ఒక వెలుగు జడి.. ఒకింత శూన్యం..

ఒక వెలుగు జడి.. ఒకింత శూన్యం.. - Sakshi


నేను కళ్లు తెరిచాను. క్షణకాలం పాటు స్తంభించిన టీవీ తెర మళ్లీ వెలుగులు జిమ్మసాగింది. ఇందిరా గాంధీ చిత్రం అదృశ్యమైంది. రాజకీయ శూన్యపు బాధ అలాగే మిగిలిపోయింది. అయితే ఈ అంధకారంలో సైతం ఒక వెలుగురేఖ కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయపు రేఖ గీయాలనే ఆలోచన మనసులో రూపు దిద్దుకుంటోంది. సామాజిక న్యాయం, సెక్యులరిజం, సోషలిజం, జాతీయవాదాలకు ఒక కొత్త భాషనివ్వాల్సిన అవసరం ఉందని తోస్తోంది. నేపథ్యంలో ఎక్కడో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ చిత్రం కూడా కనిపిస్తోంది.



టీవీ తెర పైన ప్రధానమంత్రి బొమ్మ. దాని చుట్టూ వెదజల్లుతున్న కాషాయ రంగు. హర హర మోదీ అనే నినాదాలు. ఎందుకో తెలియదు గానీ ఈ రంగుల ధూళి వెనుక ఇందిరా గాంధీ బొమ్మ ఉన్నట్టుగా కనిపించసాగింది. నా చెవికి ‘ఇందిరా ఈజ్‌ ఇండియా‘ అనే నినాదం వినిపించసాగింది. కొన్ని క్షణాలు పాటు కళ్లు మూసుకున్నాను.



కళ్లు మూసుకుంటే పెద్ద చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశంలో ఒక పెద్ద రేఖను గీశాయి. ప్రతి విధానసభ ఎన్నికల్లోనూ మనం పెద్ద సందేశాన్ని వెదకలేం. కానీ ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఇమిడి ఉన్న సందేశాన్ని అర్థం చేసుకోకుంటే మాత్రం అది పెద్ద పొరపాటవుతుంది. ఇది కేవలం ఎన్నికల గణాంకాలకు, విజయం తేడాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయం సాధించడం ఒక్కటే కూడా కాదిది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడేళ్లకు కూడా బీజేపీ తన సీట్లనూ, ఓట్ల అంకెలనూ నిలబెట్టుకున్నదన్న విషయానికి పరిమితమైంది కూడా కాదు. బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో స్థానిక ముఖం ఏదీ లేకుండానే బ్రహ్మాండమైన విజయం సాధించిందన్నది అసలు విషయం. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో భారీ వ్యతిరేకత ఏదీ లేనప్పటికీ అది ఈ విజయాన్ని సాధించగలగిందన్నది కూడా ముఖ్యమైన విషయమే. ఈ విజయం కేవలం ఉత్తరప్రదేశ్‌కు పరిమితమైంది కాదు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ను తుడిచి పెడుతూ గెలుపు సాధించడం, గోవాలో స్పష్టమైన మెజారిటీని సాధించకుండా కాంగ్రెస్‌ను కట్టడి చేయడం కూడా చిన్న విషయాలేమీ కాదు. వీటిని ఇటీవల మహారాష్ట్ర, ఒడిశా స్థానిక ఎన్నికల ఫలితాల సంకేతాలతో కలిపి చూసినపుడు యావత్‌ దేశంలో బీజేపీ వెల్లువ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వెల్లువలో అది ఢిల్లీ, బిహార్‌లలో పొందిన పరాభవం కూడా కొట్టుకొనిపోయింది. దేశంలో బలాల సమతౌల్యపు సూచిక ఇప్పుడు స్పష్టంగా మోదీ వైపు మొగ్గింది. ప్రధానమంత్రి తన వ్యతిరేకులకన్నా, స్వయంగా తన పార్టీకన్నా కూడా పెద్ద శక్తిగా అవతరించారు.



ఇంత పెద్ద విజయాన్ని కేవలం ఎన్నికల వ్యూహపు మహత్య్మం లేదా కూటమి వైఫల్యం అనే కోణంలో మాత్రమే అర్థం చేసుకోలేం. పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలుపుతోనూ దీన్ని కప్పి పుచ్చలేం. పంజాబ్‌లో గెలుపు నకు క్రెడిట్‌ కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌కు దక్కుతుంది. నిజానికి పంజాబ్‌లో బీజేపీ ఓటమికి ముఖ్య కారణం దాని భాగస్వామి అకాలీ దళ్‌ సాగించిన భ్రష్ట పాలనే. పంజాబ్‌లో ప్రతి ఒక్కరూ దాన్ని ఏవగించుకో సాగారు. గోవా, మణిపూర్‌లలో బీజేపీ విజయం సాధించకున్నా, సహజంగా గెలవాల్సిన కాంగ్రెస్‌ కూడా గెలుపునకు దూరంగానే ఉండిపోయింది.



వాస్తవం ఏమిటంటే ఈ ఫలి తాలతో బీజేపీ నరేంద్రమోదీ నాయకత్వంలో ఒక జాతీయ రాజకీయ ఆమోదాన్ని సాధిం చింది. ప్రతి ఎన్నికల విజయపు సారాంశం నైతిక విజయమే కావాలనేమీ లేదు. బీజేపీ అగ్రకులాలనూ, అత్యధిక వెనుకబడిన హిందూ కులాలనూ సమీక రించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి సహా బీజేపీ నేతలందరూ ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొట్టారనడంలోనూ అనుమానం అక్కర్లేదు. తన విరోధుల వలెనే బీజేపీ వద్ద కూడా అత్యధిక సంఖ్యాకులైన రైతులు, శ్రామికులు, పేదల కోసం అని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నది కూడా నిజమే. అయినా సామాన్య ప్రజల దృష్టిలో బీజేపీ ఇమేజ్‌ మతతత్వ, కులవాద రాజకీయాలు నెరపే పార్టీగా లేదు. ఉత్తరప్రదేశ్‌లోని సామాన్య ఓటరు కంటికి ప్రధానమంత్రిలో ఒక నైతిక తేజస్సు కనిపించింది. పేదలకు మేలు జరుగుతుందనే ఆశ కనిపించింది.



ఎన్నికల ఫలితాలు బీజేపీయేతర రాజకీయాల దివాలాకోరుతనాన్ని నగ్నంగా నిలబెట్టాయి. మాయావతి తన ఓటమికి ఈవీఎంలను, ఎన్నికల కమిషన్‌ను తప్పు పడుతుంటే ’ఆడలేక మద్దెల ఓటిదనే’ సామెత గుర్తు రాక మానదు. ఉత్తరప్రదేశ్‌ ఓటర్లు 2014లో లాగానే సామాజిక న్యాయం పేరుతో సాగుతున్న కులవాద రాజకీయాలను మరోసారి తిరస్కరించారు. అట్లాగే సెక్యులరిజం పేరుతో ముస్లింలను కట్టి ఉంచే రాజకీయాలు ముస్లింలకు అనివార్యమైనప్పటికీ దానికి విస్తృత స్థాయి ఆమోదం లేదు. అటు మణిపూర్‌లో కాంగ్రెస్‌ సిద్ధాంతాల పేరుతో తెగల మధ్య విద్వేషాన్ని పెంచిపోషించినా, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సెక్టేరియన్‌ అతివాదాన్ని ఆశ్రయించాలని చూసినా అవేవీ సఫలం కాలేదు.

పంజాబ్‌ ఫలితాలను మరో కోణంలో కూడా చూడొచ్చు. ఎన్ని ప్రకటనలు చేసినా, మరెన్ని ఆశలు పెట్టుకున్నా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటమి ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక గుణపాఠం వంటిది. పంజాబ్, గోవాలలో పెద్ద మార్పు వస్తుందనే ఆశతో దేశ దేశాల్లో ఎదురు చూస్తున్న వారందరి హృదయాలూ ఈ ఓటమితో ముక్కలైపోతాయి. పెద్ద పార్టీలు చెప్పే పెద్ద అబద్ధాలను అర్ధసత్యాలతో ఎదుర్కోలేమనేదే ఆ గుణపాఠం. అకాలీ దళ్, కాంగ్రెస్‌ రాజకీయాలను ఎదుర్కోవాలంటే అది ఆ పార్టీల నుంచే అరువు తెచ్చుకున్న నాయకులతో చేయాల్సిన పనికాదు. వేళ్లూనుకున్న పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే పార్టీ తనలోని మరకల్ని కప్పిపెట్టలేదు. ప్రత్యామ్నాయ రాజకీయాలనేవి గారడీ విద్యతో నిర్వహించేవి కూడా కాదు. ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యామ్నాయపు అవసరాన్ని ఎత్తిచూపితే, పంజాబ్‌ అబద్ధపు ప్రత్యామ్నాయాన్ని తోసిరాజంది.



నేను కళ్లు తెరిచాను. క్షణకాలం పాటు స్తంభించిన టీవీ తెర మళ్లీ వెలుగులు జిమ్మసాగింది. ఇందిరా గాంధీ చిత్రం అదృశ్యమైంది. రాజకీయ శూన్యపు బాధ అలాగే మిగిలిపోయింది. అయితే ఈ అంధకారంలో సైతం ఒక వెలుగురేఖ కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయపు రేఖ గీయాలనే ఆలోచన మనసులో రూపు దిద్దుకుంటోంది. సామాజిక న్యాయం, సెక్యులరిజం, సోషలిజం, జాతీయవాదాలకు ఒక కొత్త భాషనివ్వాల్సిన అవసరం ఉందని తోస్తోంది. నేపథ్యంలో ఎక్కడో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ చిత్రం కూడా కనిపిస్తోంది.





- యోగేంద్ర యాదవ్‌


వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు

మొబైల్‌ : 98688 88986  Twitter : @_YogendraYadav

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top