జోస్యాల జోలికి పోవద్దు.. రెండేళ్లు బహు దూరం

జోస్యాల జోలికి పోవద్దు.. రెండేళ్లు బహు దూరం - Sakshi


అవలోకనం

ఉత్తరాదిలో మోదీ 2014 ఫలితాలను పునరావృతం చేయడం సవాలే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలలో బీజేపీ ఇçప్పటి తన మద్దతును నిలుపుకోలేకపోవచ్చు. కానీ మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, బెంగాల్‌లలో మరింత మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. కాబట్టి, ఐదు దక్షిణాది రాష్ట్రాలు మోదీకి తక్కువ కీలకమైనవి అవుతాయి. అయినా ఆ రాష్ట్రాల్లోనూ ఆయన మంచి స్థానంలోనే ఉన్నారు. మరో రెండేళ్లకు ఏమి జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వాలు, హీరోలు అంతకంటే చాలా తక్కువ కాలంలోనే జనాదరణను కోల్పోయారు.



‘‘జరగబోయేదాన్ని చెప్పడం, ప్రత్యేకించి భవిష్యత్తును చెప్పడం కష్టం.’’ ఈ చతురోక్తిని విసిరినది అమెరికన్‌ బేస్‌ బాల్‌ క్రీడాకారుడు యోగి బెర్రా అంటారు. అయితే ఆయన నిజం పేరు మాత్రం లోరెంజో బెర్రా. ‘‘యోగి’’ అతని ముద్దు పేరు. భారతీయులలా అతను మటం వేసుకుని కూచోగలడు కాబట్టి ఆ పేరొ చ్చింది. మనం యోగులం, ఆథ్యాత్మికవాదులం కావద్దుగానీ, 2019 ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యాలు చెప్పడం జోలికి పోకుండా ఉందాం. అయినా మనం ఒకసారి 2014 ఎన్నికల గణాంకాలవైపు దృష్టిసారించి, వాటిని వేటికవిగా విడదీసి 2019లో సంభవం కాగల పరిణామాలను విశ్లేషిద్దాం.



ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ సాధించిన తాజా విజయం 2019లో నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి రావడాన్ని అనివార్యం చేసింది. అది నిజంగానే అలా జరగాలంటే ఏమి జరగాల్సిన అవసరం ఉంది? 2014లో సరిగ్గా ఓట్ల లెక్కింపునకు ముందు మోదీ రానున్న ఫలితాలను ఊహించి చెప్పారు. 1984 తర్వాత భారత రాజకీయాలలో కనీ వినీ ఎరుగని రీతిలో తనకు పూర్తి ఆధిక్యత లభిస్తుందన్నారు. తన సభలకు హాజరైన ప్రజలే ఆ విషయం చెప్పారని తెలిపారు. ఆయన అంచనా కచ్చితమైన ది. 543 లోక్‌సభ స్థానాలలో 282 ఆయనకు లభిం చాయి. ఈ సంఖ్యా బలం మోదీకి ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాల నుంచే సమ కూరింది. ఆయన పూర్తి ఆధిక్యతను సాధించిన ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి లేదా ఆ పార్టీ బలంగా ఉనికిలో ఉంది. అవి, మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ (26కు 26), రాజస్థాన్‌ (25కు 25), మధ్యప్రదేశ్‌ (29కి 27), జార్ఖండ్‌ (14కు 12), హిమాచల్‌ప్రదేశ్‌ (4కు 4),  హరియాణా (7కు 7), ఢిల్లీ (7కు 7), ఛత్తీస్‌గఢ్‌ (11కు 10), ఉత్తరాఖండ్‌ (5కు 5), ఉత్తరప్రదేశ్‌ (80కి 71). ఉత్తరాది రాష్ట్రాలను ఇలా తుడిచిపెట్టేయడానికి తోడు బీజేపీకి ఈశాన్యంలో చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు దక్కాయి. ఇలా ఆ పార్టీకి దాదాపు 200 సీట్లకు పైగా అక్కడే లభిం చాయి. గత 30 ఏళ్లలో ఏ పార్టీకి ఆ ప్రాంతంలో అంత పెద్ద సంఖ్యా బలం సమకూరలేదు. దీంతో ఇతర ప్రాంతాలలో ఓ మోస్తరు ఫలితాలను సాధించడం మాత్రమే మోదీ గెలుపునకు అవసరమైంది. అవే  çఫలితాలను తిరిగి సాధించడం ఆయన చేయగల అతి తేలిక పని.





కాకపోతే ఉత్తరాదిలో తిరిగి ఈ స్థాయి ఫలితాలను పునరావృతం చేయడం ఒక సవాలే అవుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బహుశా ఉత్తరప్రదేశ్‌ వంటి ప్రాంతాలలో పార్టీ ఇప్పుడు తనకున్న మద్దతును నిలుపుకోలేక పోవచ్చు. పరిపూర్ణమైనదాన్ని ఎవరూ ఇంకా మెరుగుపరచలేరు. గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీలలో మోదీ ఇప్పటికే పరిపూర్ణతను సాధించారు. ఇక గుజారాత్‌లో బీజేపీ తమకు అత్యంత విధేయ ఓటర్లయిన పాటిదార్ల తిరుగుబాటును ఎదు ర్కొంటోంది. రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ వంటి సమర్థవంతులైన ప్రత్యర్థి నేతలు న్నారు. సమర్థులైన స్థానిక నేతలున్న పంజా»Œ లో జరిగినట్టే అక్కడా సీటు సీటుకూ  పోరాటం సాగవచ్చు.



అయితే అదృష్టవశాత్తూ ఇతర పెద్ద రాష్ట్రాలలో మరింత మెరుగైన ఫలితా లను సాధించే అవకాశం ఉండటమనే వెసులుబాటు మోదీకి ఉంది. మహారాష్ట్ర (48కి 23), బిహార్‌ (40కి 22), ఒడిశా (21కి 1), పశ్చిమ బెంగాల్‌ (42కు 2) రాష్ట్రాల్లో ఆయన తన సంఖ్యా బలాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్‌ను, శరద్‌ పవార్‌ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ను, ఉద్ధవ్‌ ఠాక్రే శివసేనను వెనక్కు నెట్టేసి, ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీగా మారింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఎన్నడూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడింది లేదు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఫలితాలు ఒడిశాలో బీజేపీ, కాంగ్రెస్‌ స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని, బెంగాల్‌లో కొంత పునాదిని ఏర్పరచుకోగలిగిందని స్పష్టం చేశాయి. మొత్తంగా మోదీకి ఉన్న జనాదరణ ఇందుకు కొంతవరకు కారణం కావచ్చు. అది 2019లో ఆయన అభ్యర్థులకు సహా యపడుతుంది.



ఈ నాలుగు రాష్ట్రాలలో మోదీకి ఊపిరి పీల్చుకునే ఈ  వెసులుబాటు ఉంది కాబట్టి, ఐదు దక్షిణాది రాష్ట్రాలు అయనకు మరింత తక్కువ కీలకమైనవి అవు   తాయి. అయినా ఆయన ఆ రాష్ట్రాల్లో కూడా మంచి స్థానంలోనే ఉన్నారు. కర్ణాటక (28కి 17), ఆంధ్రప్రదేశ్‌ (25కి 2), కేరళ (20కి 0), తమిళనాడు (39కి 1), తెలంగాణ (17కి 1) రాష్ట్రాలలో ఆయన తన ఇప్పటి బలాన్ని నిలుపుకోగలుగు తారు లేదా మెరుగుపరచుకోగలుగుతారు. ఓడిపోయినా ఈ రాష్ట్రాలు కొన్నిటిలో బీజేపీకి మంచి ఓట్ల శాతం లభించింది (ఉదాహరణకు, కేరళలో దానికి 10 శాతం ఓట్లు లభించాయి). ఈ రాష్ట్రాలలో ఆ పార్టీ తన ఉనికిని సుస్థిరమైనదిగా మార్చు కునే వరిస్థితిలో ఉంది.



రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యకర్తలు ఇందుకు కొంత వరకు కారణం (స్థానిక ఎన్నికల విజయాలను మదింపు వేసిన ప్రతిసారీ మోదీ వారిని అభినం దిస్తుంటారు). దశాబ్దాల తరబడి వారు నిస్వార్థంగా చేసిన స్వచ్ఛంద కృషి ఫలి తాలను ఇచ్చింది. ఈ రాష్ట్రాలన్నిటిలోనూ కాంగ్రెస్‌ పరిస్థితి క్షీణించిపోవడం కూడా కొంతవరకు దీనికి కారణం.



మనలో చాలా మందిమి 2004లో అటల్‌ బిహారి వాజ్‌పేయి మెజారిటీ స్థానా లను సాధిస్తారని భావించాం. ఆయన సైతం ఆ విషయంలో ధీమాగా ఉండి, ఆరు నెలల ముందే ఎన్నికలకు దిగి, ఓడిపోయారు. కాబట్టి మరో రెండేళ్లు గడిచాక ఏమి జరుగుతుందో ఇప్పుడే ఊహాగానాలు చేయడం అవివేకం అవుతుంది. ప్రభు త్వాలు, హీరోల్లాంటి ఎదురులేని నేతలు సైతం అంతకంటే చాలా చాలా తక్కువ సమయంలోనే జనాదరణను కోల్పోయారు మరి.



అయితే గణాంకాలు మాత్రం మోదీకి చాలా అనుకూలంగా ఉన్నాయి. అయినా అనుకోనిదే జరిగేట్టయితే... 2019 ఎన్నికలను మోదీ ఓడిపోయే ఎన్నికలు అనగలమే తప్ప, ప్రతిపక్షం గెలిచే ఎన్నికలు అనలేం.





- ఆకార్‌ పటేల్‌


వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top