ప్రజా పక్షమా? ప్రభువుల పక్షమా?!

ప్రజా పక్షమా? ప్రభువుల పక్షమా?!


అభిప్రాయం

‘ప్రభుత్వం యిచ్చిన పదవుల్లో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం అనైతికమ’ని కొందరి ఉవాచ. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కావాలంటే అలాంటి పదవులు వద్దనుకోవాలని సారాంశం. యిది సరైనదేనా? దీనికి కట్టుబడాలంటే, ప్రగతిశీలురు ప్రభుత్వ పదవులు, ప్రభుత్వ బహుమతులు వద్దను కోవాలి. ఫలితం.. ప్రభుత్వాన్ని నిర్విమర్శకంగా సమర్థించేవారు.. జనం పన్నుల డబ్బుతో శాలువాలు కప్పుకుంటారు. ప్రజల పక్షం వహించే వారు వాటికి దూరంగా వుండి పోతారు. ఉండలేని స్థితిలో లొంగిపోతారు. ‘లొంగిపోతే’ విమర్శించే నోళ్లలో... శాలువా ధారులదే ముందు వరుస. ఈ నీతి సూక్తి చుట్టూ జరుగుతున్న మొరాలిటీ డ్రామా వల్ల ఎవరికి మేలు? ప్రగతి శక్తులు సమాజానికి దూరమై, అడవులు పట్టిపోవడం కాకుండా దీని వల్ల జరిగే మేలేదీ లేదు. దీని వెనుక ఉన్న హిపోక్రసీ ప్రగతి శక్తుల ఐక్యతకు పెను అవరోధం.



దీన్ని మొరాలిటీ డ్రామా అని ఎందుకంటున్నానంటే... మహర్షికి దానం చేస్తానని వాగ్దానం చెయ్యడం ద్వారా అప్పుపడినవాడు ఆలు బిడ్డలను తెగనమ్మి అయినా సరే అప్పు కట్టాలనే నాటకీయ నీతికి... ప్రభుత్వ పదవులు, బిరుదులు తీసుకుంటే ప్రభుత్వాన్ని విమర్శించరాదనే రాజకీయ నీతికి... రెండింటి మధ్య తేడా లేదు. అప్పు కట్టక్కర్లేదనుకుంటే చాలు, హరిశ్చంద్రుడు ఆలుబిడ్డలను అమ్ముకోనక్కర్లేదు. పదవుల్లో ఉన్నా ప్రభుత్వం తప్పులు ఎత్తిచూపొచ్చు అనుకుంటే చాలు, ప్రగతిశీలురు సమాజానికి దూరం కానక్కర్లేదు. అడవులు పట్టక్కర్లేదు.



ప్రభుత్వం అనేది ఎవరి సొంత సొమ్ము కాదు. ప్రభుత్వ పదవులు, బిరుదులు, సౌకర్యాలు ఏవీ... ప్రభుత్వ నేతల సొంత సొమ్ము కాదు. ఆ మాటకొస్తే మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వారి పదవులు కూడా ఊరికే రావు. నిజాయితీగానో, నిర్నిజాయితీ గానో, పలు రకాల శక్తియుక్తులతో సంపాదించుకున్నవే. వాళ్ల లాగే రకరకాల శక్తియుక్తులన్నీ ఉపయోగించి ‘గెలుపొం’దిన వారే సోకాల్డ్‌ ‘ప్రభుత్వ పదవుల్లో’ ఉన్న వారు కూడా. ఎవరికీ ఏవీ ‘యివ్వబడ’లేదు. అన్నీ... అందరివీ... ‘సంపాదించుకున్నవే’. ‘యెదియు సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము’.



ఒక ప్రభుత్వాన్ని విమర్శించడమంటే దాని నేతల నిర్వాకాల్ని విమర్శించడమే. అలా ప్రజల పక్షాన ప్రభుత్వాల్ని విమర్శించాల్సి వచ్చినప్పుడు.. ప్రభుత్వం ఇచ్చిన పదవుల్లో ఉండి విమర్శించడం అనైతికమని నీతి సూత్రాలు వల్లించడం అనైతికం. యుక్తులేం లేకుండా, కొందరికి నిజ శక్తుల వల్ల కూడా పదవులూ అవీ వస్తాయి. తర్క శాస్త్రంలో ‘అనుమానం’ కూడా ఒక అంగీకృత ప్రమాణం. పదవులు పొందినోళ్లంతా చెడ్డవాళ్లు కాదు. నిజమైన సుగుణాలకుగాను సత్కారం పొందిన వారు కూడా ఉంటారు. పదవులు ఎలా వచ్చినా సరే.. వాటిని సంపాదిం చిన వారికి అభినందనలు చెప్పడానికి అభ్యంతరం ఉండక్కర్లేదు.



ఎందుకంటే... పదవులు, బిరుదులు అందరూ కోరుకుంటారు. అప్పుడప్పుడు కొందరం మేకపోతు గాంభీర్యాలు పోతుంటారంతే. ఇచ్చి చూడండి. ఇప్పించి చూడండి. ఎవరు వద్దంటారు, ‘అడవులు’ పట్టదలిచిన వారు తప్ప. ఎస్‌ సర్, పదవులు సంపాదించిన, సంపాదించుకున్న, సంపాదించనున్న వారిని విమర్శించడం లేదు. ఆడిపోసుకోడం లేదు. మీదు మిక్కిలి, మనసారా అభినందిస్తున్నాం. ఆ పదవుల కారణంగా ఎవరైనా ప్రజల పక్షాన నిలబడలేకపోవడాన్ని మాత్రం అర్థం చేసుకోలేం.



ప్రజల తరఫున ఏలిన వారిని విమర్శించడానికి ఎవరు సందేహించినా అర్థం చేసుకోలేం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు కీడు చేస్తే, దాని అర్థం యేమిటి? ప్రజల ఉప్పుతిన్న నేతలు ప్రజలకు ద్రోహం చేశారని అర్థం. అలాంటి ప్రభుత్వ నేతలకులేని మొహమాటాలు.. వారి నుంచి పదవులు తీసుకుంటున్న సమయంలో మనకు లేని మొహమాటాలు.. ప్రజల పక్షాన ప్రభుత్వాల్ని విమర్శించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఉండాలనడం పరమ అన్యాయం. ఆగి కాస్తా ఆలోచించండి, ఇన్నాళ్లుగా సాగుతున్న ఈ ఆలోచన అన్యాయమో కాదో..



బిరుదులు వెనక్కివ్వడం వంటి ‘అమర్యాద’ పనులేం అక్కర్లేదు. పదవులు, బిరుదులు ఉంటే ఉంటై.. పోతే పోతై అన్నట్లు నీళ్లు నమలకుండా, సందేహించకుండా, నిర్భయంగా... ప్రజల పక్షాన, ప్రభుత్వాల్ని నిలదీద్దాం. అలా నిలదీసే పని కోసం... ప్రభుత్వ పదవుల వల్ల మనకు దొరికే ‘ప్రతిష్ఠ’ను కూడా వాడుకుందాం. ప్రజల కోసం ఏం చేసినా తప్పు కాదు. ఈ పదవులూ అవీ ప్రజలు ఇచ్చినవే.



ప్రభుత్వం అనేది అధికారంలో ఉన్న నేతల సొంత సొమ్ము అనే ఊహను వదిలేద్దాం, మన బుర్రల్లోంచి. ప్రజల వైపు నిలబడాల్సి వచ్చినప్పుడు.. ‘పదవిలో ఉన్నానూ, మన్నించాలీ’ అని తూగుపాటలు పాడడం అధర్మం. ఏ ప్రభుత్వాలయినా.. అధికారంలో ఉన్నోళ్ల సొంతసొమ్ము కాదు. ఎవరికీ సొంత ఆస్తి కాదు. ప్రభుత్వానికి ఉండాల్సినది బాధ్యతే గానీ, అధికారం కాదు. అధికారం దానికదే వ్యతిరేకించదగిన ఈవిల్‌. చర్యలకు, పనులకు, పురోగమనానికి నాయకత్వం వహించడం వేరు, అధికారం వేరు. డౌన్‌ విత్‌ అధికారం. నాయకత్వం జిందాబాద్‌.





-హెచ్చార్కె


వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

ఈ–మెయిల్‌ : hrkkodidela@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top