నమ్మకమిస్తున్న ‘నవరత్నాలు’


విశ్లేషణ

ప్రజానీకంలో విశ్వసనీయత కలిగిన నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌కు తండ్రి నుంచి పుణికి పుచ్చుకొన్న విశిష్ట లక్షణాలలో ప్రజల ఈతిబాధల పట్ల సానుభూతి, ఇచ్చిన హామీల నుంచి వెనుదిరగకపోవడం వంటివి ఉన్నాయి. అమరావతి ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు ప్రజల జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని చేసినవి. రాష్ట్రంలో నిరాశా నిస్పృహలు నెలకొన్న నేపథ్యంలో జగన్‌ 9 ప్రధాన వాగ్దానాలు చేయడం సముచితం, సమంజసమంటూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.







ప్రజాస్వామ్యానికి పునాది– విస్తృత ‘చర్చ’. అది హేతుబద్ధమైన అంశాలను ఆవిష్కరిస్తుంది. వాస్తవాలను వెలికి తీస్తుంది. పరిష్కారాలను చూపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ‘చర్చ’ మొత్తం గుంటూరు వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిది అంశాలతో ప్రకటించిన ముందస్తు మినీ మేనిఫెస్టో చుట్టూ తిరుగుతోంది. ‘నవరత్నాలుగా’ అభివర్ణిస్తున్న ఆ హామీల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చకు తెర తీయడం ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ తన రాజకీయ గోతిని తానే తవ్వుకొన్నట్లయింది.



ఎందుకంటే, 2014లో తెలుగుదేశంపార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు 3 ఏళ్లు గడిచినా, ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు. రాష్ట్రానికి సంజీవనిలా ఉపయోగపడే ‘ప్రత్యేక హోదా’ హామీకి కూడా మంగళం పాడేశారు. రైల్వేజోన్‌ జాడ కానరాదు. పోలవరం ప్రాజెక్టు కేంద్రానిదో, రాష్ట్రానిదో అంతుబట్టదు. 2014లోనే కాదు, ఎన్టీఆర్‌ నుంచి పార్టీని హస్తగతం చేసుకొన్నప్పటి నుంచి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలు, హామీలను నిలబెట్టుకొన్న దాఖలాలు కానరావు. కానీ నేడు తన పార్టీ నాయకులతో వైఎస్సార్‌సీపీ అధినేత ఇచ్చిన వాగ్దానాలను ఆయన విమర్శించడం విడ్డూరం.



చిత్తశుద్ధి ముఖ్యం

‘సాయం చేయడానికి ప్రభుత్వం చేతిలో డబ్బు కంటే నాయకత్వానికి మంచి మనసు ఉండటం ముఖ్యం’అన్నది ఒక నానుడి. మనసున్న రాజకీయవేత్తలే పేదల కష్టాలు తెలుసుకోగలుగుతారు. ఆ మేరకు బడ్జెట్‌ కేటాయింపులు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మనసున్న నేతలు ఎన్టీఆర్, డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌కు ప్రీతిపాత్రమైన కిలో రెండు రూపాయల బియ్యం పథకానికి నిర్వచనం మార్చారు. అనతికాలంలోనే బియ్యం ధరను రెండు రూపాయల నుంచి ఐదున్నరకు పెంచేశారు. ఇందుకు పార్టీ వేదికలపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసినా పెడచెవినపెట్టారు. పేద మహిళలు పోరాడి సాధించుకున్న సంపూర్ణ మద్య నిషేధానికి చంద్రబాబు గండి కొట్టారు.



రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే మద్యం పారాల్సిందేనని ఓ వింత వాదన లేవనెత్తి ఎన్టీఆర్‌ ఆశయాన్ని నీరుగార్చేశారు. 1999లో ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమం అనే పదానికి కూడా అర్థాన్ని మార్చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో యూజర్‌ చార్జీలు విధించారు. 2000 నుంచి 2003 వరకూ రాష్ట్రంలో వరుస కరువులు ఏర్పడి ప్రజలు తల్లడిల్లిపోయారు. పంటలకు ఒక్క తడికి కూడా నీరు లేక పంటలు ఎండిపోతుంటే లక్షల సంఖ్యలో రైతులు వలసలు పోతూ, వందల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడుతుంటే, కనీన కనికరం లేకుండా భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేశారు. ఆనాడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రాంత రైతులు పడుతున్న కష్టాలను చూసి రైతుల ఆత్మహత్యలను నివారించడానికి బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసే మెట్టప్రాంత రైతులకైనా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ‘లేఖ’రాస్తే, ఆయనను పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించారు. ఫలితంగానే కేసీఆర్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఏర్పాటు చేశారు.

 

కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాటి నేత డా. రాజశేఖరరెడ్డి తాము అధికారంలోకి వస్తే వ్యవసాయరంగానికి ‘ఉచిత విద్యుత్‌’ఇస్తామని హామీ ఇచ్చారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను ‘రోల్‌బ్యాక్‌’ చేయాలనే డిమాండ్‌తో ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వైఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో సాగిన దీక్షా శిబిరాలను ప్రభుత్వం అడ్డుకొన్న ఉదంతాన్ని ప్రజలు మర్చిపోలేదు. పెంచిన చార్జీలు తగ్గించాలంటూ హైదరాబాద్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీని అడ్డుకొని, పోలీసులు ఉద్యమకారులపై కాల్పులు జరపడంతో ఇరువురు మరణించారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఉచిత విద్యుత్‌ ఇస్తే మంచిదని పార్టీ నేతలు హితవు చెప్పారు. కానీ, వారిని చులకన చేస్తూ.. ‘మీ మైండ్‌సెట్‌ మారాలి. ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంట్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే’ అంటూ నోళ్లు మూయించిన చరిత్ర చంద్రబాబునాయుడిది.



2003 లో వైఎస్సార్‌ చేసిన చరిత్రాత్మక పాదయాత్ర అంతటా ‘అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తాం’ అంటూ ఇచ్చిన హామీ ఓ బూటకమని చిత్రీకరించడానికి శతవిధాలా ప్రయత్నాలు జరిగాయి. అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ (ఏఐసీసీ) ఆనాడు తమ జాతీయ విధానంగా ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకమంటూ చేసిన తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించింది. అయినా, వైఎస్సార్‌ మాత్రం రైతుల ఆత్మహత్యలు పెద్దఎత్తున జరుగుతున్న దృష్ట్యా ఉచిత విద్యుత్‌ ఇచ్చి తీరాల్సిందేనని అధిష్టానాన్ని ఒప్పించగలిగారు. ఉచిత విద్యుత్‌ ఏవిధంగా ఇవ్వవచ్చునో ఆయన వివరించిన తర్వాత ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో ఉచిత విద్యుత్‌ హామీని చేర్చినప్పటికీ ప్రజలు దానినొక ప్రహసనంగానే చూశారు. వామపక్షాలు, టీఆర్‌ఎస్‌తో కలసి తెలుగుదేశంపార్టీ ఏర్పాటు చేసిన మహాకూటమిని ప్రజలు తిరస్కరించారు.



చరిత్ర పునరావృతం

విశ్వసనీయత కోల్పోయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టి నరేంద్ర మోదీ గాలిలో, జనసేన పవన్‌కల్యాణ్‌ అందించిన సహకారంతో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో 2014లో అధికారంలోకి రాగలిగింది. తెలుగుదేశం ఇచ్చిన హామీల అమలుపై ఎన్నికల కమిషన్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. ‘ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం’ అంటూ అఫిడవిట్‌ సమర్పించి ఆ పార్టీ ప్రజలను నమ్మించగలిగిందన్నది సుస్పష్టం. కానీ అధికారంలోకి వచ్చాక ఏ హామీని నెరవేర్చగలిగారు? తొలి సంతకాలు అంటూ ఆర్భాటంగా చేసిన 5 ఫైళ్లు ఏమయ్యాయి? నిబంధనల పుణ్యమా అని రైతుల సంపూర్ణ రుణమాఫీ కుంచించుకు పోయింది. చివరకు రూ. 24 వేల కోట్లు ఇస్తామని, రూ. 10 వేల కోట్లు లోపునకు పరిమితమైనారు. అది రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీలక్కూడా సరిపోదనేది నగ్నసత్యం.



బెల్ట్‌షాపుల రద్దు, దశల వారీ మద్య నిషేధం హామీ ఏమైనాయి? సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన 500 మీటర్లలోపు ఉండే మద్యం దుకాణాలను తరలించకుండా ఏకంగా ఆ రహదారుల్ని పట్టణ రహదారులుగా నోటిఫై చేయడానికి ఒడిగట్టింది ప్రభుత్వం. ప్రత్యేక హోదా, స్థానిక సంస్థలకు నిధులు, విధుల బదలాయింపు, రాజ్యాంగేతర, అప్రజాస్వామిక ‘జన్మభూమి’ ఆవిర్భావంతో జరుగుతున్న అక్రమాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీల్లో ఏవైనా నెరవేరాయా? నేరవేర్చామని చెబుతున్న కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ వంటి సంస్థలు ఎప్పుడు మొదలైనాయి?



జీవన ప్రమాణాలు పెంచే పథకాలు

ప్రజానీకంలో విశ్వసనీయత కలిగిన నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన కుమారుడు జగన్‌కు తండ్రి నుంచి పుణికి పుచ్చుకొన్న విశిష్ట లక్షణాలలో ప్రజల ఈతిబాధల పట్ల సానుభూతి, ఇచ్చిన హామీల నుంచి వెనుదిరగకపోవడం వంటివి ఉన్నాయి. అమరావతి ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు ప్రజల జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని చేసినవి. తెలుగుదేశం పాలనలో రైతాంగం, మహిళలు, నిరుద్యోగ యువత, బడుగు, బలహీన వర్గాల ఆశలు అడియాసలైన నేపథ్యంలో జగన్‌ 9 ప్రధాన వాగ్దానాలు చేయ డం సముచితం, సమంజసమని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.



‘వైఎస్సార్‌సీపీ భరోసా’ పథకం వల్ల చిన్న సన్నకారు రైతులు ఒక్కొక్కరికి రూ. 50,000 అందుతుంది. కనీస మద్దతు ధరలు లేక, పెట్టుబడులు లేక వ్యవసాయం చేయలేని రైతాంగానికి అది గొప్ప ఊరట.  డ్వాక్రా మహిళలకు ‘వైఎస్సార్‌సీపీ ఆసరా’ పథకం నిజమైన ఆసరాయే. 3 దశల్లో మద్య నిషేధం ఆలోచన సత్ఫలితాలిచ్చే అవకాశం ఉంది. ‘అమ్మ ఒడి’ పథకంతో పేద కుటుంబాల చిన్నారులు విద్యాపరంగా తమ కాళ్లమీద తాము నిలబడగలిగే శక్తిని సంపాదించగలరు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వైఎస్‌ మరణానంతరం చతికిలపడ్డాయి. సాగునీటి రంగంలో నీటి కంటే ముందు అవినీతి పారుతోంది. రాష్ట్రానికి కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులకు సంబంధించి న్యాయమైన హక్కులు సాధించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన అలసత్వం, వైఫల్యం వల్ల నీటి వనరుల సాధనలో వెనుకబడిన పరిస్థితి ఏర్పడింది.



ఈ నేపథ్యంలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలన్న తండ్రి కల నెరవేరాలంటే వైఎస్ జగన్‌ ‘జలయజ్ఞం’ను ప్రజల అవసరాలు, వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపదికగా పునర్వ్యవస్థీకరించాలి. వైఎస్‌ తను ముఖ్యమంత్రిగా ఉండగా సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 80 లక్షల ఇళ్లను నిర్మించి సంతృప్తస్థాయి (శాట్యురేటెడ్‌ లెవల్‌) సాధించాలన్న ఆయన కలను సాకారం చేయాలంటే మరో 25 లక్షల ఇండ్ల నిర్మాణం జరగాలి. పేదల ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలిచిన ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యమయింది. ప్రజల చెంతకు మళ్లీ ప్రజా వైద్యం చేరాలనేదే వైఎస్సార్‌సీపీ ఆకాంక్ష. 2019లో జరగబోయే ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చే నైతిక స్థాయి ప్రధాన ప్రతిపక్షనేతగా ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంది. విశ్వసనీయతకు, నమ్మక ద్రోహానికి మధ్య జరిగే సంఘర్షణలో ప్రజలు నిస్సందేహంగా విశ్వసనీయతకే పట్టం గడతారు.



ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడం చారి త్రక ఆవశ్యకత! ‘అన్న వస్తాడు.. నవరత్నాలు అందిస్తాడు.. మంచి రోజులు రానున్నాయి’ అనేదే ఈనాటి ప్రజాచర్చ. ఈ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వైఎస్సా ర్‌సీపీ తన ప్లీనరీ ద్వారా ప్రజల్లో కల్పించగలిగింది. అందుకే రాష్ట్ర ప్రజల ఆలోచనా విధానం మారింది. చంద్రబాబు పట్ల భ్రమలు వీడిపోయే సందర్భం వచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తర్వాత ప్రజాభిప్రాయం పూర్తిగా వాస్తవి కతకు దగ్గరైందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రస్తుతం తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. తమ అన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు. ‘అన్న వస్తున్నాడు’ అన్న పదమే ప్రజల నోళ్లలో పలుకుతోంది. మంచి రోజులు దగ్గరలో ఉన్నాయన్న ఆశ పెరుగుతోంది.





డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు


మొబైల్‌ : 99890 24579

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top