‘లాల్‌ నీల్‌ జెండా’ నేటి ఎజెండా

‘లాల్‌ నీల్‌ జెండా’ నేటి ఎజెండా - Sakshi


అణగారిన సామాజిక ప్రజా సమూహాలకు, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య ఏర్పడుతున్న ఈ మైత్రీ బంధాన్ని విచ్ఛినం చేయాలని కొందరు చూస్తున్నారు. మార్క్సిజాన్ని, అంబేద్కర్‌ భావసంచయాన్ని పరస్పరం పొసగనివిగా చూపే ప్రయత్నాలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసే శక్తులు, ఆర్థిక దోపిడీ నిర్మూలన శక్తులు సహజంగానే దృఢ బంధంతో ఐక్యం కావాల్సిన వారు. మహాజన యాత్ర, సమర సమ్మేళన సభల్లో వెల్లివిరిసిన ఈ నూతన చైతన్యం మరింత బలపడాలి.



ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో అపూర్వమైన మహాజన పాదయాత్ర జరిగింది. దాని ముగింపుగా హైదరాబాద్‌లో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభ పరిమాణాత్మకంగానే కాదు, గుణాత్మకంగాను ప్రశస్తమైనది. ఇంత దనుక వర్గ పోరాటమే ఏకైక పోరాట రూపం, తమ అంతిమ లక్ష్యానికి అదే సర్వే సర్వత్రా ఆచరణీయం అన్న భావనలతో ఏ ఇతర సామాజిక అణచివేతలను, ముఖ్యంగా దళిత, ఆది వాసి, గిరిజన, మైనారిటీలు, మహిళలు తదితర వెనుకబడిన కులాలపై ఆధి పత్య కులాల అహంకారపూరిత దాడులను పట్టించుకోవడం లేదనే కొంత వాస్తవిక విమర్శ ఉండేది. దానికి సీపీఎం ఆచరణాత్మకంగా చెప్పిన సరైన సమాధానం ‘లాల్‌ నీల్‌ జెండా’. మన దేశ ప్రత్యేకపరిస్థితుల్లో తమ ఎజెండా సామాజిక న్యాయంతో పాటూ సాగే వర్గపోరాటమే పార్టీ లక్ష్య సాధనకు దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆ సభాముఖంగా తేల్చి చెప్పింది. అదే విషయాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి ఏచూరి సీతారాం చేత కూడా నిర్ద్వంద్వంగా స్పష్టం చేయించింది. ఈ వినూత్న వైఖరి సీపీఎం శ్రేణులతో పాటూ, వామపక్ష శ్రేణులు, అభిమానులందరికీ నిస్సందేహంగా ఉత్తేజం కలి గించి ఉంటుంది. ఆ సభలో సీపీఎం నేతలేగాక సీపీఐ కార్యదర్శి చాడ వెంక టరెడ్డి, ప్రజా కళాకారుడు గద్దర్, ఐలయ్య, హరగోపాల్‌ వంటి మేధావులు పాల్గొనడం అభినందనీయం.



నూతన అధ్యాయానికి నాంది

స్వాతంత్య్రోద్యమం తర్వాతి తరం వచ్చేసరికి కార్మిక వర్గ పునాదిగా, ఆ వర్గ ఐక్యతే ప్రధానంగా జరపవలసిన ఉద్యమాల ఆవశ్యకత వల్ల కష్టజీవుల మధ్య అభేద్యమైన ఐక్యత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫలితంగా కొన్ని సామాజిక పోరాటాలపట్ల, వారి అస్తిత్వ ఉద్యమాల పట్ల అవి కార్మికవర్గ ఉద్యమానికి భంగకరం కాగలవేమోననే భయాందోళనలుండేవి. దీంతో ఆ ఉద్యమాల పట్ల వామపక్షాల్లో కొంత సందేహాత్మకమైన, ఊగిసలాట వైఖరిని ప్రదర్శించడం చూశాం. అయితే వర్గ ఐక్యతకు అవి భంగం కలిగిస్తాయనే అపోహా కొనసాగుతున్నా... సామాజిక న్యాయం అనే అంశం పార్టీలో చర్చనీ యాంశం కాకుండా పోలేదు. ఏది ఏమైనా ఏచూరి లాల్‌ నీల్‌ జెండా నినాదం నుంచి నాలుగువేల కిలోమీటర్లకు పైగా సాగిన సుదీర్ఘ పాదయాత్ర తదుపరి తమ్మినేని చేసిన ఉపన్యాసం వరకు ఆ సభ ఎంతో ఉత్తేజభరితంగా సాగింది. అది పార్టీ చరిత్రలో ఒక ఉత్సాహపూరిత నూతనాధ్యాయానికి నాంది అవు తుంది. ఇదే వేదికపై నుంచి  గద్దర్, తాను గతంలో సీపీఐ, సీపీఎంలను విమ ర్శించినందుకు సభాముఖంగా ప్రజాసమూహం ముందే చెంపలు వేసుకు న్నారు. శ్రీశ్రీ గతంలో ఇందిరాగాం«ధీ అత్యవసర పరిస్థితిని వామపక్ష నియం తృత్వంగా పొరబడ్డారు. అయితే గద్దర్‌ ప్రజా కళాకారుడే కాదు, అనుభవం గల రాజకీయ మేధావి. అయినా ఆ సభ సృజించిన భావోద్వేగంతో ఇకపై పార్లమెంటరీ రంగాన కృషి చేస్తానని ప్రకటించారు.



గతంలో నేను 11 మందితో కూడిన సీపీఎం కార్యదర్శి వర్గంలో సభ్యు నిగా ఉండేవాడిని. అందులో ఒక్క బీసీగానీ, దళితుడుగానీ, మైనారిటీ వ్యక్తి గానీ, మహిళగానీ లేరు. అది కావాలని జరిగిందని అనుకోను. అలా వారిని ఇముడ్చుకోవాలన్న ప్రత్యేక అవగాహన, పోనీ చైతన్యం తగినంతగా లేనందు వలననే ఈ విషయమై ‘వివిధ రాజకీయ పార్టీలలో ఈ సామాజిక అణచివే తకు గురవుతున్న శక్తుల ప్రాధాన్యత’పై ఉస్మానియా యూనివర్సిటీలో డాక్ట రేట్‌ చేస్తున్న కృష్ణారావు సమాచారం కోసం నన్ను కలిశారు. మీ రాష్ట్ర ఉన్నత కమిటీ సెక్రెటేరియట్‌లో పరిస్థితి ఎలా ఉందని అడిగారు. నేను పై విషయం చెప్పి, మా పార్టీలో రిజర్వేషన్లు ఉండవని సమాధానం ఇచ్చాను. కనీసం అది మా లోపమేనని కూడా చెప్పలేక పోయాను. ఆ తర్వాత అందుకు కొంత పశ్చాత్తాపపడి అందుబాటులో ఉన్న ఓ ఇద్దరు కార్యదర్శివర్గ సభ్యులతో, కొర టాల గంగాధరరావుతో ఆ విషయాన్ని ప్రస్తావించాను, ‘‘అందులో పశ్చా త్తాపపడాల్సింది ఏముంది? రాష్ట్ర కమిటీలో నలుగురు దళితులున్నారు, కార్య దర్శివర్గ స్థాయికి వారు ఇంకా ఎదగాల్సి ఉంది’’ అన్నారు.



అలాగే కొత్తపట్నంలో రాజకీయ పాఠశాల జరిగిన సందర్భంగా కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. ఆ పాఠశాలకు హాజరైన విద్యార్థుల నుంచి సూచనలను, అభిప్రా యాలను రాతపూర్వకంగా పార్టీకి అందజేయాలని కోరాం. ప్రస్తుతం తెలం గాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్న సి. రాములు మాత్రం ‘‘మన పార్టీలో అంబేద్కర్‌పై తగురీతిలో అవగాహన ఉన్నట్టు అనిపించడం లేదు. బహుశా అందువల్లనే పార్టీలో దళితులు తదితర అణగారిన సమూ హాల పట్ల మరింత శ్రద్ధ చూపలేకపోతున్నాము’’ అంటూ తన అభిప్రా యాన్ని తెలిపారు. అది నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో దాన్ని కార్యదర్శి వర్గ సమావేశంలో చర్చకు పెడదామనుకుని, ముందుగా కార్యదర్శి గంగా ధరరావుతో చెప్పాను. ‘‘దాన్ని ఆ కామ్రేడ్‌ విమర్శనాత్మక దృష్టితో పెట్టారని అనుకోవడంలేదు. అందుకు అతణ్ణి వివరణ అడగనవసరం లేదు. సహ జంగా దళితులలో ఒకరుగా జన్మించి ఆ బాధలు అనుభవించారు గనుక అలా భావించడంలో తప్పు లేదు’’  అంటూ ఆ అభిప్రాయాన్ని ఒక క్షమార్హమైన భావనగా భావించి తీసి పక్కన పెట్టేశారు. అది చర్చనీయాంశమని నేనంటే.. ‘‘ఈచర్చ అనవసరమైన కుల చర్యలకు దారి తీస్తుంది’’ అన్నారాయన.



చర్చకు వస్తూనే ఉన్న సామాజిక న్యాయం

నేను కార్యదర్శివర్గంలో ఉండగానే కారంచేడులో దళితులపై అక్కడి ఆధి పత్య కులాల వారు దాడి చేయగా పలువురు మరణించారు, గాయపడ్డారు. నాటి పౌరహక్కుల సంఘం కార్యదర్శిగా అక్కడికి వెళ్లిన నేను అది నగ్న అగ్రకుల దురహంకార దాడి అని స్పష్టంగా ‘ప్రజాశక్తి’లో రాశాను, కార్యదర్శివర్గానికీ చెప్పాను. ఆ తర్వాత మళ్లీ కారంచేడు వెళ్లినప్పుడు నాటి ప్రకాశం జిల్లా పార్టీ కార్యదర్శి తవనం చెంచయ్య అక్కడ కలిశారు. అన్ని కులాల్లోని పేదలు, కష్ట జీవులను ఏకంచేసి, వర్గపోరాటం ద్వారా ఇలాంటి దురాగతాలను ఎండ గట్టగలమనే మన అవగాహన చెప్పడం తప్ప, క్షేత్ర స్థాయిలో ఆ ఘటనపై తగినంత చేయలేకపోయామనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చగా నేను ఏకీభవించాను. ఆ తర్వాత విజయవాడలో జరిగిన రాష్ట్ర మహాసభలో పాతూరి రామయ్య (నేటి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు) ‘‘కారంచేడు దళితులపై దాడి సందర్భంగా మన పార్టీ తగిన రీతిలో స్పందించిందా అన్నది ఆలోచించుకోవాలి’’ అన్నారు. ఏవైనా ప్రధాన అంశాలు సభలో ప్రస్తావనకు వస్తే కార్యదర్శివర్గంలో చర్చించి, సమాధానం ఇవ్వాలి. కానీ కార్యదర్శి గంగా«ధరరావు లేచి ‘‘రామయ్య ఏనాడూ రాష్ట్ర కమిటీలోగానీ విడిగాగానీ ఇలాంటి సందేహాస్పద వ్యాఖ్యచేయలేదు. అదేమిటి హఠాత్తుగా ఇలా ఏకంగా రాష్ట్ర మహాసభలో ప్రస్తావించడం వింతగా ఉంది’’ అన్నారు. కార్యదర్శివర్గ కమిటీని మించిన అత్యున్నత వేదిక రాష్ట్ర మహాసభ. అక్కడ అభిప్రాయం చెప్పేహక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయినా వెంటనే రామయ్య ‘‘తొందర పడ్డాను, పొరపాటయ్యింది, క్షమించమని సభను, కార్యదర్శిని కోరుతు న్నాను’’ అంటూ చిన్నబుచ్చుకున్నారు.



విజయవంతమైన నాటి సామాజిక న్యాయసభ

ఉమ్మడి ఏపీలో సీపీఎంకు బలమైన జిల్లా నల్లగొండ. 1995 శాసనసభ ఎన్ని కల సందర్భంగా ‘సామాజిక న్యాయం’ అంశంపై పార్టీలో చీలిక వచ్చింది. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మల్లు స్వరాజ్యం(రెడ్డి)ను నిలపాలన్న పార్టీ నాయకత్వ అభిప్రాయానికి వ్యతిరేకంగా బుచ్చిరాములు (గౌడ)కు ఆ సీటును కేటాయించాలనీ, ఎప్పుడూ ఆ సీటును బీఎన్, స్వరాజ్యం, వీయన్, కుశలవరెడ్డిలకేనా, ఒక్కసారైనా బీసీకి ఇవ్వవచ్చు కదా అనే డిమాండ్‌ వచ్చింది. దీంతో రాష్ట్ర నాయకత్వం అయిష్టంగానే అయినా బుచ్చిరాములుకు సీటు ఇవ్వక తప్పలేదు. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. స్వరాజ్యం, వీయన్‌లే అందుకు కారణం అంటూ సామాజిక న్యాయ గ్రూపుగా ఉన్న దళిత నాయకత్వం పార్టీ నుంచి విడిపోయింది. జిల్లా అగ్రనేత బీఎన్‌ సైతం వారితో నిలిచారు. 1977 డిసెంబర్‌ 2న సూర్యాపేటలో లక్షన్నర ప్రజానీకంతో భారీ ఎత్తున ‘సామాజికన్యాయసభ’ జరిగింది. దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా జరిగిన ఆ సభకు బీఎన్‌ అధ్యక్షత వహించారు, ఓంకార్‌ ప్రధాన వక్త. మాదిగ దండోరా వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ, మాల మహానాడు నేత పీవీ రావు తదితర నేతలతో పాటూ ఆర్‌ కృష్ణయ్య, తుడుందెబ్బ గిరిజన నేతలు ఆ సభకు హాజరై సంఘీభావ సందేశాలిచ్చారు. నేను ప్రారంభోప  న్యాసం చేశాను. దీంతో ఆ సభకు వ్యతిరేకంగా సీపీఎం తరఫున మోటూరు హనుమంతరావు ‘వెనుకబడిన కులాల సభకు బ్రాహ్మణ నాయకత్వం!?’ అంటూ నన్ను దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యంగా కరపత్రాన్ని రచించారు. వాస్తవానికి నాడు న్యాయపోరాట శ్రామికపార్టీగా ఏర్పడిన సీపీఎం (బీఎన్‌) ప్రధాన నిర్వాహకులతో పోలిస్తే నేను చేసిన కృషి స్వల్పం.ఆ సభ నాడు శ్రమ జీవులకు, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీలు, మహిళలకు ఎంతో ఉత్తేజా న్నిచ్చింది.



ఈ మైత్రీ బంధం విడరానిది

ఈ పరిణామ ప్రభావం వల్ల, కమ్యూనిస్టు పార్టీలలో క్రమంగా పెరుగుతూ వచ్చిన  ‘సామాజిక న్యాయ’ వాంఛా బలంవల్ల... నాటి సీపీఎం కార్యదర్శి రాఘవులు ముఖ్య బాధ్యతతో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పాటు చేశారు. దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించుతున్నారు. సీపీఐ మాజీ ఎంఎల్‌ఏ మల్లేశ్‌ నాయకత్వాన దళిత హక్కుల వేదికను, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షులుగా సామాజిక హక్కుల వేదికను ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ దిశగానే తెలంగాణలో సీపీఎం నేతృత్వాన దాదాపు వంద ప్రజా సంఘాలతో ప్రజా సాంస్కృతిక వేదిక ఏర్పాటైంది. వీటన్నిటి పర్యవసానమే గుణాత్మకంగా భిన్నమైనదిగా సాగిన తమ్మినేని సామాజిక న్యాయ సాధనా పాదయాత్రగా చెప్పవచ్చు. అణగారిన సామాజిక ప్రజా సమూహాలకు, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య ఏర్పడుతున్న ఈ మైత్రీ బం«ధాన్ని విచ్ఛినం చేయాలని కొందరు రంగం మీదకు వస్తున్నారు. వారు మార్క్సిజాన్ని, అంబేడ్కర్‌ భావసంచయాన్ని పరస్పరం పొసగనివిగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసే శక్తులు, ఆర్థిక దోపిడీ నిర్మూలనాశక్తులు సహజమైన దృఢ బంధంతో ఐక్యం కావాల్సిన వారు. ఈ నూతన చైతన్యం మరింత బలపడి నిర్ణయాత్మక క్తి కావాలని ఆశిద్దాం!





డాక్టర్‌ ఏపీ విఠల్‌

వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు

మొబైల్‌ : 98480 69720

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top