చాయ్ పే చర్చా బాగా జరిగింది: ఒబామా

నమస్తే.. మేరా ప్యారా భాయీ నమస్కార్ అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, తనకు మధ్య 'చాయ్పే చర్చా' బాగా జరిగిందని, ఇలాంటివి వైట్హౌస్లో కూడా మరిన్ని జరగాలని ఒబామా అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ''భారతదేశంతో బంధం మరింత దృఢపరుచుకోవడం నా హయాంలో జరుగుతున్నందుకు సంతోషం. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన మొదటి అధ్యక్షుడిని నేనే. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. అణు విస్తరణ విషయంలో కూడా రెండు దేశాల మధ్య బంధం బలోపేతమైంది. గత నెలలో వాషింగ్టన్ వచ్చినప్పుడు, అక్కడ న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్లో మీ ప్రసంగానికి బాలీవుడ్ స్టార్కు వచ్చినట్లుగా జనం రావడం చూసి ఆశ్చర్యపోయాం. 'చాయ్ పే చర్చా' బాగా జరిగింది. ఇలాంటివి వైట్ హౌస్లో కూడా జరగాలి. ఇప్పటికే రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇది మరింత పెరగాలని ఆశిస్తున్నాం. ఇండియాతో మరింత హైటెక్ సహకారం ఉంటుంది. స్వచ్ఛమైన ఇంధనం విషయంలో కూడా మా సహకారం ఉంటుంది. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులు మరిన్ని ప్రారంభం అవుతాయి. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని హైడ్రో ఫ్లోరో కార్బన్లను తగ్గించాలని నిర్ణయించుకున్నాం. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాం. మరో పదేళ్ల పాటు కూడా ఇలాగే సహకారం కొనసాగాలని భావిస్తున్నాం. రక్షణ రంగంలోను, అణు రంగంలోను కూడా సహకారం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని భారతీయులకు మరోసారి చెబుతున్నాను'' అన్నారు.

అనుకున్న సమయం కంటే దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా సంయుక్త విలేకరుల సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చోపచర్చలు సాగాయి. సంయుక్త ప్రకటనను ఇరుదేశాల ఉన్నతాధికారులు సిద్ధం చేయగా, దానికి ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు బరాక్ ఒబామా ఇద్దరూ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామా ఎప్పుడొస్తారా అని చాలాసేపు బయట ఇరు దేశాల మంత్రులు, జాతీయ.. అంతర్జాతీయ మీడియా ఆసక్తిగా ఎదురు చూడటం కనిపించింది. ఈలోపు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు అమెరికా బృందంతో మాటా మంతీ సాగించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top