నాట్స్ చొరవతో.. ఆర్వో ప్లాంట్లు

నాట్స్ చొరవతో..  ఆర్వో ప్లాంట్లు


ఉప్పలపాడు(ప్రకాశం):

జన్మభూమి రుణం కొంత తీర్చుకునే క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్)  ప్రకాశం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తాగునీటితో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాలో తన వంతు సాయం చేసేందుకు నాట్స్ ముందుకొచ్చింది. అమెరికా నుంచి వచ్చిన నాట్స్  ప్రతినిధులు చీర్వాను ఉప్పలపాడు గ్రామంలో ఆర్వో ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు, నాట్స్ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  యుద్ధప్రతిపాదికన మరి కొన్ని పల్లెల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న నాట్స్ ఆ దిశగా ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబుతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ప్లోరైడ్ బాధిత పల్లెల్లో ఈ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా నాట్స్ అడుగులు వేస్తోంది.

 

బడికి నాట్స్ చేయూత..!

ఆధునాతన సాంకేతిక పరిజ్జానాన్ని కూడా పల్లె బడులకు చేరువ చేయాలనే సంకల్పంతో నాట్స్.. డిజిటల్ తరగతుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.. ప్రకాశం జిల్లాలోని అమ్మనబ్రోలులో తొలి డిజిటల్ తరగతిని ఏర్పాటు చేసింది. దీనిని కూడా నాట్స్ ప్రతినిధులతో కలిసి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు ప్రారంభించారు. మరో 9 ప్రభుత్వ బడుల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు నాట్స్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోందని నాట్స్ ప్రతినిధులు తెలిపారు. పుస్తకాలతోనే పిల్లల మనోవికాసం జరుగుతుందని భావించే నాట్స్ పుస్తకాలతో స్నేహం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి అమ్మనబ్రోలు ఉన్నత పాఠశాలలో దానిపై చర్చను నిర్వహించింది.





పుస్తక ప్రదర్శన కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 1500 మంది ఈ కార్యక్రమానికి  విచ్చేశారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలోని 23 జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. నాలుగు ప్రభుత్వ బడుల్లో మరమ్మత్తులు, పునరుద్దరణ పనులు చేయించింది.. ప్రకాశం జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి జన విజ్జాన వేదిక ప్రతినిధి సీఏ ప్రసాద్, ఈఎన్ టీ వైద్యులు డా.సుధాకర్ తమ సహకారాన్ని అందించారని నాట్స్ తెలిపింది. అమ్మనబ్రోలు నాట్స్ చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో కృషి చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులకు అమ్మనబ్రోలు ఉన్నత పాఠశాల సిబ్బందికి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఎన్.ఆర్.ఐ సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ గుళ్ళపల్లి, కిరణ్ పోలినేని తమ వంతు సహాయం అందించారు. నాట్స్ ట్రెజరర్ శ్రీనివాస్ మంచికలపూడి ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top