ఊరటనిచ్చిన నెదర్లాండ్స్‌

ఊరటనిచ్చిన నెదర్లాండ్స్‌


ఎటుచూసినా మితవాదుల, జాతీయవాదుల జైత్రయాత్ర సాగుతున్న సమయంలో చిన్నదే కావొచ్చుగానీ... నెదర్లాండ్స్‌ పార్లమెంటుకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ప్రధాని మార్క్‌ రుట్‌ నాయకత్వంలోని వీవీడీ పార్టీ సాధించిన విజయం యూరప్‌ను ఊపిరి పీల్చుకునేలా చేసింది. యూరప్‌లోని వాయువ్య భాగాన ఉన్న నెదర్లాండ్స్‌ జనాభా కోటీ 70 లక్షలు. యూరప్‌లో ఇప్పుడు చాలా దేశాల్లో వెల్లు వెత్తుతున్న అవాంఛనీయ ధోరణులన్నీ నెదర్లాండ్స్‌ను సైతం చుట్టుముట్టాయి.



గత కొన్నేళ్లుగా అక్కడ ముస్లింలకు, వలసొచ్చినవారికి  వ్యతిరేకంగా కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. ఖురాన్‌ను నిషేధించాలని, మసీదులను మూసేయాలని అక్క డక్కడా ఆందోళనలు సాగాయి. వీటన్నిటి వెనకా గీర్ట్‌ వైల్డర్స్‌ నేతృత్వంలోని పీవీవీ పార్టీ ఉంది. వలసల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ కుంగిపోతున్నదని, దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ముప్పు కలుగుతున్నదని ఆ పార్టీ నేత వైల్డర్స్‌ ఆరోపించారు.  ఆయన ఉపన్యాస ధోరణి, సమస్యలకు ఆయన ప్రతిపాదించే పరిష్కారాలూ గమనిస్తున్నవారు వైల్డర్స్‌ను ‘నెదర్లాండ్స్‌ ట్రంప్‌’గా అభివర్ణించారు. జాత్యహంకార ధోరణులను రెచ్చగొట్టే ఆ ప్రసంగాలు సమాజంలో భయాందోళనలు కలిగిం చాయి. ముస్లింలు, శ్వేతేతర జాతీయులు తమ భద్రతపై కలవరపడ్డారు. నెద ర్లాండ్స్‌ యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బయటకు రావాలని వైల్డర్స్‌ ఇచ్చిన పిలుపునకు స్పందన కూడా అధికంగానే ఉంది.



ఈ ఎన్నికకు ముందు జరిపిన వివిధ సర్వేల్లో వైల్డర్స్‌ చాలా ముందంజలో ఉండటాన్ని గమనించి ప్రధాని మార్క్‌ రుట్‌ పార్టీ కూడా కంగారుపడింది. నిరుడు జూన్‌లో బ్రిటన్‌లో జరిగిన రిఫరెండంలో ఈయూ నుంచి తప్పుకోవాలన్న బ్రెగ్జిట్‌ వాదమే విజయం సాధించ డం... నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ గెల్చుకోవడంలాంటి పరిణామాలను చూసి నెదర్లాండ్స్‌ సైతం ఆ బాటలోనే పయనిస్తున్నదన్న భయాం దోళనలు అందరిలో వ్యాపించాయి. త్వరలో ఎన్నికలు జరగబోయే ఫ్రాన్స్, జర్మనీ ల్లోనూ ఈ మాదిరి భయాలే అలుముకున్నాయి.



ప్రపంచాన్ని 2008లో చుట్టుముట్టిన ఆర్ధిక మాంద్యం నెదర్లాండ్స్‌ను కూడా తాకింది. ఉత్పత్తి మందగించి, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమై, వేతనాలు పడిపోయి, పింఛన్లు ఆగిపోయి అక్కడి పౌరులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితి క్రమేపీ సర్దుకోవడం ప్రారంభమైంది. వాస్తవానికి గత రెండేళ్లుగా అక్కడ ఆర్ధిక వ్యవస్థ కుదుటపడింది. నిరుద్యోగం 5.3 శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు కూడా ఆశావహంగా ఉంది. ఈసారి మిగులు బడ్జెట్‌ కూడా రాబోతున్నదంటు న్నారు. ఆర్ధిక రంగంలో అది జర్మనీని దాటి ముందుకెళ్తున్నదని ఆర్ధిక నిపుణుల అంచనా. పరిస్థితి ఇంత అనుకూలంగా, ఆశావహంగా ఉన్నప్పుడు వైల్డర్స్‌లాంటి నాయకుడికి ఇంత జనాకర్షణ ఎక్కడినుంచి వచ్చింది? సర్వేల్లో ఆయన పార్టీయే ముందంజలో ఎలా ఉంది? ఈ అనుకూల వాతావరణం వెనక ప్రభుత్వం తీసు కున్న కఠిన చర్యలున్నాయి. పరిశ్రమల్లో రోబోల వాడకాన్ని క్రమేపీ పెంచే యోచన చేయడం, రిటైర్మెంట్‌ వయసును 67 సంవత్సరాలకు పెంచబోతుండటం, ప్రజా రోగ్య రక్షణ విధానాన్ని సవరించడం వంటివి పౌరుల్లో అనుమానాలను రేకెత్తించాయి. ఆర్ధిక మాంద్యం వల్ల కలిగిన క్లేశాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్న తమపై మరోసారి సంక్షోభం విరుచుకుపడబోతున్నదన్న భయం వారికి ఏర్పడింది. రిటైర్మెంట్‌ వయసు పెంచితే ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయన్న బెంగ యువతను ఆవహించింది. కార్మికులు సైతం తమ పనుల్లో రోబోల ప్రవేశం ఖాయమని ఆందో ళనచెందారు.



ఒకపక్క బ్రిటన్‌ ఈయూ నుంచి తప్పుకోవడం, అమెరికా ప్రపంచీ కరణ విధానాలను విడనాడే దిశగా అడుగులేస్తుండటం, తన పరిశ్రమలనూ, ఉత్ప త్తులనూ కాపాడుకునే చర్యలు ప్రారంభించడంవంటివి తమపై తీవ్ర ప్రభావం చూపుతాయని నెదర్లాండ్స్‌ పౌరులు విశ్వసించారు. ఈయూలో కొనసాగటం వల్ల కీడే తప్ప మేలు జరగదన్న అభిప్రాయం ఏర్పడింది. బ్రిటన్‌ దిగుమతుల్లో సింహ భాగం నెదర్లాండ్స్‌దే. అటు అమెరికాకు కూడా నెదర్లాండ్స్‌ నుంచి ఎగుమతులు విస్తారంగా ఉన్నాయి. ఆ రెండు దేశాలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే స్థితి ఏర్పడటం వల్ల మరోసారి ఇబ్బందులు తప్పవన్నది భిన్న వర్గాల అభిప్రాయం.  వీటన్నిటినీ వైల్డర్స్‌ బాగా సొమ్ము చేసుకోగలిగాడు. వలస విధానాలను కఠినం చేస్తే, ముస్లింల రాకను అడ్డుకుంటే ఈ పరిణామాల వల్ల కలిగే ప్రమాదాలను నివా రించవచ్చునని ఆయన ప్రచారం చేశాడు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఈయూ నుంచి బయటికొచ్చి, దేశానికి మేలు కలిగేలా స్వతంత్ర విధానాలను రూపొంది స్తామని ఆయన హామీ ఇచ్చాడు.



నెదర్లాండ్స్‌ ఎన్నికల రంగంలో 28 పార్టీలున్నాయి. అసలు బ్యాలెట్‌ పత్రమే ఎంతో అయోమయం కలిగించేదిగా మారింది. అది కూడా వైల్డర్స్‌కు కలిసొచ్చే అవకాశం ఉన్నదని అందరూ భావించారు. పైగా ప్రధాని మార్క్‌ రుట్‌ వరసగా రెండు దఫాలనుంచి ప్రభుత్వానికి సారధ్యంవహిస్తున్నారు. పాలకపక్ష వ్యతిరేకత ఆయన్ను దెబ్బతీయవచ్చునని లెక్కలేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో 81 శాతం పోలింగ్‌ జరగటంతో అది ఎవరికి అనుకూలమో విశ్లేషకులు అంచనా వేయలేకపోయారు. చివరకు సీట్లు తగ్గినా వీవీడీయే పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎప్పటిలా అది కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పదు. వైల్డర్స్‌ విజేత కాకపోవచ్చుగానీ ఆయన పార్టీ 2012 ఎన్నికలతో పోలిస్తే మెరుగుపడింది. వచ్చే మే నెలలో ఫ్రాన్స్‌ ఎన్నికలు, సెప్టెంబర్‌లో జర్మనీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ రెండుచోట్లా వలసలను, ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే జాతీయవాదుల ప్రాబల్యం విస్తరిస్తోంది. ఈయూ నుంచి బయటకు రావాలన్న డిమాండు పెరుగుతోంది. నెదర్లాండ్స్‌ తాజా పరిణామాలు ఆ దేశాల్లోని మధ్యే వాద, ఉదారవాద పక్షాలకు పోరాట చేవనిచ్చాయి. అయితే వైల్డర్స్‌ నాటిన జాత్య హంకార జాడ్యం ఉదారవాద నెదర్లాండ్స్‌ సమాజాన్ని నిలువునా చీల్చింది. పర స్పర అవిశ్వాసాన్ని పెంచింది. దాన్ని చక్కదిద్దడానికి చాలా కాలం పడుతుంది.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top