ఎమ్మెల్యే బోండా ఉమ తనయుడిపై కేసు నమోదు

కారు రేస్లపై గుంటూరు జిల్లా యడ్లపాడు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. 304 (A), 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు యడ్లపాడు పోలీసులు తెలిపారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కారు అత్యంత వేగంగా నడపటం వల్లే ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని పోలీసులు తెలిపారు.

కాగా వేగంగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి అంతే వేగంతో వెళ్తున్న మరో కారును ఢీకొన్న సంఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. కార్లు పల్టీలు కొట్టే సమయంలోనే ఇంజినీరింగ్ విద్యార్థి నాగేంద్ర (22) జాతీయ రహదారిపై పడి మృతి చెందాడు.

ఇక ఎమ్మెల్యే కుమారుడు రేస్లో పాల్గొనటం ఇది తొలిసారి కాదు. కొద్ది నెలల కిందట విజయవాడ తాడిగడప వద్ద బైక్ రేస్లో పాల్గొనగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కుమారుడిపై కేసు లేకుండా మాఫీ చేసుకున్నారని, అప్పుడే పోలీసులు చర్య తీసుకుని ఉంటే ఇప్పుడు ఓ విద్యార్థి బలయ్యేవాడు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top