విభజనకు 23 జిల్లాల ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిందే

రాష్ట్ర విభజనపై 23 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజన ప్రకటనను కేంద్రం వెంటనే వెనక్కు తీసుకోవాలని సభలో పాల్గొన్న నేతలందరూ ఏకకంఠంతో డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా భయపడేది లేదని, ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఢిల్లీ పీఠం దిగివచ్చేదాక సమైక్యాంధ్ర ఉద్యమం ఆగదని తేల్చిచెప్పారు. జేఏసీ నిర్వహించిన ఈ సభలో ఉద్యోగ సంఘాలతోపాటు విద్యార్థి, న్యాయవాద, వైద్య, రైతు, ఆర్టీసీ, కళాకారుల సంఘాల ప్రతినిధులు కూడా తమ వాణిని వినిపించారు. సాయంత్రం నుంచి వర్షం పడుతూనే ఉన్నా... పెద్దసంఖ్యలో ఉద్యోగులు, సమైక్యవాదులు సభకు కదలివచ్చారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో జోరువానగా మారినా... ఒక్కరు కూడా కదలకుండా సమైక్య నినాదం వినిపించారు. ఐదు గంటలపాటు జరిగిన సభ సమైక్య స్ఫూర్తిని వెలుగెత్తి చాటింది.

ఎలాంటి పరిస్థితులెదురైనా ముందుకే: అశోక్‌బాబు
జోరువానలోనూ కదలకుండా సమైక్య నినాదం చేస్తున్న జనవాహినిని చూస్తుంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే న మ్మకం కలిగిందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కన్వీనర్ పరుచూరి అశోక్‌బాబు చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, రాష్ట్రం సమైక్యంగా ఉండి తీరుతుందని ప్రకటించారు. ఆయన మాట్లాడే సమయానికి కుంభవృష్టి కురియడంతో తన ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు.

సభలో మొదట విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ... కేసీఆర్ ‘తెలంగాణా వాలా జాగో... ఆంధ్రావాలా భాగో’ నినాదాన్ని ఇచ్చారని, ఇప్పుడు ‘తెలుగువాలా జాగో... కేసీఆర్ భాగో’ అని నినాదం ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టడానికి రాజకీయ పార్టీలే కారణమని దుయ్యబట్టారు. తెలంగాణపై నిర్ణయం ఆగడానికి కేంద్ర మంత్రులు కారణం కాదని, శాంతియుతంగా ఉద్యమిస్తున్న కోట్లాదిమంది ప్రజలే కారణమని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనం కాదని... ఇదే సీడబ్ల్యూసీ 2001లో రెండవ ఎస్సార్సీ కోసం తీర్మానం చేసి తర్వాత మార్చుకుందని గుర్తు చేశారు. ఆక్టోబర్‌లో ఢిల్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.

ఐక్యతకు వందేళ్ల చరిత్ర
తెలుగుజాతి ఐక్యత కోసం జరుగుతున్న ఉద్యమానికి వందేళ్ల చరిత్ర ఉందని, తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్రమహాసభ ఊపిరులూదితే, సీమాంధ్ర ప్రజలు తోడ్పాటు ఇచ్చారని ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్‌లో రెండవ తరగతి ప్రజలుగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేసి అసెంబ్లీ లేకుండా చేస్తే బిల్లు ఎలా ముందుకెళ్తుందని నిలదీశారు. ఆంటోనీ కమిటీ దాని పని అది చేసుకుంటూ పోతుందని, షిండే తన పని తాను చేసుకుంటూ వెళ్తారని కాంగ్రెస్ ప్రతినిధులు తివారీ, చాకో చెబుతున్నా... కేంద్ర మంత్రులు, ఎంపీలు సిగ్గు, లజ్జా లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. అవాస్తవ పునాదులపై తెలంగాణను నిర్మిస్తున్నారని ఆంధ్రామేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తప్పుబట్టారు. రాజధాని కోసం నాలుగైదు లక్షల కోట్లు ఇస్తారనే ప్రచారాన్ని నమ్మితే మోసపోవడం ఖాయమని చెప్పారు.

ఎన్నిసార్లు రాజధాని వెతుక్కోవాలి?
శాతవాహనుల కాలంలో అమరావతి, కాకతీయుల కాలంలో వరంగల్, కృష్ణదేవరాయల కాలంలో హంపి, చంద్రగిరి రాజు తండ్రి చెన్నగిరి పేరుతో ఏర్పాటైన చెన్నపట్నం, ఆ తర్వాత కర్నూలు, అక్కడినుంచి హైదరాబాద్, ఇప్పుడు మరో రాజధాని వెతుక్కోమంటున్నారని... పిల్లి తన పిల్లలను తిప్పినట్లుగా మేం తిరగాల్సిందేనా అని కృష్ణాజిల్లా జేఏసీ నాయకులు విద్యాసాగర్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వస్తే రెఫరెండం పెట్టి నిర్ణయం తీసుకోవాలని ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి డిమాండ్ చేశారు. మగవాళ్ల మీసకట్టులోనే పౌరుషం లేదని, ఆడవారి చీరకట్టులోనూ ఉందని మహిళలు ఉద్యమంతో నిరూపిస్తున్నారని విద్యార్థి జేఏసీ నేత దేవినేని అవినాష్ ప్రశంసించారు. ఎన్నిరోజులైనా ఉద్యమించడానికి విద్యార్థిలోకం సిద్ధంగా ఉందని ప్రకటించారు. దళితులు బయట దేశాలకు వెళ్లి చదువుకుని ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదని, కనీసం హైదరాబాద్‌కు పంపే పరిస్థితి లేకుండా చేస్తారా అని మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ప్రశ్నించారు.

తెలుగుప్రజల మధ్య చిచ్చు పెడుతున్న మంద కృష్ణమాదిగను సీమాంధ్రలో అడుగుపెట్టనివ్వబోమని ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు చెప్పారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆర్టీసీ నినాదంతో ఉద్యమంలో ముందుకు వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలనాయకులు ప్రసాద్, వైవీరావులు చెప్పారు. ప్రజలందరూ ఉద్యమంలో ఉంటే... ఉద్యమం చేయని నేతలు ఏ జాతికి చెందుతారని విద్యార్థి నేత కృష్ణయాదవ్ ప్రశ్నించారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి రాష్ట్రంలో స్థిరపడ్డ వ్యాపారి ప్రదీప్ గోయల్, విద్యుత్ జేఏసీ నేత సాయిబాబు, న్యాయవాద జేఏసీ నేత మట్టా జయకర్, తెలంగాణకు చెందిన పలువురు నేతలు సభలో ప్రసంగించారు.

మంత్రులు, ఎంపీల వైఖరేమిటో చెప్పాలి
తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే ప్రకటించిన నేపథ్యంలో కేంద్రమంత్రులు, ఎంపీలు ఏం చేయబోతున్నది చెప్పాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కన్వీనర్ పరుచూరి అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ముందు విలేకరులతో మాట్లాడుతూ... కొందరు ఎంపీలు మాత్రమే రాజీనామాలను ఆమోదించుకుంటామని చెబుతున్నారని, మిగిలిన వారు కూడా రాజీనామా చేయాలని కోరారు. అసెంబ్లీలోకి తెలంగాణ బిల్లు వస్తే వ్యతిరేకించాలని తెలంగాణ ఎమ్మెల్యేలను కూడా కోరతామన్నారు. కాంగ్రెస్ పెద్దలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. తెలంగాణపై వారు వెనక్కివెళ్లే అవకాశం లేకపోవచ్చుగాని, ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. కేబినెట్ నోట్ సర్క్యులేట్ అయిన తర్వాత కేంద్ర మంత్రుల స్పందన చూసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top