పతకాల ప్రాప్తిరస్తు!


ప్రపంచమంతా నాలుగేళ్ల పాటు ఎదురు చూసే ఆటల పండుగ వచ్చేసింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో ఒలింపిక్స్‌కు నేడు తెర లేవనుంది. ఈ నెల 21 వరకు జరిగే ఈ అతి పెద్ద క్రీడా సంబరంలో ప్రపంచవ్యాప్తంగా 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. మొత్తం 306 స్వర్ణాల కోసం వీరంతా పోటీపడనున్నారు. ప్రతి క్రీడాకారుడూ, క్రీడాకారిణి తన జీవితకాలంలో ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకుంటారు. అందుకోసం నాలుగేళ్ల పాటు సన్నద్ధమవుతారు. జీవితకాలపు కష్టాన్నంతా విశ్వక్రీడా వేదికపై వెలికితీస్తారు. సర్వశక్తులూ ఒడ్డుతారు. ఒలింపిక్స్ అంటే అత్యున్నత ప్రమాణాలకు నెలవు. ఇక్కడ స్వర్ణం గెలిచారంటే ఆ ఈవెంట్‌లో వారు ప్రపంచాన్ని జయించినట్లే.



1896లో ఏథెన్స్‌లో తొలిసారి ఆధునిక ఒలింపిక్స్ జరిగాయి. ఆనాటి నుంచి ఎంతోమంది దిగ్గజాలు వెలుగులోకి వచ్చారు. జెస్సీ ఒవెన్స్, కార్ల్ లూయిస్, మైకేల్ జాన్సన్ లాంటి పరుగు వీరులు ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. 40 ఏళ్ల క్రితం మాంట్రియల్ ఒలింపిక్స్‌లో రుమేనియా క్రీడాకారిణి నదియా జిమ్నాస్టిక్స్ విన్యాసాలు ఇప్పటికీ పాత తరం అభిమానుల కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. లాథియానా, ఇయాన్ థోర్ఫ్‌లాంటి ఎంతో మంది దిగ్గజాలు ఒలింపిక్ ప్రమాణాలను పెంచారు. ఇప్పటి తరంలో ఫెల్ప్స్, బోల్ట్ లాంటి అథ్లెట్లు వాటిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. దీంతో పోటీ అంతకంతకు పెరుగుతోంది. గతంలో ఒలింపిక్స్ అంటే ప్రధానంగా సోవియట్ యూనియన్, అమెరికా మధ్య పోరాటంగా సాగేది. సోవియట్ ముక్కలయ్యాక రష్యా కొంత పోటీ ఇచ్చినా, చైనా దూసుకొచ్చేదాకా అమెరికాదే ఏకఛత్రాధిపత్యం. 2008లో స్వదేశంలో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రావడంతో చైనా చెలరేగిపోయింది. ఆ ఒలింపిక్స్‌లో అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి కూడా అగ్రస్థానం కోసం ఆ దేశాలే పోటీపడే అవకాశం ఉంది.



క్రీడలకూ, డోపింగ్‌కూ అవినాభావ సంబంధముంది. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోవడం కొత్త కాకపోయినా ఈసారి మాత్రం రష్యా డోపింగ్ ఉదంతం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆ దేశ క్రీడా శాఖ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతున్నదన్న వార్త పెను సంచలనం సృష్టించింది. దీంతో రష్యా నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు బరిలోకి దిగకుండా నిషేధించారు. ఒక దశలో ఒలింపిక్స్ నుంచి ఆ దేశాన్నే బహిష్కరించాలన్న డిమాండ్ వినిపించినా, అది వివాదాస్పదమవుతుందన్న కారణంతో అంత కఠిన నిర్ణయానికి రాలేదు. ఈసారి మనకూ డోపింగ్ జాడ్యం అంటుకోవడం విషాదం. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికాడు. అతడిపై కుట్ర జరిగిందని, తినే ఆహారంలో కావాలని ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలు కలిపారని ‘నాడా’ నమ్మడంతో ఎట్టకేలకు రియోకు వెళుతున్నాడు. కానీ అందరికన్నా ముందు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షాట్‌పుట్టర్ ఇందర్‌జీత్‌సింగ్, 36 ఏళ్ల తర్వాత భారత్ నుంచి 200 మీటర్ల పరుగుకు అర్హత సాధించిన ధరమ్‌వీర్‌సింగ్ దొరికిపోయి ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. మున్ముందురష్యాలాంటి స్థితి మనకు రాకుండా జాగ్రత్త పడాలని ఈ ఘటనలు గుర్తు చేశాయి.



ఒలింపిక్స్ నిర్వహణ కూడా పెను సవాలే. ఆ అవకాశం దక్కాలంటే ఎన్నో పరీక్షలు, ఎంతో పోటీ తట్టుకుని నిలబడాలి. ఆర్థికంగా భారమే అయినా ఒలింపిక్స్ నిర్వహణ వల్ల లభించే కీర్తి అన్ని దేశాలనూ ఊరిస్తుంటుంది. రియో కూడా 2009లో ఎంతో పోటీపడి ఈ ఆతిథ్య అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఈ ఏడేళ్లలో ఓడలు బళ్లయ్యాయి. నాడు పరిపుష్టంగా ఉన్న బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు దారుణంగా దెబ్బతింది. ఒలింపిక్స్ నిర్వహణపైనే ఆందోళన ఏర్పడింది. అయితే అన్నిటినీ అధిగమించి రాగల 17 రోజులూ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న పట్టుదలతో బ్రెజిల్ ఉంది. ఈసారి ఒలింపిక్స్‌లో అమెరికా అందరికన్నాఎక్కువగా 555 మంది అథ్లెట్లతో రియోలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆతిథ్య బ్రెజిల్ నుంచి 465 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ కూడా 400మందికి పైగా అథ్లెట్లను పంపాయి.  చాలా యూరోప్ దేశాలు 200 మందికి పైగా అథ్లెట్లతో వచ్చాయి. ప్రతి క్రీడాంశంలోనూ నిర్దిష్ట ప్రమాణాలు అందుకుంటేనే ఒలింపిక్స్ చాన్స్ దక్కుతుంది. అలా అందుకోవడంవల్లే ఆయా దేశాల నుంచి భారీగా అథ్లెట్లు వెళ్తున్నారు. సహజంగానే వారి పతకాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆసియా నుంచి చైనా అత్యధికంగా 413 మందిని రంగంలోకి దించితే... జపాన్ 333, దక్షిణ కొరియా నుంచి 205 మంది క్రీడల్లో పాల్గొంటున్నారు.



భారత్ విషయానికొస్తే...ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 119 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటేనే చాలనుకునే స్థితి నుంచి, ఇప్పుడు పతకాలు ఎన్ని సాధిస్తామనే వరకూ మన క్రీడాకారులు తమ స్థాయిని పెంచుకున్నారు. ఒలింపిక్స్ చరిత్రలో మనకు వచ్చిన మొత్తం పతకాలు 22. ఇందులో 9 స్వర్ణాలు. అయితే వీటిలో 8 మన హాకీ గత వైభవానికి చిహ్నాలే! వ్యక్తిగత విభాగంలో 2008లో బీజింగ్‌లో అభినవ్ బింద్రా షూటింగ్‌లో స్వర్ణం సాధించాడు. 1956లో జాదవ్ పతకం సాధించాక 1996లో అట్లాంటాలో లియాండర్ పేస్ కాంస్యం సాధించేవరకూ... అంటే 40 ఏళ్ల పాటు భారత్‌కు వ్యక్తిగత విభాగంలో పతకం ఎలా ఉంటుందో తెలియదు. తర్వాత 2000లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి, 2004లో రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ పతకాలు సాధించారు. బీజింగ్‌లో బింద్రా స్వర్ణంతో పాటు మరో రెండు పతకాలు వస్తే, 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్య ఆరుకు పెరిగింది. ఈసారి అథ్లెట్ల సంఖ్య కూడా బాగా పెరిగినందున కనీసం 10 పతకాలైనా వస్తాయన్న అంచనాలున్నాయి. అయితే మన ప్రమాణాలు పెరిగినట్లే ప్రపంచంలోని మిగిలిన దేశాల అథ్లెట్ల ప్రమాణాలు కూడా పెరిగాయి.  ఈసారి భారత అథ్లెట్లు మరింత మెరుగ్గా రాణించి పతకాల సంఖ్యను పెంచుతారని ఆశిద్దాం.

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top