ఓ ‘సన్యాసి’ పాలన

ఓ ‘సన్యాసి’ పాలన


జీవన కాలమ్‌

నాయకులు అందలాలు ఎక్కడానికి ఇంతకాలం మైనారిటీల మైండ్‌సెట్‌ని ధ్వంసం చేశారు. సర్వమత సహజీవనానికి మతం ప్రాతిపదిక కానక్కర లేదని–ఓ మతానికి చెందిన సన్యాసి నిరూపించగలిగితే?



ఈ మధ్యకాలంలో దేశీ యులనే కాక, న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి విదేశీ మాధ్యమాలను కూడా నివ్వెరపోయేటట్టు చేసిన పరిణామం– ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఒక ‘సన్యాసి’ని నియమించడం. అలనాడు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ని భారతీయ జనతాపార్టీ కొల్లగొట్టడం కేవలం ఒక ‘వేవ్‌’లో జరిగిపోయిన ‘చిలక్కొట్టుడు’ అని రాజకీయ మేధావులు చాలామంది పెదవి విరిచారు.



అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో 324 సీట్లు గెలిచి, జార్ఖండ్‌లో ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్‌ని బీజేపీ తుడిచిపెట్టిన తర్వాత–మేధావులు వినాయకుడి బొడ్డులో వేలు పెట్టినట్టు–ఉలిక్కి పడి–ఆ విజయాన్ని అటకెక్కించి పంజాబ్, మణిపూర్‌ మాటేమిటని కళ్లెగరేశారు. అంతవరకూ బాగుంది. కానీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ నియామకం– అందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. ఎందరికో ఈ నియామకం కొరుకుడు పడలేదు. ఏమయింది ఈ ప్రభుత్వానికి? బీజేపీ అధిష్టానానికి మతి పోయిందా? ‘గెలుపు’ అహంకారాన్ని రెచ్చగొట్టిందా? తామేం చేసినా చెల్లుతుందన్న ధీమాని ఇచ్చిందా? ఎవరేమన్నా– ‘మేం పసుపు జెండా ఎగరేసి తీరుతాం’ అన్న నిర్లక్ష్యానికి ఇది గుర్తా? ఇంతవరకూ అజ్ఞాతంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు రంగప్రవేశం చేసి పంజా విప్పిందా? రాష్ట్రంలో 18 శాతం ముస్లింలను కలుపుకోవడానికి వందమందికి టికెట్లు ఇచ్చి ఒక నాయకురాలు బరిలోకి దిగగా, ఒక్కరికీ టికెట్టు ఇవ్వకుండా తమ గెలుపుకి– ఆయా వర్గాలకి సంబంధం లేదని దేశానికి సూచించాలని ప్రయత్నమా?–ఎన్నో ప్రశ్నలు.



ఈ యోగికి నా అన్నవాళ్లు లేరు. సన్యాసి. అప్పుడెప్పుడో–2006లో–ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తనమీద కక్ష సాధిస్తోందని–పార్లమెంటులో అంతా నిర్ఘాంతపోయేలాగ కంటతడి పెట్టుకున్నారు. అర్థంలేని కారణాలకి పాతిక చెప్పుదెబ్బలు కొట్టి గర్వంగా చెప్పుకున్న పార్లమెంటు సభ్యులు రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఈ ‘సన్యాసి’ పార్లమెంటులో కంటతడి పెట్టుకుంటాడేమిటి? అని కొందరు నవ్వుకున్నారు. కొందరు విస్తుపోయారు.

తీరా షాక్‌ నుంచి తేరుకున్నాక– చాలామంది నాయకులు– ఆయా వర్గాలను బుజ్జగించడానికి చేసే ‘ఇచ్చకాల’ మీద ఈ ‘సన్యాసి’ ఇనుప పాదం మోపడాన్ని– మొదట మతానికీ, తర్వాత అధిష్టానం కుట్రకీ, తదుపరి మైనారిటీల అణచివేతకీ కారణమని కొందరు రాజకీయ మేధావులు పంజాలు విప్పారు. కాలేజీల ముందు రోమియోల విహారాలు, అనుమతిలేని కబేళాల తొలగింపు లాంటి పనులకు తప్పుడు అర్థాలు తీశారు.



ఏమయినా–కాస్త లోతుకి వెళ్లి చూడగా ఈ చర్యలో అపూర్వమైన రాజకీయ దురంధరత కనిపిస్తుంది. ప్రతీక్షణం ‘మైనారిటీలు మా ప్రాణం’ అని ఊదరగొట్టే నాయకులు పదవిలోకి వచ్చిన తర్వాత తన బాబునీ, మామనీ, తండ్రినీ, తాతనీ పదవుల్లో నిలిపి– ముఖం తుడవడానికి ఒక మైనారిటీ చెంచాని చేరదీసి–పబ్బం గడుపుకున్న 70 ఏళ్ల చరిత్ర నేపథ్యంలో–100 మందికి టికెట్లిచ్చి–తన శిలా విగ్రహాల్ని పెట్టుకున్న నాయకురాలి ‘ఆత్మ వంచన’ని చూసిన ఈ ప్రజలు–తమ శ్రేయస్సుకి అనుక్షణం ఓ కాషాయ సన్యాసి పట్ల దృష్టిని నిలపడం విచిత్రమైన మలుపు. ఒకవేళ ఈ కాషాయ సన్యాసి వారికి నిజ మైన మేలు చేస్తే– పాలనలో సుపరిణామానికి నూటి కి నూట యాభై మార్కులు దక్కుతాయి. కాగా– ఒక ‘యోగి’, ఒక ‘సన్యాసి’ కట్టుకుపోయేదేమీ లేదు. అతనికి బలిసిన ఏనుగుల పార్కులక్కరలేదు. తన కుటుంబాల వారికి పదవుల పంపకం అక్కరలేదు.



నాయకులు అందలాలు ఎక్కడానికి ఇంతకాలం మైనారిటీల మైండ్‌సెట్‌ని ధ్వంసం చేశారు. ఆయా సామాజిక వర్గాల సామరస్య సహజీవనం కాక ఆయా వర్గాలకి ‘హక్కు’ల రుచిని మప్పి–తీరా వాటిని కాలరాశారు. సర్వమత సహజీవనానికి మతం ప్రాతిపదిక కానక్కరలేదని– ఓ మతానికి చెందిన సన్యాసి నిరూపించగలిగితే? మైనారిటీలను దువ్వి పబ్బం గడుపుకునే ్టౌజ్ఛుnజీటఝకి అత్యంత సాహసంతో స్వస్తి చెప్పి– ఫలితాల మీదా, సజావైన పరిపాలన మీదా ‘గురి’ పెట్టగల నాయకత్వాన్ని ఇవ్వగల గుండె ధైర్యం ఉన్న వ్యవస్థ– ప్రారంభంలో పదిమందినీ ఒప్పించే ప్రయత్నం చెయ్యలేదు. మెప్పించే ప్రయత్నమూ చెయ్యలేదు. కాగా సాహసించి పదిమంది ‘షాక్‌’కీ సిద్ధపడింది.



నిజాయితీ, గుండె ధైర్యం ఎప్పుడూ ఒప్పించాలని ప్రయత్నించదు. ఎందుకంటే అది ప్రదర్శన కాదు. ఇంతవరకూ మనం నాయకత్వం వేషాల్ని చూశాం. ఇచ్చకాల్ని చూశాం. ‘ఆకర్షణ’ల్ని చూశాం. తాయిలాల సంస్కృతిని చూశాం. ఇప్పుడు కేవలం సత్పాలన లక్ష్యంగా–మనల్ని ఒప్పించాల్సిన పని చెయ్యనక్కరలేని నాయకత్వం–ఒప్పుకునే పాలనని కాక–అవసరమైన పాలనని చెయ్యగల ‘దమ్ము’, ‘ఆత్మవిశ్వాసం’–ఇంకా చెప్పాలంటే–‘సవాలు’ ఈ ‘సన్యాసి’ పాలనకి గుర్తు–అని నాకనిపిస్తుంది.





గొల్లపూడి మారుతీరావు

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top