ఆ కొంచెం కూడా పోవడం ఖాయం

ఆ కొంచెం కూడా పోవడం ఖాయం - Sakshi

పార్లమెంటులో అందరూ మేజాల్ని చరుస్తూ హర్షామోదాలు వ్యక్తం చేస్తుంటే నాకు దలేర్ మెహందీ పాడే పాట గుర్తుకొచ్చింది - 'మామ్లా గడ్‌బడ్‌ హై'! ఏ రాజకీయ నాయకుల నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారో, వాళ్లే దాన్ని స్వాగతిస్తుంటే మీరైతే ఏమంటారు? వ్యవహారం గందరగోళంగా(మామ్లా గడ్‌బడ్‌) ఉందనేగా!

 

అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో చాలా నాటకీయంగా మాట్లాడుతూ, రాజకీయ పార్టీల నిధులలో పారదర్శకతను తేవడం కోసం ఒక ప్రతిపాదనను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రాజకీయ పార్టీలు ఇకపై రూ. 2,000 లకు మించి నగదు స్వీకరించలేవు. రాజకీయాలలోకి స్వచ్ఛమైన సక్రమ ధనాన్ని తేవడం కోసం 'ఎలక్షన్ బాండ్లు' ప్రవేశపెడతామని కూడా ఆయనన్నారు. ఈ తీర్మానానికి పార్లమెంటు సభ్యులంతా మేజాల్ని చరుస్తూ మద్దతు పలికారు. టీవీ చానెళ్లు ఆహో ఓహో అంటూ ప్రశంసలు కురిపించాయి. మరుసటి రోజు దినపత్రికల సంపాదకీయాల్లో కూడా ఇప్పటికైనా సరైన దిశలో ఓ గొప్ప ముందడుగు వేశారన్న సంతోషం వ్యక్తమైంది. ఆర్థికమంత్రి పనైపోయింది.. బడ్జెట్ లెక్కాపద్దులూ పూర్తయ్యాయి.

 

వాస్తవానికి ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ఆ రోజున ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎలక్షన్ బాండ్ వ్యవహారం నిజానికి మూసిన డబ్బా పెట్టె లాంటిది. కానీ బడ్జెట్ పత్రాలు బైటికి వెలువడిన తర్వాత అర్థమైన విషయమేమిటంటే ఇది అరుణ్ జైట్లీ వేసిన మరో గూగ్లీ! అంటే బంతి ఏ దిశలో స్పిన్ అవుతుందో దానికి పూర్తిగా భిన్నమైన దిశలో తిరుగుతుంది! దీని ద్వారా రాజకీయాల్లో నల్లధనం అంతం కావడం మాట అటుంచి రాజకీయ అకౌంటింగ్‌లో ఇప్పటి దాకా ఏ కాస్తయినా నెలకొని ఉన్న పారదర్శకత కూడా తూడ్చిపెట్టుకుపోవడం ఖాయం. అందుకే రాజకీయాల్లో పారదర్శకత కోసం అనేక ఏళ్లుగా గొంతెత్తుతున్న 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్' వంటి సంస్థలు ఈ ప్రతిపాదనలతో తల పట్టుకున్నాయి.

 

రాజకీయ పార్టీలకు నగదు రూపంలో లభించే చందాల పరిమితి 2 వేల రూపాయలు మించగూడదనేది ఆర్థిక మంత్రి చేసిన మొదటి ప్రతిపాదన. ఇప్పటివరకు అలాంటి పరిమితి ఏదీ లేదు కాబట్టి చూడగానే ఇది బాగానే కనిపిస్తుంది. వందల కోట్ల రూపాయల నగదు చందాలు ఊరూ పేరులేని వనరుల నుంచి లభించాయని చెప్పుకుంటున్న పార్టీలకు ఏదో మేరకు కళ్లెం వేసినట్టే అని అనిపిస్తుంది. కానీ కాస్త జాగ్రత్తగా గమనిస్తే దీనితో జరిగే మార్పేమీ లేదని గ్రహించవచ్చు. ప్రస్తుత చట్టం ప్రకారం పార్టీలు రూ.20 వేల లోపు లభించే చందాలకు లెక్కలు చూపాల్సిన అవసరం లేదు. దీనిని అడ్డు పెట్టుకొని అత్యధిక రాజకీయ పార్టీలూ, వాటి నేతలూ హవాలా, ప్రాపర్టీ, అవినీతి మార్గాల్లో అక్రమంగా ఆర్జించిన ధనాన్ని రాజకీయ చందాలుగా చూపిస్తూ బ్లాక్‌ను వైట్‌గా మార్చుకుంటున్నాయి.

 

దీనిని అడ్డుకోవాలంటే రెండు రకాల నిబంధనలు అవసరం. మొదటిది, లెక్క చెప్పనవసరం లేని మినహాయింపు పరిమితిని పూర్తిగా తొలగించాలి. మిగతా సంస్థలకు వర్తించినట్టుగానే రాజకీయ పార్టీలు కూడా తమకు లభించే నిధుల లెక్కల్ని విధిగా చూపించేలా కట్టడి చేయాలి. నగదుగా లభించినా, చెక్ రూపంలో లభించినా, 50 వేలే అయినా, లేదా 50 లక్షలైనా అన్నింటికీ లెక్కలు చూపాలి. రెండోది, ఏ పార్టీ అయినా నగదు రూపంలో స్వీకరించే చందాల మొత్తానికి ఒక పరిమితి పెట్టాల్సింది. పార్టీలు తమ మొత్తం చందాలలో 10 శాతం మాత్రమే నగదు రూపంలో స్వీకరించవచ్చనే నిబంధనను రూపొందించాల్సింది.

 

కానీ ఆర్థిక మంత్రి అలాంటిదేమీ చేయలేదు. ఇప్పుడు జరిగిందేమిటేటంటే, లెక్క చెప్పనవసరం లేని నగదు చందా పరిమితిని 20 వేల నుంచి 2 వేల రూపాయలకు తగ్గించారు. దీనితో జరిగే మార్పేమీ ఉండదు. నిన్నటి వరకు 'ఇవిగో 100 కోట్లు, వీటిని 20-20 వేల చొప్పున వేర్వేరు చందాలుగా చూపిస్తూ రిజిస్టర్‌లో ఎంట్రీ చేసెయ్' అని తమ అకౌంటెంట్లను పురమాయించిన రాజకీయ నేతలు ఇప్పుడు 'ఇవిగో 100 కోట్లు, వీటిని రెండేసి వేల రూపాయలుగా చూపిస్తూ రిజిస్టర్‌లో నమోదు చేయ్' అని ఆర్డరు వేస్తారంతే. నిన్నటి వరకు వందల కోట్ల అక్రమ ధనాన్ని సక్రమ ధనంగా మార్చుకున్న వాళ్లు ఈరోజు కూడా ఆ పనిని భేషుగ్గా చేసేస్తారు.

 

ఈ కొత్త ప్రతిపాదనతో వాళ్లపై పడే ప్రభావమేమీ ఉండబోదు. కేవలం చార్టర్డ్ అకౌంటెంట్లు పడే కష్టం, వారి ఫీజులు పెరుగుతాయంతే. ఇక ఎలక్షన్ బాండ్ల ప్రకటన వెనుకున్న ఉద్దేశం రాజకీయ పార్టీలకు సక్రమ ధనాన్ని చందాగా ఇవ్వాలనుకునే వారికి ఆ ప్రక్రియ సులువుగా జరిగేలా చెయ్యడం. నిజమే, రాజకీయాల్లో అక్రమ ధనాన్ని అరికట్టడంతో పాటు సక్రమ ధనాన్ని ప్రోత్సహించడం కూడా అవసరమే మరి! కానీ ఈ సాకుతో ఆర్థిక మంత్రి వేసిన ఎత్తుగడ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైంది. రాజకీయ పార్టీలకు స్వచ్ఛంద దానానికి బదులు గుప్త దానం కోసమే ఈ ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో ఇప్పటి వరకూ కాస్తో కూస్తో మిగిలి వున్న పారదర్శకత కూడా ఈ ఎలక్షన్ బాండ్లతో హరించుకుపోతుంది.

 

ప్రభుత్వ పథకం ప్రకారం ఒక వ్యక్తి ఏ పార్టీకైనా తన సక్రమ ధనాన్ని చందాగా ఇవ్వాలనుకున్నట్టయితే బ్యాంకుకు వెళ్లి అంతే మొత్తానికి సరిపడా ఎలక్ట్రానిక్ బాండ్లు ఖరీదు చేయాల్సి ఉంటుంది. బాండ్‌పై దాన్ని కొనుగోలు చేసే వ్యక్తి పేరూ, దానిని స్వీకరించే పార్టీ పేరూ ఏదీ ఉండదు. ఏ పార్టీకి కావాలనుకుంటే ఆ పార్టీ వాళ్ల చేతిలో ఆ బాండ్‌ను పెట్టెయ్యవచ్చు. దానం చేసే వాళ్లు తాము ఏ పార్టీకి దానం చేశారో చెప్పాల్సిన పని లేదు. స్వీకరించిన పార్టీలు తమకు ఏ వ్యక్తి నుంచి లేదా ఏ కంపెనీ నుంచి సదరు చందా ముట్టిందో చెప్పాల్సిన పని లేదు. ఇందులో అన్నింటికన్నా ప్రమాదకరమైన అంశం ఏమిటంటే పార్టీలు తమకు లభించిన మొత్తం బాండ్ల విలువెంతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎలక్షన్ బాండ్లతో రూ. 20,000 లోపు స్వీకరించే చందాలకు లెక్కలు చెప్పనవసరం లేదనే కనీస మినహాయింపు కూడా పూర్తిగా లేకుండా పోతుందన్న మాట.

 

ఉదాహరణకు ఒక ప్రభుత్వం ఏదైనా కంపెనీకి ఒక పెద్ద డీల్ ద్వారా రూ. 5 వేల కోట్లు లాభం వచ్చేలా చేసిందనుకుందాం. ఇరు పక్షాల మధ్య ఫిఫ్టీ-ఫిఫ్టీకి ఒప్పందం కుదిరిందనుకుందాం. అప్పుడా కంపెనీ రూ. 2.5 వేల కోట్ల ఎలక్షన్ బాండ్లు ఖరీదు చేసి గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీ చేతిలో పెట్టేస్తుంది. నేడున్న నిబంధనల ప్రకారం కంపెనీ ఏదైనా పార్టీకి రెండున్నర వేల కోట్లు ఇచ్చినట్టయితే ఆ వివరాన్ని బ్యాలెన్స్ షీట్‌లో చూపాల్సి ఉంటుంది. ఆ పార్టీకి సంబంధించిన ఆదాయ పన్ను వివరాల్లో సైతం దీన్ని పొందుపర్చాల్సి ఉంటుంది. కానీ జైట్లీ గారు ప్రవేశపెట్టిన ఈ 'సంస్కరణ'తో లావాదేవీల రికార్డులే మాయమైపోతాయి. ఈ ఒప్పందంలో వ్యవహారం గురించి కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది - కంపెనీ యజమాని, పార్టీ నేత. ఇలా సక్రమ ధనాన్ని అక్రమ మార్గాల్లో అందించే బ్రహ్మాండమైన ఏర్పాటు జరిగిందన్న మాట.

 

మన దేశంలో నల్లధనానికీ, అవినీతికీ మూలం రాజకీయ అవినీతేనన్న విషయం అందరికీ తెలుసు. దానికి పునాదిగా వున్నవి ఎన్నికల ఖర్చు, రాజకీయ నిధులే. రాజకీయ నిధులలో అత్యధిక భాగం పార్టీ నేతల జేబుల్లోనైనా ఉంటుంది లేదా పార్టీల ఇనప్పెట్టెల్లోనైనా ఉంటుందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. నిధులలో అత్యల్ప భాగాన్ని మాత్రమే బ్యాంకు అకౌంట్లలో నిల్వ చేస్తారు. ఆ కొద్ది భాగాన్నే ఆదాయ పన్ను శాఖ ఎదుటా, ఎన్నికల కమిషన్ ఎదుటా ప్రకటిస్తారు. ఈ స్వల్ప మొత్తాల్లో కూడా పెద్ద పెద్ద కుంభకోణాలు బైటపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల నిధుల వ్యవహారాన్ని సంస్కరించాలంటే పార్టీలకు లభిస్తున్న డబ్బులో సక్రమమైనదే అత్యధికంగా ఉండే విధంగా చూడాల్సి ఉంటుంది. దాంతో పాటు ఈ డబ్బు లావాదేవీలను తనిఖీ చేయగల పటిష్టమైన వ్యవస్థ కూడా ఉండాలి. కానీ ఆర్థిక మంత్రి అలా చేయడానికి బదులు ఇప్పటి వరకు స్వల్ప పరిమితిలోనే అయినా అమలులో ఉన్న తనిఖీని పూర్తిగా లేకుండా చేసి దానిపై పరదా కప్పేశారు.

 

దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నిధులనే నీళ్ల ట్యాంకుకు కన్నం పడి అందులోంచి నీరు లీక్ అవుతుందనుకుందాం. దాన్ని పూడ్చడానికి బదులు, ట్యాంకుకు మరెన్ని చిల్లులైనా పడనివ్వండి, కానీ అవి రెండు వేళ్లకన్నా ఎక్కువ వెడల్పుతో ఉండగూడదు అన్న చందంగా ఆర్థిక మంత్రి ఈ నిబంధనలు రూపొందించారు. అంతే కాదు, ట్యాంకు పైనున్న మూత కూడా తీసేశారు. ఎవరికి ఎన్ని లోటాలు కావల్సినా తోడుకోవచ్చు. అన్నింటికన్నా గమ్మత్తైన విషయమేమిటంటే అందరి కళ్లెదుటా పారదర్శకత అని రాసున్న ఒక పెద్ద స్క్రీన్‌ను పెట్టారు. ట్యాంకులోంచి నీళ్లు మునుపటికన్నా ఎక్కువ లీక్ అవుతున్నాయి. నీటి దోపిడీ జరిగిపోతోంది. కానీ అదిప్పుడు కళ్లకు కనిపించకుండా అయిపోయింది. అందరూ పారదర్శకత అనే స్క్రీన్‌ను చూసి చప్పట్లు కొడుతున్నారు. పార్లమెంటు సభ్యులు మేజాల్ని చరుస్తున్నారు.


 

 -Yogendra Yadav
Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top