లీటరుకు రూ. 1.50 తగ్గనున్న పెట్రోలు ధర!

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో వచ్చే వారం పెట్రోలు ధర లీటరుకు రూ. 1.50 వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు కనపడుతోంది. అయితే, డీజిల్, ఎల్పీజీ ధరలు మాత్రం కొంతమేర పెరగక తప్పకపోవచ్చని అంటున్నారు. డీజిల్, వంటగ్యాస్ ధరలను ఒకసారి పెంచక తప్పడంలేదని ఇంధన శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ తెలిపారు. దీన్నుంచి తాము తప్పించుకోలేమన్నారు. ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కొంటోందని, అందులో కొంత మేరకు ప్రజలు కూడా భరించాలని అన్నారు. ఈ సమస్యల నుంచి మనం తప్పించుకుని పారిపోవడం కుదరదని ఆయన అన్నారు. ఢిల్లీ ఉత్పాదకమండలి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

సబ్సిడీ భారం భరించలేని స్థాయికి చేరుకుందని, ప్రభుత్వ బడ్జెట్లు గానీ, చమురు సంస్థలు గానీ దాన్ని భరించే పరిస్థితి లేదని రాయ్ అన్నారు. గడిచిన రెండు నెలల్లో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతుల భారం పెరిగి సబ్సిడీ బిల్లు 20వేల కోట్లకు చేరుకుందన్నారు. ఇంధన ధరలలో మార్పు చేయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని స్వయంగా ఆర్థికమంత్రి చిదంబరమే గతంలో వ్యాఖ్యానించారు. ఈనెల 15, 16 తేదీల నాటికి పెట్రోలు ధర కొంతమేర తగ్గొచ్చని రాయ్, ఇతర అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. సిరియా సంక్షోభం చల్లారడం కూడా ముడిచమురు ధరలు తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top