'హోదా' నేతి బీరకాయ?

'హోదా' నేతి బీరకాయ? - Sakshi


అక్షర తూణీరం

మా వూళ్లో ఒక పెద్దాయన అన్నాడు – ‘అంతా మకతిక చేస్తున్నారు. చంద్రయ్య నాయుడు, వెంకబాబు ఇద్దరూ కలసి ఆంధ్రప్రదేశ్‌లో అంత్యాక్షరి ఆడుతున్నారు’ అని.



రాష్ట్రాన్ని కత్తిరిస్తున్నప్పుడు ఉభయ రాష్ట్రాలకి లాభసాటిగా ఉండేలా చూస్తాం అన్నారు. చేస్తాం అని కూడా అన్నారు పార్ల మెంటులో. తెగిపోయిన ఆంధ్రప్రదేశ్‌ దిక్కూ మొక్కూ లేకుండా, తాడూ బొంగరం, ఇల్లూ వాకిలీ లేకుండా మిగిలింది. అందుకు పెద్దలంతా జాలిపడి, పదేళ్లపాటు ఉమ్మడి క్యాపి టల్‌గా పాలన సాగించుకోమని పర్మిషన్‌ ఇచ్చారు. ఆంధ్రప్ర దేశ్‌కి స్పెషల్‌ స్టేటస్‌ ఇస్తామని, తద్వారా అన్ని రంగాలలో త్వరితగతిని వృద్ధి చెందుతుందని చెబుతూ వరం ప్రసాదించారు. వరమిచ్చిన వేలుపు మారాడు. కొత్త దేవుడు సీన్‌లోకి వచ్చాడు. అయ్యా మా వరం అన్నారు భక్తులు. దేవుళ్లంతా ఒకటే – మహా మాయదార్లు! 'అమాయక భక్తులారా! ప్రత్యేక హోదావల్ల మీకేమీ ప్రయోజనం లేదు. ఎప్పటికప్పుడు నాకు తోచిన విధంగా డబ్బు సంచులిస్తాను. హాయిగా బాగుపడండి. సుఖ పడండి' అంటూ వరాన్ని తిరగేశాడు.


దేవుళ్ల చుట్టూ సొంత గణాలుంటాయ్‌. కొత్త దేవుడికి కొరతేముంది?! తిరగేసిన వరం ఎంత గొప్పదో రకరకాలుగా జనంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మా వూళ్లో ఒక పెద్దాయన అన్నాడు - 'అంతా మకతిక చేస్తున్నారు. చంద్రయ్య నాయుడు, వెంకబాబు ఇద్దరూ కలసి ఆంధ్రప్రదేశ్‌లో అంత్యాక్షరి ఆడుతున్నారు' అని. 'అదెట్లా' అన్నాను. 'ఏవుంది, మోదీ భజన పాటలు ఆయన ఆపిన అక్షరం మీద ఈయన ఎత్తుకుం టాడు. కప్పల సంగీతంలాగా భజన మాత్రం ఆగదు' అంటూ వివరించాడు. అసలు దీనికింత రచ్చ దేనికి? ప్రత్యేక హోదాతో పదేళ్లలో ఒనగూడే ప్రయోజనా లేంటి? ప్యాకేజీతో లాభాలేంటి? ఈ రెంటినీ కచ్చితంగా రూపాయి పైసల్లో లెక్క కట్టొచ్చు. అప్పుడు ఏ వరాన్ని పొందాలో తేల్చు కోవచ్చు. వెరీ సింపుల్‌.



ఇది ఇట్లా ఉండగా ఏదో కొంప మునిగినట్టు కొత్త క్యాపి టల్‌ నిర్మాణంలో పడ్డారు. యాభై వేల ఎకరాల పంట భూమిని కళ తప్పించారు. లాభసాటి చాలెం జ్‌ల మీద మహా నేత కసరత్తు చేస్తున్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ని వినియోగించుకోవచ్చు అన్నారు. అయినా అర్జంట్‌గా సొంత క్యాపిటల్‌ కావల్సిందే నన్నారు. ఇక్కడ రోడ్లమీద మన కాన్వాయ్‌కి మర్యాద లేదు. ఇక్కడ సెల్‌ఫోన్‌ టవర్స్‌పై మనకి పట్టుండదు. మన మాటకి గుట్టుండదు. అందుకని వెళ్లిపోవడమే మన తక్షణ కర్తవ్యం అన్నారు. ప్రపంచంలోనే నంబర్‌వన్‌ సిటీగా తీర్చిదిద్దుతామనే నినాదంతో చంద్రబాబు ముందుకు పోతా ఉన్నారు. కొండకి వెంట్రుక కట్టాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.



ఉరిశిక్ష పడిన గజదొంగని జైల్లో పెట్టారు. ఉరి అమలుకి వ్యవధి ఉంది. నా దగ్గర గుర్రాన్ని ఎగిరించే అపురూపమైన విద్య ఉందని రాజుకి కబురు చేశాడు. రాజు కీలు గుర్రంపై సరదాపడి, ఆయనకి ఏమేమి కావాలో ఇవ్వండి. జాగ్రత్తగా చూసుకోండి అని ఆజ్ఞాపించాడు. గజదొంగకి బోలెడు మర్యాదలు సాగుతున్నాయి. ఓ జాతి గుర్రాన్ని తెప్పించి రోజూ ఆవు వెన్నతో దొంగ మంత్రాలతో మాలిష్‌ చేస్తున్నాడు. ఒకరోజు సాటి ఖైదీ 'నిజంగా గుర్రాన్ని ఎగిరించే విద్య నీకు తెలుసా' అని నిగ్గదీశాడు. గజదొంగ నవ్వి, 'ప్రస్తుతానికి ఉరి తప్పింది. చూద్దాం. తర్వాత భూకంపమో, వరదో రావచ్చు. పొరుగు రాజు దండెత్తి రావచ్చు. ఇంకేదో కావచ్చు. ఏమో! గుర్రం ఎగరావచ్చు' అని ధీమాగా చెప్పాడు. అలాగే, ఈ అసంపూర్తి క్యాపిటల్‌ నిర్మాణం నాతోనే సాధ్యమని మరోసారి, ఇంకోసారి అంటూ కాలక్షేపం చెయ్యొచ్చు. వస్తే కొండ, పోతే వెంట్రుక!



(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

శ్రీరమణ

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top