విడుదల లేని జీవిత బందీ

విడుదల లేని జీవిత బందీ - Sakshi


ఆలోచనం

మిర్చి రైతుల ఆక్రందనలు, ఆత్మహత్యలు నాకు శ్రీనాథుని ఒక పద్యాన్ని జ్ఞాపకం తెచ్చాయి. కొండవీటి రాజుల ప్రాభవం అంతరించి పోయాక ఆదరించేవారు కరువై  బ్రతుకుదెరువు కోసం కవిసార్వభౌమ బిరుదాంకితుడయిన శ్రీనాథుడు ఓడ్ర రాజుల పాలనలో వున్న కృష్ణాతీరంలోని బొడ్డుపల్లి గ్రామాన్ని గుత్తకు తీసుకుని వ్యవసాయం చేయించాడు. ప్రకృతి వైపరీత్యాలు పంటని దోచుకెళ్ళాక 700 రూపాయల సుంకమెలా కట్టాలో తోచక ‘‘కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము/బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు/బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి/నెట్లు చెల్లింతు సుంకంబు నేడు నూర్లు?’’ అని విలపిస్తాడు. శిస్తుకట్టని నేరానికి భుజం పై శిలను మోయిస్తూ ఆయనను ఊరంతా తిప్పగా, ఆ అవమానంతో ‘‘సార్వభౌముని భుజస్కందమెక్కెను కదా నగరి వాకిటనుండు నల్లగుండు’’ అని విలపిం చాడు, మరణించాడు. ఈ కవి 15వ శతాబ్దం వాడు. యర్రగొండపాలెం, మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుపతి కోటయ్య, అంతంత మాత్రమే పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, అప్పులవాళ్ళు నట్టనడివీధిలో అవమానించగా దిక్కుతోచక పురుగులమందు తాగాడు. శ్రీనా«థునికి, తిరుపతయ్యకు మధ్య 600 ఏళ్ళ ఎడం వుంది. ఈ మధ్యలో రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యాలు వచ్చాయి. కానీ ఆశ్చర్యంగా రైతు పరిస్థితిలో మార్పు రాలేదు. వేలసంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు.



ఈ పరిస్థితి అంతా ఏ కారణం చేత సంభవిస్తూ వుంది? రైతులు ఏ విషవలయంలో చిక్కుకుని ఉన్నారు పరిశీలించాల్సిన అవసరం వుంది. నా రాజకీయోద్యోగంలో భాగంగా నేను అనేక గ్రామాలలో తిరిగాను. అప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను. అదేమిటంటే ఈ రాష్ట్రంలో లేదా, ఈ దేశంలో దిగువ మధ్యతరగతి ఇళ్లన్నీ ఒక రకంగానూ, మధ్యతరగతి ఇళ్లు ఒకరకం సెట్టింగ్‌తోను, ఎగువతరగతి ఇళ్లన్నీ మరో రకం సెట్టింగ్‌తోనూ ఉన్నాయి. ఉదాహరణకు ఖరీదయిన లెదర్‌  రిక్లైనర్‌ సోఫాలను మార్కెట్‌ విడుదలచేస్తే సంపన్నుల ఇళ్లన్నీ ఆ సోఫాలను అత్యవసరంగా భావిస్తున్నాయి. మన ఇల్లు, మన జీవితాలు మన అభిరుచులకు అనుగుణంగా లేవు, మార్కెట్‌ ఎలా చెప్తే అలా ఉంటున్నాయి. రైతుల వ్యవసాయం కూడా అంతే.  



బీటీ విత్తనం, వనిల్లా పత్తి, మిర్చి, మొక్కజొన్న ఏదయినా ఏ పంట వేయాలో మార్కెట్‌ నిర్ణయిస్తూ ఉంది. రైతులంతా పొలోమని అటువైపు వెళ్తున్నారు. రెండవది వ్యవసాయ ఖర్చులు. రైతు జీవితం ‘‘అంగట్లో బియ్యం తంగేడు కట్టె’’. మధ్యతరగతి వారికి కార్లు కొనుగోలు చేసేందుకు లోన్లు ఇవ్వడానికి ఉత్సాహపడినట్లు బ్యాం  కులు, రైతులకు రుణాలివ్వడానికి ఉత్సాహం చూపవు. పంటను, చారెడు భూమిని చూపి తెచ్చుకున్న అప్పులు కొండంత పెరిగిపోయి, రైతును ఆత్మహత్య వైపు నెడుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు వేలసంఖ్యను ఎప్పుడో దాటిపోయి రికార్డులు సృష్టిస్తున్నాయి.



ప్రకృతి వైపరీత్యాలను దాటుకుని పండించిన పంటను మార్కెట్టుకు తీసుకువస్తే చదరంగంలో పాముల్లా నోళ్లు తెరుచుకుని రైతులను చావు వైపుకు నెట్టే దళారులే అంతటా. దళారుల మీద అదుపులేని రాజ్యం, కొంతమంది రైతులు ఆత్మబలిదానం చేసాక కానీ కొంత రాయితీని ప్రకటించదు. పంటను నిల్వ ఉంచుకుని  సరసమయిన ధరకు అమ్ముకోవడానికి, సరైన నిల్వ గోదాములు లేవు. 1991 సెన్సెస్‌ ప్రకారం 80 లక్షల మంది వ్యవసాయాన్ని వదిలేశారని ది హిందూ రూరల్‌ ఎఫెయిర్స్‌ ఎడిటర్‌ పి.సాయినాథ్‌ ఒక సెమినార్‌లో చెప్పారు. ఆ సంఖ్య ఇప్పటికి చాలా పెరిగి ఉంటుంది. చేతిలో సరైన వృత్తి నైపుణ్యం లేని ఈ రైతులందరూ, పట్టణాలలో కూలీలుగా మారి ఉంటారని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు.



70% వరకూ రైతులూ, రైతు కూలీలు ఉన్న భారత దేశంలో, ప్రజలచేత ఎన్నుకోబడుతున్న ఈ ప్రభుత్వాలు రైతులను ఆత్మహత్యలవైపుకూ, లేదా కార్పొరేట్‌ గుప్పిళ్ళలోకి ఎందుకు పంపుతూ ఉన్నట్లు ఆలోచిం చాలి. ఇన్ని సంవత్సరాలయినా స్వామినాథన్‌ సూచనలను ఎందుకు ఆచరణలోకి తీసుకురావటంలేదు. రైతు చేతిలోకి గుప్పెడు డబ్బు వస్తే, అతని కొనుగోలు శక్తి పెరిగితే యథావిధిగా మార్కెట్‌ వృద్ధి చెందుతుంది కదా. దేశాభివృద్ధికి నాంది వేస్తుంది కదా. తూతూ మంత్రపు రాయితీలు, లోన్లు వంటివి పక్కన పెడితే రైతుల జ్ఞాన పరిధిని విస్తరింపజేయడానికి స్వామినాథన్‌ చెప్పిన ‘‘విలేజ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌’’లను ఎందుకు ఆచరణలోకి తీసుకురావడం లేదు. అప్పుడు తమకేం కావాలో రైతులే విశదంగా చెప్పగలరు కదా.



పరిపాలకులలో చిత్తశుద్ధి, రైతుల జీవితాలను మెరుగు పరచాలనే పట్టుదల లేకుంటే సమాజం ఎంత అభివృద్ధి చెందినా, మనం రాకెట్లు ఎక్కి చంద్రుని మీదకి పిక్నిక్‌ వెళ్లేంత సాంకేతిక ప్రగతి సాధించినా రైతు జీవితం మాత్రం 600 ఏళ్ళ క్రితం ఉన్నట్లు ఇప్పుడు, ఇప్పుడు ఉన్నట్లే మరో 600 ఏళ్ళ తర్వాతా ఉంటుంది. ‘‘కాకమ్మ కథలోని రాహుకేతువులతో ఏడాదికోసారే గ్రహణం/పంట చేతికి వస్తే చుట్టూరా రాహువులు ఏడాదికేడాది గ్రహణం/వాడికేమో విడుదల వుంది /నీవేమో జీవిత బందీ’’ అని సుద్దాల అశోక్‌ తేజ అన్నట్లు మనం రైతు అంటే జీవిత ఖైదు అని పర్యాయ పదం చదువుకోవాల్సి ఉంటుంది.



సామాన్య కిరణ్‌

ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top