ఎటువైపు ఈ ప్రస్థానం?

ఎటువైపు ఈ ప్రస్థానం? - Sakshi


జాతిహితం

ప్రస్తుతం ఆయన ప్రదర్శించిన చర్యలు, అంటే–ఒక ముస్లిం మత గురువు ఇచ్చిన టోపీని ధరించడానికి నిరాకరించడం, ప్రధాని నివాసంలో అప్పటిదాకా వస్తున్న ఇఫ్తార్‌ విందు సంప్రదాయాన్ని ఆపడం, తన మంత్రిమండలిలో ఒక ముస్లింకు లేదా ఒక క్రైస్తవుడికి సాధారణ పదవికి మించి అవకాశాలు కల్పించకపోవడం, ఆఖరికి నిన్నటి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో 403 స్థానాలు ఉన్నా ఒక్క ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకపోవడం మోదీలోని ఆ మనస్తత్వం పుణ్యమే.



భారత రాజకీయ చరిత్రని యుగాలుగా విభజిస్తే, 1969లో కాంగ్రెస్‌ పార్టీని చీల్చిన క్షణం దగ్గర ఇందిరాగాంధీ యుగం ఆరంభమవుతుంది. లోక్‌సభలో అఖండ మెజారిటీ సాధించినప్పటికీ దానిని నిలుపుకోలేక, 1989లో ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రతిపక్షానికి పరిమితం కావడం దగ్గర ఆ యుగం ముగిసిపోతుంది. కొన్ని అత్యవసర కారణాలతో పాటు, రెండు రాజకీయ వ్యతిరేక శక్తుల ఆవిర్భావం కూడా రాజీవ్‌గాంధీ పతనానికి దోహద పడి నాయి. అవి–మందిర్, మండల్‌. తరువాత పదిహేను సంవత్సరాలు అధికా రంలో ఉన్నప్పటికీ (పీవీ నరసింహారావు ప్రధానిగా ఒక దఫా, సోనియా/ మన్మోహన్‌సింగ్‌ హయాంలో రెండు దఫాలు) కాంగ్రెస్‌ పార్టీ శక్తియుక్తులను తిరిగి పొందలేకపోయింది. మందిర్‌/మండల్‌ పరిణామాలతో ఉద్భవించిన తరంవారు కాంగ్రెస్‌తో వివిధ దశలలో, టెస్ట్‌ మ్యాచ్‌లలో రెండు బృందాలు సెషన్స్‌ను పంచుకున్న తీరులో అధికారం పంచుకున్నారు. ఇలాంటి యుగం లేదా రాజకీయ టెస్ట్‌ మ్యాచ్‌ యుగం కూడా ఇప్పుడు ముగిసిపోయింది.



ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 325 అసెంబ్లీ స్థానాలు గెలిచి, యోగి ఆదిత్యనా థ్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుని చేయడంతో 1989 తదనంతర రాజకీయాలకు కూడా తెరపడింది. గడియారంలో లోలకం ఊగిసలాట మాది రిగా ప్రత్యర్థులు ఒకరి నుంచి ఒకరు అధికారం తీసుకోవడమనే పరిణా మంగా దీనిని చూడడం సరికాదు. ఆ మార్పు మౌలికమైనది. ఈ మార్పుని భూకంపంలో పొరల ఘర్షణతో పోల్చవచ్చు. లేదా భౌగోళిక మార్పులన బట్టి జరిగే ఖండాల కదలికగా అయినా చెప్పవచ్చు. అది మీ ఇష్టం. ఈ మార్పు భారత రాజకీయాలలో పాత నిబంధనలను చెరిపేసి, కొత్త సూత్రాలను ఆవి ష్కరించింది. పాత నిబంధనలు కల్యాణ్‌సింగ్‌నూ, రాజ్‌నాథ్‌సింగ్‌నూ రంగం మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి స్థానంలో యోగిని చూడడం కంటే ఆ ఇద్దరిలో ఎవరిని ఆ స్థానంలో చూసినా కరడు కట్టిన వామపక్ష వాదు లకు కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ కొత్త సూత్రాలు మరింత మంది యోగులను ప్రతిష్టించేవే. ఇప్పటికి కూడా అధికారం చేపట్టాలని విప క్షాలకు ఆశ ఏమైనా మిగిలి ఉంటే ఈ సూత్రాన్ని పటాపంచలు చేసే మార్గాన్ని అన్వేషించవలసి ఉంది.



చెల్లాచెదురైన ఓటు బ్యాంకులు

ఏవో ఒకటి రెండు ప్రముఖ వెనుకబడిన కులాలను, షెడ్యూల్డ్‌ కులాలను; ముస్లింలను ఏకం చేస్తే నెగ్గవచ్చునన్న వ్యూహం ఇకపై మధ్య భారతంలో ఎక్కడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే నరేంద్ర మోదీ/ అమిత్‌షాల ఎన్నికల యంత్రాంగం దానిని తుత్తునియలు చేసింది. బీజేపీ సాధించిన ఈ విజయా నికి ఊతమిచ్చిన హిందుత్వ, అటు పరిమితమైనదీ కాదు, ఇటు రామ మందిరానికి ప్రతీకాత్మకమైనదీ కాదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు గంప గుత్తగా ఓటు వేశారంటూ వచ్చిన వాద నలు చాలా సౌకర్యంగా ఏర్పరుచుకున్న భ్రమ. నిజానికి మొత్తం ఓట్లలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ యాభయ్‌ శాతం చీల్చాయి. వాటిలో బీజేపీ 39.7 శాతం ఓట్లు దక్కించుకుంది. బీజేపీకి వ్యతిరేకంగానే ముస్లింలు సామూహి కంగా ఓట్లు వేయకుంటే, ఆ పార్టీలు అన్ని ఓట్లు సాధించగలిగేవి కావు. బీజే పీకి అన్ని ఓట్లు రావడానికి కారణం– హిందువులలోని మధ్య తరగతి, వెనుక బడిన వర్గాలు, సంప్రదాయక పోరాట బాటను వదిలిన కొందరు షెడ్యూల్డ్‌ కులాల వారు ఆ పార్టీ వైపు మొగ్గడమే. అయితే వీరంతా రామమందిరం నిర్మాణం కోసమో, గోరక్షణ కోసమో, ముస్లిం స్మశాన వాటికల కంటే, హిందూ స్మశాన వాటికలకు మరిన్ని నిధులు వస్తాయనో బీజేపీ వైపు మొగ్గ లేదు. నిజానికి ఇవే ఆ పార్టీ ఆశయాలైతే అందుకు ఆదిత్యనాథ్‌ను ప్రయో గించవలసిన అవసరం లేదు. ఆ పార్టీలోని పాత తరం నాయకులు చాలు అవన్నీ సాధించడానికి.



అసలు ఆదిత్యనాథ్‌ ఎంపిక మోదీది కాదనీ, ఆరెస్సెస్‌ బలవంతం చేయడం వల్లనే ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టవలసి వచ్చిందని మాటలు వినిపిస్తున్నాయి. ఈ అభిప్రాయాలన్నీ ఒట్టి ఉబుసుపోక కబుర్లు. ఢిల్లీలో పుష్కలంగా లభించే ఇలాంటి భ్రమలలో మనం దేనినైనా నెత్తికెత్తు కున్నామంటే ఆదిత్యనాథ్‌ను ఎందుకు ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చిందో విశ్లేషించడానికి గానీ, అర్థం చేసుకోవడానికి గానీ సాధ్యపడదు. ఏడు దశాబ్దాల పాటు కాంగ్రెస్, లేదా కాంగ్రెస్‌ వంటి వామపక్ష కేంద్రీకృత రాజకీయాలు మన దేశ రాజకీయాలను శాసించాయి. ఇప్పుడు బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. గతంలో జరిగిన పోటీ అంతా భారతదేశంలోని మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే, కొన్ని కులాలతో కూడిన ఓటు బ్యాంకులకూ; అభద్రతా భావంతో ఉన్న మెజారిటీ వర్గాన్ని మేలు కొలుపేం దుకు యత్నిస్తున్నదని చెప్పే బీజేపీకీ మధ్య జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో హిందూ ఓటు బ్యాంకుకు నాయకత్వం వహి స్తున్నది. కానీ ఆ ఓటు బ్యాంకు ఇదివరకు మాదిరిగా పాత అభద్రతా భావంతో నిలుబెట్టుకోవడం సాధ్యం కానిది. ద్విగుణీకృతమైన కొత్త విశ్వాసంతో నడుస్తుంది. లేదా అహంకరిస్తుంది.



హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం

ఈ విషయాన్ని మరింత వివరంగా చెబుతాను. లండన్‌ కేంద్రంగా పనిచేసే వ్యూహాత్మక అధ్యయనాల అంతర్జాతీయ సంస్థ (అడెల్ఫీ పేపర్‌ సిరీస్‌) కోసం తయారు చేసిన మోనోగ్రాఫ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొ న్నాను. భారతదేశం ఒక అసాధారణ దశకు చేరుకుంటున్నదని, ఆ దశలో అధిక సంఖ్యాకులు అల్ప సంఖ్యాకుల మనస్తత్వానికి అలవాటు పడు తున్నారని కూడా వాదించాను. హిందువులలో ఈ అభద్రత, వారు పడు తున్న ఇక్కట్ల గురించి ఎల్‌.కె. అడ్వాణీ, ఆరెస్సెస్‌ ప్రచారాన్ని నిర్వహించిన సమయం కూడా అదే. కాంగ్రెస్‌ తరహా సెక్యులరిజంలో ముస్లింలు, క్రైస్తవులు ప్రత్యేక హక్కులు పొందుతున్నారని నమ్మించేందుకు ప్రయత్నం జరిగింది. హజ్‌ యాత్రికులకు ఇచ్చే రాయితీ, మంత్రులు ఇచ్చే ఖరీదైన ఇఫ్తార్‌ విందులు, మైనారిటీ విద్యా సంస్థల వైఖరి, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం పెచ్చరిల్లడం, ప్రపంచమంతటా ఇస్లాంను విస్తరించాలన్న ఆ దేశపు ఆశయం–అన్నీ కలసి హిందువుల అభద్రతా భావానికి తోడ్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులు రెండుసార్లు బీజేపీకి అనుకూలతను ఏర్పరిచాయి. 1998–2004 మధ్య ఆరేళ్ల పాటు అధికారాన్ని చేపట్టే అవకాశం ఇచ్చాయి. చాలావరకు ‘సెక్యులర్‌’ శక్తులు ఒకే తాటిపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాలంలోనే ఇదంతా జరిగింది. అయితే మెజారిటీ వర్గం అభద్రతా భావం∙ఆసరాగా ఆ పార్టీ అమలు చేయదలుచుకున్న స్వారీ వ్యూహానికిS కొన్ని పరిధులు ఉన్నాయి.  సంస్కరణల ప్రవేశం తరువాత, గడచిన ఈ రెండు దశాబ్దాల కాలంలో జరిగిన పురోగతి అన్ని వర్గాల వారికీ ఇతోధిక అవకాశాలు కల్పిం చింది. ముఖ్యం ప్రైవేట్‌ రంగంలో పట్టణ ప్రాంత హిందువులకు, గ్రామీణ ప్రాంత విద్యావంతులకు కూడా ఆ అవకాశాలు అందివచ్చాయి.



2007 నుంచి నరేంద్ర మోదీ (పూర్తికాలం ముఖ్యమంత్రిగా రెండవ దఫా ప్రమాణం చే సినప్పుడు) పాలనా సరళిని విశ్లేషించినట్టయితే, ఆయన వేసిన ప్రతి అడుగు, ఆయన చెప్పిన ప్రతిమాట ఏకపక్షంగా ఒకటే చెబుతూ ఉంటుంది. అది–ఆయన నాయకత్వంలో హిందువులు కష్టాల నుంచి బయట పడి, పునరుత్తేజం పొందుతారు. ఆయన అప్పటి నుంచి ముస్లిం పట్ల దుడు కుగా వ్యవహరించినట్టు కనిపించలేదు. అలా అని క్షమాపణలు కోరే రీతి లోనూ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన ప్రదర్శించిన చర్యలు, అంటే– ఒక ముస్లిం మత గురువు ఇచ్చిన టోపీని ధరించడానికి నిరాకరించడం, ప్రధాని నివాసంలో అప్పటిదాకా వస్తున్న ఇఫ్తార్‌ విందు సంప్రదాయాన్ని ఆపడం, తన మంత్రిమండలిలో ఒక ముస్లింకు లేదా ఒక క్రైస్తవుడికి సాధారణ పదవికి మించి అవకాశాలు కల్పించకపోవడం, ఆఖరికి నిన్నటి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో 403 స్థానాలు ఉన్నా ఒక్క ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకపోవడం మోదీలోని ఆ మనస్తత్వం పుణ్యమే. ఇదంతా రాజకీయ సెక్యులరిజమ్, హిందుత్వ పునాది మీద జాతీయవాదం అనే అంశాలను  పునర్‌ నిర్వచించ డానికి ఉద్దేశపూర్వకంగా చేసినదే. సరిగ్గా ఈ ధోరణిలో ఇమిడిపోయే మరో అంశమే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ నియామకం. మోదీ, షాల నిర్వచనం ప్రకారం కొత్త సెక్యులరిజం అంటే విశ్వాసంతో తొణి కిసలాడే, పునరుత్తేజం పొందిన హిందువు. ఆ విధంగా వారితో కూడిన  సరి కొత్త సెక్యులర్‌ దేశం.



అలాగే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ముస్లింలు సురక్షితంగా ఉంటారు. దేశాన్ని ఎవరు పాలించాలి లేదా పాలించరాదు అనే విషయం మీద నిర్ణయం చేసే హక్కును వినియోగించడానికి వారిని ఎంత మాత్రం అనుమతించరు. ఇప్పుడు మెజారిటీ వర్గం విజయం సాధించింది. అధికారం చేపట్టింది. చరిత్రలో మున్నెన్నడూ లేనంత బలంగా ఉన్నట్టు ఆ వర్గం భావిస్తున్నది. ఏదో విషయానికి ఎవరికో ఒకరికి క్షమాపణ చెప్పే విధంగా ఉండే రోజులు పోయాయి. ముస్లిం మౌల్వీ నుంచి టోపీని నిరా కరించాలన్న నిర్ణయం తీసుకున్నంత  సులభంగా యోగి ఆదిత్యనాథ్‌ ఎంపిక జరిగింది. కాంగ్రెస్‌తో సహా, ఏ ప్రతిపక్షమూ పాత నినాదాలతో ఈ ధోరణికి కళ్లెం వేయలేకపోయింది. ఈసారి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి పక్షాలు సెక్యులరిజమ్‌ భావనతో, ముస్లింల పరిరక్షకులుగా జెండా పట్టుకుని బరిలోకి దిగాయి. ఓడిపోయాయి. ప్రతిపక్షాలు ఓడిపోయినది హిందూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ధ్వజమెత్తి పోరాడినందుకు కాదు. ఇప్పుడు అక్కడ మోదీ సరికొత్త జాతీయవాదాన్ని ఆయుధంగా ఇచ్చారు. అది విప క్షాలు ప్రయోగించిన ఆయుధం కంటే బలమైనది. ఇప్పటిదాకా కాంగ్రెస్‌ తరహా సెక్యులరిజమే జాతీయ రాజకీయ చర్చలలో ప్రధానంగా కనిపిం చింది. అందులో బీజేపీ, ఆరెస్సెస్‌ తాము కూడా సెక్యులరిస్టులమేనని చెప్పు కునేవి. అలాగే కాంగ్రెస్‌ చెప్పే సెక్యులరిజం కుహనా సెక్యులరిజమని ఎదురు దాడికి దిగేవి. ఇప్పుడు మోదీ జేఎన్‌యూ తరహా వక్రీకరించిన లిబరలిజంకు పోటీగా జాతీయవాదాన్ని చర్చలోకి తెచ్చారు. ఈ జాతీయవాదం ప్రకారం భారత్‌ గుండెలలో జాన్‌ లెనిన్‌ ఊహించిన సరిహద్దులు లేని, జాతీయత లేని ప్రపంచం లేదు. ఈ మార్పును గమనించి, జాతీయ వాదం మీద జాతీయ వాదంతోనే పోరు జరిపే ఒక నేతను ప్రతిపక్షం తయారు చేసుకునే వరకు నరేంద్ర మోదీ అనితరసాధ్యుడే.





- శేఖర్‌ గుప్తా


twitter@shekargupta

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top