కులాల కురుక్షేత్రం యూపీ

కులాల కురుక్షేత్రం యూపీ - Sakshi


త్రికాలమ్‌

సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బ్యా(ఓ)టింగ్‌ మొదలయింది. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్‌ జరిగిన శనివారంనాడే ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 11న ప్రథమ ఘట్టం ఓటింగ్‌ జరగబోయే పశ్చిమోత్తరప్రదేశ్‌లో బీజేపీ బలమైన శక్తి. ఆగ్రా నుంచి మథుర వరకూ, ఘజియాబాద్‌ నుంచి మీరట్, ముజఫర్‌నగర్‌ వరకూ ఆ పార్టీకి జనాదరణ విశేషంగా ఉంది. చరణ్‌సింగ్‌ కుమారుడు అజిత్‌సింగ్‌ నాయ కత్వంలోని రాష్ట్రీయలోక్‌దళ్‌ (ఆరెల్డీ) అభ్యర్థులు లేకపోతే జాట్, క్షత్రియ ఓట్లలో అధికభాగం బీజేపీకే పడేవి. 2014లో ఆరెల్డీని వదిలి వెళ్ళిన జాట్‌లు ఆ పార్టీకి తిరిగి వస్తున్నారు.



వడ్డీ సహితంగా రైతుల రుణాలు సంపూర్ణంగా మాఫ్‌ చేస్తామని పరివర్తన సభలో నరేంద్రమోదీ ప్రకటించారు. తమ పార్టీ స్కాంకు వ్యతిరేకంగా పోరాటం నిరవధికంగా సాగిస్తుందని చెబుతూ, ఇంగ్లీషు మాట స్కాంలోని అక్షరాలలో ‘ఎస్‌’ అంటే సమాజ్‌వాదీ అనీ, ‘సి’ అంటే కాంగ్రెస్‌ అనీ, ‘ఏ’ అంటే అఖిలేశ్‌ అనీ ‘ఎం’ అంటే మాయావతి అనీ అభివర్ణించారు. పశ్చిమంలోనే కాదు మొత్తం ఉత్తరప్రదేశ్‌లో మోదీకి జనాకర్షణశక్తి ఏ మాత్రం తగ్గలేదు. 2014లో మొత్తం 80 స్థానాలలో 71 స్థానాలు గెలుచుకున్నప్పటి ప్రాబల్యం చెక్కుచెదరలేదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత ఉన్నప్పటికీ మోదీకి ప్రతికూలంగా మారలేదు. ప్రస్తుతానికి అత్యంత జనప్రియనేత మోదీనే. ఈ విశ్వాసం మితిమీరితే అల సత్వం పెరిగి బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉంది.



యూపీలో సాగుతున్న సం‘కుల’ సమరంలో ప్రధాన పార్టీలన్నీ కులాల లెక్కల ప్రకారమే అభ్యర్థులను నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా అన్ని  రాష్ట్రాల లోనూ జరుగుతున్న తంతు ఇదే. ముఖ్యంగా యూపీలో ఎన్నికలంటే కులాలు, మతాల మధ్య కుమ్ములాటే. ఏ రెండు ప్రధాన కులాలు లేక వర్గాలు ఒక్కటైనా గెలుపు ఖాయం. రాష్ట్ర జనాభాలో 19 శాతం ఉన్న ముస్లింలు, 20.5 శాతం ఉన్న దళితులూ, 40 శాతానికి పైగా ఉన్న ఓబీసీలూ, 12 శాతం ఉన్న బ్రాహ్మణులూ పార్టీల జయాపజయాలను నిర్ణయించే కీలక స్థితిలో ఉన్నారు.  2012లో యాదవులూ, ముస్లింలూ ఒక్క తాటిపైకి వచ్చి సమాజ్‌వాదీ పార్టీకి మొత్తం 403 స్థానాలలో 224 స్థానాలు సాధించిపెట్టారు.


తిరిగి అదే సమీకరణ సాధించడం కోసమే ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భుజం కలిపారు. ముస్లిం ఓట్లు చీలకుండా ఉండాలంటే సమా జ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు అత్యవసరమని భావించి అందుకు అనుగుణంగా పావులు కదిపిన రణకౌశలం యువ ముఖ్యమంత్రిది. ఇందుకోసం తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌నీ, బాబాయ్‌ శివపాల్‌ యాద వ్‌నూ ఎదిరించి పోరాడిన రాజకీయ చతురుడు. వ్యూహం ఫలిస్తుందో లేదో తెలియదు కానీ అఖిలేశ్‌ చేసింది మంచి ప్రయత్నం. రెండోసారి గెలిచి యూపీలో చరిత్ర సృష్టించాలంటే ఇది ఒక్కటే మార్గం. కాంగ్రెస్‌తో పొత్తు వద్దేవద్దంటున్న నేతాజీ ములాయం మాటకు అఖిలేశ్‌ కట్టుబడి ఉన్నట్లయితే నిస్సందేహంగా మాయావతికి విజయం చేకూరేది. కాంగ్రెస్‌–ఎస్‌పీ కూటమి బీజేపీని నిలువ రించే అవకాశం ఉన్నదని ముస్లింలు భావిస్తున్నారు కనుక ఎస్‌పీతోనే వారు కొన సాగుతున్నట్టు కనిపిస్తున్నారు.



మాయావతి వ్యూహం

దళిత ఓట్లకు ముస్లిం ఓట్లు తోడయితే అయిదోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని లెక్కలేసుకున్న మాయావతి ముస్లిం అభ్యర్థులను 97 నియోజక వర్గా  లలో నిలబెట్టారు.  ముస్లింలు ఎటువైపు మొగ్గు చూపితే విజయం అటువైపే. ముస్లింలు మూకుమ్మడిగా ఓట్లు వేయరనీ, బీజేపీ అభ్యర్థిని ఏ పార్టీ అభ్యర్థి ఓడించగలరని స్థానిక ముస్లింలు భావిస్తారో ఆ అభ్యర్థికే వారు ఓటు వేస్తారనీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ముజఫర్‌నగర్, సహ్రాన్‌పూర్‌ మత కల హాలు ముస్లింలపై ప్రభావం చూపించాయి. ముస్లిం అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ముస్లిం అభ్యర్థులు కాకపోయినా బీజేపీని ఓడించే శక్తి కలిగిన వారికి ఓటు వేస్తారు పార్టీతో నిమిత్తం లేకుండా. ఉదాహరణకు మీరట్‌ జిల్లా సర్దానా నియోజకవర్గంలో నేను గతవారం పర్యటించినప్పుడు బీఎస్‌పీ అభ్యర్థి ఇమ్రాన్‌ ఖురేషీతో మాట్లాడాను. అక్కడ బీజేపీ అభ్యర్థి సందీప్‌ సోమ్‌. ముజఫర్‌నగర్‌ మతకలహాల కేసులో నిందితుడు. ఎస్‌పీ, ఆరెల్డీ అభ్యర్థులు ఉన్నప్పటికీ ఒకే ఒక ముస్లిం అభ్యర్థి ఇమ్రాన్‌. ముస్లింలూ, దళితులూ కలిసి ఆయనను గెలిపించే అవకాశం ఉంది. అలీగఢ్‌లో ముస్లింలూ, యాదవులూ కలిసి ఎస్‌పీ అభ్యర్థిని విజయపథంలో నడిపిస్తారు.




తమ పార్టీ విభిన్నమైనదనీ, విలక్షణమైనదనీ బీజేపీ నాయకులు చెప్పుకుం టారు. కాంగ్రెస్‌ నెహ్రూ–గాంధీ కుటుంబానికి విధేయమైన పార్టీ. ఎస్‌పీ ములా యంసింగ్‌ పరివారానికి పెద్దపీట వేస్తుంది. మాయావతి నియంతలాగా బీఎస్‌ పీని నడుపుతారు. కానీ తమది కార్యకర్తల ప్రతిభాపాటవాలను గుర్తించి వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే పార్టీ అని ఇంతవరకూ బీజేపీ నేతలు చెప్పు కొచ్చారు. కాలక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అవలక్షణాలు బీజేపీకి అంటుకున్నాయి. సోదరీసోదరులకూ, పిల్లలకూ టిక్కట్లు ఇవ్వాలంటూ ఇబ్బంది పెట్టవద్దని నరేంద్రమోదీ ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సహచరులకు విజ్ఞప్తి చేశారు.


పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రధాని మనోగతానికి భిన్నంగా చాలా మంది వరిష్ఠ నేతల బంధుమిత్రులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చారు. బాబ్రీని కూల్చిన ప్పుడు యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్‌సింగ్‌ ఇప్పుడు స్వయంగా గవర్నర్‌. ఆయన కుమారుడు పార్లమెంటు సభ్యుడు. కల్యాణ్‌సింగ్‌ మనవడికి పార్టీ టిక్కెట్టు ఇచ్చారు. దేశీయాంగమంత్రి రాజనాథ్‌సింగ్‌ కొడుకు పంకజ్‌కు పార్టీ టిక్కెట్టు ఇవ్వడం కోసం నాయిడాలో ప్రస్తుతం ఎంఎల్‌ఏగా ఉన్న విమలా బాతమ్‌కు మొండిచేయి చూపించారు. రాజనాథ్‌సింగ్‌ బంధువు నారాయణ్‌ సింగ్‌ రాణేకు ఉత్తరాఖండ్‌లో పార్టీ టిక్కెట్టు లభించింది.


లలిత్‌ టాండన్‌ కుమా రుడు గోపాల్‌ టాండన్, బ్రహ్మదత్‌ ద్వివేదీ తనయుడు సునీల్‌దత్‌ ద్వివేదీ, బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ కుమారుడు ప్రతీక్‌శరణ్‌ సింగ్‌ తదితరులు మోదీ అభి మతానికి విరుద్ధంగా టిక్కెట్లు సంపాదించుకున్నారు. పక్కనే ఉత్తరాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ కుమారుడు సౌరభ్, మరో మాజీ ముఖ్యమంత్రి  బీసీ ఖండూరీ కుమార్తె రీటా పార్టీ అభ్యర్థులు. ఇది ఒక్కటే కాదు. సోషలిస్టు విధానాలను తూర్పారబట్టే బీజేపీ ఎన్నికలు లేని సమయంలో సబ్సి డీలకూ, రుణాల రద్దుకు వ్యతిరేకం అంటూ చాటుకుంటుంది. ఎన్నికల ప్రణాళి కలలో మాత్రం రైతు రుణాలు మాఫ్‌ చేస్తామంటూ గెలుపు మంత్రం వల్లిస్తుంది. ఆర్థిక విధానాలలో సైతం బీజేపీ విశిష్టత మిగలలేదు.



అమిత్‌షా కసరత్తు

అమిత్‌ షా అమితమైన తెలివితేటల వల్ల పార్టీ రెండిందాల చెడిన రేవడి చందంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కులాల చిత్రికబట్టి చక్రం తిప్పాలని ఆయన ఆకాంక్ష. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలలో మొదట అగ్రవర్ణాల ఆధిక్యం ఉండేది. అడ్వాణీ రథయాత్ర సాగినప్పుడు యాదవేతర బీసీలు ఆ  పార్టీని ఆదరించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, తదితర అగ్రకులాలవారు జనాభాలో దాదాపు 25 శాతం. బాబ్రీమసీదు పతనం తర్వాత బీజేపీ క్రమంగా అగ్రవర్ణాలకు దూర మైంది. బీసీలు కూడా పునరాలోచనలో పడ్డారు. అగ్రవర్ణాలు తమను అంటి పెట్టుకునే ఉంటాయన్న భరోసాతో అమిత్‌ షా యాదవేతర బీసీలనూ, జాతవే తర దళితులనూ దువ్వసాగారు.


ఓబీసీలవైపు మొగ్గు పెరిగి అగ్రవర్ణాలు ఆగ్ర హించే పరిస్థితి వచ్చింది. ఓబీసీల మనసులను గెలుచుకునే లక్ష్యంతోనే ఆ వర్గానికి చెందిన ఫుల్పూర్‌ లోక్‌సభ సభ్యుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడిగా నియమించారు. తూర్పు యూపీలో అగ్రవర్ణాలకు జెల్లకొట్టి బీసీలకు జైకొట్టడంతో అగ్రవర్ణ నాయకులు కొందరు పార్టీ నుంచి వైదొలిగారు. అస్సాంలో అరువు తెచ్చుకున్న నాయకులతో ఎన్నికలలో గెలిచినట్టే యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలోనూ అదే వ్యూహంతో విజయం సాధించాలని ప్రయత్నం. గత ఐదేళ్ళలో బీజేపీలో చేరినవారికి పెద్దపీట వెయ్యడం పార్టీ విధే యులకు మనస్తాపం కలిగించింది. దాదాపు 140 స్థానాలు ఫిరాయింపుదారు లకే కేటాయించడం విశేషం. ఇక బీజేపీ ప్రత్యేకత ఎక్కడ మిగిలింది? ఓబీసీల మద్దతు లభిస్తుందో లేదో తెలియదు కానీ అగ్రవర్ణాల అండదండలు మాత్రం బీజేపీకి మునపటివలె ఉండకపోవచ్చునని పరిశీలకులు అంటున్నారు.



తేలని బీజేపీ సీఎం అభ్యర్థి

ఎస్‌పీ, బీఎస్‌పీలలో ఏ పార్టీ విజయం సాధించినా ముఖ్యమంత్రి ఎవరో తెలుసు. బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మౌర్య ముఖ్య మంత్రి అవుతారని ఇప్పుడు ప్రకటిస్తే అగ్రవర్ణాలకు చెందిన నాయకులూ, కార్యకర్తలూ చురుగ్గా పనిచేయరని భయం. మోదీని చూసి ఓటు వేయాలని బీజేపీ ప్రజలను కోరుతోంది. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదనే ఆగ్రహంతో గోరఖ్‌పూర్‌ పార్లమెంట్‌  సభ్యుడు మహంత్‌ యోగి ఆదిత్యనాథ్‌ తిరుగుబాటు చేసి పశ్చిమోత్తరప్రదేశ్‌లో పోటీ అభ్యర్థులను నిలిపారు. బీజేపీకి తిరుగుబాట్ల బెడద ఉంది. ఎస్‌పీకి ములాయం, శివపాల్‌ యాదవ్‌ల అలక వల్ల ఎంతోకొంత నష్టం జరుగుతుంది. మాయావతికి అసమ్మతి సెగ లేదు. ఆమె ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. బూత్‌ స్థాయి వరకూ కమిటీలను నియమించి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేశారు. కాంగ్రెస్‌ పార్టీతో బీఎస్‌పీ పొత్తు పెట్టుకొని ఉంటే గెలుపు ఆ కూటమిదే.


2019లో ఉపప్రధాని పదవి ఇస్తామనీ, పొత్తుకు అంగీకరించాలనీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం కబురు పెడితే మాయావతి ససేమిరా అన్నట్టు భోగట్టా. లక్నోలోనూ, ఆగ్రాలోనూ అఖిలేశ్, రాహుల్‌ ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు మంచి స్పందన కనిపించింది. ‘ఖాట్‌ పే చర్చా’, రైతులను పలకరించే యాత్ర విఫలమైన తర్వాత యూపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయరాదని రాహుల్‌గాంధీ తీసుకున్న సముచితమైన నిర్ణయం కారణంగా ఎస్‌పీతో పొత్తు సాధ్యమైంది. అఖిలేశ్‌తో మైత్రి ఫలితంగానేlఅతనికోసం వచ్చిన పెద్ద జనసమూహాలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రాహుల్‌కి దక్కింది.


ఒంటరి పోరాటమైతే 2012లో వచ్చిన 28 సీట్లను నిలబెట్టుకోవడమే కాంగ్రెస్‌కు కష్టమయ్యేది. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కూడా 47 స్థానాలు మాత్రమే దక్కాయి. కానీ 2014 సార్వ త్రిక ఎన్నికలలో మోదీ ప్రభంజనం కారణంగా బీజేపీ స్థాయి అమాంతంగా పెరిగింది. అయిదేళ్ళ  కిందట బీఎస్‌పీ 80 స్థానాలు కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత రెండేళ్ళలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాదనీ, అప్పుడు యూపీ నుంచి 50 స్థానాలైనా గెలుచుకుంటే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రి కావచ్చుననే ఉద్దేశంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ కుమారుడు అఖిలేశ్‌ను గద్దె మీద కూర్చోబెట్టారు. ఏకులా వచ్చిన కొడుకు మేకు అవుతాడని ములాయం ఊహించి ఉండరు. 2014లో మోదీ పిడుగులాగా వచ్చి నెత్తిమీద పడతారని మాత్రం ఎవరు ఊహించారు?



యూపీలో జరుగుతున్నది త్రిముఖ పోటీ. ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పుడే చెప్పడం ఎవ్వరి తరం కాదు. ఎవరికి ఓటేసేదీ చెప్పమని అడిగితే గ్రామీణులు సైతం గుంభనంగా న వ్వుతారే కానీ మనసూ, నోరూ విప్పరు. అతిపెద్ద పక్షంగా ఏదో ఒక పార్టీ లేదా కూటమి వస్తుందన్న ఊహాగానాలు సైతం పూర్వపక్షం కావచ్చు. దేశప్రజలు ఎన్నికలలో స్పష్టమైన తీర్పు ఇవ్వడం అలవాటు చేసు కున్నారు. అదే ఆనవాయితీ పంజాబ్, గోవా, యూపీ, ఉత్తరాఖండ్‌లలోనూ కొన సాగుతుందని అంచనా.





- కె. రామచంద్రమూర్తి

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top