రాజ్‌నాథ్‌సింగ్‌ రాయని డైరీ

రాజ్‌నాథ్‌సింగ్‌ రాయని డైరీ - Sakshi


‘‘గాంధీజీ అంటే మీకు గౌరవం లేదా’’ అని చంపారన్‌ నుంచి వచ్చిన ఒక సీనియర్‌ సిటిజన్‌ ఈ ఉదయం నన్ను పట్టుకుని అడిగాడు! చూడ్డానికి ఆయన అచ్చు గాంధీజీలా ఉన్నారు. చేతిలో కర్ర లేదు. కళ్లకు గుండ్రటి ఫ్రేమ్‌ ఉన్న అద్దాలు లేవు. ఇంకో చేతిలో పుస్తకమూ లేదు. అయినా గాంధీజీలానే ఉన్నారు.



ఆయన అడిగిన ప్రశ్నను బట్టి, ముఖ్యమైన పనేమీ లేకుండానే ఆయన నన్ను కలవడానికి వచ్చినట్లు అనిపించింది. అంత ముఖ్యం అయి ఉంటే, నేనే అతడి దగ్గరికి ఢిల్లీ నుంచి చంపారన్‌ వెళ్లి ఉండేవాడిని! చంపారన్‌ బిహార్‌లో ఉంటుంది. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ ఉంటాడు. బిహార్‌లోనే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ఉంటాడు. వాళ్లిద్దరూ అక్కడ ఉన్నా సరే, ఈ పెద్దాయన కోసం అక్కడికి వెళ్లి ఉండేవాడిని. వెళ్లి, సమస్య ఏమిటని అడిగి ఉండేవాడిని. ఎంతైనా ఈ బిహారీ గాంధీజీకి కూడా నేను హోమ్‌ మినిస్టర్‌నే కదా.



హోమ్‌ మినిస్టర్‌ ఏ స్టేట్‌కి అయినా వెళ్లొచ్చు. అక్కడ బీజేపీ ప్రభుత్వం లేకపోవచ్చు. అయినా వెళ్లొచ్చు. అక్కడ నితీశ్, లాలూ ఉండొచ్చు. అయినా వెళ్లొచ్చు. ముఖం చూడ్డం ఇష్టం లేక వెళ్లడం మానేస్తే, మనం చూడాలనుకున్న ముఖాలను చూడలేం. మనల్ని చూడాలనుకున్నవాళ్లకూ ముఖం చూపించలేం.



‘‘పెద్దాయనా.. ముందు మీరు కూర్చోండి. మీకు ఏ విధంగానైనా సహాయపడ గలగడం కోసమే కదా మేమంతా  ఇక్కడ.. ఈ ఢిల్లీలో సిద్ధంగా ఉన్నాం’’ అన్నాను. ఆయన కూర్చోలేదు! ‘‘నాకు సహాయం వద్దు. సమాధానం కావాలి’’ అన్నారు.‘‘చెప్తాను కూర్చోండి’’ అన్నాను. ‘‘చెప్పండి. కూర్చుంటాను’’ అన్నారు. గాంధీజీ కంటే మొండివాడిలా ఉన్నాడు. ‘‘గాంధీజీ అంటే మీకు గౌరవం లేదా?’’ అని మళ్లీ అడిగాడు. ‘‘ఉంది పెద్దాయనా.. గాంధీజీపై గౌరవం ఉంది. గాంధీజీ సత్యాగ్రహం చేసిన చంపారన్‌పై గౌరవం ఉంది. చంపారన్‌లో ఉంటున్న మీపైనా గౌరవం ఉంది’’ అన్నాను.




‘‘మరి చంపారన్‌లో వందేళ్ల సత్యాగ్రహ సభ జరుగుతుంటే.. ఆ సభకు మీరెందుకు రాలేకపోయారు?’’ అని ప్రశ్నించాడు పెద్దాయన. ‘‘రాలేకపోవడం.. గౌరవం లేకపోవడం రెండూ ఒకటేనా పెద్దాయనా’’ అని అడిగాను. ‘‘రాజ్‌నాథ్‌జీ.. మీకోసం ఎల్తైన వేదికపైన కుర్చీ వేశారు. ఆ కుర్చీపైన అందరికీ కనిపించేలా మీ పేరు కూడా రాశారు. లాలూజీ ఏమన్నారో తెలుసా? గాంధీజీకి పూలదండ వేసిన చేత్తోనే మీరు గాడ్సేకీ వేస్తారని, అలాంటి మనిషి సత్యాగ్రహ సభకు ఎందుకు వస్తారనీ! ఆ మాట నిజమేనా రాజ్‌నాథ్‌జీ.. చెప్పండి’’ అన్నారు. ఏం చెప్పను?! ‘‘ఆగ్రహాన్ని నా దగ్గర వదిలేసి, లాలూజీ కనిపెట్టిన సత్యాన్ని తిరిగి మీతోనే చంపారన్‌ మోసుకెళ్లండి పెద్దాయనా’’ అని చెప్పాను.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top