భగ్గుమంటున్న సూరీడు

భగ్గుమంటున్న సూరీడు - Sakshi


శివరాత్రితో చలి నిష్క్రమించాక తీరిగ్గా వచ్చే అలవాటున్న వేసవి పిలవని పేరంటంలా ముందే వచ్చి ఠారెత్తిస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరునుంచే ఎండలు మండుతున్నాయి. గత కొన్ని వారాలుగా అవి క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు లండన్, పెన్సిల్వేనియాలలోని శాస్త్రవేత్తలతోపాటు భారత వాతావరణ విభాగం చేస్తున్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఈసారి మాత్రమే కాదు...మున్ముందు కూడా భారత్‌లో భారీ వడగాడ్పులుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మహానగరాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని వారంటున్నారు. ఈసారి వేసవిలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండొచ్చు గనుక అందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను పాటించాలని భారత వాతావరణ విభాగం, జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంసీ) రాష్ట్రాలను కోరాయి. రెండేళ్లనాడు దేశంలో వడగాడ్పుల వల్ల దాదాపు 2,500మంది మరణించారు. అందులో దాదాపు 2,000 మరణాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంభవించినవే. ఇవి అధికారిక గణాంకాలు. రికార్డుల కెక్కని మరణాలు కూడా కలుపుకుంటే ఇవి మరిన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. మృతుల్లో అధిక శాతంమంది రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద వర్గాలవారే. ఎండలు మండుతున్నా, వడగాడ్పులు వీస్తున్నా ఏదో ఒక పని చేస్తే తప్ప ఇల్లు గడవని జీవితాలు వారివి. ఆ వర్గాల్లో ఉండే నిరక్షరాస్యత వల్ల కావొచ్చు... వారికి పలుకుబడి అంతగా లేకపోవడంవల్ల కావొచ్చు ఆ మరణాల్లో చాలా భాగం వడగాడ్పుల జాబితాలో చేరవు.



వడగాడ్పులు కూడా ఇతర ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, భూకంపాలు, చలిగాలులు వగైరాల వంటివే. అయితే ప్రభుత్వాలు మాత్రం ఇతర వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించినట్టుగా వడగాడ్పుల విషయంలో వ్యవహరించవు. వాటి దృష్టిలో అసలు ఈ గాడ్పులు ప్రకృతి వైపరీత్యమే కాదు. 2012 వరకూ చలిగాలుల్ని కూడా ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించలేదు. ఆ ఏడాది ఉత్తరాదిన చలిగాలులకు అధిక సంఖ్యలో ప్రజలు మరణించాక తొలిసారి అది కూడా ప్రకృతి వైపరీత్యాల జాబితాలోకి వెళ్లింది. వడగాడ్పుల తీవ్రత దక్షిణాదిలోనే ఎక్కువుంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లోనే అధికం. వడగాడ్పుల్ని ప్రకృతి వైపరీత్యంగా చూడాలన్న డిమాండు కొంతకాలంగా వినబడుతున్నా కేంద్రం ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అదే జరిగితే వడదెబ్బ తగిలినవారికి వైద్య సదుపాయం కల్పించడం, మరణాలు సంభవించిన పక్షంలో వారి కుటుం బాలకు లక్షన్నర చొప్పున పరిహారం ఇవ్వడం వీలవుతుంది. ఆ అవకాశం లేక పోవడం వల్ల ఆ కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. వడగాడ్పుల వల్ల కేవలం మరణాలే కాదు... ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా పుట్టుకొస్తాయి. ఇక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి ఆ సమస్యల తీవ్రత మరింత పెరుగుతుంది. తాగునీటి సమస్య లేకుండా చూడటం, పశు దాణా లభ్యమయ్యేలా చూడటం కూడా కీలకం. అందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి.  



ఉన్నంతలో వేసవి తాపం పెరుగుతున్న దశలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రాష్ట్రాలను కదిలించడం మేలు కలిగించే విషయం. సాధారణ స్థాయి ఉష్ణోగ్రతకు మించి అయిదారు డిగ్రీలు మించితే వడగాడ్పుగా పరిగణిస్తారు. ఈసారి కూడా రాష్ట్రాలకు పంపిన కార్యాచరణ ప్రణాళిక అనేక చర్యలను సూచిం చింది. వడగాడ్పులపై వాతావరణ విభాగం అందజేసే సమాచారం ఆధారంగా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడం, ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకన్నా ఎక్కువగా పెరిగితే రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయడం వంటివి ఇందులో కొన్ని. దీన్ని అమల్లో పెట్టాక జాతీయ గ్రామీణ ఉపాధి పథకంకింద చేపట్టే పనుల్లో  నిర్దిష్ట సమయాల్లో  కూలీలతో పనిచేయించడాన్ని నిలిపేయిస్తారు. అలాగే నిర్మాణ రంగంలోనూ, ఇతరత్రా రంగాల్లోనూ పని స్థలాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన వన్నీ అందుబాటులో ఉంచడాన్ని తప్పనిసరి చేస్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వగైరాల్లో రీహైడ్రేషన్‌ సౌకర్యం కల్పిస్తారు. ఆసుపత్రుల్లో అదనపు బెడ్‌ల ఏర్పాటు, కూలర్లు సమకూర్చడం వంటి చర్యలు తీసుకుంటారు. వడదెబ్బ మరణాలను ధ్రువీకరించేందుకు స్థానికంగా కమిటీల ఏర్పాటు, వడగాలుల సమాచారాన్ని అందించడంతోపాటు ప్రజానీకంలో చైతన్యం కలగజేసేందుకు, వడదెబ్బ మృతుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నోడల్‌ అధికారిని నియమిస్తారు. నాలుగేళ్లక్రితం అహ్మదాబాద్, నాగపూర్, భువనేశ్వర్‌ తదితర నగరాలను ఎంచు కుని వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి స్థానిక సంస్థలనూ, స్వచ్ఛంద సంస్థలనూ అందులో భాగస్వాముల్ని చేసి అమలు చేశాక మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక చోట్ల నిరుడు ఆ విధానాన్నే అనుసరించడంవల్ల వడదెబ్బ మృతుల సంఖ్య 50 శాతం తగ్గింది. నిజానికి  ఈ శతాబ్దంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డయింది.



గాడి తప్పిన ప్రకృతిని సరిచేయడం ఏ ఒక్క దేశం వల్లనో సాధ్యం కాదు. అది సమష్టిగా జరగాల్సిన కృషి. పర్యావరణం క్షీణించడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న డిమాండుకు అమెరికా, ఇతర పారిశ్రామిక దేశాలు తలొగ్గి ఎంతో కాలం కాలేదు. ఆ తర్వాత కూడా ఏ మేరకు కోత విధించుకుం టాయో చెప్పడంలోనూ తాత్సారం చేశాయి. ఈలోగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ సానుకూల దృక్పథాన్ని ధ్వంసం చేసే చర్యలకు దిగారు. వాతావరణ ఒప్పందాలకు సంబంధించిన విధానాలను రద్దు చేసే కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. వెనకో ముందో ఇతర సంపన్న దేశాలు కూడా ఈ బాట పట్టే అవ కాశం లేకపోలేదు. కాబట్టి రానున్నది మరింత గడ్డుకాలం. కనుక ప్రకృతి వైపరీ త్యాల విషయంలో మరింత అప్రమత్తత, వాటివల్ల కలిగే నష్టం కనిష్ట స్థాయికి పరి మిత మయ్యేలా చూడటం తప్పనిసరి.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top