అదిగో నవలోకం!

అదిగో నవలోకం!


ఈ విశాల విశ్వంలో మనిషిని పోలిన... మనిషిలా ఆలోచించగలిగిన జీవులు వేరే ఎక్కడైనా ఉన్నారా అన్న ఆసక్తి ఈనాటిది కాదు. అంతక్రితం మాటేమోగానీ, క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దిలో గ్రీకు తత్వవేత్తలు భూమిని పోలిన గ్రహాలున్నాయని ఊహించినట్టు దాఖలాలున్నాయి. అనంతరకాలంలో గ్రహాంతరజీవుల గురించిన ఆలోచనలు మొగ్గతొడిగాయి. సహజంగానే తర్వాత్తర్వాత వారు కాల్పనిక సాహి త్యంలోనూ ‘చొరబడ్డారు’. ఎన్నో కావ్యాలకూ, నవలలకూ ఇతివృత్తమ య్యారు. వారిని గురించిన ఈ దాహార్తిని వెండితెర కూడా యధోచితంగా తీర్చింది. గ్రహాం తరజీవులను ప్రధానం చేసుకుని అనేక చలనచిత్రాలు వచ్చాయి. అప్పుడప్పుడు గ్రహాంతరజీవుల్ని తాము చూశామని చెప్పినవారూ లేకపోలేదు. కొందరైతే గ్రహాంతరజీవులు ఉపయోగించే ఎగిరే పళ్లాలు చూశామని చెప్పిన సందర్భాలున్నాయి. ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేమన్న నమ్మకమే వీటన్నిటికీ ఆధారం. అయితే భూమిని పోలిన గ్రహాలున్నాయన్నంతవరకూ మాత్రమే ఇప్పటిదాకా శాస్త్ర  వేత్తలు ధ్రువీకరించారు.



ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా... మన సౌర కుటుంబాన్ని పోలి ఉండే సప్త గ్రహ వ్యవస్థ మనకు 39 కాంతి సంవత్సరాల దూరంలో... అంటే 234 లక్షల కోట్ల మైళ్లకు పైగా దూరంలో ఉన్నదని చేసిన ప్రకటన సంభ్రమాశ్చర్యాలు గొలుపుతుంది. మన సూర్యుడి కంటే బాగా చిన్నగా, తక్కువ తీవ్రతతో ఉన్న ఒక కుబ్జ తార ట్రాపిస్ట్‌–1 చుట్టూ ఆ ఏడు గ్రహాలూ తిరుగాడుతున్నాయని నాసా తెలిపింది. చిత్రమేమంటే ఆ ఏడూ పరిమాణంలో భూమిని పోలే ఉన్నాయి. అంతేకాదు...వాటిలో మూడు గ్రహాలు జలరాశితో కూడా నిండి ఉండొచ్చునని నాసా శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. జలరాశికి ఆస్కారమున్నది గనుక ఏదో రకమైన జీవరాశి కూడా ఉండకపోదంటున్నారు.



గ్రహాన్వేషణకు సంబంధించి దాదాపు రెండు దశాబ్దాలుగా అడపా దడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. 1995లో తొలిసారి ఒక తార చుట్టూ గురు గ్రహం పరిమాణంలో ఉన్న గ్రహం తిరుగాడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన సౌర కుటుంబం ఆవల ఒక గ్రహం జాడ తెలుసుకోవడం అదే ప్రథమం. ఆ తర్వాత ఇతర సౌర కుటుంబాల్లో చిన్నా, పెద్దా గ్రహాలు 3,449 కనుక్కున్నారు. వాటిలో భూమి పరిమాణంలో, శిలామయ ఉపరితలంతో ఉన్న గ్రహాలు 348 ఉన్నాయి. అయితే జీవుల మనుగడకు ప్రాథమిక అవసరం నీరు. అది ఉన్నదని నిర్ధారణగా తేలాకే ఏదో రకమైన జీవరాశి ఉండొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. నీరుం డటం అంత తేలికేం కాదు. సౌర కుటుంబంలో పరిభ్రమించే ఏ గ్రహమైనా అందు లోని సూర్యుడికి మరీ దగ్గరగా ఉన్నా లేక మరీ దూరంగా ఉన్నా... అక్కడ నీరుండే అవకాశం లేదు. మన సౌరకుటుంబాన్నే తీసుకుంటే భూమి కన్నా బుధ, శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉన్నాయి. అంగారకుడు దూరంగా ఉన్నాడు. ఇవి సాంద్రమైన ఘన పదార్థాలతో కూడుకున్నవి. మిగిలిన గురు, శని, యురేనస్, నెప్ట్యూన్‌లాంటివి ఘనీకృత లేదా చిక్కటి వాయువులతో ఉన్నవే. కొత్తగా కనుగొన్న సప్త గ్రహ వ్యవస్థలోని మూడు గ్రహాల్లో భూమిలాగే నీరు, ఇక్కడిలాగే సమశీతో ష్ణస్థితి ఉండటం జీవరాశి మనుగడ సాధ్యమై ఉండొచ్చునన్న అంచనాలకు తావి   స్తోంది. వాస్తవానికి ట్రాపిస్ట్‌–1 మన సూర్యుడి కంటే తక్కువ వేడిమితో ఉన్నది కనుక సమీపంలోని గ్రహంలో సైతం నీరున్నా ఆశ్చర్యపోనవసరం లేదని శాస్త్ర  వేత్తలు చెబుతున్నారు.



‘రేపు ఒక సంచలన ప్రకటన చేయబోతున్నామ’ంటూ నాసా వెల్లడించగానే ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఊహాగానాలు ప్రజానీకంలో ఉన్న శాస్త్ర విజ్ఞాన తృష్ణను, ప్రత్యేకించి ఖగోళంపై ఉన్న ఆసక్తిని తెలియజెబుతాయి. ఈ ప్రకటన తర్వాత కొందరు ప్లూటోకు మళ్లీ ‘పదోన్నతి’ కల్పించి దాన్ని గ్రహంగా ప్రకటి స్తారేమోనని ఊహించారు. 1930లో తొలిసారి కనుగొన్నప్పుడు ప్లూటోను గ్రహం గానే పరిగణించారు. అయితే ఉన్నట్టుండి 2006లో దాని స్థాయిని తగ్గించారు. మన సౌర కుటుంబంలో ప్లూటోలాంటివి మరిన్ని కనబడుతున్నాయని, మహా అయితే దాన్ని ‘కుబ్జ గ్రహం’గా పిలవొచ్చునని అంతర్జాతీయ ఖగోళ సమితి(ఐఏయూ) ప్రకటించింది. గ్రహానికి ఐఏయూ ఇచ్చిన నిర్వచనం మరీ సంకుచితంగా ఉన్నదని, ప్లూటోకు మళ్లీ గ్రహం స్థాయిని ఇవ్వాల్సిందేనని వాదించేవారు చాలామంది ఉన్నారు. ఏదో చెప్పబోతున్నామని నాసా ప్రకటన చేసిన వెంటనే అలాంటి వారంతా మళ్లీ ప్లూటో ప్రభ వెలిగిపోతుందని సహజంగానే ఆశించారు.  



ఈ సప్తగ్రహ వ్యవస్థ కనుగొనడానికి శాస్త్రవేత్తలు చేసిన కృషి అంతా ఇంతా కాదు. బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్‌ లీజీకి చెందిన శాస్త్రవేత్తలు, చిలీ, మొరా కోల్లో ఉన్న మరో రెండు బృందాలు శక్తివంతమైన టెలిస్కోప్‌లతో సమన్వయంతో నిశితంగా నిరంతరాన్వేషణ జరిపారు. కేవలం పెద్ద తారలవైపే కాక మరుగుజ్జు తారలపై కూడా దృష్టి పెట్టాలన్న నిర్ణయం పర్యవసానంగా వారు విశ్వంలో మస కగా వెలుగుతున్న మరుగుజ్జు నక్షత్రాన్ని గమనించారు. దాని ముందు నుంచి వెళ్తున్న మూడు గ్రహాలు గత ఏడాది మేలో వారి దృష్టికొచ్చాయి. దీనిపైనే దృష్టి కేంద్రీకరించి పనిచేయడంతో మొత్తం ఏడు గ్రహాల ఉనికిని కనుగొనగలిగారు. ఇంతక్రితం గమనించిన సౌర కుటుంబాలతో పోలిస్తే ఇది మనకు సమీపంలో ఉన్నట్టు లెక్క. కాబట్టి అందులోని గ్రహాల తీరుతెన్నులను, వాటిలో ఉండే ద్రవ్య రాశి, సాంద్రత, వాయువులు వగైరాలను పసిగట్టడం తేలికవుతుంది. విశ్వంలో ఇతరచోట్ల జీవరాశి ఆచూకీ కనుగొనడం ఒక్కటే ఇలాంటి అధ్యయనాల పరమార్ధం కాదు. మొత్తంగా గ్రహాల ఆవిర్భావం, వాతావరణ మార్పులు, జీవరాశి ఆవి ర్భావం వంటి అంశాల్లో మన అవగాహనను పెంచుకోవడానికి అవి తోడ్పడతాయి. వాటి అధ్యయనంతో మన భూగోళం గురించి మనం మరింత విస్తృతంగా, మరింత లోతుగా తెలుసుకోగలుగుతాం. ఈ విశ్వంలో మన స్థానం ఎక్కడో అంచనాకు రాగ లుగుతాం. శతాబ్దాలక్రితం మనిషి మస్తిష్కంలో పురుడుపోసుకున్న గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నదీ లేనిదీ నిర్ధారణగా తెలిసిపోయే రోజు దగ్గర్లోనే ఉంది.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top