డిజిటల్‌ కోటలో ప్లాస్టిక్‌ పాగా

డిజిటల్‌ కోటలో ప్లాస్టిక్‌ పాగా - Sakshi


రెండో మాట

ప్లాస్టిక్‌ కరెన్సీ రంగంలోకి వచ్చినంత మాత్రాన అవినీతికి కళ్లెం పడుతుందనీ, దొంగ ప్లాస్టిక్‌ నోట్లు ఆర్థిక వ్యవస్థలోకి రాజాలవనీ తీర్మానించుకోరాదు. ఇందుకు ఉదాహరణ–అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ అనేక సంవత్సరాలుగా ఆదాయపు పన్ను శాఖ కన్నుకప్పి అమెరికా ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడిచానని ఒప్పుకోవటం. ఇలాంటి ఒప్పుకోళ్లు రహస్య రాజకీ యాలకు అలవాటుపడిన బీజేపీకి పడవు. కానీ నేటి ప్లాస్టిక్‌ కరెన్సీ ఉత్పత్తికి దాని పునర్ము ద్రణకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుందని నిపుణులు నిర్ధారించారని మరవరాదు.



చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1,000 పెద్ద నోట్లను రద్దు చేసి; రూ. 2,000 నోటును ముద్రించడానికి తీసుకున్న నిర్ణయాన్ని ‘125 కోట్ల మంది భారతీయులు స్వాగతించా’రని ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించుకున్నారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని ఆయన ఈ ఎన్నికలలో తురుపు ముక్కగా ఉపయోగించుకున్నారు కూడా. ఇప్పుడు మరోసారి పేద, మధ్యతరగతి ప్రజలను మళ్లీ మభ్య పెట్టేందుకు మోదీ సరికొత్త ఎత్తుగడకు దిగుతున్నట్టు వార్త. రూ. 10 విలువగల ప్లాస్టిక్‌ (పోలి మర్‌) నోట్లను త్వరలో ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్‌ (17–3–17) ప్రకటించారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ఐదు నగరాలను ఎంపిక చేసి ప్రయోగాత్మ కంగా ఈ నోట్లను ప్రవేశపెడుతున్నట్టు కూడా ఆయన చెప్పారు. నోట్ల రద్దుతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇంకా తెరిపిన పడకముందే, ప్రజల మీద మరింత భారాన్ని మోపే తీరులో ప్లాస్టిక్‌ కరెన్సీ ముద్రణకు తొందరపడడం ఎంత వరకు సబబు?



చెట్టులెక్కగలవా.....?

ఈ అంశాన్ని చర్చించే ముందు బీజేపీ పరివార్‌ పాలనలో ఉన్న రాజస్తాన్‌లోని బాగోతం గురించి తెలుసుకోవాలి. అక్కడి బడుగు బలహీన వర్గాలు మారు మూల గ్రామాలలో అనుభవిస్తున్న కష్టాల గురించి ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక ప్రచురించిన వార్తా కథనం,‘ఓ చెట్టు కథ’ వెనుక విషాదాన్ని గమ నించాలి. రేషన్‌ సరుకుల కోసం ప్రజలను చెట్లెక్కించే మన పాలకులకు ఇంగిత జ్ఞానం (కామన్‌సెన్స్‌) ఉందా అని ప్రశ్నించిన కథనమది.

‘‘ఇక్కడ రేషన్‌ సరుకు తీసుకోవాలంటే ఓ చెట్టు ఎక్కాలి. ఓ కొమ్మ మీద కూర్చోవాలి. మీ వంతు రాగానే వేలిముద్ర వేయాలి. తరువాత ఓ చిట్టీ ఇస్తారు. అది తీసుకుని జాగ్రత్తగా చెట్టు మీద నుంచి దిగాలి. ఆపై మరో చిట్టీ ఇస్తారు.

‘‘చెట్టెక్కాలంటే భయమా? మీరు వృద్ధులా? వికలాంగులా? అయ్యో! మీరింకా చెట్టెక్కడం నేర్వలేదా?

‘‘అయితే మీకు రేషన్‌ లేదు. పరేషాన్‌ లేదు పో!

‘‘ఇలాంటి పరిస్థితి ఎక్కడ? అనే కుతర్కాల జోలికి పోకండి! ఇలాంటి కామన్‌సెన్స్‌ లేని నిర్ణయాలను అమలు చేసేది కేవలం ఇండియాలోనే. చేతిలో ఒక కొత్తనోటు కూడా లేకుండా 56 శాతం పాత నోట్లను రద్దుచేసి పారెయ్‌ లేదా మనం!

‘ఇది కొట్రా అనే ప్రాంతం–ఉదయ్‌పూర్‌కి కొంచెం దూరంలోనే ఉంటుం దిలెండి. ఇప్పుడక్కడ చాలా గ్రామాలలో అకస్మాత్తుగా జనం చెట్లెక్కడం నేర్చుకుంటున్నారు, అర్జెంటుగా. ఎందుకంటే చెట్లెక్కి కూర్చుంటే, ఆపైన ఉన్న చిటారుకొమ్మ దగ్గర రేషన్‌ డీలర్‌ ఉంటాడు. ఈ దృశ్యం మీ దృష్టికి ఎందుకొచ్చిందీ అంటే......?



‘మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం డిజిటలైజ్‌ చేసింది. ఈ ప్రాంతంలో 76 రేషన్‌ దుకాణాలు ఉంటే, వాటిలో 13 దుకాణాల పరిధిలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ నికృష్టంగా ఉంది. మరేం చేయాలి? మనం ఇప్పటికీ ఫోన్‌ సిగ్నల్‌ అందకపోతే ఏ భవంతి పైకో, ఆరుబయటకో వచ్చి మాట్లాడు కుంటాం కదా! అలా అక్కడ కాస్త కనెక్టివిటీ కోసం చెట్లెక్కి పీఎస్‌ఓ యంత్రం పెట్టుకున్నారు. ఇక అక్కడి ఊళ్లు–మెర్పార్, బిబర్‌వాడీ, మాల్వియా, కాకర్యా, పీస్లా, భూరిదుద్వార్, బీరకు, పాల్చా, ఉమర్యా, సామ్దీ–ఇలా. అన్ని చోట్లా ఇదే దుస్థితి. కాస్త కనెక్టివిటీ దొరికేదాకా ఆగడం, లేదా అక్కడే ఏ కొమ్మ మీదనో నిరీక్షిస్తూ గడపడం. ఇంకా చెప్పాలా? ఆ ఏరియాలో ఇప్పటికీ విద్యుత్‌ కనెక్షన్‌లు లేని ఇళ్లున్నాయి. చాలా చోట్ల రోడ్లు కూడా లేవు. కడుపు నొచ్చినా, కాళ్లు నొచ్చినా మందు గోలీయే దొరకదు. ఇక చదువుకోవాలంటే మైళ్ల కొద్దీ నడవాలి. వయసులో ఉన్నవాళ్లంతా  దూరంగా బతుకుతున్నారు. ఆ ఊళ్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు కనిపిస్తుంటారు. అలాంటి చోట కూడా ఇంటర్నెట్‌ ఆధారిత రేషన్‌ను నిర్బంధంగా అమలు చేయవలసిన అవసరం ఉందా? అందుకే మొదట మన పాలకులకు కామన్‌సెన్స్‌ ఉండదని చెప్పేది.

‘‘ఇక రాబోయే కాలంలో చూడండి! నగదు రహిత అనే ఓ పిచ్చి నినాదం సరిగా ఈ తరహాలోనే ఆవాసాల్లో మరిన్ని కష్టాలకు ఎలా కారణం కాబోతున్నదో! గుట్టలూ, అడవులూ అధికంగా ఉండే ప్రాంతాలలో డిజిటల్‌ కరెన్సీ అనేది తుగ్లక్‌ చర్యలా ఎలా పరిణమించబోతున్నదో! ’’



ఇదా సమయం?

స్థూలంగా నోట్ల రద్దు తరువాత ప్రజా బాహుళ్యానికి (సంపన్న వర్గాలు, వారి అనుయాయులు, కోటీశ్వరులు, బడా కార్పొరేటర్లు గుట్టుగా నల్లధ నాన్ని, పాత కరెన్సీ రూపంలో కొత్త కరెన్సీని కనుమరుగు చేసుకున్న తర్వాత) మిగిలింది హళ్లికి హళ్లి, సున్నకు సున్న. పైపెచ్చు బ్యాంకులు, ఏటీఎంల ఎదుట ‘నో క్యాష్‌’ బోర్డులు ఇప్పటికీ ఖాతాదార్లను వెక్కిరిస్తూనే ఉన్నాయి. బ్యాంకులకు రూ. 2 వేల కరెన్సీ నోట్లు తిరిగి రాలేదు. నెల రోజులుగా ఆర్బీఐ నుంచి నగదు పంపిణీ బంద్‌ అయింది. లావాదేవీల నిర్వహణకు క్యాష్‌ చాలని ఈ తరుణంలో పాలకులకు పుట్టుకొచ్చిన లేదా ఎరువు తెచ్చుకున్న ఆలోచన ప్లాస్టిక్‌ (పోలిమార్‌) కరెన్సీ. ప్రపంచంలోని 200 దేశాల్లో కేవలం 20 దేశాలు ప్రవేశపెట్టి, ఖర్చులు తడిసి మోపెడైన ప్లాస్టిక్‌ కరెన్సీ ఇది. అందుకే కొన్ని దేశాలు వెనుకడుగు వేశాయి (ఉదా. కెన్యా. మొదటిసారిగా కెనడా, ఆస్ట్రేలియాల తర్వాత ఈ కరెన్సీని ప్రవేశపెట్టి క్రమంగా ఉపసంహరించు కుంది). పత్తి ఆధారిత నారపీచు సాయంతో తయారయ్యే కాగితపు (పేపర్‌) కరెన్సీ కన్నా ప్లాస్టిక్‌ కరెన్సీ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని మంత్రి మేఘావాల్‌ చెబుతున్నారు. కానీ పేపర్‌ కరెన్సీ మాదిరిగా మడతపెట్టి జేబులో పెట్టుకోడానికి వీలుగా ఉండదు ప్లాస్టిక్‌ కరెన్సీ. ఇది మృదువుగా, మడతకు వీలుగా ఉండదు గనుక మామూలు పర్సు (వాలెట్‌) లాభం లేదని నిపుణుల అంచనా.



నోట్ల రద్దు తరువాత రూ. 2 వేలు, రూ. 500 నోట్లను అనవసరంగా ముద్రించడానికే రూ. 20,000 కోట్లను ముద్రణాలయాలపైనే వెచ్చించాల్సి వచ్చిందని తెలుస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌లు అమెరికా ఆర్థిక సంక్షోభ నివారణలో భాగంగా ప్రపంచ దేశాలపై రుద్దిన ఆర్థిక సంస్కరణ లలో పేపర్‌ కరెన్సీ స్థానే ప్లాస్టిక్‌ కరెన్సీని ప్రవేశపెట్టడం ఒక భాగమని మరచిపోరాదు. బడా అమెరికన్‌ మల్టీ నేషనల్‌ కార్పొరేట్‌ కంపెనీల లావాదే వీలకు అనుగుణంగానే ఈ ప్లాస్టిక్‌ కరెన్సీ ప్రయోగం ముందుకొచ్చింది. డిజిటల్‌ కరెన్సీలో లావాదేవీల కోసమని కరెన్సీ నోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లధనం (బ్లాక్‌మనీ) ఆగిపోలేదు. అంతేగాదు, దేశీయ సుప్రసిద్ధ ఆర్థికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్లు నోట్ల రద్దు అనాలోచితమైనదిగా ప్రకటించిన సమయంలోనే అమెరికన్‌ విదేశాంగ ప్రతినిధి మార్క్‌ టోనర్‌ ‘భారత ప్రభుత్వ చర్య బ్లాక్‌మనీని అరికట్టడానికి దోహదపడుతుంద’ని సమర్థించాడు. మోదీ చర్య యూపీ ఎన్నికలలో బీజేపీ ప్రచార లబ్ధి్ద కోసం ఉద్దేశించినదేగానీ బ్లాక్‌మనీని వెలికితీయడానికి గానీ, అవినీతిని అరికట్టడానికిగానీ దోహదపడలేదనీ, కనీసం బ్యాంకులకు బడా కార్పొరేట్లు (ఇవే ఎన్నికల్లో బీజేపీ సహా వివిధ రాజకీయ పార్టీలకు ప్రధాన పోషకులు) బకాయి పడిన రూ. 8 లక్షల కోట్ల రుణాలలో ఒక్క పైసా ఇంత వరకూ తిరిగి ప్రభుత్వం రాబట్టలేక పోయిందనీ రుజువైపోయింది. ప్లాస్టిక్‌ కరెన్సీ రంగంలోకి వచ్చినంత మాత్రాన అవినీతికి కళ్లెం పడుతుందనీ, దొంగ ప్లాస్టిక్‌ నోట్లు ఆర్థిక వ్యవస్థలోకి రాజాలవనీ తీర్మానించుకోరాదు. ఇందుకు ఉదాహరణ–అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ అనేక సంవత్సరాలుగా ఆదాయపు పన్ను శాఖ కన్నుకప్పి అమెరికా ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడిచానని ఒప్పు కోవటం. ఇలాంటి ఒప్పుకోళ్లు రహస్య రాజకీయాలకు అలవాటుపడిన బీజేపీకి పడవు.



ఆదరణ ఎందుకు లేదు?

ఈ సందర్భంగా ఇక్కడో ప్రశ్న సహజం–ప్లాస్టిక్‌ కరెన్సీ దీర్ఘకాలం మన్నికగా ఉండడం నిజమైతే, నకలు సృష్టించడం కష్టమన్న మాట కూడా నిజమే అయితే–చాలా ప్రపంచ దేశాలు పేపర్‌ కరెన్సీని వదిలి ప్లాస్టిక్‌ కరెన్సీకి ఎందుకు మళ్లడం లేదు? మొదటిసారిగా ఆస్ట్రేలియా 10 ఆస్ట్రేలియన్‌ డాలర్ల నోటును ప్లాస్టిక్‌ నగదుగా ప్రవేశపెట్టింది. ఉష్ణ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ చెక్కు చెదరదు, నీరు దాన్ని చెనకదు. కానీ ప్లాస్టిక్‌ నోట్లు ఒక దానికొకటి అతక్కు పోయి, పేపర్‌ కరెన్సీ మాదిరిగా వేగంగా లెక్కపెట్టడానికి వేళ్లకు చిక్కవు. పేపర్‌ కరెన్సీ ఉత్పత్తి కన్నా ప్లాస్టిక్‌ కరెన్సీ ఉత్పత్తి భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్లాస్టిక్‌ బ్యాంకు నోట్ల సైజు (నిడివి) పేపర్‌ నోట్ల సైజు కన్నా పొడుగు. కెనడా ప్లాస్టిక్‌ కరెన్సీకి భద్రతా ప్రమాణాలు పటిష్టమని భావిం చినా, దానికే నకిలీ దొంగనోట్లు బెడద తప్పలేదు. ప్రపంచంలో కేవలం 20 దేశాలే ప్లాస్టిక్‌ కరెన్సీని అమలులోకి లె చ్చాయి. పైగా అందులో ఆరు దేశాల ప్రభుత్వాలు మాత్రమే అన్నిరకాల డినామినేషన్లను ప్లాస్టిక్‌ కరెన్సీలోకి మార్చారు. ఏ విధంగా చూసినా ప్లాస్టిక్‌ కరెన్సీ కన్నా, పేపర్‌ కరెన్సీయే భద్రత గల కరెన్సీ అని, బ్రిటిష్‌ మ్యూజియం ద్రవ్య కరెన్సీ ప్రదర్శన విభాగానికి చెందిన క్యూరేటర్‌ హాకెన్‌హాల్‌ పేర్కొన్నాడు.



పెట్టుబడిదారీ వ్యవస్థ పుణ్యమే!

కరెన్సీ యుద్ధాలకు పెట్టుబడిదారీ వ్యవస్థ తెరతీసినది మొదలు సాధా రణ పేపర్‌ కరెన్సీల స్థానంలో ఆర్థిక సంక్షోభాలకు పరిష్కారం ముసుగులో ప్లాస్టిక్‌ కరెన్సీయేగాదు, ‘బిట్‌’ కాయిన్స్‌ లాంటి మోసపూరిత కరెన్సీ రంగంలోకి దిగుతూ ఉంది (ఇది ఉత్తరోత్తరా పరిశీలించదగిన ప్రత్యేక చర్చ). ధన వ్యాప్తిలో మారక మాధ్యమాలు అనాదిగా ఎన్ని రూపాంతరాలు పొందాయో తోలు నాణాల నుంచి టెంకాయ చిప్పలు, ముత్యపు చిప్పలు, శంఖు, అపురూప లోహాలు, పత్తి కాగితం నుంచి ఇటీవలి ప్లాస్టిక్‌ కరెన్సీ దాకా వచ్చిన పరిణామం రుజువు చేస్తుంది. కానీ నేటి ప్లాస్టిక్‌ కరెన్సీ ఉత్పత్తికి దాని పునర్ముద్రణకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుందని కరెన్సీ నిపుణులు నిర్ధారించారని మరవరాదు.





- ఏబీకే ప్రసాద్‌


సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top