గేయం రేపిన దుమారం

గేయం రేపిన దుమారం - Sakshi


విశ్లేషణ



బీఎంసీ సొంత నివేదికలే దాని నిర్వహణపై ఏ ప్రభావమూ చూపనప్పుడు.. మాలిష్కా అధికార వ్యవస్థను చికాకుపరచడం ఎందుకు? అనేది ఆసక్తికరంగా మారింది. సామాజిక మాధ్యమాలకే ఎక్కువ విశ్వసనీయత ఉండటమే కారణమా?



ముంబై గతుకుల రోడ్లు ఇప్పటికే అప్రతిష్టాకరంగా ప్రసిద్ధి చెందాయి. వాటి వార్తలు ఏటేటా, ప్రతి వానాకాలం వార్తాపత్రికలను, టెలి విజన్‌ తెరలను ముంచెత్తుతున్నాయి. వానలు పడటానికి ముందే రోడ్ల పరిస్థితిని చక్కదిద్దేస్తామని నగర పాలక సంస్థ వాగ్దానాలు చేస్తూనే ఉంటుంది. అది ఆ పని చేయగలగడం మాత్రం అరుదు. తొలి వానలు పడీ పడటంతోనే రోడ్లు చంద్ర బిలాలను తలపింపజేస్తుం టాయి. రోడ్ల మీది గుంతలన్నిటినీ సక్రమంగా పూడ్చి వేయాలంటూ హైకోర్టు గతంలో కొన్ని సందర్భాల్లో నగర పాలక సంస్థకు మొట్టికాయలు వేసి, అందుకు గడువును కూడా విధించింది. కనీసం ఒక ఏడాదైనా మనగలిగేపాటి నాణ్యతగల రోడ్లకు హామీని కల్పిం చేలా అది సైతం నగర ప్రభుత్వాన్ని మేల్కొలపలేకపోయింది. ప్రతి ఏటా రోడ్ల మీద బిలాలు తిరిగి ప్రత్యక్షమౌతూనే ఉంటాయి.



రోడ్ల పనులను చేపట్టడంలో జరుగుతున్న దగానే ఈ దుస్థితికి అసలు కారణమనేది స్పష్టమే. గ్రేటర్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఒక స్విస్‌ కంపెనీని కన్సల్టెంటుగా పెట్టుకుని జరిపించిన దానితో సహా అంతర్గత దర్యాప్తులన్నీ... రోడ్లు వేయడానికి వాడిన వస్తు సామగ్రి నాణ్యత అధ్వానమైనదని, రోడ్లు వేసే పని అధ్వానంగా జరిగిందని తేల్చి చెప్పాయి. కాబట్టి ఇందులో అవినీతి చోటుచేసుకున్నదంటే పౌరులు ఆశ్చ ర్యపోరు. పైగా, దగాకోరుతనం నేడు సర్వసాధారణమేనని చెబుతారు. అయినాగానీ, గతవారం మాలిష్కా మెండోన్సా ఆలపించిన ఓ ర్యాప్‌ గీతం ముంబై నగర ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న పార్టీ నాయకులకు మంట పుట్టించగలిగింది. దాదాపు పన్నెం డేళ్లుగా రేడియో జాకీ(ఆర్‌జే)గా పనిచేస్తున్న మాలిష్కా విడుదల చేసిన ఆ మరాఠీ వెక్కిరింత ర్యాప్‌ వెంటనే విస్తృతమైన ప్రాచుర్యాన్ని పొందింది. శివసేన యువ విభాగం ఆ ఆర్‌జేకు వ్యతిరేకంగా రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేయాలని నగర కమిషనర్‌ను కోరింది.



దానిపై ఆయన ఇంకా ప్రతిస్పందించలేదుగానీ, ఆ మరుసటి రోజునే నగర పాలక సంస్థ ఇన్‌స్పెక్టర్లు ఆమె ఇంట్లోని కొన్ని చోట్ల ఏడెస్‌ దోమలు పుట్టిపెరిగే స్థానాలున్నాయని కనిపెట్టారు. అది డెంగ్యూను వ్యాపి ంపజేసే జాతి దోమ. నగర పాలక సంస్థ ఆమెకు నోటీసును జారీచేసింది. ఇది, ప్రజల భాగస్వామ్యానికి వ్యతి రేకంగా దాఖలు చేసిన దావా ( ఔఅ్క్క) (చెంబదెబ్బ) అని పౌర సమాజం భావిస్తోంది. పౌర పాలక సంస్థ అంటున్నట్టుగా ఇది యాదృచ్ఛికమే అనుకున్నా, ఈ నోటీసును జారీ చేసిన సమయం నిజంగానే అనుమానాన్ని రేకెత్తించేది. అయినా ఆమె ఒక్కరిపైనా ఎందు కు? నగర శివార్లకే రాణిగా ఒకప్పుడు వెలుగొందిన సంపన్న ప్రాంతం బాంద్రాలోని ఆమె నివాసంలో అలాంటి దోమలు పుట్టిపెరిగే స్థావరాలుండవచ్చనే నిర్ధారణకు అసలు వారు ఎలా వచ్చారు? ఫిర్యాదులేమైనా వచ్చాయా? నగర పాలక సంస్థ ప్రదర్శించిన ఈ జాగరూకతకు–ఇదే గనుక జాగరూకత అయితే–దాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ, సదరు ఆర్‌జే నగరపాలక సంస్థ ప్రతిష్టకు భంగం కలుగజేశారని, అహోరాత్రాలు పనిచేస్తున్న ఆ సంస్థ కార్మికులను అవమానించిందని శివసేన ఆరోపిస్తోంది. అది నిజం కూడా కావచ్చు. కానీ ముంబైలోని ఏ పౌరుడినైనా అడగండి, అది సమర్థవంతంగా కృషి చేస్తున్నదని మాత్రం అనరు.



మాలిష్కా మెండోన్సా ర్యాప్‌ మొదట ఒక ఎఫ్‌ఎమ్‌ రేడియోలో ప్రసారమైంది, ఆ తర్వాత ఆ వీడియో యూట్యూబ్‌కు చేరింది. ఒకటిన్నర నిమిషం కూడా లేని అది ఎంత గొప్ప ప్రభావాన్ని కలిగించింది! ‘‘నమ్మకం లేదా బీఎంసీపై మీకు?’’ అంటూ మొదలయ్యే ఆ ర్యాప్, గుంతలు పడ్డ రోడ్లు, తత్పర్యవసానమైన ట్రాఫిక్‌ సమస్యలు, నగర పాలక సంస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోవడాన్ని ఏకరువు పెడుతుంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలన్నీ శివసేన వైఖరిని వాక్‌స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి చేస్తున్న ప్రయత్నాలంటూ విరుచుకుపడ్డ మాట నిజమే. శివసేన నేత ఒకరు టీవీ తెరపై నుంచి అదే బాణీలో ‘‘నోరు ముయ్యకపోతే నువ్వు అయిపోతుంది రభస’’ అని ఆలపించారు. దీనికి జంకని మాలిష్కా, తన బుర్రలో మరో ఆరు ర్యాప్‌లు ఉన్నాయన్నారు.



ముంబై పౌర పాలనా సంస్థ స్వయంగా జరి పించిన లోతైన పరిశోధనల నివేదికలే దాని నిర్వహణా తీరుపై ఎలాంటి ప్రభావమూ చూపనప్పుడు.. ఈ ర్యాప్‌ గాయని అధికార రాజకీయ వ్యవస్థను చికాకుపరచడం ఎందుకు? అనేది ప్రధాన వార్తా పత్రికలకు, చానళ్లకు ఆసక్తికరమైన అంశంగా మారింది. పక్షపాతంతో వక్రీకరించడానికి అవకాశమున్న సామాజిక మాధ్యమాలకే పౌరుల్లో ఎక్కువ విశ్వసనీయత ఉండటం వల్లనా? ఇప్పటికే మరో రెండు వీడియోలు వెలుగుచూశాయి. వాటిలో ఒకటి అదే బాణీలో ‘‘ఆర్‌జేపై నమ్మకం లేదా మీకు?’’ అంటూ మొదలై పౌర పాలక సంస్థను పట్టి పీడిస్తున్న మరింత తీవ్ర రుగ్మతలను... ఇక్కడి వాటిని గురించే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలన్నిటి గురించి ప్రస్తావిస్తుంది. ఇçప్పుడే ఒక పౌరుడు ‘‘టీ సముద్రం లాంటి’’ ముదురు గోధుమరంగు నీళ్లతో ఉన్న గుంతలను చూపిస్తూ ‘‘వచ్చి కాస్త తీనుకుపోండి. దోమల్ని చంపేస్తుంది’’ అంటూ మరో వీడియోను పోస్ట్‌ చేశాడు.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు



















మహేష్‌ విజాపృకర్‌

ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top