యోగి ఆదిత్యనాథ్‌ రాయని డైరీ

యోగి ఆదిత్యనాథ్‌ రాయని డైరీ - Sakshi


‘‘ఓసారి వచ్చి వెళతావా యోగీ’’ అని ఢిల్లీ నుంచి మోదీజీ ఫోన్‌!

‘‘అప్పుడే కంప్లైంట్లా నా మీద మోదీజీ?!’’ అన్నాను. పెద్దగా నవ్వారు పెద్దాయన. నేనూ నవ్వాను.

‘‘నవ్వింది పెద్దాయన కాదు. నేను’’ అని అమిత్‌షా గొంతు వినిపించింది!

‘‘ఓ.. మోదీజీ పక్కనే ఉన్నారా మీరు’’ అన్నాను.



‘‘నేనే కాదు, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, మురళీ మనోహర్‌ జోషీ, అనంత్‌కుమార్‌ అందరం పక్క పక్కనే ఉన్నాం’’ అన్నారు అమిత్‌షా.

స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడుతున్నట్లున్నారు!

‘‘బాగా చేస్తున్నావ్‌ యోగీ’’ అన్నారు మోదీజీ.

‘‘ధన్యవాదాలు మోదీజీ’’ అన్నాను.



జైట్లీ లైన్‌లోకి వచ్చారు!

‘‘సర్‌ప్రైజ్‌లు బాగానే ఇస్తున్నావ్‌. సర్‌ప్రైజులేనా? షాకులు కూడా ఉన్నాయా?’’ అన్నారు జైట్లీ!

‘‘మోదీజీ.. మీకు నచ్చట్లేదా నేనిలా చేయడం?’’ అన్నాను. మోదీజీ మాట్లాడలేదు.

‘‘ఆయనకెందుకు నచ్చడం? నీ రాష్ట్రం.. నీ ఇష్టం’’ అన్నారు రాజ్‌నాథ్‌సింగ్‌.

‘‘అదేమిటి రాజ్‌నాథ్‌జీ.. ఈ రాష్ట్రం  మీది, మనందరిది, ప్రతి బీజేపీ పౌరుడిది! మీరేనా ఇలా మాట్లాడుతున్నది’’ అన్నాను.



‘‘లేదు, నేనే గొంతు మార్చి నాలా మాట్లాడుతున్నాను!  ఆఫీసుల్లో పాన్‌ మసాలా నమలొద్దన్నావ్‌. మోదీజీకి చెప్పలేదు. యాంటీ రోమియో స్క్వాడ్‌లు పెట్టించావ్‌. మోదీజీకి చెప్పలేదు. కబేళాలు మూయిస్తున్నావ్‌. అదీ మోదీజీకి చెప్పలేదు ’’ అన్నారు రాజ్‌నాథ్‌.

‘‘చిన్న చిన్న విషయాలు పెద్దాయన వరకు ఎందుకనీ..’’ అన్నాను.

మధ్యలోకి మళ్లీ జైట్లీ వచ్చారు.

‘‘అరె! మోదీజీ కూడా మన పార్టీ ఎంపీలకు అదే చెప్పారు. ప్రతి చిన్న విషయాన్నీ యోగి వరకు తీసుకెళ్లొద్దని. మరి మీకెవరు చెప్పారు యోగీ.. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దాయన వరకు తీసుకెళ్లొద్దని’’ అని అడిగారు. నాకు అర్థమయింది. టీమ్‌ అంతా కూర్చొని ఏదో స్కెచ్‌ వేస్తున్నారు!

‘‘ఢిల్లీకి రమ్మంటారా మోదీజీ’’ అని అడిగాను.



‘‘మోదీజీ వెళ్లిపోయి చాలాసేపయింది’’ అన్నారు జైట్లీ.

‘‘ఢిల్లీకి రమ్మంటారా అమిత్‌జీ’’ అని అడిగాను.

‘‘మోదీజీ వెళ్లిపోతే, అమిత్‌జీ మాత్రం ఎందుకుంటారు యోగీ’’ అన్నారు జైట్లీ.

‘‘ఢిల్లీకి రమ్మంటారా జైట్లీజీ’’ అని అడిగాను.



‘‘అవసరం లేదు’’ అన్నారు జైట్లీ.

 ‘‘మరి పెద్దాయన నన్నెందుకు ‘ఓసారి వచ్చి వెళతావా యోగీ’ అని అడిగారు జైట్లీజీ?!’’ అన్నాను.

‘‘మోదీజీ భయపడుతున్నారు యోగీ! శ్రీరామ నవమి దగ్గరపడుతోంది కదా. చెప్పాపెట్టకుండా అయోధ్యలో గుడి కట్టేసి, నవమికి ప్రారంభోత్సవం పెట్టేస్తావేమోనని!’’ అన్నారు జైట్లీ.

‘‘ఎందుకు భయం జైట్లీజీ! గొడవలౌతాయనా?’’ అన్నాను.



‘‘ఊహు. ఇప్పుడే కట్టేస్తే, ‘కడతాం’ అని చెప్పడానికి ఏముంటుందని భయం!’’ అన్నారు జైట్లీ!!



- మాధవ్‌ శింగరాజు

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top