ప్రసంగాలకే పరిమితమా!

ప్రసంగాలకే పరిమితమా! - Sakshi


రెండో మాట

మొదట్లోనే పేర్కొన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ మౌంట్‌ అబూ ప్రసంగం ఆయన రాజకీయ ప్రస్థానంలో సర్వమత లౌకిక సమన్వయ భారతావతరణ, ఆచరణలో ప్రాతిపదికలు వేయ గలిగితే సంతోషమే. కానీ ఆ భరోసాను, ఆయన రాజకీయ సహోదరులు, అంతేవాసులైన తొగాడియా, అమిత్‌ షా ప్రకటనలు మాత్రం ప్రజలకు కల్పించడం లేదు. వసుధైక కుటుంబాన్ని మరిచారు, ప్రజలంతా సుఖంగా ఉండాలన్న తొల్లింటి ఆకాంక్షనూ వదులుకున్నారు.



‘భారత్‌ తన అభిప్రాయాలను ఎవరిపైనా బలవంతంగా రుద్దదు. భారత్‌లో సుసంపన్నమైన భిన్నత్వం ఉంది. భారత్‌లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు–అందరికీ దేవుడొక్కడే. సత్యం ఒక్కటే, భిన్న వర్గాల ప్రజలు దానిని భిన్నరకాలుగా వ్యక్తీకరిస్తారు. తన అభిప్రాయాలను ఇతరులపై రుద్దడంపై భారత్‌కు విశ్వాసం లేదు.’



ఇప్పుడు ఇంతలేసి గొప్ప మాటలూ, సూక్తులూ ఎవరు చెప్పి ఉంటారు! వివేకానందుడా? గాంధీజీయా? టాగూరా? అరవిందుడా? వీరంతా దేశ సమగ్రత, సమైక్యతా భావజాలానికి భిన్న కోణాల నుంచి శక్తిని ప్రోది చేసిన వారే. కానీ ఇప్పుడు ఈ మాటలు వల్లిస్తున్నవారు ఎవరై ఉంటారు? మరెవరో కాదు! సావర్కర్, గోల్వాల్కర్‌ల ‘హిందుత్వ’ నినాదం నీడలో, సంఘ్‌ పరి వార్‌ భావజాలం మధ్య ఎదిగి; భారత ప్రధాని పీఠం దగ్గరకి దూసుకొచ్చిన బీజేపీ అగ్రజుడు నరేంద్ర మోదీ. ఎన్నాళ్లకు ఇంత మంచి మాట చెప్పారా యన! రాజస్తాన్‌లోని మౌంట్‌ అబూలో బ్రహ్మకుమారీల సదస్సును (మార్చి 26) ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసిన ప్రసంగంలో మోదీ ఈ మాటలు చెప్పారు.



ఆ మాటలు విన్నప్పుడు మన చెవులను మనమే నమ్మలేని విచిత్రమైన అనుభూతితో పాటు, మనలని వీడిపోని ఒక అనుమానం తలెత్తడం కూడా సహజం. మంచి అనుభూతినిచ్చే ఓ మంచి భావనను ఆయన పరివార్‌ సెక్యులర్‌ వ్యతిరేక భావజాలానికి భిన్నమైన కోణాన్ని తొలిసారిగా వ్యక్తం చేసినందుకే ఈ అనుమానం. ఇంతవరకూ మోదీ వ్యక్తం చేసిన అభిప్రాయా లకు మౌంట్‌ అబూ సందేశం పూర్తిగా భిన్నమైనది. ఇంకా చెప్పాలంటే, పౌరులకు భారత రాజ్యాంగం పూచీ పడిన భావ ప్రకటనా స్వేచ్ఛకూ, జీవించే హక్కుకూ, హేతువాద బద్ధమైన దృక్పథం పట్ల పాలకుల ఆచరణ భిన్నంగా ఉన్నందున మోదీ తాజా ప్రకటన ప్రశ్నార్థకం కావడం సహజమే. అలాగే శాస్త్రీయమైన ఆలోచనా ధారను వ్యాప్తి చేసి, రక్షించుకునే  బాధ్యత లను గురించి నిర్దేశించిన ఆదేశిక పత్రానికి భిన్నంగానే పాలకుల ఆచరణ ఉంది. ఇది దేశ సామాజిక వ్యవస్థలో భిన్నవర్గాల నడుమ అశాంతికి బీజాలు నాటుతున్నందున కూడా అనుమానం సహజం.



నోళ్లు నొక్కకండి!

ఈ తరుణంలో భారత ఉపరాష్ట్రపతి, విజ్ఞానవేత్త హమీద్‌ అన్సారీ పంజాబ్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ, ఇటీవల దేశంలో విద్వత్‌ రంగంలో, విద్యార్థి లోకంలో, యువతలో మతం పేరిట, కులం పేరిట పాలక రాజకీయ శక్తులు రగుల్కొలుపుతున్న అశాంతి వాతావరణాన్ని గురించి ప్రస్తా వించవలసి వచ్చింది. చండీగఢ్‌లో అన్సారీ ఇచ్చిన ప్రసంగం (మార్చి 25) ఒక్క విద్వత్‌ లోకమే కాదు, పౌర సమాజం యావత్తు జాగరూకమై ఉండవల సిన అవసరాన్ని గుర్తు చేసింది. విద్యార్థిలోకంలో విజ్ఞాన పరిధిని విస్తరించి, నిర్భీకతనీ, స్వేచ్ఛా చింతననీ పెంపొందించేందుకు ఏం చేయాలో తక్షణమే యోచించాలని అన్సారీ ప్రతిపాదించారు. ఇందుకు అవసరమైన స్వేచ్ఛాపూ రిత వాతావరణం గురించే అన్సారీ నొక్కి చెప్పారు. ‘విశ్వవిద్యాలయాలనేవి విద్యార్థులకు ఉండవలసిన స్వేచ్ఛావాతావరణానికి అనుగుణంగా వర్ధిల్లాలి. అవి స్వతంత్ర ఆలోచనలకు వేదికలుగా, విమర్శనాత్మక దృష్టితో ఎదగవల సిన వైజ్ఞానిక కేంద్రాలుగా వర్ధిల్లేటట్టు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఉదార వాద విలువలను సంరక్షించుకోవాలి. ఈ విలువలు సామాజిక వ్యవస్థలో పర స్పరం కలివిడిగా పౌరులు ఉండడానికి సమాజంలో సమానత్వ భావాలను పెంచగల కేంద్రాలుగా ఇవి వర్ధిల్లాలి’ అని ఉపరాష్ట్రపతి ఉద్బోధించారు. విశ్వ విద్యాలయాలలో ఇటీవల దళిత విద్యార్థులపైన, ప్రగతిశీల వామపక్ష భావా లతో ఎదుగుతున్న విద్యార్థులపైన (ఉదా: కన్హయ్యకుమార్, రోహిత్‌) మిత వాద పాలక పక్ష వర్గ ప్రతినిధులు జరిపిన దాడులూ, ఆత్మహత్యలకు పురి కొల్పిన దుర్ఘటనలూ మనసును కలవరపరిచినందుకే అన్సారీ ఇలాంటి ప్రస్తా వనలు చేయవలసి వచ్చిందని గమనించాలి.



‘ఏ సమాజంలో అయినా సంస్కృతీ, సామాజికతల పరంగా వ్యాప్తిలో ఉన్న పురాణాలను ప్రశ్నిస్తూ, వాటిలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసే సామా జిక పరిశోధనలకు నేడు ఎంతో ప్రాధాన్యం ఉంద’ని కూడా అన్సారీ పేర్కొ న్నారు. ఇలాంటి పని పరివర్తన దశలో ఉన్న సమాజానికి అత్యవసరమని ఆయన భావన. విశ్వవిద్యాలయం ఎలా ఉండాలి? లేదా ఉండరాదు అనే అంశం మీద ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పెద్ద గందరగోళమే రేగింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు లేదా హింసాత్మక చర్యల విషయంలో తప్ప విశ్వవిద్యాలయం అనేది ఫలానా అంశం లేదా విషయంపైననే అధ్యాపకులు గాని, విద్యార్థులు గాని తమ అభిప్రాయాలను మార్చుకోవాలని చెప్పడం లేదా వారి నోళ్లు మూయించాలని చూడడం చేయరాదని అన్సారీ అన్నారు.



లా కమిషన్‌ హెచ్చరిక

ఇండియన్‌ లా కమిషన్‌ తన తాజా నివేదికలో దేశ పరిణామాల దృష్ట్యా వ్యక్తు లను, సమాజానికి హానికరంగా పరిణమించే విద్వేష ప్రసంగాలను కట్టి పెట్టించే విధంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేసి తీరాలని ప్రభుత్వాన్నీ, పార్లమెంటునూ ఆదేశించవలసి వచ్చిందంటే, అది పాలనా వ్యవస్థను శఠించినట్టే. ఈ విద్వేషపూరిత ప్రసంగాలు (పాలక, ప్రతిపక్ష శాసనకర్తలు ఎవరు చేసినా) ప్రతిహింసను ప్రోత్సహిస్తాయని ‘లా కమిషన్‌’ హెచ్చరించవలసి వచ్చింది. ఏ పాలకుడినీ, నాయకుడినీ పౌర సమాజంగానీ, సామాజిక కార్యకర్తలుగానీ, పౌరులుగానీ విమర్శించరాదనే నిరంకుశ ధోరణి పాలనా వ్యవస్థ నిర్వాకాలతో గూడుకట్టుకుపోతున్నందువల్లనే సుప్రీంకోర్టు, లా కమిషన్‌ దఫదఫాలుగా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో హెచ్చరిస్తున్నా యని మరచిపోరాదు. పాలనా వ్యవస్థలోనూ, ఇటు చట్టాల రూపకల్పన లోనూ, సమాచార హక్కు చట్ట నిబంధన అమలు కాకుండా చేయడం లేదా లోపాయికారీగా తొక్కిపట్టడం కూడా ప్రజల అనుభవంలోనిదే. ఎన్నికల కమిషన్, సీబీఐ నివేదికల్లో వెల్లడైన శాసనకర్తల అవినీతి, లంచగొండితనం, నేరాలు కొల్లలుగా బహిర్గతమవుతున్నా చట్టబద్ధ సంస్థల నివేదికలు వెలుగు చూడకుండా నియంత్రించే ‘సంస్కృతి’ పెరిగిపోతోంది. ఈ పోకడలను అరి కట్టకపోతే ‘జీవించే హక్కు’ను కోల్పోయే దుస్థితి దాపురిస్తుందని కూడా ‘లా’ కమిషన్‌ స్పష్టం చేసింది.



అటు లా కమిషన్, ఇటు ఉప రాష్ట్రపతి అన్సారీ సకాలంలో చేస్తున్న హెచ్చరికలకు పూర్వరంగాన్ని రుగ్వేద సూక్తి ఏనాడో పొందుపరిచింది: ‘ప్రపంచం నలుమూలలనుంచీ వచ్చే విభిన్న భావజాలాలను స్వేచ్ఛగా ప్రస రించనివ్వండి’ అని. ఏనాటి కాళిదాసు మహాకవి? ఆయన ‘ప్రాచీనమైనదను కునే ప్రతిదీ అంత శ్రేయస్కరం’ (పురాణ మిత్యేవ న సాధు సర్వమ్‌) కాదు సుమా! అన్నాడు. ఇక బుద్ధుడైతే 2,500 సంవత్సరాల క్రితమే ‘వెలుగు కోసం నీలోకి నీవు చూసుకో, ఎవరో చెప్పగా విన్నంతనే దేన్నీ నమ్మొద్దు. చాలా మంది నమ్ముతున్నంత మాత్రాన ప్రచారం చేసుకున్నంత మాత్రాన దేన్నీ నమ్మవద్దు. నీ గురువులు వేర్వేరు, పెద్దరికం చూసి సంప్రదాయం ప్రమాద మని చెప్పినంత మాత్రాన ఏ సంప్రదాయాలనూ నమ్మొద్దు. తరతరాలుగా ఆచరణలో ఉన్నంత మాత్రాన ఏ సంప్రదాయాలనూ నమ్మవద్దు. నీ విచక్షణా ధికారాన్ని, విజ్ఞతను పరిశీలించిన తర్వాతనే ఏదైనా నీకు, ఇతరాలకు సులభ కరమని తోస్తే స్వీకరించి, ఆచరణలో పెట్టు (కాలాయ సూత్రం)’. వందల సంవత్సరాల క్రితం ‘తలలు బోడులైన తలపులు బోడులా’ అని ప్రశ్నించిన వాడు వేమన. కాకపోతే ఇప్పుడు పాలకులు తలల, తలపుల నియంత్రణకే సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది.



మార్పు కోసం వేచి ఉందాం!

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివ ర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీల్లో పాలకులు జరిపిన ప్రయోగాలే ఇందుకు ముందస్తు హెచ్చరికలుగా పరిగణించబట్టే అన్సారీ, లా కమిషన్‌ల తాజా ప్రకటనలు వెలువడ్డాయని మరచిపోరాదు. ఒకరు యోగముద్రలో దాగినంత మాత్రాన అందరు యోగులూ వేమనయోగి కాలేరు! ఆధునిక మైథిలీ భాషను, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రొఫెసర్‌ హరిమోహన్‌ ఝా ఒక హాస్య రసావతారం, వ్యంగ్య సమ్రాట్‌. ఆయన చలోక్తులు, చమత్కారాలు మిథిలా ప్రాంత వాసులకు తరాల తరబడి రసోత్పత్తి కలిగిస్తాయని పండిత వాక్కు. అవి చదివితే నేటి పాలకశక్తులు సహా ఆధునికుల తలలు తిరుగు తాయి. అన్నింటికన్నా వికటకవి రూపంలో ఉన్న ‘చిన్నాన్న’ పాత్ర ద్వారా ప్రొఫెసర్‌ ఝా మనలోని హేతు విరుద్ధ ధోరణులను, అంధ విశ్వాసాలను ఏకరువుపెడుతూ పండితుడైన ఈ వికటకవి ద్వారా కొన్ని జీవన సత్యాలను ఈ ‘పురాణ ప్రలాపంలో’ ఇలా గుర్తు చేశాడు:



‘మనకు తీపి కలలు కనే అలవాటుంది. ఇతర దేశాల్లో ప్రజలు ఏ వస్తువునైతే బాహుబలంతోనో, బుద్ధిబలంతోనో సంపాదించుకుంటారో వాటిని మనం మహా సులువుగా మంత్రబలంతోనో, దివ్యశక్తుల దయతోనో పొందాలనుకుంటాం. వాళ్లు పాతాళగంగ నుంచి నీళ్లు పైకి లాగి పనులు చేసుకుంటారు. మనం ఆకాశగంగ కోసం జపం చేస్తూ ఉంటాం. ఈ దృక్పథం మారందే నవ సమాజ నిర్మాణం జరగదు. మన పూర్వాచారాలు, సంప్రదా యాలు మారాలి. మొత్తం మన జీవిత విధానమే మారాలి. శాస్త్రీయ దృష్టిని అలవరచుకోవాలి. నేడు భారతదేశం మూర్ఖత్వమనే రాహువు వశంలో ఉంది. ఎప్పుడు ఏ విధంగా దానికి విముక్తి కలుగుతుందో చూడాలి’ అన్నవాడు మహా పండితుడైన ఈ వికటకవి. ఈ ‘పురాణ ప్రలాపం’లో ‘చిన్నాన్న’ పాత్రలో ఉన్న వికటకవి– ప్రొఫెసర్‌ ఝా కలంద్వారా సకల శాస్త్రాల, కావ్యాల, పురాణాల, ప్రబంధాల, విభిన్న కావ్యాలంకార శాస్త్రాలన్నీ మన కళ్లకు జ్ఞాన సులోచనాలు తొడిగి, కొత్త దృష్టిని అద్దినట్టయింది.



మొదట్లోనే పేర్కొన్నట్టు ప్రధాని మోదీ మౌంట్‌ అబూ ప్రసంగం ఆయన రాజకీయ ప్రస్థానంలో సర్వమత లౌకిక సమన్వయ భారతావతరణ, ఆచ రణలో ప్రాతిపదికలు వేయగలిగితే సంతోషమే. కానీ ఆ భరోసాను, ఆయన రాజకీయ సహోదరులు, అంతేవాసులైన తొగాడియా, అమిత్‌ షా ప్రకటనలు మాత్రం ప్రజలకు కల్పించడం లేదు. వసుధైక కుటుంబాన్ని మరిచారు, ప్రజలంతా సుఖంగా ఉండాలన్న తొల్లింటి ఆకాంక్షనూ వదులుకున్నారు.





- ఏబీకే ప్రసాద్‌


సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top