ఇకనైనా మేలుకుందామా?

ఇకనైనా మేలుకుందామా? - Sakshi


భారత ఎన్నికల కమిషన్‌కు అత్యంత సమర్థవంతమైన ఎన్నికల నిర్వహణ వ్యవస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇటీవలి జమ్మూకశ్మీర్, తమిళనాడు ఉప ఎన్నికలు ఆ ప్రతిష్టకు భంగం కలిగించేలా పరిణమించడం దురదృష్టకరం. ఈ నెల 9న శ్రీనగర్‌ పార్లమెంటరీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 7.24 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గత 30 ఏళ్లలో ఇది అత్యంత తక్కువ పోలింగ్‌. దీంతో ఎన్నికల సంఘం 12న జరగాల్సిన అనంతనాగ్‌ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్ని కను నిలిపివేసి, శ్రీనగర్‌లోని 38 పోలింగ్‌ బూత్‌లలో తిరిగి ఎన్నికలకు ఆదేశిం చింది. గురువారం ఆ పోలింగ్‌ పూర్తయ్యాక, పద్ధతి ప్రకారం ఆ ఓట్లను లెక్కించి అత్యధిక ఓట్లను సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాల్సి వస్తుంది. గత రెండు దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్‌ ప్రజలు మిలిటెంట్ల బెదిరింపులను, ఎన్నికల బహిష్క రణ పిలుపులను లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ఓటు చేస్తుండటాన్ని భారత ప్రధాన స్రవంతి రాజకీయాలను వారు ఆమోదిస్తున్నారనడానికి నిదర్శనంగా చూపుతున్నాం.



ఈ ఎన్నిక దాన్ని అపహాస్యం చేసేది కాదా? రాష్ట్రlశాసనసభ ఎన్నికల్లో 1996లో 53.9 శాతం, 2002లో 43 శాతం, 2008లో 60.5 శాతం, 2014లో 65.23 శాతం పోలింగ్‌ నమోదైంది. అలాంటిది రెండేళ్లు గడిచేసరికే పోలింగ్‌ ఇంత తక్కువ స్థాయికి పడిపోవడానికి కారణం మిలిటెంట్ల బెదిరింపులు, ప్రతీకార దాడుల భయమే అనడం సమంజసం కాదు. 1996, 2002 ఎన్నికల్లో సైతం ఇలాంటి భయాల మధ్యే ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు వచ్చారు. భయం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉన్నా ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు, ప్రత్యేకించి యువత పోలింగ్‌ పట్ల విముఖతను ప్రదర్శించారనేది స్పష్టమే.



2016 జూలైలో హిజబుల్‌ ముజాహిదిన్‌ కమాండర్‌ బుర్హన్‌వనీ ఎదురు కాల్పులలో మరణించినప్పటి నుంచి కశ్మీర్‌ లోయలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం, నిరసన, హింసా కాండ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పరిస్థితిని ఉపశమింపజేయడానికి బదులు పీడీపీ–బీజేపీ ప్రభుత్వం ఈ అల్లర్లను, అసంతృప్తిని పాక్‌ ప్రేరేపిత చర్యలుగా కొట్టిపారేస్తూ, బలప్రయోగమే శరణ్యంగా భావించాయి. దీనికి తోడు జమ్మూ ప్రాంతంలో బీజేపీ నేతలు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తామంటూ సాగించిన ప్రచారం, దేశవ్యాప్తంగా ఆ పార్టీ సాగిస్తున్న గోరక్షణ ప్రచారం కశ్మీర్‌ ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను మరింతగా పెంచాయి. వీటన్నిటి జమిలి ఫలితంగానే పరి స్థితి పూర్తిగా అదుపుతప్పింది.



గత ఆరు నెలల్లోనే అల్లర్లు, నిరసనలలో 96 మంది పౌరులు మరణించారు. 12,000 మందికి పైగా గాయపడ్డారు. పెల్లెట్స్‌ గన్స్‌ ప్రయోగంవల్ల వెయ్యి మంది ఒక కన్ను కోల్పోగా ఐదుగురు పూర్తి అంధుల య్యారు. ఇవేవీ ఓటర్లను ప్రభావితం చేయలేదనుకోవడం అసమంజసం. కశ్మీర్‌ లోయలో ఎన్నికలు జరిపే పరిస్థితి లేదని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చెప్పినా లెక్క చేయక ఈసీ ఈ ఉప ఎన్నికలకు సిద్ధమైంది. అది తన స్వతంత్ర, స్వయం ప్రతిపత్తిని నిస్సంశయంగా కాపాడుకోవాల్సిందే. కానీ దేశం లోనే అతి సున్నితమైన ప్రాంతంలో అవాస్తవిక అంచనాలతో ఎన్నికలకు దిగడం తొందరపాటేనని చెప్పక తప్పదు. శ్రీనగర్‌ ఓటింగ్‌ సరళి గుణపాఠంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వైఖరిని మార్చుకుని కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి ప్రాధా న్యమిచ్చి సామరస్యంతో, సహనంతో, చాకచక్యంగా  ప్రజల సంతృప్తిని, ఆగ్రహాన్ని ఉపశమింపజేయడానికి కృషి చేయడం అవసరం.



ఇక తమిళనాడులోని ఆర్కే నగర్‌ శాసనసభ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్ని కకు సంబంధించి ఈసీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టి పీడిస్తున్న అతి పెద్ద రుగ్మతలలో ఒకటైన ధన బలానికి ఎదురు నిలవాల్సి వచ్చింది. దివంగత ముఖ్య మంత్రి జయలలిత మరణంతో అవసరమైన ఈ ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయక తప్పలేదు. అనూహ్యమైన రీతిలో ఆర్కేనగర్‌ను ముంచెత్తిన నోట్ల వరదలో ఎన్నికలు స్వేచ్ఛగా, ఏ ప్రలోభాలూ లేకుండా జరిగే అవకాశం లేదని ఈసీ సహేతుకంగానే భావించింది. తమిళనాట ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలు రెండూ వాగ్దానాలు కురిపించడంలో, ఓట్లను విడివిడిగా, టోకుగా కొను గోలు చేయడంలో ఆరితేరినవే.



అక్రమాస్తుల కేసులో దోషిగా బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిçస్తున్న శశికళ నటరాజన్‌ నేతృత్వంలోని అన్నా డీఎంకే (అమ్మ) పార్టీ, ఆమె ప్రతినిధిగా ముఖ్యమంత్రి అయిన కే పళనిస్వామి ప్రభుత్వానికి ఈ ఉప ఎన్ని కలో గెలుపు ప్రజామోద ముద్ర అవుతుందని భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమైనదిగా మారింది. ఇది దృష్టిలో ఉంచుకునే ఈసీ అసాధారణమైన రీతిలో పెద్ద సంఖ్యలో కేంద్ర పరిశీలకులు, ప్లయింగ్‌ స్క్వాడ్‌లతో భారీ ఏర్పాట్లు చేసింది.  ఏఐఏడీఎంకే (అమ్మ) పార్టీ, ప్రభుత్వాలలో చక్రం తిప్పుతున్న దినకరన్‌ నిస్సిగ్గుగా, విచ్చల విడిగా డబ్బును పంపిణీ చేయడం సాగించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి సీ విజయభాస్కర్‌ వద్ద ముఖ్యమంత్రి సహా పలువులు మంత్రుల ద్వారా ఓటర్లకు పంచడానికి రూ. 89 కోట్లు సిద్ధం చేసినట్టు తెలిపే పత్రాలు ఏప్రిల్‌ 7న ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో దొరికాయి. ఆ పార్టీ పంపిణీ  చేస్తున్న రూ. 18.8 లక్షలు రెడ్‌ హ్యాండెడ్‌గ పట్టుబడ్డాయి.



అమ్మ పార్టీకి, దినకరన్‌కు ఈ డబ్బు పంపిణీతో సంబంధాలున్నాయని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత ఈసీది. ఓటుకు నోట్లు కొని ఎన్నికల్లో పోటీ చేసేవారు తాము ఖర్చు పెట్టే డబ్బును పెట్టు బడిగా చూస్తారని, ఐదేళ్లపాటూ నల్లధనాన్ని పోగేసుకోడానికి పదవులను వాడుకుని ఎన్నికల్లో తిరిగి డబ్బు వెదజల్లుతారని అందరికీ తెలిసిందే. ఈ విష వలయాన్ని బద్ధలు కొట్టాల్సిన బాధ్యత ఈసీది కానే కాదు, ఎన్నికైన ప్రభుత్వాలది. ఆర్కేనగర్‌ నోట్ల పంపిణీ, అక్రమాలు అసాధారణమైనవి. ఇలాంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డ పార్టీపై, అభ్యర్థిపై కనీసం ఆ ఎన్నిక వరకైనా అనర్హత వేటు వేయగలిగేలా ఈసీ అధికారాలను విస్తరింపజేయడంపై సమగ్ర బహిరంగ చర్చ జరగడం అవ సరం, ఏదిఏమైనా రోజురోజుకూ బలపడుతున్న ఓటుకు నోట్లు సంస్కతి మన ప్రజాస్వామ్య వ్యవస్థ సుస్థిరతకు ముప్పు తెచ్చేది. ఆ విషయాన్ని మన రాజకీయ పార్టీలు, నేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top