పాలకులను కలవరపెట్టిన పాదయాత్ర..!

పాలకులను కలవరపెట్టిన పాదయాత్ర..! - Sakshi


సందర్భం

ఐదు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభించిన మహాజన పాదయాత్ర నేడు జరిగే సామాజిక సమర సమ్మేళన సభతో ముగియ నుంది. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు కోసం  చేపట్టిన ఈ యాత్ర ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ యాత్ర రాష్ట్రం లోని అన్ని రాజకీయ పార్టీలకు సామా జిక న్యాయంపై మాట్లాడాల్సిన పరిస్థితిని కల్పించింది. యాత్ర ప్రారంభం నుంచి నేటి వరకు రాష్ట్రంలోని వివిధ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను 140 లేఖలు రాసాను. మా లేఖలకు స్పందన నేరుగా ఇవ్వకపోయినప్పటికీ లేఖల్లో ప్రస్తావించిన సామాజిక, ఆర్థిక సమస్యలపై సీఎం స్థాయిలోనే స్పందన ప్రారంభమైంది.



పాలకవర్గాలు కూడా ఊదర గొడుతున్న సామాజిక న్యాయం అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి? దాని సాధన కోసం ఏం చేయాలి? అనే అంశాల ప్రాతిపదికనే ఈ మహాజన పాదయాత్ర సాగింది. 1600కి పైగా గ్రామాలు, పట్టణాలు, గిరిజన గూడేలు, తండాలు, దళిత వాడల గుండా సాగిన మా యాత్ర ఇప్పటివరకు 4150 కిలోమీటర్ల దూరం పర్యటించింది. బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై వరాల జల్లు కురి పిస్తూ... వారి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం కేసీఆర్‌ గొప్పగా మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితిని మహాజన పాదయాత్ర కల్పించింది. రెండున్నరేళ్ల పాటు గుర్తుకు రాని సంక్షేమ చర్యలు హఠాత్తుగా గుర్తుకు రావడం వెనుక అనేక కారణాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక సంఘాలు, వ్యక్తులు, మేధావులు ఇదే అంశంపై మా యాత్రకు మద్దతుగా కదిలి రావడం ఈ కలవర పాటుకు కారణం. అందుకే గొర్రెల పెంపకందారులకు, మత్స్యకారులకు వరాలు ప్రకటిం చారు. గొర్రెల పెంపకానికి పెద్దఎత్తున ప్రోత్సాహం ఇవ్వనున్నా మని చెప్పారు.



సంతోషమే కానీ ఓ వైపు గొర్రెల పెంపకానికి కావా ల్సిన మేతకు స్థలం లేకుండా, గుట్టలను, బంజర్లను క్వారీలకు, కార్పోరేట్లకు కట్టబెడుతూ ప్రోత్సాహం ఇస్తామని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకోవైపు చెరువు కట్టలపై, శిఖం భూముల్లో ఉన్న తుమ్మలపై గొర్రెల కాపర్లకు హక్కు కల్పిస్తూ ఉన్న జీవోను తుంగలోకి తొక్కి వేలాది తుమ్మ చెట్లను మిషన్‌ కాకతీయలో భాగంగా నరికివేశారు. జీవోను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నా పట్టిం చుకోని సీఎం గారు గొర్రెల పెంపకానికి ప్రోత్సాహం అనడం వెనక మర్మమేంటి? ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ మాటలు? మా యాత్ర భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సందర్భంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గొర్రెల మేత కోసం వలస వచ్చిన గొర్రెల కాపరులను కలిశాం. ఉన్న ఊరిని, పిల్లలకు దూరంగా నెలల తరబడి వలసతోనే బతుకు తున్న వారిని చూశాం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్న సందర్భంలో పదుల సంఖ్యలో ఎంబీసీ కులాలను కలిశాం. వారికి ప్రభుత్వ పథకాలు అందేందుకు ఉపయోగపడే ఆధార్‌కార్డు, ఓటర్‌ కార్డు, రేషన్‌ కార్డులు కూడా లేవు. స్థిర నివాసం లేదు. పిల్లలు బడికి కూడా వెళ్లటం లేదు. వీరి గురించి సీఎంకు నాలుగు లేఖలు రాసిన తర్వాత స్పందిస్తూ ఎంబీసీ కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.



మరోవైపు గత సంవత్సరం సబ్‌ ప్లాన్‌కి సంబంధించిన కేటాయించిన నిధులను 92 శాతం ఇతర పథకాలకు దారి మళ్లించారు. మిషన్‌ భగీరథకు 7వేల కోట్లు, భారీ ప్రాజెక్టులకు 2వేల కోట్లు, రవాణా శాఖకు 800 కోట్ల రూపాయలను జీవోలు ఇచ్చి మరీ దారి మళ్లించిన కేసీఆర్‌ దళిత, గిరిజన ఉద్దారకుడు. సబ్‌ప్లాన్‌ పాలకులకు అడుగడుగునా అడ్డంకిగా మారింది. తాజాగా కేంద్ర ప్లాన్‌ నాన్‌ప్లాన్‌ తీసివేయాలని చెప్పిందని సబ్‌ప్లాన్‌ లేకుండా చేశారు. ఇక మాకు వచ్చిన వినతుల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు చెందిన వినతులు కూడా గణనీయ సంఖ్యలోనే ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పైగా సీఎం ప్రతిపక్షాలకు సమాధానం చెబుతూ ఈ ఏడు రెండు లక్షల ఇండ్లు కట్టకపోతే ఓట్లడగం అని ప్రగల్భాలు పలికారు. బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించ కుండా ఎలా కడతారనే మాటకు సమాధానం ఇవ్వకపోగా ప్రతి జ్ఞలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించారు.



కమ్యూనిజం మంచిదే కానీ అంటూ.. పరిణామశీలత లాంటి పదాలనూ ఆయన ఉపయోగించారు. అందుకే దేశంలో సామా జిక పోరాటాలను, వర్గ పోరాటాలతో కలిపి అట్టడుగు ప్రజల కోసం మరింత మెరుగ్గా పని చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నాం. అందుకు లాల్‌ నీల్‌ జెండాల ఐక్యతే మార్గమని నిశ్చయించాం.  మమ్మల్ని విమర్శిస్తున్న వారికి మేం ఒక్కటే చెప్పదల్చుకున్నాం. రాబోయే కాలమంతా లాల్‌ నీల్‌ జండాలదే. ఇప్పటిదాకా మీ జెండాలు మోసిన వారిని, దండాలు పెట్టిన ప్రజలను రాజ్యాధి కారం దిశగా నడిపించే పోరాటానికి ఈ పాదయాత్ర నాంది మాత్రమే. అసలైన సామాజిక సమరానికి ఈ పోరాటం ఆరంభం మాత్రమే.. భవిష్యత్‌లో జరిగే పోరాటాలలో ప్రజలకు దిశా నిర్దేశం చేసేందుకు నేడు జరగబోయే సామాజిక సమర సమ్మే ళనం వేదిక కానుంది.

(నేడు మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా)





- తమ్మినేని వీరభద్రం


వ్యాసకర్త సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top