ఎందుకీ అంతులేని సహనం?

ఎందుకీ అంతులేని సహనం? - Sakshi


త్రికాలమ్


రాజ్యసభలో మాట్లాడే టీడీపీ సభ్యులు ఎవరు? సుజనా చౌదరి, సీఎం రమేష్. ప్రత్యేక హోదా లేదంటూ జైట్లీ స్పష్టం చేస్తుంటే ఎప్పుడు ఎంత నిధులు ఇస్తారో ఇప్పుడైనా చెప్పండి అంటూ సుజనా చౌదరి అడుగు తున్నారు. సీఎం రమేశ్ కూడా స్పష్టంగా, సూటిగా మాట్లాడలేక పోయారు. అధినాయకుడి ఆంతర్యం ఏమిటో వారికి తెలియదు. స్వయంగా రాజకీయ వైఖరి తీసుకునే అనుభవం కానీ సాహసం కానీ లేదు.  కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తే చంద్రబాబు హర్షిస్తారో, కోపగిస్తారోనన్న సందేహం. ఆ స్పష్టత నాయకుడికి సైతం లేదు. ‘పొమ్మంటే పోతాం’ అంటూ చంద్రబాబు రాజ్యసభ చర్చ తర్వాత వ్యాఖ్యానించినట్టు వార్తాకథనాలు వచ్చాయి. ఇంత పొగపెట్టిన తర్వాత పొమ్మని వేరే చెప్పాలా? ఢిల్లీ వెడితే ప్రధాని ఇంటర్వ్యూ దొరకదు. సుజనా చౌదరికి కోరిన శాఖ ఇవ్వరు.

 

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో శుక్రవారం చేసిన ప్రసంగం తర్వాత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందని భావించడం సహజం. ఇంతకంటే మిత్రద్రోహం మరొకటి ఉంటుందా అని అదేరోజు రాత్రి మీడియా గోష్ఠిలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమితమైన ఆవేదన వెలిబుచ్చారు కానీ ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం లేదు. అవ మానం జరిగినా, వాగ్దానభంగం జరిగినా ఎందుకింత సహనం పాటిస్తున్నది?

 

‘ఒక రాజకీయ నాయకుడు స్వార్థచింతన లేకుండా కృషి చేస్తే ఏదైనా సాధిం చవచ్చునని వెంకయ్యనాయుడు నిరూపించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి లభించడానికి కారకుడుగా ఏ ఒక్క వ్యక్తి పేరు అయినా చెప్పవచ్చుననుకుంటే ఆ వ్యక్తి మీ జిల్లాలోనే పుట్టిన వెంకయ్యనాయుడు...’- ఎన్నికల ముందు నెల్లూ రులో జరిగిన సభలో నరేంద్రమోదీ హిందీలో చేసిన ప్రసంగానికి వెంకయ్యనా యుడు స్వయంగా తెలుగులోకి చేసిన అనువాదం ఇది. వేదికపైన కూర్చున్న చంద్రబాబునాయుడు రుమాలుతో ముఖం తుడుచుకుంటూ నాటి దృశ్యంలో కనిపించారు. తిరుపతి నుంచి విశాఖపట్టణం వరకూ మోదీ ప్రసంగించిన నాలుగు ఎన్నికల సభలలో ఇదే వరుస. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే కాకుండా అంతకు మించి చేస్తామంటూ వాగ్దానం.

 

అరుణ్‌జైట్లీ స్పష్టీకరణ


 రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపైన జరిగిన లఘు చర్చకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమా ధానం చెబుతూ, కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉన్న ఆర్థిక సమస్యలను ఏకరవు పెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 42 శాతం (ఇదివరకు 32 శాతమే ఉండేది) రాష్ట్రాలకే దక్కాలంటూ 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును ఆమోదించిన ఫలితంగా కేంద్రం దగ్గర నిధులు పెద్దగా మిగలవనీ, మిగిలిన నిధులతోనే కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు జరగాలనీ, రక్షణ అవసరాలూ, కేంద్ర ప్రభుత్వోద్యోగుల జీతనాతాలూ, ఇతర ఖర్చులు సకలం ఆ నిధులతోనే నిర్వహించాలనీ చెప్పుకొచ్చారు. పైగా ఈ సంవత్సరం కేంద్రం 3.9 శాతం ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నదని అన్నారు. అరుణ్‌జైట్లీ తేల్చిందేమంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మంజూరు చేయడం సాధ్యం కాదని.



2014 ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడూ, అరుణ్‌జైట్లీ పట్టుబడితే అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదాకు అంగీకరించారు. 2014 ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభ ఆమోదిస్తే, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించింది. మార్చి ఒకటిన రాజపత్రం విడుదలయింది. మార్చి 2న కేంద్ర కేబినెట్ ప్రత్యేక హోదాను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. జూన్ 2న అధికారి కంగా రాష్ట్ర విభజన అమలు జరిగింది. ఎన్నికల సభలలో వెంకయ్య నాయుడు పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఉండాలంటే, పదిహేనేళ్ళు ఉంటేనే ప్రయోజనం అంటూ చంద్రబాబునాయుడు వాదించారు. ఎన్నికలు జరిగాయి. నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది.



మోదీ ప్రభంజనం సహకా రంతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో గెలుపొందింది. మోదీ ప్రధానిగా  పదవీ స్వీకారం చేసి ఇరవై ఆరు మాసాలు గడిచాయి. మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ మంత్రిమండలిలో వెంకయ్యనాయుడు ముఖ్యమైన మంత్రి. మోదీ తర్వాత స్థానం అరుణ్‌జైట్లీదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునా యుడు ఉన్నారు. రాజ్యసభలో రాబట్టుకున్న, ఎన్నికల సభలలో అదేపనిగా ప్రచారం చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి అభ్యంతరం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి అధికారం హస్తగతం చేసుకొని రెండు సంవత్స రాలు దాటిన తర్వాత సైతం హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేయక పోగా కాంగ్రెస్‌ను నిందించడంలో అర్థం ఉన్నదా?

 

టీడీపీ ఏమి చేసింది?

 అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని దుయ్యపడుతూ ఇంకా ఎంత కాలం టీడీపీ, బీజేపీలు పబ్బం గడుపుకుంటాయి. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ కొన్ని సూచనలు చేసింది, కొన్ని హామీలు కావాలంటూ పట్టుపట్టింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీటీపీ ఏమి చేసింది? ‘దమ్ముంటే విభజన బిల్లు పెట్టండి. మేం సహకరిస్తాం’ అని పదే పదే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సవాలు విసరడమే కానీ బిల్లును ప్రతిపాదించిన తర్వాత సవరణలు ఏమైనా టీడీపీ ప్రతిపాదించిందా? అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను తొమ్మిది సంవత్స రాలు పరిపాలించిన విశేషానుభవం కలిగిన చంద్రబాబునాయుడికి రాష్ట్ర విభ జన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమిటో తెలుసు. వాటి పరిష్కారానికి బిల్లు లలో ఏయే అంశాలు పొందుపరచాలో తెలుసు. సోనియాగాందీతోనో, మన్మో హన్‌సింగ్‌తోనో, బిల్లును రూపొందించిన జైరాం రమేశ్‌తోనో చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ ప్రతినిధి బృందం కూర్చొని సమాలోచనలు జరిపి ఉంటే బాధ్యతాయుతంగా ఉండేది.



టీడీపీ సలహాలను తిరస్కరిస్తే నేరం కాంగ్రెస్‌ది అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జిల్లాలలో ఎన్నికల ప్రచారం చేసిన ప్పుడు విభజనకు తన లేఖే కారణమంటూ చెప్పుకున్న చంద్రబాబునాయుడు తనకు బొత్తిగా ఇష్టం లేకుండానే విభజన జరిగినట్టూ, అది అడ్డగోలుగా జరిగి నట్టూ ప్రచారం చేయడంలో మర్మం ఏమిటి?  విభజన చంద్రబాబునాయుడు అంగీకారంతోనే జరిగింది. విభజన బిల్లులో బీజేపీ ప్రతిపాదించిన కొన్ని సవరణలను మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. బిల్లులో లేని ప్రత్యేక హోదాపైన కూడా మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా కేంద్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. సవరణలు సూచించకుండా, సలహాలు ఇవ్వకుండా బిల్లుపైన చర్చ జరగడానికి సహకరించకుండా రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందంటూ నిందించడమే పనిగా పెట్టుకున్నది టీడీపీ.

 

నరేంద్రమోదీ స్వతంత్ర ప్రధాని. వాజపేయి లాగా  సంకీర్ణధర్మం పాటించ వలసిన అవసరం మోదీకి లేదు. బీజేపీకి సొంతంగా లోక్‌సభలో మెజారిటీ ఉన్నది. అందుకే చంద్రబాబునాయుడు ఇదివరకు ఢిల్లీలో చక్రం తిప్పినట్టు ఇప్పుడు తిప్పలేక తిప్పలు పడుతున్నారు. శాసనసభ స్థానాలు పెంచుతారనే ఆశ చూపించి ప్రతిపక్షం నుంచి శాసనసభ్యులను ఆకర్షించారు. తీరా శాసనసభ స్థానాల సంఖ్యను పెంచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఇప్పుడు ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చిచెప్పడం చంద్రబాబునాయుడికి  మోదీ హయాంలో తగిలిన రెండో ఎదురుదెబ్బ. పైకి ఏమి చెప్పినా ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోదనే సంకేతం చంద్రబాబునాయుడికి చాలా కాలం కిందటే అందింది. ఆయన వ్యూహాత్మకంగా అరుణ్‌జైట్లీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. అందుకే ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ, దాని వల్ల అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయను కోవడం పొరబాటంటూ వ్యాఖ్యానించారు.



రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ప్రసంగించిన తీరు తనకు బాధ కలిగించిందని ముఖ్యమంత్రి ఖేదం వెలిబుచ్చారు. సభలో గట్టిగా మాట్లాడనందుకు టీడీపీ సభ్యులను ఆయన గట్టిగా మందలించినట్టు  కూడా కొన్ని పత్రికలలో వచ్చింది. రాజ్యసభలో మాట్లాడే టీడీపీ సభ్యులు ఎవరు? సుజనా చౌదరి, సీఎం రమేష్. ప్రత్యేక హోదా లేదంటూ జైట్లీ స్పష్టం చేస్తుంటే ఎప్పుడు ఎంత నిధులు ఇస్తారో ఇప్పుడైనా చెప్పండి అంటూ సుజనా చౌదరి అడుగుతున్నారు. సీఎం రమేశ్ కూడా స్పష్టంగా, సూటిగా మాట్లాడలేకపోయారు. అధినాయకుడి ఆంతర్యం ఏమిటో వారికి తెలియదు. స్వయంగా రాజకీయ వైఖరి తీసుకునే అనుభవం కానీ సాహసం కానీ లేదు.  కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తే చంద్రబాబు హర్షిస్తారో, కోపగిస్తారోనన్న సందేహం. ఆ స్పష్టత నాయకుడికి సైతం లేదు. ‘పొమ్మంటే పోతాం’ అంటూ చంద్రబాబు రాజ్యసభ చర్చ తర్వాత వ్యాఖ్యానిం చినట్టు వార్తాకథనాలు వచ్చాయి. ఇంత పొగపెట్టిన తర్వాత పొమ్మని వేరే చెప్పాలా? ఢిల్లీ వెడితే ప్రధాని ఇంటర్వ్యూ దొరకదు. సుజనా చౌదరికి కోరిన శాఖ ఇవ్వరు. అసెంబ్లీ స్థానాలు పెంచడం లేదని స్పష్టం చేస్తారు. ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపిస్తారు. ఈ చర్యలన్నీ అమిత్ర వైఖరినే సూచి స్తున్నాయి కదా! ప్రధానమంత్రి వైఖరి అట్లా ఉంటే, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయ కులు  టీడీపీ పరిష్వంగంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తున్నారు.

 

సఖ్యతే సంజీవని


కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు కొనసాగడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయో జనం ఏమీలేదు. ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా కొంత వెసులుబాటు ఉండే మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తే అనేక రకాల చిరాకులు, చిక్కులు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఈసారి వ్యవహరి స్తున్న తీరు ఇదివరకటి కంటే భిన్నం.  వేల ఎకరాల భూమి సేకరించడం, సింగ పూర్ ప్రభుత్వంతో, అక్కడి ప్రైవేటు కంపెనీలతో నేరుగా లావాదేవీలు పెట్టుకో వడం వంటి అంశాలపై ఎవరు కోర్టులో పిటిషన్ వేసినా, కోర్టు విచారణ జరిపి సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ నిర్ణయించినా ఇబ్బందే. నరేంద్రమోదీ రాజకీయ ప్రత్యర్థులతో ఏ విధంగా ఆడుకుంటున్నారో గమనించినవారు ఆయ నతో సున్నం వేసుకునే సాహసం చేయరు. ఎవరు ఏమి చెప్పినా సీబీఐ స్వతం త్రంగా వ్యవహరించే మాట కల్ల. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో బలమైన ఆయుధం. సోనియా అయినా మోదీ అయినా తేడా లేదు. పైగా ఇప్పుడు ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలిగితే ఆ స్థానం భర్తీ చేయడానికి టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంది. టీడీపీ అధినేతను భ్రష్టుపట్టించాలనుకుంటే  ఓటుకు నోటు వ్యవహారం ఒక్కటే చాలు.



రాజ్యసభ తాజా ఉదంతం వల్ల ప్రజలకు తెలిసి వచ్చింది ఏమిటంటే బీజేపీ, టీడీపీలు మరి కొంతకాలం కలసి కాపురం చేస్తాయి. కనీసం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగే వరకూ చంద్రబాబునాయుడు ఓపికపడతారు.  ఢిల్లీ, బిహార్‌లో లాగా యూపీలో కూడా బీజేపీ బోర్లపడితే  టీడీపీ ఎన్‌డీఏ నుంచి ఎగ్జిట్ నిర్ణయం తీసుకుంటుంది.

 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే బిహార్, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాలు అడుగుతాయని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన నరేంద్రమోదీకి తెలియదా? రాజ్యసభలో మన్మోహన్‌సింగ్ చేత వాగ్దానం చేయించిన వెంకయ్య నాయుడికీ, అరుణ్‌జైట్లీకీ తెలియదా? వారిద్దరూ లోగడ కేంద్రమంత్రులుగా పనిచేసిన జాతీయస్థాయి నాయకులు. అందరికీ తెలుసు. అమలు చేయడం అసాధ్యమని తెలిసి కూడా బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలకు పాతర వేయడం ఆనవాయితీగా మారితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం నశిస్తుంది. ఆర్థిక ప్రవీణులతో ఒక సంఘాన్ని ఎన్నికల కమిషన్ నియమించాలి. అన్ని రాజకీయ పార్టీలూ తమ ఎన్నికల ప్రణాళిలలో చేసిన వాగ్దానాల సాధ్యా సాధ్యాలను ఆ సంఘం పరిశీలించాలి. సాధ్యమని భావించిన వాగ్దానాలనే ఎన్నికల ప్రణాళికలో చేర్చాలి. సాధ్యం కావనుకున్న వాగ్దానాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయకుండా రాజకీయ పార్టీలనూ, నాయకులనూ ఎన్నికల కమిషన్ కట్టడి చేయాలి. ఈ సంస్కరణ తక్షణం జరగకపోతే ప్రజాస్వామ్యానికి పూచీ ఉండదు.



( వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్)

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top