ఉచితంగా మల్లెపూలు

ఉచితంగా మల్లెపూలు


అక్షర తూణీరం

ఇలా ఒక్కసారిగా ఎండలు విజృంభించడం వెనకాల అపోజిషన్‌ వర్గం కుట్ర కూడా ఉంది. వాళ్ల పత్రికలో, చానల్స్‌లో నాలుగు డిగ్రీలు ఎక్కువ చేసి చెబుతున్నారు.



వేసవికాలం వచ్చిందంటే ప్రభుత్వాలకి బోలెడు వెసులు బాటు కల్పిస్తుంది. చూడండి! అప్పుడే నాలుగు రోజు ల్నుంచి పాలకుల అకృత్యాలను కాస్త పక్కన పెట్టి, ఎండలు మండిపోవడం మీద జనం మాట్లాడుకుంటు న్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉభయ సభలనూ వీక్షిస్తున్నా, ఉభయ వర్గాల అవాకులు చెవాకులు వింటున్నా ప్రజలు అంతగా స్పందించడం లేదు. ఎందుకంటే సూర్యతాపం సరిగ్గా సభా సమయంలోనే బుర్ర పనిచేయకుండా చేస్తోంది. ఏప్రిల్‌ రాకుండానే, రామనవమి వెళ్లకుండానే ఇంత ఘోరమా ఈ సంవత్సరం...! ఇష్షో...! అంటూ వొగర్చడం మొదలైపోయింది. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు ఏమొచ్చినా వాటిని అనుకూలంగా మార్చుకునే సత్తా చంద్రబాబుకి ఉగ్గుపాలతో అబ్బింది.



‘‘రాబోయే కాలంలో అమరావతి వీధుల్లో ఏసీ డ్రోన్‌లు శీతల పవనాలు వెదజల్లుతూ చక్కర్లు కొడతాయ్‌! కాపిటల్‌కి భూములిచ్చిన రైతులందరికీ రెండు టన్నుల ఏసీ యూనిట్లు ఉచితంగా పంపిణీ చేస్తాం. అవసరమైతే ఈ సీజన్‌ మొత్తం వారికి ఉచిత విద్యుత్తు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎండకి ఏమాత్రం భయపడద్దు. ఇలా ఒక్కసారిగా ఎండలు విజృంభించడం వెనకాల అపోజిషన్‌ వర్గం కుట్ర కూడా ఉంది. వాళ్ల పత్రికలో, చాన ల్స్‌లో నాలుగు డిగ్రీలు ఎక్కువ చేసి చెబుతున్నారు. జనం అంతా గమనిస్తూనే ఉన్నారు. అవసరమైతే మన పత్రికల్లో, మన మీడియాలో అయిదారు డిగ్రీలు తగ్గిం చుకుని, ఆ విధంగా ముందుకు పోదాం!’’– ఇట్లాంటి మాటలు నాకు కునుకు తీసినప్పుడు విని పిస్తున్నాయ్‌. ‘‘అవసరమైతే ఈ సూర్యతాపాన్ని జయిం చడానికి రెయిన్‌గన్స్‌ బయ టకు తీస్తాం! ఎండకు ఏమాత్రం భయపడద్దు.’’



ఎండలు కాస్తే కాయచ్చుగాని చైత్రవైశాఖాలు బాగుంటాయి. ఒకప్పుడు పిల్లలకి మహా సరదా సీజన్‌ ఇది. హాయిగా బడికి సెలవలు వచ్చేవి. అమ్మమ్మ గారింటికి చుట్టాలై వెళ్లిపోవడం ఉండేది. పుచ్చకాయలు, తాటిముంజలు, మామిడి పళ్లు, ఐస్‌ఫ్రూట్లు తిన్నన్ని దొరికేవి. హోమ్‌వర్కులుండవ్‌. పాపం! ఇప్పుడలా లేదు. సెలవల్లో కూడా పిల్లల్ని చదువు గానుగలో వేసి నలక్కొడుతున్నారు. వేసవి సెలవల మీద బోలెడంత చదువు వ్యాపారం సాగుతోంది. బాల్యం బలైపోతోంది. వేసవిలో మిగతా సంవ త్సరానికి సరిపడా పచ్చళ్లు, ఒరుగులు, వడియాలు, తయారుచేసుకునే సంప్ర దాయం ఉండేది. ప్రతి ఇల్లూ కారపు కోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండేది. ఇప్పుడన్నింటికీ ప్యాకెట్లలో అందించే కంపెనీలు వచ్చేశాయి. తినే వారెవ్వరూ లేకపోయినా ఓ పాతిక ఆవకాయ, ఓ పాతిక మాగాయ, ఓ పరక మెంతికాయ పడెయ్యకపోతే తోచనివారు ఇంకా తగుల్తున్నారు. పాపం వారిని చూస్తే జాలే స్తుంది. వేసవిలో మల్లెపూలు ప్రకృతి పంపే వరాలు. ముఖ్యంగా యువజంటలకి... ఇప్పుడు పెద్దగా అనకండి. ‘‘మల్లెపూలు, మంచిగంధం, సింహాచలం సంపెంగలు ఉత్సాహవంతులకి ఉచితంగా అందిస్తాం. అవసరమైతే డ్వాక్రా గ్రూప్స్‌ ద్వారా...’’ చాలు మహాప్రభో!





- శ్రీరమణ


(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top