ఆయనది నవ భారత దర్శనం

ఆయనది నవ భారత దర్శనం - Sakshi


కొత్త కోణం

ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ల ఆధిపత్యం వల్ల ఈ విభేదాలు తీవ్రమయ్యే ప్రమాద మున్నదని అంబేడ్కర్‌ అభిప్రాయం. అందుకే ఈ రాష్ట్రాలను విభజించాలని 1955లోనే  ప్రతిపాదించారు. కానీ 40 ఏళ్లకుగానీ మన నాయకులు దానిమీద దృష్టిపెట్టలేకపోయారు. హిందీని ఇతర రాష్ట్రాల మీద రుద్దడం వల్ల మరింత అనైక్యతకు దారితీస్తుందని ఆయన ఊహించారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరగకుండా ఉండాలంటే, ఢిల్లీతో పాటు మరొక ప్రాంతాన్ని రెండవ రాజధానిగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.



బాబాసాహెబ్‌ డాక్టర్‌. బి.ఆర్‌. అంబేడ్కర్‌ దార్శనికత ఏ రంగంలోనైనా మనకు స్పష్టంగా గోచరిస్తుంది. స్వాతంత్య్రానంతరం ఈ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, సమగ్రాభివృద్ధిని గురించి ఆలోచించిన నాయకుల్లో ఆయన ప్రథముడు. అంబేడ్కర్‌ అంటరానికులాల గురించి మాత్రమే ఆలోచించాడనే  చాలామంది అపోహ. అందుకే ఆయనను వెలివాడకు పరిమితం చేసే ప్రయత్నం సాగుతున్నది. అంబేడ్కర్‌ను చదవకపోవడమో, తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడమో ఇలాంటి అభిప్రాయాలకు కారణం. కులం, మతం, చరిత్ర, ఆర్థికరంగం, రాజకీయ సిద్ధాంతాలు, వివిధ రంగాల అభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, ప్రగతి, మహిళల హక్కులు– ఒక్కటేమిటి? ఏ విషయాన్ని తీసుకున్నా, అంబేడ్కర్‌ సమగ్రమైన, శాస్త్రీయమైన, ఆచరణాత్మకమైన ప్రతిపాదనలు చేశారు. అందుకే అంబేడ్కర్‌ కేవలం అంటరాని కులాలు, నిమ్న వర్గాలు, ఆదివాసీల హక్కుల కోసం స్వప్నించినవాడు మాత్రమే కాదు. ఒక సమగ్ర, సమానత్వ దృష్టి ఉన్న భవ్య భారతదేశాన్ని ఊహించినవారు కూడా. ఎన్నో విషయాలను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా సర్వజన సంక్షేమాన్ని కాంక్షించారాయన. కొన్నింటిలో సఫలీకృతులయ్యారు. కొన్నింటిలో కాలేకపోయారు. ఆ విషయాలను రాజ్యాంగాన్ని సభకు సమర్పిస్తున్నప్పుడే చెప్పారు.



తిరోగమన తిమిరంతో సమరం

బీజేపీ మాజీ పార్లమెంటు సభ్యులు తరుణ్‌ విజయ్‌ వారం క్రితం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అల్‌జజిరాకు ఇచ్చిన ఇంట ర్వూ్యలో వర్ణ వివక్షను గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను ఎటువంటి వర్ణ వివక్ష పాటించడం లేదనీ, తాము (ఉత్తర భారతీయులు) దక్షిణ భారతం నుంచి వచ్చిన నల్లవారితో కూర్చోవడమే దానికి నిదర్శనమని విజయ్‌ వ్యాఖ్యానించారు. తాము నల్లని కృష్ణున్ని పూజిస్తున్నామని, ఇంకా ఏవేవో మాట్లాడారు. తాము ఎటువంటి వర్ణ వివక్ష పాటించడం లేదని చెబుతూనే, దాక్షిణాత్యులు నల్లరంగులో ఉంటారని ప్రస్తావించడం అహంకార, ఆధిపత్య భావజాలానికి పరాకాష్టగా చాలా మంది భావించారు. పార్లమెంటులో కూడా దీనిపై చర్చ జరిగింది. ఈ వివాదం ఇప్పటికిప్పుడు ముగిసినట్టనిపించవచ్చు. కానీ ఉత్తర భారతదేశ ప్రజలకు దక్షిణ భారతీయుల పట్ల తరతరాలుగా ఉన్న ఒక చిన్నచూపునకు విజయ్‌ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. అయితే ఈ సమస్య అంత సులభంగా సమసిపోదు.



ఈ తిరోగమన భావజాలాన్ని ఒక ప్రగతిశీల దృక్పథంతో మాత్రమే ఓడించగలం. అక్కడి ప్రజల్లోనే ఆ మార్పు రావాలి. ఉత్తర భారతదేశ ప్రజల చైతన్యమే ఆ మార్పు తేవాలి. ఇక్కడే అంబేడ్కర్‌ని గుర్తు చేసుకోవాలి. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మధ్య వైరుధ్యాల గురించి ప్రస్తావిం చారు. వాటికి పరిష్కారాలను కూడా చూపెట్టారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పడిన ఫజల్‌ అలీ కమిషన్‌కు సమర్పించిన నివేదికలో ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న వైరుధ్యాల నివారణ గురించి తెలియచేశారు. అంబేడ్కర్‌ తన అభిప్రాయాలతో పాటు, ప్రముఖ మేధావి, చరిత్రకారుడు కె.ఎం. ఫణిక్కర్, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రాజగోపాలాచారి అభిప్రాయాలను కూడా  పేర్కొన్నారు.



ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న తేడాలను బేరీజు వేస్తూ, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం (ఎస్‌ఆర్‌సి) అనుసరించే విధానాన్ని అంబేడ్కర్‌ దుయ్యబట్టారు. ‘‘ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య చాలా పెద్ద తేడాలున్నాయి. ఉత్తర భారతం ఛాందస ఆలోచనలతో నిండి ఉన్నది. దక్షిణ భారతదేశం ప్రగతిశీల భావాలకు నెలవుగా మారింది. ఉత్తర భారతదేశం మూఢనమ్మకాలకు నిలయం. దక్షిణభారతదేశం హేతువాద దృక్పథానికి నెలవు. విద్యావిషయాల్లో సైతం దక్షిణ భారతదేశం ముందంజలో ఉంటే, ఉత్తర భారతదేశం వెనుకబడి ఉన్నది. దక్షిణ భారతదేశ సంస్కృతి ఆధునికమైనది. ఉత్తర భారతదేశ సంస్కృతి సనాతనమైనది’’ అంటూ రెండు ప్రాంతాల మధ్య ఉన్న భేదాలను నిష్పక్షపాతంగా వివరించారు.



ఈ నివేదికలో రాజగోపాలాచారి ఉటంకించిన విషయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘మీరు మహా తప్పిదం చేస్తున్నారు. భారతదేశానికి ఒకే కేంద్రం, సమాఖ్య సరిపోదు. దేశమంతటికీ ఇది ఒక్కటే ప్రాతినిధ్యం వహించదు. ఒకవేళ ఒక సమాఖ్య ఉంటే ప్రతిసారి ప్రధాని, రాష్ట్రపతి ఉత్తర భారతదేశం నుంచే ఉంటారు. అందుకే ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు ప్రత్యేకంగా సమాఖ్య ఉండాల్సిన అవసరం ఉన్నది. ఉత్తర, దక్షిణ భారత సమాఖ్యలు రెండూ కలసి మహా సమాఖ్యగా ఏర్పడాలి. అప్పుడు సమతుల్యత సాధ్యమవుతుంది’’ అని రాజగోపాలాచారి తనతో అన్న మాటలను అంబేడ్కర్‌ ఉటంకించారు.



దక్షిణ భారతం మీద చిన్నచూపేల?

1955 నవంబర్‌ 27న ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వూ్యలో రాజగోపాలాచారి, ‘‘దక్షిణ భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ఉత్తర భారతాన్ని మాత్రం విభజించకుండా ఆపుతున్నారు, ఇందులో కుట్ర ఉన్నది’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రముఖ చరిత్రకారుడు ఫణిక్కర్, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణపై తన నిరసనను తెలియజేస్తూ, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు ప్రాంతాల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాయనీ, దక్షిణ, ఉత్తర భారత ప్రజల మధ్యనే కాకుండా, పంజాబ్, బెంగాల్‌ లాంటి ప్రాంతాలను కూడా వివక్షకు గురిచేస్తాయనీ, ఉత్తరప్రదేశ్‌ కేంద్రంగా దేశ రాజకీయాలు నడపాలనుకోవడం సరైందికాదని హెచ్చరించారు. రాజ్యాంగసభలో జరిగిన మరొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా అంబేడ్కర్‌ ప్రస్తావించారు. ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల మధ్య ఉన్న అగాధాన్ని ఇది తెలియజేయగలదని అంబేడ్కర్‌ వివరించారు.



‘‘హిందీ అధికార భాష విషయమై రాజ్యాంగ సభలో, కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో జరిగిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తే తప్పులేదనుకుంటున్నాను. హిందీని అధికార భాషను చేయాలనే విషయంపై జరిగినంత చర్చ మరే అంశంపైనా జరగలేదంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘ చర్చ తరువాత జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 78 ఓట్లు, వ్యతిరేకంగా 78 ఓట్లు పోలయ్యాయి. బలాబలాలు సమానంగా ఉండడంతో ఎటూ తేల్చుకోలేకపోయాము. చాలా కాలం తరువాత మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చర్చజరిగింది. దీనిని ఒక్క ఓటు తేడాతో నెగ్గించుకోవడం జరిగింది. ఈ విషయంతో  హిందీ భాష మీద, అంటే ఉత్తరాది మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం కాగలదు.’’ అంటూ ఒక చారిత్రాత్మక సత్యాన్ని అంబేడ్కర్‌ వివరించారు.



రెండో రాజధానిగా హైదరాబాద్‌

ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ల ఆధిపత్యం వల్ల ఈ విభేదాలు తీవ్రమయ్యే ప్రమాదమున్నదని అంబేడ్కర్‌ అభిప్రాయం. అందుకే ఈ మూడు రాష్ట్రాలను విభజించాలని 1955లోనే  ప్రతిపాదించారు. ఆ తర్వాత 40 ఏళ్లకుగానీ మన నాయకులు దానిమీద దృష్టిపెట్టలేకపోయారు. హిందీని ఇతర రాష్ట్రాల మీద రుద్దడం వల్ల మరింత అనైక్యతకు దారి తీస్తుందని ఆయన ఊహించారు. మరొక ప్రధాన ప్రతిపాదనను కూడా అంబేడ్కర్‌ చేశారు. భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరగకుండా ఉండాలంటే, ఢిల్లీతో పాటు మరొక ప్రాంతాన్ని రెండవ రాజధానిగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.


మొఘల్, బ్రిటిష్‌ పరిపాలనా కాలాల్లో కూడా రెండు రాజధానులున్నాయని గుర్తు చేశారు. మొఘల్‌లు ఢిల్లీతో పాటు, శ్రీనగర్‌ను, బ్రిటిష్‌ వాళ్లు కలకత్తాతో పాటు సిమ్లాను రెండో రాజధానిగా ఎంచుకున్నారు. ఢిల్లీ మాత్రమే రాజధానిగా ఉంటే దక్షిణాదిలో ఎప్పటికైనా తాము అధికారానికి దూరంగా ఉన్నామనే భావం ఏర్పడుతుందని కూడా అంబేడ్కర్‌lతెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా వేసవి, చలికాలాల్లో ఢిల్లీ నివాసానికి అననుకూలంగా ఉంటుంది. ఇదొక కారణం. రెండో కారణం–రెండో రాజధానితో దక్షిణ భారత ప్రజలకు కూడా ప్రభుత్వాల మీద విశ్వాసం పెంచుకోవడానికి ఉపకరిస్తుంది. హైదరాబాద్‌ అందుకు అనువైనదనీ, ఈ నగర వాతావరణం చాలా అనుకూలమనీ అంబేడ్కర్‌ భావించారు. 1955 ప్రాంతంలో హైదరాబాద్‌లో ఉన్న భవనాలు ప్రభుత్వ కార్యాలయాలకు అనువైనవనీ, పార్లమెంటు భవనం నిర్మిస్తే హైదరాబాద్‌కు తరలిపోవచ్చునని కూడా చెప్పారు.


అంతేకాకుండా ఉత్తరభారతంలోని ఏ ప్రాంతమూ దేశ రక్షణ కోణం నుంచి సరైనది కాదనీ, వ్యూహాత్మకంగా హైదరాబాద్‌ మాత్రమే సరైన నగరమని ఆయన తన నివేదికలో చెప్పారు. హైదరాబాద్, ఇతర ప్రముఖ నగరాలకు మధ్యనున్న దూరం అంత ఎక్కువేమీ కాదని లెక్కలతో సహా చూపించారు. కలకత్తా, బొంబాయి నగరాలు పొరుగుదేశాల దాడులకు అనువుగా ఉంటాయనీ, ముఖ్యంగా కలకత్తా మీద టిబెట్‌ ద్వారా చైనా ఏ సమయంలోనైనా దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుందని, బొంబాయి కూడా నావికాదళాల ద్వారా సులువుగా దోపిడీకి గురవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.



అటు ఢిల్లీకీ, ఇటు హైదరాబాద్‌కీ; ఇతర నగరాలకీ మధ్య దూరంలోని వ్యత్యాసాన్ని కూడా అంబేడ్కర్‌ వివరించారు. హైదరాబాద్‌ నుంచి బొంబాయినగరానికి 739 కిలోమీటర్లు. అదే ఢిల్లీ నుంచి బాంబేకి 1414 కి.మీ. హైదరాబాద్‌నుంచి కలకత్తాకి 1488 కి.మీ., ఢిల్లీ నుంచి కలకత్తాకి 1492కి.మీ. హైదరాబాద్‌ నుంచి మద్రాసుకి 628 కి.మీ, ఢిల్లీనుంచి 2190 కి.మీ. హైదరాబాద్‌నుంచి కర్నూలుకి 214 కి.మీ.ఢిల్లీ నుంచి కర్నూలుకి 1797 కి.మీ. హైదరాబాద్‌–త్రివేండ్రమ్‌కి 1306 కి.మీ, ఢిల్లీ–త్రివేండ్రమ్‌ 2891 కి.మీ. హైదరాబాద్‌నుంచి పటియాలా 1811 కి.మీ., అదే ఢిల్లీ నుంచి 249 కి.మీ. హైదరాబాద్‌ నుంచి చండీఘర్‌ 1806 కి.మీ. ఢిల్లీ నుంచి చండీఘర్‌ 244 కి.మీ. హైదరాబాద్‌ నుంచి లక్నో 1426 కి.మీ. అయితే ఢిల్లీ నుంచి లక్నో 555 కిలోమీటర్లు మాత్రమే.


అంబేడ్కర్‌ దేశ సమగ్రతకోసం పరితపించిన మహోన్నత నాయకుడు. ఆయన ప్రతిపాదించిన విషయాలను అమలుచేయకపోవడం వల్లనే దేశం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులోభాగంగానే ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావించిన విషయాన్ని చూడాలి. భారతదేశ పురోగమనానికి రాజ్యాంగ విలువల అమలుకు, మంచి ఫలితాలకు అంబేడ్కర్‌ దార్శనికత, తాత్వికత ఒక్కటే మార్గనిర్దేశనం చేయగలవు. మంచి భవిష్యత్తు కోసం ఆ దార్శనికత, తాత్వికతలను దేశం నిరంతరం స్వాగతించాలి.

(రేపు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 126వ జయంతి)




వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 97055 66213 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top