పొత్తులపై బాబు జిత్తులు!

పార్టీ టికెట్లిప్పిస్తామంటూ విరాళాల పేరుతో భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడటమే కాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీలో కర్రపెత్తనం చలాయించాలని చూడటమేంటని బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు మండిపడుతున్నారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో పరస్పరం ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత నామినేషన్లకు గడువు దగ్గర పడుతున్న సమయంలో ఈ కొత్త డ్రామాలేంటని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. బీజేపీకి బలం లేదంటూ చంద్రబాబు తాజాగా చేస్తున్న ప్రచారం తప్పకుండా సీట్ల బేరం పెట్టే ఎత్తుగడలో భాగమేనని స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలను సమీక్షించిన బీజేపీ నేతలు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై, ఆయనతో పొత్తు పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసిన జాతీయ నేతలపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు లాంటి విశ్వసనీయత లేని నాయకుడున్న టీడీపీతో అసలు పొత్తు వద్దేవద్దని ఇరు ప్రాంతాల నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా తమపై ఒత్తిడి చేసి మరీ పొత్తు కుదుర్చుకోవాలని చెప్పిన బీజేపీ జాతీయ నాయకులనువారు తప్పుబడుతున్నారు. దేశం, రెండు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు కొందరు పారిశ్రామికవేత్తల ఒత్తిళ్లకు తలొగ్గి బీజేపీని నిర్దేశించాలని చూడటం సహించరాని విషయమని చెబుతున్నారు. నిన్నటివరకు మోడీ జపం చేసి ఇప్పుడు పారిశ్రామికవేత్తల అడుగులకు మడుగులొత్తడానికి ఈ కొత్త డ్రామాకు తెరతీశారని అంటున్నారు. ఇరుపక్షాల మధ్య సీట్ల పంపిణీ పూర్తయిన తర్వాత.. తమ పార్టీ తరఫున ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా చంద్రబాబు నిర్ణయించడమేంటని మండిపడుతున్నారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థులను మార్చాలంటూ టీడీపీ అధినేత సూచించడంపై విజయవాడలో పార్టీ నేతలు బహిరంగంగానే అగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థుల ఎంపికలో మేం జోక్యం చేసుకోనప్పుడు మా అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకోవడానికి చంద్రబాబెవరంటూ అక్కడి స్థానిక నేత ఒకరు ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇరు పార్టీల మధ్య పొత్తుకు మొదట్నుంచీ వెంపర్లాడిందే బాబు అని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఎన్నికలకు ఎన్నో రోజుల ముందునుంచే మోడీ జపం చేస్తూ పైరవీతో ఆయన పాల్గొన్న పలు సభలకు సైతం చంద్రబాబు హాజరయ్యారని వారంటున్నారు. అంతాచేసి ఈ రోజు ఆంధ్రాలో మోడీ హవా లేదనీ, రాష్ట్రంలో మోడీ ప్రభావం ఉండదని లీకులు ప్రచారం చేస్తూ పొత్తు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడటమేమిటంటూ బీజేపీ నేతలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తనకు వెన్నుపోటు పొడవడం అలవాటేనని, విశ్వసనీయత లేదని బాబు మరోసారి నిరూపించుకున్నారని అంటున్నారు. పొత్తు లేకుండా ఒంటరిగా ఏనాడూ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యంలేని చంద్రబాబు ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, నామినేషన్లు దగ్గర పడుతున్న సమయంలో సొంత పార్టీ నేతలకు బీ ఫారాలిచ్చి పోటీలోకి దింపడం సర్వసాధారమైన విషయంగా మారిందని విమర్శిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top