ఇదొక ధర్మ మీమాంస

ఇదొక ధర్మ మీమాంస


అక్షర తూణీరం

సువర్ణాక్షరాలతో రాయతగిన ఘట్టం. ప్రపంచమంతా విస్తు పోయి చూసింది. అయినా మన పత్రికలకి అది పక్కవార్తే అయింది. ఆ రోజు కూడా శశికళే పతాక శీర్షిక అయింది.



దాదాపు వందరోజుల నించి తమిళనాడులో ఉన్నట్టుంది. వార్తాపత్రికల పతాకశీర్షికలు, వార్తా చానళ్ల బ్రేకింగ్‌ న్యూస్‌లూ సమస్తం తమిళనాడు సమాచారంతోనే మార్మోగుతున్నాయి. జయలలిత అనారోగ్యం, అమ్మ ఆసుపత్రిలో ఉండడం, బడా నేతలంతా రావడం పోవడం, లోపలేంచూశారో చెప్పకుండా అమ్మ కోలుకుంటోందని టీవీ గొట్టాల్లో చెప్పడం, మొత్తం ఆ ఫార్స్‌ని ‘చిదంబర రహస్యం’గా తీర్చిదిద్దడం, ఆనక అందరూ కూడబలుక్కుని ఆమెని సాగనంపడం– ఒక రోజువారీ టీవీ సీరియల్‌లా నడిచింది.



తెలుగు వార్తా చానళ్లు జనాన్ని తెరలకి కట్టి పడేశాయి. తర్వాత సాగిన జయ అంతిమయాత్ర, ఆ తర్వాత నడిచిన పొలిటికల్‌ హైడ్రామా ఇవ్వాళ్టి దాకా మాంఛి టెంపోలో నడిపిస్తున్నారు. జనం చూస్తున్నారు, కళ్లల్లో ఒత్తులేసుకు చదివేస్తు న్నారు. మన సంగతులు కాని ఈ సంగతులు ఇంత సమగ్రంగా మనకి అవసరమా అని తెలుగు వాళ్లెవరూ అనుకోరు. హాయిగా చదివేస్తూ, చూసేస్తూ, మనిషి దొరికితే తమిళ రాజకీయాన్ని నూరిపోస్తున్నారు.



ఇటీవలి కాలంలో వార్తల్ని కూడా సీరియల్స్‌ స్థాయికి తీసుకొచ్చారు. అందునా మన తెలుగువారిది విశాల హృదయం. ఆనందం ఎవరిదైనా, విషాదం ఎవరిదైనా తమదిగా భావించి స్పందించే గుణం మనవారికుంది. ‘‘తప్పేముంది.. దాన్ని మేం క్యాష్‌ చేసు కుంటాం’’ అని మీడియాలో కొందరు హాయిగా చెప్పేస్తుం టారు. ఏది వార్తో, ఏది వార్త కాదో జర్నలిజం నిర్వచించింది గానీ, ఏది ఎవరికి వార్తో చెప్పనే లేదు. ఈ వందరోజుల్లో తమిళ నేతల పేర్లన్నీ మనకి కంఠతా వచ్చాయి. కనీసం వందమంది ముఖాల్ని చటుక్కున గుర్తించ గలం.



ఇక చిన్నమ్మ ఆనవాళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రస్తుతం బోలెడంత న్యాయ చర్చ జరుగుతోంది. దోషిగా మరణిం చిన అమ్మ చెల్లించాల్సిన వంద కోట్ల జరిమానా ఎవరు చెల్లి స్తారు? పార్టీనా, అభిమానులా, ప్రభుత్వమా? ఆమెకు పడిన జైలు శిక్షని ఎవరు భరి స్తారు? అతి ముఖ్యులంతా తలొక నెలా శిక్ష అనుభవించి అమ్మ ఆత్మకి శాంతి కలిగి స్తారా? భవిష్యత్తులో పురుచ్చితలైవిని బిరుదావళితో సంభావించవచ్చునా? ఆమెను తిరిగి కడిగిన ముత్యంగా తీర్చిదిద్దడం ఎలా? ఎంత తలపట్టుకున్నా ఎవరికీ అర్థం కావడం లేదు. ఇందులో తలపెట్టి ఎంతో కొంత లబ్ధి పొందాలన్న బీజేపీకి ఎక్కడా పట్టు చిక్కలేదు. జయ సమాధిపై చిన్నమ్మ చేసిన శపథం ఏమిటో ఎవరికీ వినిపించలేదు. అందుకని ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. అసలీ వందరోజులూ మనం ఈ వార్తల్ని ఫాలో కాకున్నా పెద్ద తేడా ఏమీ పడదనేది నిర్వివాదాంశం.



శ్రీహరికోటలో ఒక మహాద్భుతం జరిగింది. ఇంకా నింగిలో ఆ చారికలు కూడా చెరగలేదు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయ తగిన ఘట్టం. ప్రపంచమంతా విస్తు పోయి చూసింది. అయినా మన పత్రికలకి అది పక్కవార్తే అయింది. ఆ రోజు కూడా శశికళే పతాక శీర్షిక అయింది. నిజానికి మన మీడియా ఇస్రో సంరంభాన్ని ముందు నుంచే వార్తల్లోకి తేవాలి. అత్యధికంగా ఆ విజయ ఘట్టాన్ని అప్పుడే వీక్షించేలా చెయ్యాలి. మరీ ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులకు దాన్ని చూసే అవకాశం వైడ్‌ స్క్రీన్‌ మీద కల్పించి ఉండాల్సింది. వారందరికీ స్ఫూర్తిదాయకం అయ్యే విధంగా ఆనాటి కార్యక్రమాన్ని డిజైన్‌ చేసి ఉండాల్సింది. వేరే రాష్ట్రపు అవినీతి బాగోతం ముఖ్యమా, మన దేశ విజయ గాథ ముఖ్యమా అనేది తేల్చుకుంటే బాగుండేది.

 




- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top