ఆ ముగ్గురు హంతకుల మాటేమిటి?

ఆ ముగ్గురు హంతకుల మాటేమిటి?


విశ్లేషణ

గాంధీ హత్య, దర్యాప్తు, పరిశోధన, నేర విచారణ, అప్పీలు, జైలుశిక్ష, ఉరిశిక్షలు, కపూర్‌ కమిషన్‌ సిఫార్సులు, వాటిపై చర్యలు తదితరాలకు సంబంధించిన అన్ని రికార్డులతో సమగ్ర సమాచార నిధిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.



గాంధీ హత్యానేరం ఎఫ్‌ఐఆర్, తుది చార్జిషీట్, నాథూరాం గాడ్సేను ఉరితీయడానికి చివరగా ఇచ్చిన ఉత్తర్వు కాపీ లను హేమంత్‌ పాండా తన అధ్యయనానికి అవసరమంటూ కోరారు.  పురావస్తు శాఖ ప్రజా సమాచార అధికారి నుంచి పాండా కొన్ని దస్తావేజుల ప్రతులను తీసుకున్నారు. కాని తుది చార్జిషీట్, నాథురాం గాడ్సే మరణశిక్ష ఉత్తర్వులు కనిపించలేదని కమిషన్‌కు విన్నవించారు. గాంధీ హంతకుల్లో ముగ్గురు–గంగాధర్‌ దహావతే, సూర్యదేవ శర్మ, గంగాధర్‌ యాదవ్‌ పారిపోయినట్టు రికార్డులు చూపుతు న్నాయని, వారిని పట్టుకున్నారా, లేదా? అందుకు ఏమైనా ప్రయత్నాలు, పరిశోధనలు జరిగాయా, లేదా? వారి సంగతే మయిందో వివరించాలని కూడా పాండా కోరారు. వారిని పట్టుకోవడానికి ఏ ప్రయత్నాలూ జరగ కపోతే అందుకు కారణాలను తెలుపాలని, దర్యాప్తు సాగితే దానికి సంబంధించిన రికార్డులు, డైరీలు చూపాలని ఆయన కోరారు. గాంధీ హత్యలో పాలుపంచు కున్న శంకర్‌ కిష్టయ్య (తెలుగువాడు), మరొక వ్యక్తి దత్తా త్రేయ పర్చురేలను సాక్ష్యం సరిపోలేదని  హైకోర్టు వది లేసిందంటూ ఆ వివరాలు కూడా ఇవ్వాలని కోరారు.



గాంధీ హత్య కేసు దర్యాప్తు, నేరవిచారణ, అప్పీ లుకు సంబంధించిన రికార్డులు తమకు అందినంత మేరకు చూపగలమే గాని, లోపాలు కారణాలు, అభిప్రా యాలు చెప్పజాలమని  సీపీఐఓ అన్నారు. ఎలా పారిపో యారు, ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు విడిచిపెట్టారు అనే అంశాలను పురావస్తుశాఖ ఎలా చెప్పగలదని ఆయన ప్రశ్నించారు. తమ వద్ద ఉన్న కొన్ని వేల పేజీల దస్తావేజులను ఎవరైనా చదువుకోవచ్చని, హేమంత్‌ మళ్లీ రావచ్చని వివరించారు. పురావస్తు శాఖ నియ మాల ప్రకారం కూడా తమ పేరు నమోదుచేసుకుని కార్యాలయంలో కూచుని దస్తావేజులు చదువుకునే అవ కాశాన్ని కల్పిస్తామన్నారు.



కానీ చట్ట ప్రకారం తమకు వచ్చిన దరఖాస్తును సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాల్సిన బాధ్యత జాతీయ పురావస్తు కార్యాలయంపైన ఉంది. వారా పని చేయలేదు. గాంధీ హత్య వివరాలున్న దస్తావేజులు చాలా పాతవని, పదే పదే ఫోటో కాపీలు తీయడం వల్ల చెడిపోతాయని, కనుక తాము వాటిని సీడీలుగా చేసి, వాటి నుండి ప్రింట్‌ కాపీలు ఇస్తున్నా మన్నారు. రికార్డు భద్రత దృష్ట్యా సమాచార కమిషనర్‌ ఢిల్లీ్లలోని జాతీయ పురావస్తు శాఖ కార్యాలయానికి వెళ్లి అసలు దస్తావేజులను పరిశీలించారు. రికార్డులలో ఒకే చార్జిషీటు ఉంది కాని, ప్రాథమిక, తుది ఆరోపణా పత్రం అని లేవు. తమ వద్ద జైలు రికార్డులు లేవు కనుక నాథూరాం గాడ్సే ఉరిశిక్ష ఉత్తర్వు ఇవ్వలేమన్నారు.  



హేమంత్‌ కోరిన సమాచారాన్ని నిరాకరించడానికి ఏ మినహాయింపూ వర్తించే అవకాశం లేదు. నిజానికి ప్రతి పౌరుడికీ జాతిపిత గాంధీ హత్య కేసు వివరా లన్నిటినీ తెలుసుకునే హక్కు ఉంది. పురావస్తు అథారిటీ సమాచార దరఖాస్తును అనేక ఉన్నతాధికార కార్యాల యాలకు పంపాల్సి ఉంది. గాంధీ హత్య, దర్యాప్తు, పరిశోధన, నేరవిచారణ, అప్పీలు, జైలుశిక్ష, ఉరిశిక్షలు, కపూర్‌ విచారణ కమిషన్‌ నివేదిక సిఫార్సులు, వాటిపై తీసుకున్న చర్యలు తదితర అంశాలకు సంబంధించిన అన్ని రికార్డులను సేకరించి సమగ్ర సమాచార నిధిని ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కనుక దరఖా స్తును ప్రధాన మంత్రి కార్యాలయానికి బదిలీ చేయాలని కమిషన్‌ ఆదేశించింది.



గాంధీ హత్యా నిందితులను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు, వివరాలున్న డైరీలను, ఇతర పత్రాలను ముంబై, పుణె, ఢిల్లీ పోలీసు వర్గాల నుంచీ, నిందితు లను జైలులో బంధించిన వివరాలను పోలీసు శాఖ నుంచీ, నాథూరాం గాడ్సే తదితరుల ఉరిశిక్ష వివరాలను జైలు అధికారుల నుంచీ, మరో ఇద్దరు నిందితులను అప్పీలులో విడుదల చేసి ఉంటే దానికి సంబంధించిన వివరాలను న్యాయస్థానం నుంచీ, బొంబాయి మహా రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయమై జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలనూ సేకరించేందుకు ఈ సమాచార దరఖా స్తును హోం మంత్రిత్వ శాఖకు పంపాలని ఆదేశించడ మైంది. పారిపోయిన ముగ్గురిని పట్టుకోవడానికి సంబం ధించిన వివరాలున్న కేసు డైరీలను, ఇతర రికార్డులను ఇవ్వడానికి గాను ఈ దరఖాస్తును తుగ్లక్‌ రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారికి బదిలీ చేయాలని ఆదేశించారు.



గాంధీ హత్య కేసులకు సంబంధించిన తీర్పులు తదితర అన్ని రికార్డులను ఇవ్వడానికి వీలుగా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు కూడా దరఖాస్తును బదిలీ చేయాలని ఆదేశించడమైంది. జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ కమి షన్‌ గాంధీ హత్య వెనుక కుట్ర వివరాలను సేకరించి, కొన్ని సూచనలను చేసింది. ఆ సూచనల వివరాలను, కమిషన్‌ విచారణలో లభించిన పత్రాలను, పురావస్తు అథారిటీకి ఇచ్చేందుకు వీలుగా పార్లమెంటు సెక్రటరీ జనరల్‌కు కూడా దరఖాస్తును బదిలీ చేయాలని కమి షన్‌ ఆదేశించింది. హోంశాఖ, ముఖ్యంగా ఢిల్లీ పోలీ సులు గాంధీ కేసు దస్తావేజులన్నీ సేకరించి పురావస్తు అథారిటీకి ఇవ్వాలని, అవన్నీ సేకరించిన తరువాత మొత్తం గాంధీ హత్య కేసుల ఫైళ్లన్నీ ఒక చోట భద్రపరిచి పౌరులకు అందుబాటులో ఉంచాలని కూడా కమిషన్‌ ఆదేశించింది.





హేమంత్‌ పాండా వర్సెస్‌ పీఐఓ (సాంస్కృతిక  మంత్రిత్వ శాఖ) CIC/SH/A/2016/001055  కేసులో 16 ఫిబ్రవరి 2017 ఇచ్చిన తీర్పు ఆధారంగా).




మాడభూషి శ్రీధర్‌,

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

professorsridhar@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top