విపక్షాలు నేర్వాల్సిన పాఠాలు

విపక్షాలు నేర్వాల్సిన పాఠాలు


విశ్లేషణ



తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహా తెలివైనవారు, తిరిగి అధికారంలోకి రావడానికి ఏమైనా చేస్తారు. ప్రతిపక్షాలు ఎప్పటిలాగానే పోరాడితే వాటిని ఓడించవచ్చని భావిస్తారు. ప్రతిపక్షాలను బెంబేలెత్తించి, వాటి చేత తప్పులు చేయించాలని ఆశిస్తారు. ఏపీ సీఎం అందుకే 2018లోనే ఎన్నికలు వచ్చేస్తాయంటూ.. అటు ప్రతిపక్షాన్ని బెంబేలెత్తించాలని, ఇటు తమ పార్టీలో ఎవరూ తిరగబడకుండా చూసుకోవాలని ఆశిస్తున్నారు. కానీ 2019లో ఎన్నికలను ప్రకటించే నాటి వరకు మోదీ అధికారంలో ఉండే పరిస్థితులే ఉన్నాయి.



మన దేశంలోని ప్రభుత్వాలు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కోరుకుం టాయి. నిధులను వసూలు చేసి, ఖర్చు చేస్తాయి. ఉచిత వస్తువుల పంపిణీ కోసం నిధులను మళ్లిస్తాయి. భారీ ఎత్తున ఓట్లను కొనడమే కాదు, సూక్ష్మ స్థాయి ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తాయి. మన దేశంలో అధికారమే సర్వం. అమెరికా అధ్యక్షులు ఎవరైనాగానీ తమ పదవీ కాలం ముగిసిన వెంటనే అధికార నివాసాన్ని, రాజధానిని వీడి స్వస్థలానికి తిరిగి పోతారు. కానీ మన దేశంలో ఒక్కసారి పదవి లభించిందంటే చాలు ఇక రాజధాని వదిలిపోరు. మాజీ రాష్ట్రపతులకు, ప్రధానమంత్రులకు ఢిల్లీలో ఉచిత నివాసాన్ని కల్పించడమే కాదు, ఉద్యోగులను కూడా ఇస్తారు. రాజకీయ పార్టీలు ప్రధాన నగర ప్రాంతంలో తమకు తామే భూమిని కేటాయింపజేసుకుని, ఐదు నక్షత్రాల కార్యాలయాలను నిర్మించుకుంటాయి. అధికారం శాశ్వతమన్నట్టు ప్రవర్తిస్తుంటాయి. మెక్సికో అధ్యక్షుడు ఒక దఫా పదవీ కాలం ఆరేళ్లు ముగిశాక, దేశంలో కనిపించకుండేలా విదేశీ రాయబారి పనిని అప్పగిస్తారు.



మన దేశంలో ఒకసారి ఎన్నికల్లో గెలిచారంటే చాలు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఇక గద్దె దిగాలని ఎవరూ అనుకోరు. అందుకోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తారు. కాబట్టి మన ప్రతిపక్షాలు అధికారంలోకి రావడానికి కొత్త ఎత్తులు వేయాల్సి ఉంటుంది. మన్మోహన్‌సింగ్‌–సోనియాగాంధీల ప్రభుత్వం బాగా అప్రతిష్టపాలై ఉన్న 2014లో ప్రజలే వారి అధికారాన్ని కూలదోశారు. అధికార పార్టీ పట్ల ప్రజలు ఆగ్రహం చెందేంత వరకు ప్రభుత్వం గెలుస్తూ ఉండటం కొంత కాలంపాటూ కొనసాగుతుంది. మమతాబెనర్జీ, నితీశ్‌ కుమార్, నవీన్‌ పట్నాయక్‌లు అలా అధికారంలో కొనసాగుతుండటానికి మంచి ఉదాహరణలు. వ్యక్తిగతంగా వారు అవినీతిపరులు కారనే అభిప్రాయం ప్రజల్లో ఉండటమే వారి ప్రధాన బలం. ఆ ముగ్గురూ మహా తెలివైన వారు, తమ చట్టూ ఉండే వారి స్థానాలను అటూ ఇటూ మారుస్తూ గారడీ చేస్తుంటారు. ముగ్గురూ దశాబ్దాల తరబడి బీజేపీతో కలసివుండి విడిపోయినవారే. డీఎంకే, ఏఐడీఎమ్‌కే పార్టీలు అవినీతిగ్రస్తమైనవని తమిళనాడు ప్రజలు తిరస్కరించారు. కానీ అక్కడ రెండే పక్షాలు ఉండటంతో అవి మళ్లీ అధికారంలోకి వస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షం ఏదైనా గానీ తన సొంత నిబంధనలను తాను రూపొందించుకోవాలి, కొత్త వ్యూహాలను ఆవి ష్కరించాలి. ప్రభుత్వాల ఉచ్చులోకి నడిస్తే ప్రతిపక్షాలు దెబ్బతినిపోతాయి.



ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదు

తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఇటీవలి చరిత్రలో ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమూ ఉపఎన్నికల్లో ఓడిపోలేదు. అవి భారీ ఎత్తున డబ్బు ఖర్చు చేస్తాయి, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తాయి, ఇతర పార్టీల కార్యకర్తలు సహా ఓటర్లకు అన్ని రకాల లంచాలు ఇస్తాయి. ప్రతిపక్షాలు ఉపఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఏవో అద్భుతాలు జరిగితే తప్ప ఓడిపోతాయి. దీంతో ప్రతిపక్షాలకు జనాదరణ లేదని ప్రచారం చేస్తూ ప్రభుత్వాలు వాటి నైతిక స్థయిర్యాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తాయి. 2002లో ములాయం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు మాయావతి ఏ ఉపఎన్నికలోనూ పోటీ చేయలేదు. బీఎస్‌పీ మునిసిపల్‌ లేదా పంచాయత్, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేసేది లేదని కూడా ఆమె ప్రకటించారు. 2007లో యూపీ అధికారాన్ని కైవసం చేసుకునే వరకు ఆమె ఈ నియమాన్ని కచ్చితంగా పాటించారు. అధ్వాన పాలన కారణంగా 2012లో ఆమె అధికారాన్ని కోల్పోయారు.



2017 ఏప్రిల్‌లో బీజేపీ అతి ఆత్మవిశ్వాసంతో కర్ణాటకలో రెండు ఉపఎన్నికల్లో బలవంతులైన అభ్యర్థులతో పోటీకి దిగింది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెరుగైన వ్యూహాన్ని అమలు చేసి, ప్రత్యర్థి దేవెగౌడ బరిలోకి దిగకుండా చేసి విజయాలు సాధించారు. 2018లో బీజేపీ అక్కడ గెలవలేదని ఇప్పుడు నిపుణుల మాట. ఆ ఎన్నికలను బీజేపీ తేలికగా తీసుకుని ఉంటే, ఏ స్వతంత్రులనో పోటీకి పెట్టి ఉండేది. అప్పుడిక కాంగ్రెస్‌ గెలుపుకు విలువే ఉండేది కాదు. బీజేపీ వాటిని ప్రతిష్టాత్మక పోరాటాలుగా మార్చింది. రాష్ట్ర బీజేపీ అధినేత బీఎస్‌ ఎడ్యూరప్ప ఆ నియోజక వర్గాల్లో మకాం వేసి, తీవ్ర స్థాయిలో పోరాడారు. కానీ, దానికి తగిన ఫలితం రాకపోవడంతో జాతీయ పార్టీ అయిన బీజేపీకి కర్ణాటకలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలోని 224 స్థానాలలో 150 స్థానాలను గెలుచుకుంటామన్న అమిత్‌ షా ప్రకటనను ఫలితాలు తుçస్సుమనిపించేశాయి. ఎడ్యూరప్ప కర్ణాటక బీజేపీని ప్రమాదకర స్థితిలోకి ¯ð ట్టారు. 2018లో బీజేపీ కర్ణాటకలో ఓడిపోతే మోదీ, అమిత్‌షాల పని ఏం కావాలి?



ప్రతిపక్షాలు ఉపఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తాయి?

1. ఉపఎన్నికలో పోటీ చేయకపోతే పార్టీ క్యాడర్లను కోల్పోతుందనేది పాత వాదనే. నిజానికి ప్రతిపక్ష పార్టీ ఉపఎన్నికలో ఓడిపోయినప్పుడే క్యాడర్లు దాన్ని వీడిపోతారు. వారి పార్టీ ఇక ఎన్నటికీ అధికారంలోకి రాలేదంటూ ప్రభుత్వం వారిని ప్రలోభపెడుతుంది. ప్రతిపక్షం బలంగా ఉంటే క్యాడర్లు దాన్ని వీడిపోరు. తమను పరీక్షకు పెట్టలేదని సంతోషిస్తారు. ఓడిపోయే పోరాటాలను వారు ఇష్టపడరు కూడా. 2. పోటీకి దిగకపోతే ప్రభుత్వం అంటే ప్రతిపక్షం భయపడుతోందని అంటారనేది మరో వాదన. కానీ నిజానికి ప్రభుత్వాలు ఉపఎన్నికల్లో రాజీకి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అది వాటికి ఎన్నో తలనొప్పులను నివారిస్తుంది. 3. ప్రభుత్వాన్ని తేలికగా వదలకూడదనుకుంటే, మంచి పోటీని ఇచ్చేలా ప్రతిపక్షం బలమైన స్వతంత్రుని లేదా గొప్ప నైతిక ప్రతిష్ట ఉన్న వ్యక్తిని అభ్యర్థిగా నిలపాలి. ఈ పోటీ వల్ల అది నిశ్చింతగా ఉంటుంది. పోటీకి దిగే ప్రభుత్వమే తన ప్రతిష్టను దిగజార్చుకుంటుంది.



ఉపఎన్నికలు లేదా మునిసిపల్‌ లేదా పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచారో ఎవరికీ గుర్తుండదు. కానీ ప్రతిపక్షం ఉపఎన్నికల్లో ఓడిపోతే, అది దానికి తీవ్ర ప్రతికూల అంశం అవుతుంది. అన్ని గొప్పలు చెప్పుకున్న బీజేపీ రెండు ఉపఎన్నికల్లో ఓడిపోవడంతో జావగారిపోయింది. విజయం పట్ల సందేహం ఉన్నప్పుడు పోరాడటం ఎందుకు, ఓడిపోవడం ఎందుకు? అంతకంటే మీ శక్తియుక్తులను కాపాడుకుని, మీరు కోరుకునే పోరాటంలో ప్రయోగించడానికి బలాన్ని పెంపొందింపజేసుకోవడం ఉత్తమం కాదా? రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో పోరాడేటప్పుడు ప్రజలకు చాలా బలహీనంగా కనబడుతుంది. ప్రభుత్వం పట్ల పూర్తిగా సంతృప్తి చెందకపోవడం వల్ల ప్రజలు దానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటారు. పైగా ప్రభుత్వాలకు తలపొగరు ఎక్కుతుంది. ప్రజలు ఆ తలపొగరుతనాన్ని ద్వేషిస్తారు. అయితే, కచ్చితంగా ఓడిపోతారనుకునే వారికి మాత్రం ప్రజలు ఓటు వేయరు.



తెలుగు రాష్ట్రాల పరిస్థితి

ఈ నియమాలు రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా వరకు వర్తిస్తాయి. ఇద్దరు ముఖ్యమంత్రులూ మహా తెలివైనవారు, తిరిగి అధికారంలోకి రావడానికి ఏమైనా చేస్తారు. మునిసిపల్‌ ఎన్నికలను, ఉపఎన్నికలను వారు ప్రతిపక్షాలను బలహీనపరచడానికి వాడుకుంటారు. ప్రతిపక్షాలు ఎప్పటిలాగానే పోరాడితే వాటిని ఓడించవచ్చని భావిస్తారు. వారు తమ అభ్యర్థులను చాలా ముందుగానే ప్రకటించి, ఎన్నికల సంవాదానికి దిగుతారు. తద్వారా ప్రతిపక్షాలను బెంబేలెత్తించి, వాటి చేత తప్పులు చేయించాలని ఆశిస్తారు. త్వరగా ప్రచారం ప్రారంభించి ప్రతిపక్ష పార్టీలు వాటి వనరులను, శక్తియుక్తులను ఖర్చు పెట్టేసుకునేలా చేయాలని అనుకుంటారు. ఏపీ ముఖ్యమంత్రి అందుకే 2018లోనే ఎన్నికలు వచ్చేస్తాయంటూ.. అటు ప్రతిపక్షాన్ని బెంబేలెత్తించాలని, ఇటు తమ పార్టీలో ఎవరూ తిరగబడకుండా చూసుకోవాలని ఆశిస్తున్నారు. కానీ 2019లో మోదీ, ఎన్నికలను ప్రకటించే నాటి వరకు అధికారంలో ఉండే పరిస్థితులే ఉన్నాయి.



తెలంగాణ

తెలంగాణ ముఖ్యమంత్రి నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఉపఎన్నికకు సిద్ధంగా ఉన్నారని, తద్వారా ఆయన బలప్రదర్శన చేసి చూపాలనుకుంటున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఆ సీటును గెలుచుకుంటుందనడం నిస్సందేహం. అలాంటప్పుడు ప్రతిపక్షాలు తమ ప్రతిష్టలను పణంగా ఒడ్డి ఆయనకు అప్పగించడం ఎందుకు? ఈ ఎన్నికను విస్మరించి, ఆయనను ప్రతి గ్రామం తిరిగి ప్రచారం చేస్తూ తన ప్రతిష్టను తానే దిగజార్చుకోనివ్వండి. ప్రతిపక్ష పార్టీలు ‘సంకేతాత్మక’ అభ్యర్థులను లేదా బలమైన స్వతంత్రుడిని ఉమ్మడి అభ్యర్థిగా నిలపాలి.



ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌ రెండు పార్టీల రాష్ట్రం. కాంగ్రెస్‌ అస్తితంలోనే లేదు, బీజేపీని పెరగనివ్వడం లేదు. వైఎస్సార్‌సీపీ స్పష్టంగా కనిపించే, ప్రజాదరణగల ప్రతిపక్షం. అయితే అది, ఆధికార టీడీపీ ప్రభుత్వ మోసపూరితమైన సవాళ్లను అంగీకరించకుండా జాగ్రత్తవహించి, దాని ఎత్తుగడల గాలానికి చిక్కకుండా ఉండాలి. నిజానికి ప్రభుత్వం తనకున్న ప్రజాదరణ విషయంలో సందేహంతోనే ఉంది. ప్రతిపక్షం తాను గెలవగల సవాళ్లనే స్వీకరిస్తూ సార్వత్రిక ఎన్నికల వరకు వేచి ఉండాలి. ప్రభుత్వంలో ఉండటంవల్ల పై చేయిగా ఉన్న టీడీపీ సవాళ్లను సృష్టించాలనే ప్రయత్నిస్తుంది. టీడీపీ తన పాత ఫార్ములా ఎత్తుగడలనే ప్రయోగిస్తోంది. ప్రతిపక్షం ఆ ఆట ఆడటానికి తిరస్కరిస్తే అది తీవ్ర సంక్షోభంలో పడిపోతుంది. ప్రతిపక్షం తప్పనిసరిగా అన్ని ఎన్నికల్లోనూ పోరాడేలా, అభ్యర్థులను ముందుగా ప్రకటించేలా ప్రేరేపించాలని చూడటం టీడీపీ ఏపీ ప్రతిపక్షానికి విసురుతున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. అలాంటి సవాళ్లను అది స్వీకరించకూడదు. స్వీకరిస్తే అది అధికార పార్టీకి సహాయపడటమే అవుతుంది. ఉపఎన్నికలో పోరాడాల్సి వస్తే అది ‘సంకేతాత్మక అభ్యర్థి’ని లేక స్వతంత్రులను పోటీ చేయనివ్వాలి. సార్వత్రిక ఎన్నికల వరకు అలాగే చెయ్యాలి.



పెద్ద విజయాలు సాధించామని టీడీపీ చెప్పుకోవడానికి లేకుండా చేయాలి. బలమైన ప్రత్యర్థిని ఓడించటానికి ఓపిక వహించి కొత్త వ్యూహాలను ఎందుకు అనుసరించకూడదు? ‘‘మీ సైనికులను ఎక్కువగా అలసిపోయేలా చేయవద్దు, మీ శక్తిని అంతా కేంద్రీకరించండి, బలాన్ని దాచుకోండి’’ అని ప్రాచీన చైనా జనరల్‌ వాంగ్‌ చెన్‌ చెప్పాడు. ‘‘ఎప్పుడు పోరాడాలో ఎప్పుడు పోరాడకూడదో తెలిసిన వాడే విజయం సాధిస్తాడు’’అని సున్‌ జూ బోధిం చాడు. వారి బోధనలు అనుసరిస్తే భారత ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలను విస్మయపరచి విజయాలను సాధించగలుగుతాయి.


వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు



పెంటపాటి పుల్లారావు

ppr193@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top