ఒక అంకుశం?!

ఒక అంకుశం?! - Sakshi


అక్షర తూణీరం

పవన్‌బాబు ఏ ఇష్యూ మీద నోరు తెరిచినా పర్వాలేదు. ఒక్క ప్రత్యేక హోదాపై నోరెత్తకుండా ఉంటే చాలని ఏలినవారు కోటి దేవుళ్లకి మొక్కుకుంటున్నారు.



రాష్ట్రంలో ఒకమూల మూత్రపిండాల వ్యాధి ప్రబలింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో అవస్థపడు తున్నారు. ప్రభుత్వం తన సహజ ధోరణిలో ఉదాసీనత వహించింది. ఉన్నట్టుండి జనసేన నేత ఆ స్పాట్‌కి వెళ్లాడు. జనం చేరారు. ప్రభుత్వాన్ని తనదైన ధోరణిలో ప్రశ్నించాడు. నిగ్గ దీశాడు. ఆపైన హెచ్చరించాడు. గంటైనా గడవకుండానే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ‘‘తగు చర్యలు తీసు కున్నాం, ఇంకా తీసుకుంటాం మహా ప్రభో!’’ అంటూ సవిన యంగా మనవి చేశారు. ఉన్నవిగాక ఇంకా బోలెడన్ని డయాలసిస్‌ కేంద్రాలు ప్రారం భిస్తాం. అందరి రక్తాలు క్షాళన చేస్తామని మీడియా ముఖంగా విన్నవించారు. అంతే కాదు, ‘‘పవన్‌ కల్యాణ్‌గారు ఇలాగ స్పాట్‌లోకి వచ్చి సమస్యని బహిర్గతం చేసి ఎంతో మేలు చేశారు. ఆయన మేలు మర్చిపోలేం’’ అంటూ అమాత్యుల వారు అభినందించారు కూడా.



అంతకు ముందు క్యాపిటల్‌ ఖాతాలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని విని జననేత నినదించారు. ఇప్పుడు అలాంటిదే మరో అఘాయిత్యం జరిగిందని రైతులు జనసేనని ఆశ్రయించారు. ఆయన అభయం ఇచ్చాడని తెలియగానే ప్రభుత్వం విప రీతంగా స్పందిస్తుంది. ఇప్పుడది జనం గ్రహించారు. అందుకని ఏపీలో ఏ సమస్య తలెత్తినా అది పవన్‌ కల్యాణ్‌  గుమ్మంలో ప్రతిధ్వనిస్తోంది. క్షణా లలో అధికారగణం అతిగా స్పందిస్తోంది. ఈ తంతుని యావ న్మంది గమనిస్తున్నారు. భయానికి కారణాలు వాళ్లకి స్పష్టంగా తెలుసు.



పవన్‌బాబు ఏ ఇష్యూ మీద నోరు తెరి చినా పర్వాలేదు. ఒక్క ప్రత్యేక హోదాపై నోరె త్తకుండా ఉంటే చాలని ఏలినవారు కోటి దేవుళ్లకి మొక్కుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం యువనేత వెంకయ్యనాయుడిపై విమర్శలు గుప్పించాడు. వాటిని అడ్డంగా ఘాటుగా ఎవరూ ఖండించలేదు. లౌక్యంగా మాట్లాడి తమని తాము సముదాయించుకున్నారు. ‘‘అందుకే గదా, అప్పుడు అన్ని ఆంధ్రా టౌన్స్‌లోనూ వెంకయ్యకి సన్మానాలు చేసి విమ ర్శల్ని మరిపించాం’’ అని ఒక పెద్దాయన క్లారిఫై చేశాడు.



ప్రభుత్వం ప్రతిపక్ష నేత విమర్శలను పట్టించుకోనట్లు నటిస్తుంది. రాజకీయేతర, రాజ్యాంగేతర శక్తిగా, ఫ్రీలాన్సర్‌గా ప్రభుత్వాన్ని నిగ్గతీస్తున్న పవన్‌ కల్యాణ్‌కి కొంచెం బాగా భయపడుతున్నట్టే కనిపిస్తోంది. ఈ వైఖరి సామాన్య జనంలోకి ఎలాంటి ఆలో చనల్ని, సంకేతాలని పంపిస్తోందో పెద్దలు ఆలోచించాలి. జననేత పెదవి విప్పితే చాలు అరక్షణంలో మంత్రులు మైకుల ముందుకు వచ్చి సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. సామాన్య ప్రజ సంతోషిస్తోంది. ఎవరైతేనేం, ఏదో ఒక అంకుశం పనిచేస్తోందని అనుకుంటున్నారు.



ఈ ఫార్స్‌ మొత్తాన్ని గమనిస్తుంటే గొగోల్‌ ప్రసిద్ధ నాటకం ‘ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌’ గుర్తొస్తోంది. మొన్న సంకురాత్రికి మా గ్రామం వెళ్లినప్పుడు మా ఊరి ప్రజలు రోడ్డు కోసం ఎమ్మెల్యేకి, మంత్రిగారికి పెట్టుకున్న అర్జీ చూపించారు. ‘‘మా ఊరు రోడ్డు వేసి పన్నెండేళ్లు దాటింది. మా ఎమ్మెల్యేకి మేం ఓట్లు వేయలేదని కోపం. కనీసం నడ వడానికి కూడా కష్టంగా ఉంది. మీరు, ఈ రోడ్డు సమస్యని వెంటనే పరిష్కరించకపోతే శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి దృష్టికి తీసుకువెళ్లాలని మా గ్రామం తీర్మానించింది’’ ఇదీ అర్జీ సారాంశం. బహుశా పని జరగచ్చు.



శ్రీరమణ

(ప్రముఖ కథకుడు)

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top