సమైక్య ఉద్యమంతో స్తంభించిన రవాణా

రాష్ట్ర విభజన నిర్ణయం రాజేసిన ‘సమైక్య’ ఉద్యమ ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది. రాజధాని హైదరాబాద్, సీమాంధ్ర ప్రాంతాల మధ్య రోడ్డు రవాణా దాదాపు స్తంభించిపోయింది. హైదరాబాద్ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణిస్తారని, సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు కూడా రోజూ 50 వేల మంది వరకు వస్తారని అంచనా. అంటే ఇరువైపులా కలిపి రోజూ దాదాపు లక్ష మంది ప్రయాణిస్తారు. కానీ సమైక్య ఉద్యమం ప్రారంభమైన గత నెల 31 నుంచి రాజధాని, సీమాంధ్ర మధ్య ప్రయాణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మంగళవారం కేవలం 10 వేల మంది రాకపోకలు సాగించారని అంచనా. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించింది. కోస్తాంధ్ర, హైదరాబాద్ మధ్య కొన్ని బస్సులు తిరుగుతున్నా ప్రయాణికులు పెద్దగా లేరు.
హైదరాబాద్ నుంచి రాయలసీమ జిల్లాలు.. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరుకు రోజూ 260 బస్సులను రాత్రి సర్వీసులుగా ఆర్టీసీ తిప్పుతోంది. ఇదే సంఖ్యలో రాయలసీమ జిల్లాల నుంచి రోజూ ఉదయాన్నే హైదరాబాద్‌కు వస్తాయి. వీటిలో ఒక్క బస్సును కూడా ఆర్టీసీ తిప్పడం లేదు. సాధారణ పరిస్థితుల్లో ప్రయివేటు బస్సులు కూడా దాదాపు ఇదే సంఖ్యలో తిరుగుతాయి. కానీ ఇప్పుడు.. అవి కూడా పరిమిత సంఖ్యలోనే ఈ రూట్లలో తిరుగుతున్నాయి. ప్రముఖ ప్రయివేటు ఆపరేటర్లు రాయలసీమ రూట్లలో బస్సులను నిలిపివేశారు. ఇక హైదరాబాద్, కోస్తాంధ్ర మధ్య పరిస్థితి కూడా దాదాపు ఇదే తీరుగా ఉంది. సాధారణ పరిస్థితుల్లో కోస్తాంధ్ర, హైదరాబాద్ మధ్య ఇటు 700, అటు 700 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఇప్పుడు రెండు వైపులా కలిపి 100 బస్సులు కూడా నడవడం లేదు. నడుపుతున్న బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ రేషియో (ప్రయాణికుల సంఖ్య) అతి తక్కువగా ఉందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సమైక్య ఉద్యమానికి తోడు వర్షాలు, వరదల ప్రభావం కూడా ఆర్టీసీ బస్సుల రాకపోకల మీద పడిందని, ఫలితంగా పెద్ద సంఖ్యలో కోస్తాంధ్రకు సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించాయి. ఇక సరిహద్దు జిల్లాల డిపోల నుంచి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే వందలాది సర్వీసులు కూడా సమైక్య ఉద్యమ ప్రభావంతో పరిమిత సంఖ్యలోనే నడుస్తున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top