కోర్టుల్లో కెమెరా కన్ను!

కోర్టుల్లో కెమెరా కన్ను! - Sakshi


దేశంలో చాన్నాళ్లుగా అందరూ కోరుకుంటున్నట్టు న్యాయ స్థానాల్లో క్లోజ్డ్‌ సర్క్యూట్‌(సీసీ) కెమెరాలు రాబోతున్నాయి. రాష్ట్రానికి రెండు జిల్లాలు చొప్పున ఎంచుకుని అక్కడి జిల్లా న్యాయస్థానాల్లో కెమెరాలు అమర్చాలని మొన్న మార్చిలో ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం సర్వోన్నత న్యాయస్థానం మొదలుకొని దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో, ట్రిబ్యునళ్లలో ఈ ఏర్పాటు చేయాలంటూ మూడు రోజుల క్రితం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.



న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌ పడుతున్న కేసులపై అందరికీ ఆదుర్దా ఉంది. అయితే పరిష్కారంపై న్యాయవ్యవస్థతోసహా ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే ఇది ఏదో ఒక్క అంశంతో ముడిపడి ఉన్న సమస్య కాదు. చాలినంతగా న్యాయమూర్తులు లేకపోవడం మొదలుకొని చీటికి మాటికీ కేసులు వేసే ప్రభుత్వ యంత్రాంగం వైఖరి వరకూ ఇందులో ఎన్నో ఉన్నాయి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు, వివిధ రంగాలకు ట్రిబ్యునళ్లు, ఫ్యామిలీ కోర్టులు, మొబైల్‌ కోర్టులు, న్యాయస్థానాల సంఖ్య పెంచడం... ఇలా రకరకాల విధానాల ద్వారా పెండింగ్‌ సమస్యను దారికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి.  కానీ అందువల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. అయితే పెద్దగా ఎవరి దృష్టీ పడని అతి ముఖ్యమైన అంశం పారదర్శకత. కింది కోర్టుల్లో నిర్దేశించిన విధానాలను పాటించక ఇష్టానుసారం వ్యవహరించడం పెండింగ్‌ కేసులు కొండలా పెరిగిపోవడానికి కారణమన్న వాదన ఎప్పటినుంచో ఉంది.



కేసుల విచారణ తీరు తెన్నులను రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు అమరిస్తే అన్నీ పద్ధతిగా జరుగు తాయని ఇలా వాదించేవారి అభిప్రాయం. విచారణ దశలో వివిధ అంశాలను లిఖితపూర్వకంగా రికార్డు చేయడం ఎప్పటినుంచో ఉన్నదే. అయితే కేసులో కీల కమైనవని న్యాయమూర్తి భావించి మౌఖికంగా చెప్పే విషయాలు మాత్రమే అందులోకి ఎక్కుతాయి. కేసులో ఏది న్యాయమో, ఏది కాదో నిర్ధారించేందుకు ఆ అంశాలు ఉపయోగపడతాయి తప్ప మొత్తంగా విచారణ ఎలా జరుగుతున్నదో, తరచు వాయిదా పడటానికి దారితీస్తున్న పరిస్థితులేమిటో అవి తేటతెల్లం చేయలేవు. కేసు విచారణల వార్తల్ని సేకరించేందుకు మీడియాను దాదాపు అన్ని దేశాల్లోనూ అనుమతిస్తున్నారు. అయితే దానికుండే పరిమితులు దానికున్నాయి.



ఏ వ్యవస్థకైనా గోప్యతనేది అవసరమే కావొచ్చుగానీ అది మోతాదుకు మించి ఉంటే అవరోధంగా మారుతుంది. పకడ్బందీ పర్యవేక్షణ ఉన్నచోట అన్నీ సక్ర మంగా కొనసాగుతాయి. లేనిపోని జాప్యానికి అడ్డుకట్ట పడుతుంది. హైకోర్టుల్లో పోర్టుఫోలియో జడ్జీలుండి తమ తమ పరిధుల్లోని జిల్లాల్లో ఏం జరుగుతున్నదో... కేసుల కదలిక ఎలా ఉంటున్నదో గమనిస్తుండటం, అవసరమైన సూచనలు, సల హాలు ఇవ్వడం ఇందులో భాగమే. అయితే ఇది ఎంతమాత్రమూ సరిపోదన్నది పారదర్శకత కోరుకునేవారి వాదన. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయ లలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏళ్ల తరబడి సాగిన తీరుపై తీవ్ర విమ ర్శలు చెలరేగాయి.



తీరా తుది తీర్పు వెలువడేనాటికి ఆమె కన్నుమూశారు. ఏదో ఒక సాకు చెప్పి న్యాయవాదులు వాయిదాలు కోరడం, న్యాయమూర్తులు ఉదా రంగా అనుమతులీయడం ఒక ధోరణిగా మారింది. విచారణ ప్రక్రియంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తే ఈ ధోరణి ఎంతోకొంత తగ్గుతుంది. ఆమేరకు విశ్వసనీయత పెరుగుతుంది. అయితే అదే సమయంలో కేసును విచారించే న్యాయమూర్తిపై అది ఒత్తిడి కలగజేస్తుందన్నది కూడా నిజం. సాక్ష్యమూ, చట్టమూ తప్ప ఇతరత్రా అంశాల ప్రభావమేదీ కేసుపై పడకుండా చూసుకోవడం ఆ పీఠంపై ఉన్నవారికి ప్రధానమవుతుంది. న్యాయమూర్తి మాత్రమే కాదు... కేసుకు సంబంధించిన ఇరు పక్షాల న్యాయవాదులు, కోర్టు హాల్‌లో ఉండే సిబ్బంది, పోలీసు అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తారు.



చాలా దేశాల్లో కోర్టు విచారణలను కెమెరాల్లో రికార్డు చేసే సంప్రదాయం ఉంది. అమెరికాలో 1991లో తొలిసారి ఈ విధానం ప్రవేశపెట్టినప్పుడు అటు విమ ర్శలు, ఇటు ప్రశంసలు కూడా సమానంగా వచ్చాయి. ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే ఆ వీడియోల వల్ల సొంత పనులపై బయటకు వెళ్లినప్పుడు సమస్యగా మారుతున్న దని న్యాయమూర్తులు కొందరు చెప్పారు. బాధితుల పక్షం న్యాయవాదిగా ఉన్న వారికి పెద్ద ఫర్వాలేదుగానీ... వారిని ఇబ్బందులపాలు చేసినవారి తరఫున వృత్తి ధర్మంతో వాదిస్తే అది తమపై వేరే అభిప్రాయం కలగజేస్తున్నదని వాపోయిన న్యాయవాదులున్నారు.



మరోపక్క తమ గురించి అందరికీ తెలిసిపోతుందని సాక్ష్యం చెప్పేవారు భయాందోళనలకు గురికావడం, తడబడటం మామూలే. ఇలాంటి కారణాలు చూపి అమెరికాలోని కొన్ని ఫెడరల్‌ కోర్టులు కెమెరాల ఏర్పాటును తిరస్కరించాయి. క్రిమినల్‌ కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే చానెళ్లు కూడా ఆ దేశంలో ఉన్నాయి. అక్కడి కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ కెమెరాలను అంగీ కరిస్తుంటే సుప్రీంకోర్టు కాదంటున్నది. మన సుప్రీంకోర్టు మాత్రం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమంటూనే ఆ రికార్డులను సమాచార హక్కు చట్టం కింద బయట పెట్టకూడదన్న ఆంక్ష విధించింది. దీనికితోడు ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల అనుమతి లేనిదే ఎవరికీ రికార్డయిన భాగాలు ఇవ్వకూడదని తెలిపింది.  



అలాగని సీసీ కెమెరాల ఏర్పాటు ప్రభావంపై అతి అంచనాలకు పోవడం కూడా సరికాదు. కెమెరాల ఏర్పాటు దానికదే కేసుల విచారణను వేగవంతం చేస్తుందని, అంతా పారదర్శకమవుతుందని భావించకూడదు. పెండింగ్‌ కేసుల సమస్య పరిష్కారానికి తోడ్పడే అనేకానేక అంశాల్లో అదొకటి మాత్రమే. దేన్నయినా కోర్టులో పడేసి చేతులు దులుపుకునే ప్రభుత్వ యంత్రాంగం వైఖరి అటు సాధారణ పౌరులను కోర్టు పక్షుల్ని చేస్తున్నది. ఇటు న్యాయస్థానాలను ఊపిరి సలపనీయడం లేదు. అందుకే అందరికంటే ముందు మారాల్సింది పాలనా వ్యవస్థే. అది మారితేనే ఏ కాస్తయినా ప్రయోజనం కలుగుతుంది.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top