ఇదేమి రాజ్యం?

ఇదేమి రాజ్యం? - Sakshi


త్రికాలమ్‌

అధికారంలో ఉన్నవారికి ప్రతిపక్షాల కార్యాచరణ నచ్చదు. ప్రతిపక్షంలో ఉండి ధర్నాలూ, రైలు రోకోలూ చేసినవారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలను ప్రతిపక్షం చేస్తే విధ్వంసంగా కనిపిస్తుంది. ఏడు దశాబ్దాలకు పైబడిన స్వతంత్ర భారత చరిత్రలో అనేక ఉద్యమాలు చూశాం. ఉద్యమాల సమయంలో సంయమనం పాటించిన ప్రధానులనూ, ముఖ్యమంత్రులనూ చూశాం. నిగ్రహం కోల్పోయి నియంతలుగా వ్యవహరించినవారినీ చూశాం. వారికి ఎటువంటి శాస్తి జరిగిందో కూడా చూశాం. నోటికి వచ్చినట్టు వాగే మంత్రులనూ, శాసనసభ్యులనూ, అడ్డగోలుగా మాట్లాడే ముఖ్యమంత్రినీ ఇప్పుడే చూస్తున్నాం.


ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడం, ప్రతి పక్ష నాయకుడు ముఖ్యమంత్రిపైన ధ్వజమెత్తడం సహజమే. ప్రతిపక్ష నాయకుడి పైన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులు విచక్షణ లేకుండా నేల బారుగా మాట్లాడటం చూస్తుంటే ఇది అనాగరిక ప్రభుత్వం అనిపిస్తోంది. కనీస సంస్కారం లోపించినవారు మంత్రులుగా వ్యవహరించడం, వారు మతి తప్పి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వారిని నివారించి మందలించకపోగా ఆమోదిం చడం ప్రజాస్వామ్య సంప్రదాయాలను మంటగలిపే వైఖరి. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అవాంఛనీయ, అప్రజాస్వామిక ధోరణులపైన వార్తలు రాసినం దుకూ, దృశ్యాలు చూపినందుకూ ముఖ్యమంత్రి మీడియాపైన కారాలు మిరియాలు నూరడం నానాటికీ పెరుగుతున్న పాలకుల నిరంకుశ ధోరణికి నిదర్శనం. తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా ప్రశ్నించకూడదు.  మాటలు కోటలు దాటì , చేతలు గడప దాటకపోయినా విమర్శించకూడదు.


ఓటు కోసం నోట్లు ఇస్తూ దొరికిపోయినా, కేసు విచారణకు రాకుండా నానా తిప్పలు పడినా అదేమని అడగకూడదు. నిరర్థకమైన పట్టిసీమ నిర్మాణం పేరుతో కోట్లు వృథా చేసినా అభ్యంతరం చెప్పకూడదు. పదేళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉంటూ ప్రణాళికాబద్ధంగా రాజధాని నిర్మించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆదరాబాదరాగా అమరావతికి వెళ్ళడం ఎందుకో, తాత్కాలిక సచివాలయం పేరుతో కోట్లు తగలెయ్యడం ఎందుకో చెప్పాలని అన కూడదు. స్థానిక మీడియా సంస్థలూ, కేంద్ర ప్రభుత్వం కావాలని కళ్ళు మూసు కున్నప్పటికీ అమరావతి నిర్మాణ వ్యూహంలోని అవినీతినీ, అక్రమాలనూ వెల్ల డిస్తూ జపాన్‌కు చెందిన మకీ అండ్‌ అసోసియేట్స్‌ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా దాని గురించి ప్రస్తావించకూడదు. మీడియా రాయదు. కేంద్ర ప్రభుత్వం అడగదు. మంత్రివర్గ సహచరులు నోరు విప్పరు. శాసనసభ్యులు ఎవరి రంధిలో వారున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేదెలా? అవినీతి రహి తంగా పారదర్శకంగా పరిపాలన సాగిస్తానంటూ విశాఖ భాగస్వామ్య సద స్సులో చంద్రబాబునాయుడు శనివారంనాడు నమ్మబలికింది ఇదేనా?



ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబునాయుడు ఉన్న రోజులలో ఆయన వ్యవహరించిన తీరు ప్రజలు మరచిపోలేదు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం అన్యా యమంటూ ఔరంగాబాద్‌ వెళ్ళి హడావిడి చేయడానికి ప్రయత్నించిన చంద్ర బాబునాయుడినీ, తెలుగుదేశం పార్టీ నాయకులనూ పోలీసులు అడ్డుకున్న ప్పుడు చంద్రబాబునాయుడు మీడియా కెమెరాల ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఆయననూ, ఆయన సహచరులనూ విమానంలో హైదరాబాద్‌కు పంప డానికి మహారాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబునాయుడు టర్మాక్‌ మీదనే బైఠాయించి గొడవ చేశారు. చంద్రబాబునాయుడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పల్లెత్తు మాట అనలేదు. పరాయి రాష్ట్రంలోకి వెళ్ళి విధ్వంసం సృష్టిస్తున్నాడని అనలేదు.


దేవినేని ఉమామహేశ్వరరావులాగా మహారాష్ట్ర మంత్రులు ఎవ్వరూ నీచంగా మాట్లాడలేదు. ‘వస్తున్నా మీకోసం’ పేరుతో చంద్రబాబునాయుడు పాదయాత్ర చేసినప్పుడు పోలీసులు పెద్దగా ఆటంకం కలిగించకపోయినప్పటికీ కొద్ది అసౌ కర్యం కలిగిన సందర్భాలలోనూ ఆగ్రహం ప్రదర్శిస్తూ తాము తిరిగి అధికారం లోకి వచ్చినప్పుడు పోలీసుల సంగతి చెబుతామంటూ బెదిరించిన సంగతి మరచిపోకూడదు. అప్పుడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నారాయణ,  రావెల కిశోర్‌బాబు మాదిరి చవకబారుగా మాట్లాడలేదు. కూరగాయల ధరలు పెరిగిన ప్పుడు మెడలో కూరగాయల దండ వేసుకొని సీపీఎం నాయకుడు రాఘవులుతో కలసి నిరసన తెలిపిన చంద్రబాబును ఏ ముఖ్యమంత్రి అభివృద్ధి నిరోధకుడని కానీ, నేరస్తుడని కానీ, మానసిక రోగి అని కానీ నిందించలేదు.



అదే బాట, అదే గమ్యం

సరిగ్గా పదిహేనేళ్ళ కిందట నేను 'వార్త' పత్రిక మొదటి పేజీలో ఇదే శీర్షికతో(ఇదేమి రాజ్యం?) సంపాదకీయం రాశాను. విద్యుత్‌ సంస్కరణలను ప్రవేశపెట్టే ప్రయత్నంలో అడ్డగోలుగా వ్యవహరించిన చంద్రబాబునాయుడి విధానాలను ఎండగడుతూ వ్యాస పరంపర ప్రచురించాను. వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో తొమ్మిది వామపక్షాల అండదండలతో సాగిన విద్యుత్‌ సంస్కరణల ప్రతిఘటన ఉద్యమాన్ని సంపూర్ణంగా బలపరిచాను. అయినప్పటికీ నాపైన  వ్యక్తిగత విమర్శకు దిగలేదు. ఆ సంపాదకీయం ప్రచురించిన రెండున్నర సంవత్సరాల అనంతరం జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది.


అలిపిరి దగ్గర నక్సలైట్లు దాడి చేయడం వల్ల వచ్చిన సానుభూతి సైతం చంద్రబాబు నాయుడిని గెలిపించలేకపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం అదే తీరులో ఉధృతమై ప్రభుత్వ అస్తిత్వాన్ని ప్రశ్నించబోతోంది. అణచివేత పర్యవసానం వేరే విధంగా ఉండదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసింది. అయినా పోలీసులు జోక్యం చేసుకొని అన్యాయంగా వ్యవహరించిన సందర్భాలు తక్కువ. అసెంబ్లీలో నవ్వుతూ చంద్రబాబునాయుడిని ఉడికించేవారే కానీ ప్రతిపక్షంలో ఉన్న వారిపైన లేనిపోని ఆరోపణలు చేయలేదు. తనపైన ఎవరైనా నిష్కారణంగా ఆగ్రహం ప్రదర్శించినా సహించేవారు. తనకు కోపం నరం తెగిపోయిందని చెప్పేవారు. బీజేపీ నాయకుడు దత్తాత్రేయ రోజుకో బహిరంగ లేఖ రాసినా 'దత్తన్నకు నామీద ప్రేమ పెరుగుతోంది' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించేవారే కానీ వ్యక్తిగత విమర్శలకు దిగలేదు.


రోశయ్య పెద్దమనిషి తరహాలోనే వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరుకొని ఆయన పదవికి ముప్పు వచ్చినప్పుడు సైతం ఉద్యమ నాయకుడు చంద్రశేఖరరావును కానీ ప్రొఫెసర్‌ జయశంకర్‌ని కానీ ఉద్యమాన్ని సమర్థించిన మేధావులను కానీ విమర్శించలేదు. కిరణ్‌కుమార్‌ రెడ్డి తన తరహాలో తాను రాష్ట్ర విభజనను నివారించడానికి ప్రయత్నించారే కానీ ఉద్యమ నాయకులను తప్పుడు మాటలతో నిందించలేదు. అప్పటి వరకూ ఒక స్థాయి సంస్కారం కొనసాగింది. 2014 ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా రాజకీయ విలువలు పతనమైపోయాయి. అధికారంలోకి రాగానే నేతలను అహంకారం ఆవహించింది. ఆచితూచి మాట్లాడే సంప్రదాయం మంట కలసింది. పొరపాట్లనూ, వైఫల్యాలనూ ఒప్పుకునే నమ్రత నశించింది. మసి బూసి మారేడుకాయ చేయవచ్చుననే నమ్మకం పెరిగింది.

 

హద్దుమీరిన అసహనం

వయస్సు ప్రభావమో, "సమయం లేదు మిత్రమా" అనే అశరీరవాణి హెచ్చరిక కారణమో తెలియదు కానీ ఎవరో తరుముతున్నట్టు చంద్రబాబునాయుడి నడక పరుగులాగా సాగుతోంది. ఇప్పుడే అంతా చక్కబెట్టుకోవాలనే ఆత్రుత కనిపిస్తోంది. మాటకీ, చేతకీ పొంతన ఉండటం లేదు. స్వోత్కర్ష శ్రుతి మించుతోంది. అసత్యాలు అలవోకగా చెబుతున్నారు. అన్ని గొప్పపనులూ తానే చేశానంటూ చెప్పుకోవడం, ఎప్పుడైనా కథ అడ్డం తిరిగినప్పుడు తటాలున తప్పుకోవడం రివాజుగా మారింది. ఢిల్లీలో ప్రధానికి అత్యంత విధేయంగా ఉండటం, అమరా వతిలో నియంతగా వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారు.


కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడితో కలసి లేనివి ఉన్నట్టు భ్రమింపజేయడాన్ని విమర్శిస్తే ఏ మాత్రం తాళలేని అసహనం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. సమావేశాలు ఘనంగా నిర్వహించడం, హామీలు పొందడం, ప్రకటనలు చేయడంతో అంతా అయిపోయినట్టు రాయాలని చంద్రబాబునాయుడుగారి అభిమతం. వాగ్దానాలే కానీ వాస్తవంలో ఏమీ జరగడం లేదనే పచ్చి నిజం రాసిన  వారినీ, అన్నవారినీ అభివృద్ధి నిరోధకులంటూ దుయ్యబడుతున్నారు. జరగని అభివృద్ధి జరిగినట్టు రాయాలనీ, రాని పెట్టుబడులు వచ్చినట్టు రాయాలనీ కోరిక. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు వరదలా వచ్చినట్టు రాయా లని ఆపేక్ష. ఓఎన్‌జీసీ, హెచ్‌ïపీసీఎల్‌ ప్రతిపాదనలు పాతవే. కొత్తగా ఎంఓయూలు కుదుర్చుకున్నవారిలో ప్రభుత్వం కేటాయించిన భూములను దఖలు పరుచు కోవాలనే ప్రయత్నిస్తున్నవారు ఉన్నారు.


కొత్తవారు వస్తారో రారో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌ తమకు ప్రత్యేక రాష్ట్రం అంటూ మురిపించిన వెంకయ్య నాయుడు కానీ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదంటూ అభినందించిన అరుణ్‌ జైట్లీ కానీ పరిశ్రమలు పెడితే ఫలానా రాయితీలు ఇస్తామంటూ స్పష్టంగా చెప్పలేదు. తియ్యటి మాటలతో కడుపు నింపాలనే ప్రయత్నమే కానీ ఆచరణలో అడుగు ముందుకు కదలడం లేదు. సదస్సులు నిర్వహించడమే ఘన కార్యం అనుకుంటే అది వేరే సంగతి. ఇదే మాట అంటే ప్రతిపక్షాలనూ, మీడియా ప్రతినిధులనూ దబాయించడం, గద్దించడం, నిందించడం, పోలీసు లను ప్రయోగించడం, నిర్బంధించడం అలవాటయింది. విశాఖ విమానా శ్రయం రన్‌వేలో బైఠాయించిన ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిపై ధ్వజమెత్తే ముందు ఔరంగాబాద్‌లో చంద్రబాబునాయుడితో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తు తెచ్చుకోవాలి.



జల్లికట్టు స్ఫూర్తి

ఇటీవల తమిళనాడులో జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేయా లంటూ రైల్‌రోకో సహా అనేక రకాలుగా ఉద్యమం చేసిన డీఎంకే నాయకుడు స్టాలిన్‌ను కానీ ఇతర ప్రతిపక్ష నాయకులను కానీ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం పల్లెత్తు మాట అనలేదు. జల్లికట్టు నిషేధంపైన ప్రజాగ్రహాన్ని చూపించి ప్రధానిని ఆర్ఢినెన్స్‌కు ఒప్పించారు. చంద్రబాబునాయుడు పన్నీర్‌ సెల్వంను ఆదర్శంగా తీసుకుంటే బాగుండేది. ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని పార్టీలనూ కలుపుకొని ఉద్యమం చేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలంటూ మోసపూరిత పిడివాదాన్ని కట్టిపెట్టి రాష్ట్ర ప్రజలలో ప్రత్యేక హోదా కోసం రగులుతున్న ఉద్యమస్ఫూర్తిని వివరించి ప్రధానిని ఒప్పించడానికి ప్రయత్నిస్తే ముఖ్యమంత్రిని అభినందించే అవకాశం ఉండేది.


ప్రజలు మెచ్చే దారిలో పోకుండా అడ్డదారులు తొక్కి కల్లబొల్లి మాటలతో ప్రజలను వంచిస్తున్నారు కనుకనే తప్పుపట్టవలసి వస్తున్నది. ప్రజా వంచనకు వంతపాడుతున్న వెంకయ్యనాయుడూ, కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా చరిత్రకూ, ప్రజలకూ సమాధానం చెప్పవలసి ఉంటుంది. కేవలం పోల వరం కాంట్రాక్టుల కోసమో, సింగపూర్‌ కంపెనీలతో వ్యవహారం చేయడానికి కేంద్రం అభ్యంతరం చెప్పకుండా ఉండటం కోసమో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం ముమ్మాటికి రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే. 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లును రాజ్యసభ ఆమోదించిన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని బుట్టదాఖలు చేసినవారికి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందంటూ యూపీఏ ప్రభుత్వాన్నీ, కాంగ్రెస్‌ పార్టీనీ విమర్శించే నైతిక హక్కు ఉంటుందా?




ప్రజలు అవివేకులు కారు. పాలకుల వింత చేష్టలకూ, అహంకారపూరిత వైఖరికీ వెంటనే స్పందించి నిరసన తెలపక పోవచ్చు. ఆత్యయిక పరిస్థితిలో సైతం నిరసన ప్రదర్శనలు లేవు. సమయం వచ్చినప్పుడు ఇందిరాగాంధీ వంటి నేతనే చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత ఆత్యయిక పరి స్థితి ఉంది. వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం, ఇతర ప్రతిపక్షాలపైన నిర్బంధం సాగు తోంది. కాపు రిజర్వేషన్లకోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంపైన పోలీసు జులుం కొనసాగుతోంది. ప్రజాస్వామ్య సంస్థలనూ, ధోరణులనూ అణచివేసే రాజ్యాన్ని ప్రజలు హర్షించరు. ప్రతిఘటిస్తారు. ప్రజలతో సంబంధం లేకుండా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ... అభ్యంతరం చెప్పినవారిని శత్రువు లుగా పరిగణిస్తూ నియంతలాగా వ్యవహరించేవారిని ప్రజలు శిక్షించి తీరుతారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. వినిపించుకోకపోతే పాలకుల ఖర్మం.





కె. రామచంద్రమూర్తి

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top