మన దూకుడు ఇలాగే సాగాలి

మన దూకుడు ఇలాగే సాగాలి


జాతిహితం

భారత క్రికెట్‌ సాధించిన ఆసాధారణ మెరుగుదలకు సంబంధించిన మధురమైన మలుపు 2000లో గంగూలీ కెప్టెన్‌ కావడం. ఆ పరంపరలో వచ్చిన ఆకలిగొన్న, దూకుడు ఆటగాళ్ల వల్ల మన క్రికెట్‌ ఉన్నత శిఖరాలకు చేరింది. గత కాలపు స్టార్‌ క్రికెటర్లకు భిన్నంగా నేటి క్రీడాకారులు ఓటమిని సహించరు. మన క్రికెట్‌ అలాగే ఉండాలి. కానీ మన కొత్త క్రికెట్‌ బోర్డు సదుద్దేశాలతోనే అయినా... క్రికెట్‌ ఆట ఇంకా పాతకాలపు పెద్దమనుషుల ఆటేనని పొరబడి దీన్ని వెనక్కు మరల్చాలని చూస్తోంది.



ఎన్నికల ఫలితాల కోసం మీరు ఉదయాన్నే నిద్ర లేచేసరికే నేను చప్పుడు చేయకుండా, మన క్రికెట్‌ గురించి కొన్ని తీవ్రవ్యాఖ్యలను చేసేస్తాను. ఈ వ్యాఖ్యలు చేయడంలో నా ఉద్దేశాలు మాత్రం  మన క్రికెట్‌కు మంచి చేసేటం తటి ఉదాత్తమైనవి. ‘‘సముచితమైన నడవడిక, స్నేహశీలత, మంచి పెంపకం ఉన్న’’ క్రీడాకారులతో కూడినదిగా ఉన్నంత కాలం మన క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ జట్టు అంత బాగానే ఉండేదని నా మొదటి వ్యాఖ్య. ఆక్స్‌ఫర్డ్‌/స్టీఫెన్‌ కళాశాలల విద్యార్థుల తరానికి చెందిన ‘‘మంచివాళ్లు’’, ‘‘సొగసుగా ఓడి పోయే వారు’’ వైదొలగి.. చిన్న పట్టణాలకు చెందిన హెచ్‌ఎమ్‌టీ (హిందీ మీడియం టైపు) వారికి దారివ్వడంతో ‘‘చెడ్డవాళ్లు’’ వృద్ధి చెందడం ప్రారంభ మైంది. ఇది నా రెండో వ్యాఖ్య. ఆ తదుపరి మన క్రికెట్‌ క్రీడా నైపుణ్యాలు అసాధారణమైన రీతిలో మెరుగుపడ్డాయి.



దేశ చరిత్రలో ఇంతవరకు ఆడిన క్రీడాకారులతో నేడు అత్యుత్తమ భారత జట్టును, 18 మంది క్రీడాకారులతోఎంపిక చేసి చూడండి. అందులో 1992కు ముందటి 25 ఏళ్ల కాలానికి చెందిన స్టార్‌ క్రీడాకారులు ముగ్గురికి మించి ఎంపిక కారు (గవాస్కర్, విశ్వనాథ్, కపిల్‌). ఈ ముగ్గురిలోకి పాత వాడైన విశ్వనాథ్‌ 1969లో తొలి టెస్ట్‌ ఆడారు. అంటే 1932–1969 మధ్య జరిగిన 115 టెస్టులలో ఆడిన వారెవరూ ఈ జట్టులోకి రాలేకపోయారు. గతంలో మన స్పిన్‌ చతుష్టయం (బిషన్‌సింగ్‌ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్‌ చంద్రశేఖర్, ఎస్‌ వెంకటరా«ఘవన్‌) అద్భుతమైనదే. కానీ ఇక ఎంత మాత్రమూ అది ఇంత వరకూ గడచిన కాలానికంతటికీ గొప్పది కాదు. ఈ వ్యాఖ్య బహుశా మరింత వివాదాస్పదమైనది కావచ్చు. వారి తర్వాత ఇటీ వలి కాలానికి చెందిన నలుగురు స్పిన్నర్లు... అనిల్‌ కుంబ్లే, హర్బజన్‌ సింగ్, రవిచంద్రన్‌ అశ్విన్, ఊపిరి బిగబట్టి వినండి సర్‌ రవీంద్ర జడేజా.



నాటి దిగ్గజాల కంటే నేటి క్రికెటర్లే  మిన్న

ఈ వాదనలో నాకు ఇద్దరు తోడుగా ఉన్నారు. భారత అత్యుత్తమ క్రికెట్‌ గణాంక నిపుణుడు మోహన్‌దాస్‌ మీనన్, హార్పర్‌ కాలిన్స్‌వారి అద్భుతమైన కొత్త పుస్తకం ‘నంబర్స్‌ డు(నాట్‌) లై’. గణాంకాలను అద్భుతంగా  విశ్లేషించే జట్టు ప్రభావ సూచీ ఈ పుస్తకంలో ఉంది.  ఒకప్పటి మన టెస్ట్‌ క్రికెట్‌ ఓపె నర్, నేటి కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆ పుస్తకంలో దానిని వివరించారు. నా గణాంకపరమైన వివరాలన్నింటికీ ఆధారం మీనన్‌. పాత కథలు, గత జ్ఞాప కాల మక్కువలకు మించి ఒక క్రీడాకారుడిని గొప్పవాణ్ణి చేసేది ఏమిటో తేల్చే తర్కాన్ని ‘నంబర్స్‌ డు(నాట్‌) లై’ అందించింది. లేదంటే నేనిలాంటి వ్యాఖ్యలు చేసే వాడినే కాదు. రాజకీయ వ్యవస్థతో వాదనకు దిగడం వేరు. అదే క్రికెట్‌ విరాట్టులుగా ఆరాధనలను అందుకుంటున్నవారిని సవాలు చేయడం ఘోర అపచారం.



1932–67 మధ్య భారత్‌ తొలి 100 టెస్టు మ్యాచ్‌లను ఆడింది. ఇందులో కేవలం 10 సార్లు గెలిచి, 40 సార్లు ఓడిపోయింది. ఆ పురాతన కాలం నాటి మన జట్టు, నేటి బంగ్లాదేశ్‌ జట్టుకంటే మెరుగ్గా ఉండేదేం కాదు. అది 2000 తర్వాత ఇంతవరకు ఆడిన 98 టెస్టులలో 8 టెస్టులలో గెలిచింది. వినూ మన్‌కడ్, లాలా అమర్‌నాథ్, పాలీ ఉమ్రీగర్, పంకజ్‌రాయ్, సీకే నాయుడు, సుభాష్‌ గుప్తే, నారీ కంట్రాక్టర్, బాపూ నడకర్ణి, నవాబ్‌ ఆఫ్‌ పటౌడీ, చందు బోర్డె తదితరులపై మనకున్న ఆరాధనను పట్టించుకోకండి. దక్షిణాఫ్రికా జాతి వివక్షను పాటించడం వల్ల అప్పట్లో ఆ జట్టుపై నిషేధం ఉండేది. ఆ తదుపరి 25 ఏళ్లలో (1967–91) భారత విజయాల శాతం రెట్టింపైంది. 174 టెస్టు లలో 34 విజయాలు లభించాయి. ఆ తర్వాతి 25 ఏళ్లలో (1992–2017) విజయాలు మళ్లీ రెట్టింపై 39.2 శాతానికి చేరాయి. దీంతో మన జట్టు పరా జయాల శాతం కూడా తగ్గింది.



గంగూలీ శకం... విజయ పథం

భారత క్రికెట్‌లో వచ్చిన అసాధారణమైన మెరుగుదలలో మరో మధు రమైన మలుపు ఉంది. అది నవంబర్‌ 2000లో అసలు సిసలు ‘‘చెడ్డ అబ్బాయి’’ సౌరవ్‌ గంగూలీ మన క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌ కావడం. ఆ తదుపరి ఆడిన 177 టెస్టులలో మన గెలుపుల రికార్డు మరింతగా మెరుగుపడి, ఓట ములు పడిపోయాయి. వాస్తవానికి మీనన్‌ గుర్తుచేసినట్టుగా అప్పటి నుంచి మన జట్టు 43.5% విజయాల రికార్డుతో ఆస్ట్రేలియా(60.6%), దక్షిణాఫ్రికా (49%)ల కంటే మాత్రమే వెనుకబడి  గౌరవప్రదమైన మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్‌ల కంటే ముందుంది.



ఈ గంగూలీ శకంలోనే దిక్కుమాలిన వివాదాలలో క్రికెట్‌ వాటా కూడా పెరిగిందని చెప్పడానికి గణాంకవేత్తలు అవసరం లేదు. గంగూలీ సంతో షంగా ముల్లును ముల్లుతోనే తీసే వైఖరిని అవలంబించేవాడు, ప్రత్యర్థుల ఏకాగ్రతను దెబ్బతీయడం కోసం దూషణలకు దిగడంలో ఆస్ట్రేలియా క్రీడా కారులను మించిపోయేవాడు. లార్డ్స్‌ మైదానం బాల్కనీలో చొక్కా విప్పి ఊపినవాడతను. తనకి ముందటి ప్రముఖ క్రీడాకారులు ఎవరూ వీటిలో దేనినీ ఆమోదించేవారు కారు. మధ్యాహ్నం పూట బీరు తాగే కొందరు ముసలాళ్లు, కుక్కలు తప్ప మరెవరూ చూడని మ్యాచ్‌లంటూ కౌంటీ క్రికెట్‌ను ఈసడించి, ఎమ్‌సీసీ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఖ్యాతి సునీల్‌ గవాస్కర్‌కే దక్కుతుంది.



కాకతాళీయంగా గంగూలీ ఎదుగుదలతో పాటే భారత క్రికెట్‌ సామాజిక పరివర్తన కూడా సాగింది. మొరటుదనం ఉన్న,  చిన్న పట్టణాలకు చెందిన, ఇంగ్లిషు మీడియంలో చదువుకోని, కాలేజీ మొహం చూడని (సచిన్‌ టెండూ ల్కర్‌ కూడా అదే బాపతు) క్రీడాకారులు జాతీయ జట్టులోకి ప్రవేశించారు. మనేకా గాంధీ  ఆధునిక ప్రయోగంగా తాజాగా వాడుకలోకి తెచ్చిన పద బంధాన్ని ఉపయోగించి చెప్పాలంటే ఇది నిజంగానే ‘‘హార్మోన్ల విస్ఫో టనం’’. ఇది కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. ఇదే కాలంలో భారత హాకీ వైఖరి, ఆట తీరు కూడా మారింది. రమేష్‌ క్రిష్ణన్‌ లేదా విజయ్‌ అమృతరాజ్‌ల నైపుణ్యంలో బహుశా ఒక భాగం మాత్రమే ఉన్న లియాండర్‌ పేస్‌ టెన్నిస్‌ టూర్లలో, డేవిస్‌ కప్‌ పోటీలలో మరిన్ని ఎక్కువ విజయాలను సాధించాడు. ఆ ఉరవడిలోనే నిర్దాక్షిణ్యమైన వ్యాపారవేత్తలు లేదా రాజకీయవేత్తలు బీసీసీఐ లోకి ప్రవేశించారు. ఇంగ్లండ్‌ను మెచ్చుకునే రాకుమారులు, బడా వ్యాపార వేత్తల శకం ముగిసిపోయింది. జగ్‌మోహన్‌ దాల్మియా, గంగూలీ, ఐఎస్‌ బింద్రా, లలిత్‌ మోదీ, ఎన్‌ శ్రీనివాసన్‌లు రంగ ప్రవేశం చేశారు. వారికీ, ఒక ప్పటి విజయ్‌ మర్చంట్, రాజ్‌సింగ్‌ దుంగార్‌పూర్, మాధవ్‌ రావ్‌ సింథియా, ఆర్‌పీ మిశ్రా, ఫతేసింగ్‌ రావు గేక్వాడ్, అందరిలోకీ అత్యుత్తమమైన పెద్ద మనిషి విజయనగరం మహారాజ్‌కుమార్‌ లేదా విజ్జీలకూ పోలికే లేదు. ఒక ఇంగ్లిషు జట్టును తమ రాజప్రాసాదాలకు తీసుకురావడమే వారికి గొప్ప. అడ్డూ అదుపూ లేకుండా బోరవిరుచుకుని, చొక్కాలు విడిచేసి తిరిగే శకంలోకి భారత్‌ ప్రవేశిస్తోంది.



ఈ మార్పు మన క్రికెట్‌లోని సంప్రదాయవాదులకు, పాత వ్యవస్థ (ఇంగ్లండు–ఆస్ట్రేలియా)లకు వేరు వేరు కారణాలతో మింగుడు పడటం లేదు. నేటి స్పిన్నర్లు బేడీ/ప్రసన్న తరగతికి చెందవచ్చు, చెందకపోవచ్చు. కానీ వారు ఎన్నడూ చేసి ఎరుగని విధంగా వీరు తమ బంతిని బౌండరికి కొట్టినందుకు బ్యాట్స్‌మన్‌ను ప్రశంసించడం కనిపిస్తుంది. గంగూలీ పూర్వ కాలంలో మన మొదటి నిజమైన నాటురకపు, దూకుడు ఆటగాడిగా కపిల్‌ దేవ్‌ను చూశాం. 1992 పోర్ట్‌ ఎలిజెబెత్‌ టెస్ట్‌లో నాన్‌ స్రై్టకింగ్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్న పీటర్‌ కిర్‌స్టన్‌ బౌలర్‌ బంతిని వేయడానికి ముందే క్రీజును దాటి నందుకు కపిల్‌ రన్‌ ఔట్‌ చేశాడు (మాన్‌కేడింగ్‌). అందుకుగానూ కిర్‌స్టన్‌ తన బ్యాట్‌తో కపిల్‌ను కొట్టాడు. ఆ బహిరంగ అవమానాన్ని, శారీరకమైన బాధను కపిల్‌ దిగమింగాల్సి వచ్చింది. విరాట్‌ కోహ్లి, ఇషాంత్‌ శర్మ లేదా అశ్విన్‌లను అలా ఎవరైనా చేయగలరా?



అది గతించిన గతం... ఇది క్రికెట్‌ విప్లవం

పంజాబీ మాట్లాడే, బిడియంగా ఉండే పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టును ఇమ్రా న్‌ఖాన్‌ 1970లలో ప్రపంచ చాంపియన్లుగా మార్చాడు. ఇమ్రాన్‌ తమ క్రీడా కారుల భయాన్ని పోగొట్టి, విదేశీయులన్న భావనను దూరం చేశాడు. సూటు, టై «అలవాటులేకపోతే అధికారిక కార్యక్రమాల్లో సల్వార్‌–కమీజ్‌ వేసు కోండి, పత్యర్థులను ఎన్నడూ ‘‘సర్‌’’ అని పిలవకండి, దేనికైనాగానీ సారీ చెప్పకండి, అవసరమైతే శాపనార్థాలు పెట్టండి, ఇంగ్లిష్‌ రాకపోతేనేం, పంజా బీలో ఆ పని చేయండి, అయినా అది వాళ్లకు అర్థమౌతుంది అని వారికి బోధించాడు. గంగూలీ వచ్చాక భారత క్రికెట్‌లో కూడా అ విప్లవమే వచ్చింది. ఆకాశ్‌ చోప్రా రాసిన పుస్తకంలో కపిల్‌కు భారత దేశపు ప్రభావశీల క్రీడా కారులలో స్థానం దక్కలేదు. అయినా ఆ పుస్తకావిష్కరణకు కపిల్‌ పెద్ద మనసుతో వచ్చాడు. పాత ‘‘బోంబే స్కూల్‌’’ బ్యాటింగ్‌లో బ్యాట్స్‌మన్‌ బాల్‌ను బాదినప్పుడు ఫాస్ట్‌ బౌలర్‌ మొహంలోకి చూస్తే, ఎక్కడ అతనికి చిర్రెత్తుతుందోనని చూసేవాడు కాడని కపిల్‌ చెప్పాడు. ఇప్పుడు కోహ్లి బంతులను బౌండరీకి కొట్టి ‘‘పోయి తీసుకురా’’ అంటాడు బౌలర్లను.  నేటి మన పెద్దమనిషి తరహా కొత్త క్రికెట్‌ బోర్డు సదుద్దేశాలతోనే అయినా... క్రికెట్‌ ఆట అంటే ఇంకా పాతకాలపు పెద్దమనుషుల ఆటేననే పొరబాటు నమ్మకంతో దీన్ని వెనక్కు మరల్చాలని చూస్తోంది.



తాజా కలం : నేను చివరగా చేసిన వ్యాఖ్యపై రేగే దుమారం నుంచి తప్పించుకోవాలని చూడటం లేదు. మన అతి గొప్ప స్పిన్నర్లు ఎవరు? 52 రన్స్‌కు ఒక వికెట్‌ చొప్పున తీసిన అశ్విన్‌ 1945 తర్వాత ప్రపంచంలోనే అత్యధిక స్ట్రయికింగ్‌ రేట్‌ను నమోదు చేసిన స్పిన్నర్‌గా నిలిచాడు. మురళి (55), వార్న్‌ (57)లకంటే ముందున్నాడు. ఇండియాకువస్తే జడేడా, కుంబ్లేలు 62, 66 రన్స్‌తో వరుసగా అశ్విన్‌ తర్వాత నిలిచారు. పాత స్పిన్నర్ల చతు ష్టయం కుంబ్లే (66) తర్వాత ఉంది. ప్రసన్న (76), బేడీ (80), వెంకట్‌ (95)lవెనుకబడి ఉన్నారు. బజ్జీ (69) సైతంlవారికంటే ముందే ఉన్నాడు. అందువల్లనే వారెవరూ ప్రభావశీల సూచీ/ఆకాశ్‌ చోప్రా ప్రభావశీల క్రీడా కారుల జాబితాలో లేరు. అది ఎంతటి అపచారంగానైనా కనిపించొచ్చు నేటి భారత జట్టులోకి వారు ప్రవేశించలేరు.





- శేఖర్‌ గుప్తా


twitter@shekargupta

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top