పెత్తనాన్ని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యతిరేకించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రయివేటీకరించబోమని తేల్చిచెప్పారు. కానీ ఆయన మరణానంతరం తిరిగి రాష్ట్ర విద్యుత్ రంగంపై ప్రపంచ బ్యాంకు పెత్తనం చేయటం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పేరుతో మీటర్లు బిగించడం ద్వారా పరిమితులు విధించాలని కుట్ర పన్నిందనే విమర్శలు ఉన్నాయి.

తీవ్రంగా ప్రతిఘటిస్తాం
ప్రజలకు అందిస్తున్న సబ్సిడీలను ఎగవేసేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే నగదు బదిలీ పథకం అమల్లోకి వచ్చింది. ఇందుకు ఉదాహరణ వంట గ్యాస్‌కు నగదు బదిలీ. గ్యాస్‌కు నగదు బదిలీ పేరుతో 50 రూపాయల వ్యాట్‌ను ప్రజలపై రుద్దారు. నగదు బదిలీ విధానంలో ధరలను పెంచేందుకు, సబ్సిడీలకు కోత పెట్టేందుకూ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం రూ. 3,000 కోట్లు సబ్సిడీగా చెల్లిస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీని వర్తింపచేస్తే.. అన్ని పంపుసెట్లకు మీటర్లు పెట్టాలి. మీటరు రీడింగ్‌ను బట్టి చార్జీ వేస్తారు. ఉదాహరణకు ఒక రైతు రూ. 200 చెల్లిస్తే.. నగదు బదిలీగా మొదటి నెలలో రూ. 200 ఇస్తారు. ఆ తర్వాత నెలలో కేవలం రూ. 150 ఇస్తారు. దానిని తర్వాత 100 రూపాయలకు తగ్గిస్తారు. ఆ తర్వాత 50 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఆనక పూర్తిగా ఎగవేస్తారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేయాలని ప్రపంచ బ్యాంకు చాలా సీరియస్‌గా ఉంది. నాగార్జునసాగర్ ఆధునీకరణకు ఇచ్చిన రుణంలో ప్రపంచ బ్యాంకు విధించిన మొదటి షరతు ఉచిత విద్యుత్ ఎత్తివేయడం. ఇందుకు కిరణ్ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో రైతుసంఘాలు తీవ్ర ఉద్యమాన్ని చేపడతాం.
- సారంపల్లి మల్లారెడ్డి, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు

‘ఉచిత’ భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడ
ప్రస్తుతం వ్యవసాయంలో ఎవరు ఎంత వినియోగిస్తున్నారనే లెక్కలు లేవు. ఎందుకంటే మీటర్లు లేవు కాబట్టి. నగదు బదిలీ పథకం పేరుతో మీటర్లు పెట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. తర్వాత దీనికి రైతులను అలవాటు చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. వాస్తవానికి రైతులు అడుగుతున్నవి ఇవి కాదు. వారికి నాణ్యమైన కరెంటు రావడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే బాగు చేసేవారు లేరు. లో-ఓల్టేజీ, లైన్లు తెగిపోవడం వంటి సమస్యలున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఈ పథకాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు? మొత్తంగా ఇది రైతుకు ఉపయోగపడదని వారికి (ప్రభుత్వానికి) కూడా తెలుసు. ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకే ఈ ప్రయత్నాలని అర్థమవుతోంది.
- నర్సింహారెడ్డి, చేతన సొసైటీ వ్యవస్థాపకుడు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top