మెరుగైన బిల్లు

మెరుగైన బిల్లు


మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏడాదిక్రితం రాజ్యసభ ఆమోదించిన ఆ బిల్లును సోమవారం లోక్‌సభ కూడా అంగీకరించడంతో దానికి పార్లమెంటు ఆమోదముద్ర పడినట్టయింది. ఈ బిల్లు చట్టమయ్యాక మూడు దశాబ్దాలనాటి మానసిక ఆరోగ్య చట్టం రద్దవుతుంది. మానసిక అస్వస్థులను చాలా దేశాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఈ ధోరణిని మార్చుకుని వారి హక్కులను పరిర క్షిస్తూ చట్టం తీసుకురావాలని పదేళ్లనాడు ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఆ తీర్మా నాన్ని అంగీకరించిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. కానీ బిల్లు రూపొందడానికీ... అది పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడానికీ ఇన్నేళ్ల సమయం పట్టడం ఒక దురదృష్టకరమైన విషయం. బ్రిటిష్‌ వలస పాలకులు 1912లో తీసుకొచ్చిన ఉన్మాద రోగుల చట్టం దాదాపు 75 ఏళ్లు కొనసాగింది. దాని స్థానంలో 1987లో మానసిక ఆరోగ్య చట్టం వచ్చినా అది కూడా ఎన్నో లోటుపాట్లతోనే ఉంది. మాన సిక రోగులకుండే హక్కులు, వారి సంరక్షణ, ఆ రోగులపై వివక్ష చూపిన సంద ర్భాల్లో తీసుకోవాల్సిన చర్యల తదితర అంశాల్లో అది మౌనంగానే ఉంది.



ఇతర రోగాల్లా మానసిక అనారోగ్యాన్ని ప్రారంభ దశలో లేదా విస్తరిస్తున్న దశలో గుర్తించడం అంత సులభం కాదు. అప్పుడప్పుడు అలాంటి వ్యక్తులు అస్వా భావికంగా, అసాధారణంగా లేదా విచిత్రంగా ఉంటున్న వైనాన్ని ఎవరూ పోల్చుకో లేరు. ఆ ధోరణుల్ని అప్పటికప్పుడు ఏర్పడ్డ సమస్యపై వారి స్పందనగానే పరి గణిస్తారు. వారిలో కట్టలు తెంచుకొని వచ్చిన ఆగ్రహం వల్ల సహనం కోల్పోయి ఉండొచ్చునన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ వారి విష యంలో వారి సన్నిహితులు తరచుగా వాపోయేది ఇదే. వారిపై తమకు కొంచెమైనా అనుమానం కలగలేదని అంటుంటారు. ఒకవేళ రోగి ఆత్మహత్యకు చేసిన ప్రయత్నం విఫలమైతే అది నేర చర్యగా మారుతుంది. వాస్తవానికి ఆ దురదృష్టకర పరిస్థితికి చేరుకున్న వ్యక్తిని రోగిగా పరిగణించి తక్షణం వైద్య చికిత్సకు పంపాలి. అందుకు బదులుగా పోలీసులు అరెస్టు చేస్తారు. ఐపీసీ 309 సెక్షన్‌కింద కేసు నమోదు చేస్తారు. ఆ సెక్షన్‌కింద సంవత్సరకాలం వరకూ జైలు, జరిమానా విధిం చవచ్చు. ఇప్పుడు పార్లమెంటు ఆమోదించిన బిల్లు ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించడం కాక దాన్ని మానసిక కుంగుబాటుగా గుర్తిస్తోంది. అలాంటివారికి వైద్య చికిత్స అందించాలని నిర్దేశిస్తోంది.  



సమాజం సరిగా గుర్తించని ఒక పెను సమస్య మానసిక అస్వస్థత. నిరుడు అంతర్జాతీయ వైద్య జర్నల్‌ లాన్‌సెట్‌ ఈ విషయంలో కీలకమైన సమాచారాన్ని వెలువరించింది. వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ చుట్టుముడుతున్న ఈ సమస్యపై భారత్‌ నిర్లక్ష్యంగా ఉంటున్నదని హెచ్చరించింది. అభివృద్ధి చెందిన దేశాలన్నిటా ఉన్న రోగులకు సమాన సంఖ్యలో భారత్, చైనాల్లో రోగులున్నారని... వీరి పెరుగుదల రేటు చైనాతో పోలిస్తే భారత్‌లో అధికమని కూడా ఆ జర్నల్‌ వెల్లడించింది. ప్రపంచంలోని మానసిక రోగుల్లో మూడో వంతు కంటే ఎక్కువ (37 శాతం)మంది ఈ రెండు దేశాలవారేనని... భారత్‌లో పదిశాతం మంది జనాభాకు ఏదో రూపంలో ఈ సమస్య ఉన్నదని చెప్పింది. మానసిక అస్వస్థతకు బహు రూపాలు, కారణాలు ఉంటాయి. పిచ్చితనంగా, ఉన్మాదంగా, మానసిక ఒత్తిడిగా, నరాల బలహీనతగా, మాదకద్రవ్యాలు లేదా మద్యసేవనం వల్ల వచ్చిన సమస్యగా దీన్ని పరిగణిస్తారు. వ్యాధిగ్రస్తులు నిరుపేదలైతే ఒకలా, ధనవంతులైతే ఒకలా చూసే ధోరణి ఉంది. అన్నిచోట్లా ఉన్నట్టే ఆడా, మగా వివక్ష కూడా ఇందులో చెప్ప లేనంతగా ఉంది.



పైగా మన దేశంలో మానసిక వ్యాధిగ్రస్తులకు సత్వర చికిత్స అందించడానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు లేవు. దేశంలో పది లక్షల మంది రోగులకు ముగ్గురు సైకియాట్రిస్ట్‌లు అందుబాటులో ఉన్నారని లాన్‌సెట్‌ నివేదిక చెబుతోంది. చైనా ఈ విషయంలో చాలా మెరుగు. అక్కడ పది లక్షల మందికి దాదాపు 17 మంది ఉంటారు. అసలంటూ వైద్య నిపుణులుంటే జనంలో ఆ వ్యాధి పట్ల చైతన్యం కలుగుతుంది. ఆ రోగుల విషయంలో శ్రద్ధ ఉంటుంది. అది లేకపోవడం వల్ల మానసిక రోగం పట్లా, ఆ రోగులపట్లా సమాజంలో అజ్ఞానం రాజ్యమేలుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లు అన్న తేడా లేకుండా ఎక్కడైనా తారసిల్లే ఈ రోగులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆ రోగులు సైతం సాధార ణంగా తమ లోకంలో తాముంటారు. రోగం ప్రకోపించి దాడులకు దిగినప్పుడు చుట్టూ ఉండే వారు వారితో నిర్దయగా వ్యవహరిస్తారు. ఆ రోగుల కుటుంబ సభ్యులు సైతం వారు తమవారని చెప్పుకోవడానికి సిద్ధపడరు. వారికి వెంటనే వైద్యం అందించా లన్న తాపత్రయం కంటే... ఆ సంగతి బయటపడకుండా చూడ టం ముఖ్యమను కుంటారు. అందువల్లే ఆ రోగులతో వ్యవహరించాల్సిన తీరుపై సన్నిహితులకు కౌన్సెలింగ్‌ అవసరమవుతుంది.



తాజా బిల్లు అనేక విధాల మేలైనది. జిల్లా స్థాయిలో సైకియాట్రిస్టుల నియా మకం, రోగులను చేర్చుకుని చికిత్స అందించడం లేదా ఎప్పటికప్పుడు మందులు అందజేయడం వంటి సేవలకు ఇది వీలు కల్పిస్తోంది. అలాగే ఈ రోగులకు ఇతర వైకల్యాలున్నవారికిచ్చే తరహాలోనే వైద్య బీమా సదుపాయం అందించాలని బీమా సంస్థలను నిర్దేశిస్తోంది. ఆ రోగుల ఆస్తుల పరిరక్షణ, చికిత్స విషయంలో వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడం, విద్యుత్‌తో చేసే చికిత్సకు కూడా పరిమితులు విధించింది. అయితే ఈసీటీ చికిత్సే అశాస్త్రీయమైనదని, దీన్ని రద్దు చేయాలని అంతర్జాతీయ నిపుణులంటున్నారు. మానసిక వ్యాధిగ్రస్తులకు పిల్లలు పుట్టకుండా చేయడాన్ని ఈ బిల్లు నిషేధిస్తోంది. వ్యాధిగ్రస్తులైన మహిళలకు అందించే చికిత్స విషయంలోనూ బిల్లు ప్రత్యేక శ్రద్ధ చూపింది. మానసిక రోగులపై వివక్ష చూపడం, వారిని గొలుసులతో బంధించడం లాంటివి చేస్తే జైలుశిక్ష, జరి మానా విధించే ఏర్పాటు కూడా ఇందులో ఉంది. మొత్తానికి ఆలస్యమైనా కూలం కషమైన చర్చ జరిపి, ఉన్నంతలో సమగ్రమైన బిల్లును రూపొందించినందుకు కేంద్రాన్ని, రాజకీయ పక్షాలను అభినందించాలి.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top