పింఛన్‌ జీవన సమాచారమే!

పింఛన్‌ జీవన సమాచారమే!


విశ్లేషణ



తన కోసం జీవితపర్యంతం పనిచేసిన సహోద్యోగికి 12 ఏళ్లయినా ఒక సమాధానం చెప్పడానికి, ఒక సమాచారం ఇవ్వడానికి వెనుకాడే ప్రభుత్వ సంస్థ ఇక ప్రజలకు ఏం మేలు చేస్తుంది?



ఉద్యోగ విరమణ చేసిన వారి జీవనాధారం పింఛన్‌ మాత్రమే. పింఛను నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందంటే వారి జీవనం కష్టమవుతుందని అర్థం. ఆ బాధితులకు ఆర్టీఐ ఒక ఆశాకిరణం. పింఛను ఫిర్యాదులపై జాప్యాన్ని ఆర్టీఐ ద్వారా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దొరికితే చాలు ఏదో రాజ్యాన్ని జయించినట్టు ఇక ఏ పనిచేయనవసరం లేదన్నట్టు మన మధ్యతరగతి ప్రజలు వ్యవహరిస్తుంటారు. అహంభావం తలకెక్కుతుంది. సీనియర్‌గా తనతో పనిచేసిన పెద్దమనిషికి సంబంధించిన పింఛను నిర్ణయాల పట్ల నిర్లక్ష్యాలతో బాధిస్తుంటాడు, అడ్డం కులు పెడుతుంటాడు. తనూ ఏదో ఒక రోజు రిటైరయిపోయి పింఛను కోసం పడిగాపులు కాయవలసి ఉంటుందనీ, తన సహోద్యోగులూ రెడ్‌ టేప్‌తో ఏడిపిస్తారని ఊహించడు.



వైద్యనాథన్‌ రిటైరయిన ఉద్యోగి. తన పింఛను రివిజన్‌ చేయడంలో జరిగిన ఆలస్యంవల్ల తనకు రావలసినంత పింఛను రావడం లేదని అతని ఫిర్యాదు. సంబంధిత సమాచారం కోరాడు. 210 రోజుల సర్వీసును లెక్కలోకి తీసుకోలేదని, అందువల్ల కూడా పింఛను తగ్గిందని ఆరోపణ.



ఒక ఉత్తరం రాసినా అవుననో కాదనో జవాబు ఇవ్వడం అధికారుల బాధ్యత. ఆర్టీఐ కిందే అడగాల్సిన పని లేదు. విధినిర్వహణ చేయడంలో ఏమాత్రం శ్రద్ధ లేని అధికారుల వల్ల ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల ఇబ్బందులను ఉద్యోగుల అవసరాలను పట్టించుకోకుండా తయారైనాయి. తను కేవలం పింఛను ఆధారంగా జీవిస్తున్నానని, ఈ సమాచారం కోసం ఎక్కడినుంచో రావాలంటే చాలా ఖర్చవుతుందని, తన కూతురు ఢిల్లీలో ఉన్నప్పటికీ ఆమెకు తన అత్తమామలను బంధువులను చూసుకునే బాధ్యత ఉంటుందని, ఆమెకు తాను భారంగా మారలేనని, కనుక తాను వృద్ధాశ్రమంలో ఉండవలసి వస్తున్నదని, పింఛను తగినంత ఉంటే తాను ఆత్మగౌరవంతో జీవిస్తానని ఆ పెద్ద మనిషి వివరిం చాడు. తాను రిటైరయి ఇప్పటికి 12 సంవత్సరాలు గడిచిందని, తనను సహోద్యోగులే ఏడిపిస్తున్నారని ఆయన వాపోయాడు.



పింఛనే రిటైరయిన ఉద్యోగుల జీవితం. ఆ జీవితాధారం లేకపోతే జీవించడం సాధ్యం కాదు. కనుక పింఛనుకు సంబంధించిన సమాచారం వెంటనే ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైనా ఉంది. 30 రోజుల్లో ఇవ్వమని చట్టం చెప్పినా చేయకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యమే అవుతుంది. సుపరిపాలనలో ముఖ్యమైన అంశం పౌరులకు నిర్ణీత కాలవ్యవధిలోగా సమాచారం ఇవ్వడం లేదా సేవలు అందించడం అవుతుంది. ఆర్టీఐ చట్టం పరిపాలనలో కనీస ప్రమాణాలను కాపాడడానికి వచ్చింది. తన కోసం జీవితపర్యంతం పనిచేసిన సహోద్యోగికి 12 ఏళ్లయినా ఒక సమాధానం చెప్పడానికి వెనుకాడే ప్రభుత్వ సంస్థ ఇక ప్రజలకు ఏం చేస్తుంది?



జీవించే హక్కును ఎవరూ ఇవ్వలేరు. అది సహజమైన హక్కు. అయితే ఆ జీవించే స్వేచ్ఛను చట్టవ్యతిరేకంగా హరించే వీల్లేదని ఆర్టికల్‌ 21 నిర్దేశిస్తున్నది. పింఛనుదారుకు ఆత్మగౌరవంతో జీవించే హక్కుంది. ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగితే జీవించే హక్కు భంగపడినట్టే. ఇవ్వాల్సిన పింఛను ఇవ్వకపోతే బతికే ప్రమాణాలు తగ్గిపోతాయి. ఒక కేసులో కొన్నేళ్లనుంచి ఇస్తున్న వృద్ధాప్య పింఛను హఠాత్తుగా నిలిపేస్తే ఆ వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడు? బకాయిలన్నీ కలిపి ఆరునెలల తరువాత ఇస్తానంటే ఈ ఆరునెలలు ఏవిధంగా జీవిస్తాడు? రెండుపూటలు తినేవాడు ఒక్కపూట తినవలసి వచ్చినా, లేదా ఆహారం తగ్గినా, లేదా ఇంకెవరినైనా అడుక్కోవలసి వచ్చినా ఆయన ఆత్మగౌరవం పడిపోయినట్టే. కనుక అది జీవన సంబంధ సమాచారమే అవుతుంది.



పింఛను నిలిపివేత, పింఛను ఫిర్యాదుల విచారణలో ఆలస్యం, పింఛను తగ్గిందన్న ఆరోపణల విచారణ ప్రతిస్పందనలో ఆలస్యం. పింఛను బకాయిల చెల్లింపు సమాచారం, పింఛను దస్తావేజులపై నిర్ణయంలో ఆలస్యాల సమాచారం ఇవన్నీ జీవించే హక్కుకు సంబంధించిన సమాచారం అని అధికారులు, ప్రభుత్వం గుర్తించవలసిన అవసరం ఉంది.



ఏ సమాచారం ఇవ్వకపోతే తక్షణం ప్రాణంపోయే ప్రమాదం ఎదురౌతుందో ఆ సమాచారమే జీవన సంబంధ సమాచారమని, అదిమాత్రమే 48 గంటల్లో ఇవ్వాలని ఒక పెద్దమనిషి వివరించాడు. ఇది చాలా దుర్మార్గమైన అన్వయం. తక్షణం ప్రాణంపోయే సమాచారం కోసం 48 గంటలదాకా ఎదురుచూడం సాధ్యం కాదు. జీవన వ్యక్తిస్వేచ్ఛలకు సంబంధించిన ఆందోళనల సమాచారం అని చాలా స్పష్టంగా ఆర్టీఐ చట్టంలో పేర్కొన్నారు. దానికి ఇంత విపరీతార్థాలు తీయడానికి వీల్లేదు. వైద్యనాథన్‌ వర్సెస్‌ ఈపీఎఫ్‌ఓ ముంబై కేసు   CIC/ BS/C-/2014/000321లో ఈ నెల 13న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా.





మాడభూషి శ్రీధర్‌

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

professorsridhar@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top