వీఐపీ విష సంస్కృతి

వీఐపీ విష సంస్కృతి - Sakshi


అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ఇష్టపడని నేతలు అసంఖ్యాకంగా ఉన్న మన దేశంలో ఉన్నట్టుండి కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘అత్యంత ప్రముఖుల’ వాహనాల నెత్తిన కనబడే ఎర్ర, నీలి రంగు లైట్లకు స్వస్తి పలకాలని తీర్మానించింది. ‘బుగ్గ కార్లు’గా జనం వాడుకలో ఉన్న ఈ బాపతు వాహనాలపై సరిగ్గా నాలుగేళ్లక్రితం సర్వోన్నత న్యాయస్థానం విరుచుకుపడింది. ఇది ‘గణతంత్ర వ్యవస్థ అనుకుంటున్నారా... రాచ రికంలో ఉన్నామనుకుంటున్నారా?’ అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అలా ఆగ్రహిం చారన్న మాటేగానీ బుగ్గకార్లు వాడటానికి అర్హులైనవారి జాబితాను తగ్గించడం తప్ప న్యాయమూర్తులు మరేమీ చేయలేకపోయారు. దీనిపై మరోసారి దృష్టి సారించి కొత్త జాబితాను రూపొందించమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ విషయంలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటామంటూ తమ వాహనాలకున్న ఎర్రబుగ్గలను తొలగింపజేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వీఐపీ జాబితాకు అంటకత్తెరేయడం కాక ఏకంగా ఆ జాబితానే రద్దు చేశారు. రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి మొదలుకొని అందరూ వచ్చే నెల 1 నుంచి బుగ్గకార్లు వినియోగించరు. ఈ పని చేసినందుకు మోదీని అభినందించాలి.

 

మన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల అంతో ఇంతో స్తోమత ఉన్నవారు సొంతానికి వాహనాలు సమకూర్చుకొనక తప్పని స్థితి ఏర్పడింది. అందువల్లే పల్లెటూరు, పట్నం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా రోడ్లపై వాహనాలు పెరిగిపోయాయి. నగరాలైతే మరింత కిక్కిరిసిపోతున్నాయి. ఇవి చాలవన్నట్టు బుగ్గకార్ల బెడద ఒక వైపరీత్యంలా మారిపోయింది. కార్పొరేటర్లు మొదలుకొని సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లు, కార్పొరేషన్‌ చైర్మన్లు... ఒకరేమిటి ఎందరెందరో ఈ బుగ్గ కార్లతో సాధారణ ప్రజాజీవనానికి పెను అంతరాయం కలిగిస్తున్నారు. ఈ వీఐపీల జాబితా రోజులు గడుస్తున్నకొద్దీ పెరిగిపోతోంది. 2002లో ఇలాంటి వాహనాల విని యోగంపై కేంద్రం ఒక నోటిఫికేషన్‌ జారీచేసింది. మరో మూడేళ్లకే దాన్ని మరింత పెంచుతూ సవరించారు. అందులో రాష్ట్రపతి మొదలుకొని కేంద్ర ఉప మంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులు, కేబినెట్‌ కార్యదర్శి, త్రివిధ దళాధిపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వివిధ కమిషన్‌ చైర్మన్లు ఇతరులు ఉన్నారు. ఈ కార్లలో వేరేవారు ప్రయాణిస్తున్న సందర్భాలుంటే  పైనున్న లైట్లను నల్ల కవర్‌తో కప్పి ఉంచాలని అందులో సూచించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలు దీనికి అదనం. ఏతావాతా దేశంలో ఇప్పుడు 5,96,000మంది వీఐపీలు తయారయ్యారని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ‘అసలు’ ఎంత...‘నకిలీ’ ఎంత అన్న విచికిత్సకు ఆస్కారమే లేదు. ఎవరికైనా అనుమానం వచ్చి ఫిర్యాదు చేస్తే, పోలీ సులు ఆపితే అప్పటికప్పుడు ఎవరిచేతనో ఫోన్‌ చేయించుకుని బయటపడటం ఎలాగో ఈ ‘వీఐపీ’లకు తెలుసు. నిజంగా ప్రాణాలకు ముప్పున్నవారికి, పదవుల రీత్యా రక్షణ అవసరమున్న వారికి ఎంతో కొంత భద్రత కల్పిస్తే ఎవరూ తప్పు బట్టరు. అభ్యంతరమల్లా ఈ పేరిట సాగుతున్న వేలంవెర్రితోనే.



ఫ్యూడల్‌ వ్యవస్థకూ, వలస పాలనకూ ప్రతీక అయిన ఈ వీఐపీ సంస్కృతి విరగడ కావాలని ఆశించనివారుండరు. కనుక కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. అయితే మొత్తంగా దేశంలో తిష్టవేసిన వీఐపీ సంస్కృతికి బుగ్గకార్లు ప్రతీకే తప్ప అందులోనే సర్వస్వమూ ఇమిడి లేదు. దేశంలో ఉగ్ర వాదుల, తీవ్రవాదుల బెడద పెరిగినప్పటినుంచీ ఎక్కువగా వాడుకలోకొచ్చిన వీఐపీ భద్రత కూడా ఈ బాపతే. సాధారణ కానిస్టేబుళ్ల రక్షణ మొదలుకొని కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ దళం(సీఆర్‌పీఎఫ్‌), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్‌పీజీ), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ) వరకూ ఎన్నో రకాల భద్రతలు అమలుకావడం మొదలైంది. ఇందులో మళ్లీ ఎక్స్, వై, జడ్, జడ్‌ ప్లస్‌ లంటూ ఎన్నో రకాలున్నాయి. ‘ఎక్స్‌’ నుంచి ‘జడ్‌’, ‘జడ్‌ప్లస్‌’ల దగ్గరకొచ్చేసరికి రక్షణ కల్పించే సాయుధుల జాబితా పాపం పెరిగినట్టు పెరుగుతూ పోతుంది. ‘ఎక్స్‌’ రకానికి ఇద్దరు భద్రతా సిబ్బంది ఉంటే ‘జడ్‌ ప్లస్‌’కొచ్చేసరికి ఆ సంఖ్య 36కు చేరుతుంది. నాలుగు వేలమందికి మించని ఎస్‌పీజీకి ఏటా అయ్యే వ్యయం రూ. 360 కోట్లని ఒక అంచనా. సర్కారు ఖజానా వీఐపీల సేవలో తరిస్తున్నదన్నమాట! ఎన్నికల ప్రచా రాల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లడిగేవారు అధికారం చేతికందగానే భద్రతా వలయాల్లో ముడుచుకుపోయి హడావుడి చేయడం హోదాకూ, దర్పానికీ ప్రతీకగా మారింది. ట్రాఫిక్‌ను ఎక్కడైనా, ఎంతసేపైనా ఆపిస్తూ పోవడం తమ జన్మహక్కుగా వారు భావిస్తారు. రోడ్లపైన మాత్రమే కాదు... వారు గుళ్లూ గోపురాల సందర్శనకెళ్లినా సర్వం స్తంభించిపోతుంది. వృద్ధులున్నారని, పిల్లలున్నారని తమ కారణంగా వారంతా ఇబ్బంది పడతారని ఈ వీఐపీలకు తోచదు.



ఆలయాల్లో మాత్రమే కాదు... టోల్‌ప్లాజాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వగైరాలన్నీ ఈ వీఐపీల బలప్రదర్శనా కేంద్రాలే. ఆమధ్య కేంద్ర హోంశాఖ సహాయమంత్రి రిజుజు తనవారి కోసం విమానాన్ని చాలాసేపు ఆపించారని వార్తలొచ్చాయి. తనకు అడిగిన సీటు కేటాయించలేదని మొన్నటికి మొన్న ఒక సీనియర్‌ అధికారిని బూటుతో 25 సార్లు కొట్టిన శివసేన ఎంపీని అందరూ చూశారు. ఆ వివాదం ఒక కొలిక్కి రాకముందే తృణమూల్‌ మహిళా ఎంపీకి కోపమొచ్చి 40 నిమిషాలు విమానాన్ని కదలనివ్వలేదు. యూపీలో టోల్‌ప్లాజా దగ్గర ఒక బీజేపీ ఎమ్మెల్యే అక్కడి సిబ్బందిని చావబాదాడు. నిజానికి సమస్య వీఐపీలతో మాత్రమే కాదు... వారి సంతానం, వారి అనుచరగణం సైతం ఈ ముసుగులో ఎక్కడికెళ్తే అక్కడ అరాచకం సృష్టిస్తారు. టీడీపీ ఏలుబడిలోని ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు సంబంధించి బోలెడు ఉదాహరణలు కనబడుతుంటాయి. ఈ సంస్కృతి దుంపనాశనమైతే తప్ప మన ప్రజాస్వామ్యానికి అర్ధం ఉండదు. ఇప్పుడు బుగ్గకార్లు నిషేధించి పుణ్యం కట్టుకున్న ఎన్‌డీఏ సర్కారు మొత్తంగా ఈ సంస్కృతిపై గురిపెట్టి తన చిత్తశుద్ధి చాటుకోవాలి.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top