మళ్లీ ఘోర ప్రమాదం

మళ్లీ ఘోర ప్రమాదం


ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతౌలి సమీపాన శనివారం పూరీ–హరి ద్వార్‌ ఉత్కళ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ప్రమాదం మరోసారి రైల్వే శాఖ లోపాలను పట్టిచూపింది. 22మంది నిండు ప్రాణాలు తీసి, మరో 156 మంది గాయాలపాలు కావడానికి దారి తీసిన ఈ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణ మని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదాల్లో మానవ తప్పిదం విషయాన్ని వెనువెంటనే ఆ శాఖ అంగీకరించడం చాన్నాళ్ల తర్వాత ఇదే మొదటిసారి.


అంతే కాదు... కార్యదర్శి స్థాయి రైల్వే బోర్డు అధికారిని సెలవుపై పంపి, నలుగురు అధి కారులను సస్పెండ్‌ చేయడంతోపాటు ఒకరిని బదిలీచేశారు. ప్రమాదం జరిగాక రైల్వే సిబ్బందిలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వెల్లడికావడం వల్ల ఇంత చురుగ్గా వ్యవహరించి ఉండొచ్చు. ఆ సంభాషణ ప్రమాదం జరిగిన పట్టాలపై వెల్డింగ్‌ పనులు నడుస్తున్నాయని నిర్ధారిస్తోంది.  



ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని రైల్వే శాఖ తరచు చెబుతుంటుంది. కానీ చాలా ప్రమాదాలు పట్టాలు తప్పడం కారణంగానే చోటు చేసుకుంటున్నాయి. శనివారంనాటి ప్రమాదానికి కేవలం పైనుంచి కింది వరకూ ఉండే సిబ్బంది మధ్య ఏర్పడ్డ సమాచార లోపమే కారణం. పట్టాలపై పనులు సాగుతున్నాయి గనుక 20 నిమిషాలు ఇటువైపు రైళ్లు రాకుండా చూడాలని తాము చెప్పామని కొందరంటుంటే, తనకసలు సమాచారం లేదని స్టేషన్‌ సూపరిం టెండెంట్‌ చెబుతున్నారు. పట్టాలపై స్వల్ప మరమ్మతులేమైనా ఉంటే ఆ కొద్ది నిడివిలోనూ రైలును అతి నెమ్మదిగా నడుపుతారు. పనుల సంగతిగానీ, అటు వెళ్ల కూడదన్న సంగతిగానీ తెలియని డ్రైవర్‌ యధాప్రకారం వేగంతో నడిపిన కార ణంగా 22మంది ప్రాణాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి.



నిజానికి మరమ్మతు లున్న పక్షంలో ఆ పని జరిగే ప్రాంతంవైపు రైళ్లు రాకుండా ఎర్రజెండాలుంచుతారు. కనీసం అది కూడా అక్కడ పాటించి ఉండరని ప్రమాదం జరిగిన తీరును చూస్తే అర్ధమవుతుంది.  పట్టాల మరమ్మతులు, ఇతరత్రా పనులు చేసేటపుడు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజెప్పే మాన్యువల్‌ ఉంటుంది. అలాంటి సమయాల్లో ఏ స్థాయి వారి బాధ్యతలేమిటో, ఎవరు ఏఏ పనులు నిర్వర్తించాలో స్పష్టంగా ఆ పుస్తకం వివరిస్తుంది. పైగా మరమ్మతులున్నప్పుడు ముందస్తుగా లిఖితపూర్వక అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ఏదైనా లోపాన్ని గుర్తిం చినప్పుడు అత్యవసరంగా పట్టాల్ని మరమ్మతు చేయాల్సి రావొచ్చు. ఆ సమ యంలో సైతం పనులకు సంబంధించిన వర్తమానాన్ని అన్ని స్థాయిల్లోనివారికి చేరేయగలగాలి. మరమ్మతుల విషయంలో అక్కడి రైల్వే డివిజన్‌ మొదలుకొని స్థానిక స్టేషన్‌ సూపరింటెండెంట్‌ వరకూ ప్రతి ఒక్కరికీ సమాచారం ఉండి తీరాలి.



అప్పుడు మాత్రమే రైలు నడిపే డ్రైవర్‌కు విషయం తెలుస్తుంది. ప్రతి స్థాయిలోనూ అతడికి సూచనలు అందుతాయి.  ఆ మార్గదర్శకాలను అనుసరిస్తే ఇలాంటి ప్రమా దాలు జరిగే ఆస్కారం ఉండదు. ఇందులో ఎక్కడ లోపం జరిగినా ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వస్తుంది. నిజానికి సిబ్బంది సంసిద్ధత ఏమేరకు ఉన్నదో తెలుసుకోవడానికి నిర్ణీత కాలవ్యవధిలో కసరత్తులు జరుగుతుండాలి. వాటిల్లో బయటపడే లోపాలపై సమీక్ష నిర్వహించుకుని సరిచేసుకోవాలి. అవి క్రమం తప్పకుండా కొనసాగిస్తుంటే ప్రమాదాలను నివారించవచ్చు. రైల్వే శాఖకొస్తున్న నష్టాలను తగ్గించుకోవడానికి చాన్నాళ్లనుంచి సిబ్బందిని తగ్గించడం, మరీ తప్పనిసరైనప్పుడు కాంట్రాక్టు సిబ్బందిని తీసుకోవడం, అదే సమయంలో ఆధునికీకరణ ప్రక్రియ చురుగ్గా ముందుకు సాగకపోవడం వంటివి సమస్యలు తెస్తున్నాయని రైల్వే యూనియన్లు ఆరోపిస్తుంటాయి.



సిబ్బందిపై పని భారం విపరీతంగా పెరిగిపోవడం వల్ల వారికి దేనిపైనా సమగ్రంగా దృష్టి సారించడం సాధ్యం కావడంలేదన్న ఆరోపణకూడా ఉంది. విస్తృతమైన దర్యాప్తు చేస్తే తప్ప ఇప్పుడు జరిగిన ప్రమాదంలో వీటి భాగమెంతో తెలియదు. ప్రమాదం జరిగినప్పుడల్లా పట్టాలను మెరుగుపర్చడానికి, వాటి యాజమాన్య నిర్వహణకు వినియోగిస్తున్న లేదా వినియోగించబోతున్న సాంకేతికత గురించి, బోగీల ప్రమాణాలు పెంచడానికి తీసుకుంటున్న చర్యలు వగైరాలను చెప్పడం రైల్వే శాఖకు పరిపాటి.



ఈసారి కూడా నలువైపుల నుంచీ వస్తున్న విమర్శల ధాటికి రైల్వే శాఖ స్పందించింది. గత మూడేళ్లలో ప్రమాదాలు చాలా భాగం తగ్గాయని చెబుతోంది. 2014–15లో 135 ప్రమాదాలు జరిగితే ఆ మరుసటి సంవత్సరం 107, ఈ ఏడాది ఇంతవరకూ 104 జరిగాయని గణాంకాలు ఏకరువు పెట్టింది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది మెరుగుదల 48.3 శాతం ఉన్నదని వివరించింది. యూపీఏ హయాంతో పోలిస్తే గత మూడేళ్లలో ఏ ఏ అంశాల్లో పురోగతి సాధించగలిగామో చెప్పింది. అలాగే భద్రతకు యూపీఏ ప్రభుత్వం ఏటా రూ. 33,972 కోట్లు వెచ్చిస్తే తాము రూ. 54,031 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించింది. అయితే ఇలాంటి గణాం కాలు స్వీయ సమీక్షకు పనికొస్తాయే తప్ప ప్రయాణికులను సంతృప్తిపరచలేవు. వారికి సంబంధించినంత వరకూ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరడం ముఖ్యం. అందుకు చేస్తున్నదేమిటో రైల్వే శాఖ చెప్పగలగాలి.



ముఖ్యంగా ఖాళీల భర్తీ విషయంలో తీసుకుంటున్న చర్యలేమిటో తెలియజేయాలి. పట్టాల నిర్వహణ, బోగీల పటిష్టత, ప్రమాదాల నివారణకు వివిధ స్థాయిల్లో అమల్లోకి తెచ్చిన వ్యవ స్థలు వగైరాలపై వివరించాలి. వీటన్నిటినీ రైల్వే శాఖలోని విభాగాలే చూస్తూ అంతర్గత సమీక్షలతో సరిపెడితే కుదరదు. వివిధ రంగాల నిపుణులతో కూడిన సంఘం ఎప్పటికప్పుడు గమనిస్తూ నిర్ణీత కాలవ్యవధిలో నివేదికలిచ్చే ఏర్పా టుండాలి. రైల్వే శాఖ చెబుతున్నదానికీ, క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవానికీ మధ్య ఉన్న వైరుధ్యాలు అందరికీ తెలియాలి. అలాచేస్తే రైల్వే శాఖ అనుసరిస్తున్న ప్రమా ణాలపై సాధారణ ప్రజానీకంలో విశ్వసనీయత కలుగుతుంది. అందుకవసరమైన పారదర్శకత పాటించడం తక్షణావసరమని ఆ శాఖ గుర్తించాలి.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top