అంతరార్థం ఏమిటి?

అంతరార్థం ఏమిటి? - Sakshi


విశ్లేషణ

రాజకీయ పార్టీలు రకరకాల కారణాలతో ఏర్పడుతుంటాయి. వాటిలో ఒకటి నల్లధనాన్ని అక్రమంగా చలామణి చేయడమని ఎన్నికల కమిషన్‌ గుర్తించింది. అలాంటి దాదాపు రెండు వందల పార్టీల గుర్తింపును రద్దు చేసింది. పార్టీల ఏర్పాటుకు ఇతర కారణాలూ ఉంటాయి.  పార్టీలోని వ్యక్తిగత, భావజాల వివాదాలు, వారసత్వ పోరాటాలు వంటివి కూడా వాటిలో ఉంటాయి. ములాయంసింగ్‌ యాదవ్‌ చేతులెత్తేయకపోతే రెండు సమాజ్‌వాదీ పార్టీలుండేవే.



పదేళ్ల క్రితం రాజ్‌ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్‌ఎన్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడంతో శివసేన  చీలిపోయింది. అదో ప్రత్యేకవాద పార్టీ. తమ పార్టీ అది కాక మరేదో అన్నట్టుగా అది నటించిందీ లేదు. మౌలికంగా మరాఠీలే  ఆ పార్టీ ఓటర్లు. అది, తమది బాల్‌ ఠాక్రే  నిర్మించిన పార్టీగా చెప్పుకుంటుంది. అయితే ఈ పార్టీ ఏర్పాటుకు అసలు కారణం నేడు రాజ్‌ మేనబావ ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివసేన నాయకత్వ వారసత్వ సమస్య వల్ల మాత్రమే ఎమ్‌ఎన్‌ఎస్‌ ఏర్పడింది.  



ఇద్దరూ మరాఠీలే కాబట్టి, వారు ఐక్యం కావాలని రెండు పార్టీల కేడరూ కోరుకుంటున్నారని ఎప్పుడూ వారికి సూచనలు అందుతూనే ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలు మాత్రం ఆ విషయం గురించి ఎన్నడూ మాట్లాడలేదు. కలసి పనిచేయడం కాదుగదా, కనీసం ఇద్దరి మధ్య అగాధాన్ని పూడ్చే ప్రయత్నమైనా వారిలో ఏ ఒక్కరూ చేయలేదు. స్థానిక పౌర పరిపాలనా సంస్థల నుంచి శాసనసభ వరకు అన్ని స్థాయిల్లోని ఎన్నికల రాజకీయాల్లోనూ  వారు ప్రత్యర్థులుగానే ఉంటూ వచ్చారు. అయితే, ముంబైసహా పది ప్రధాన పౌర పురపాలన సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో రాజ్‌ ఠాక్రే హఠాత్తుగా ఆశ్చర్యకరంగా ప్రవర్తించారు. రాజ్‌ తన బావ ఉద్ధవ్‌కు ఏడు సార్లు ఫోన్‌ చేశారు. ఆయన ఫోన్‌ తీయలేదు. ఉద్ధవ్‌ ఎక్కడ, ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా అంగీకరించి రెండు పార్టీల మధ్య ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవాలనేదే ఈ చర్య వెనుక ఉన్న S ఉద్దేశం. రాజ్‌ పంపిన దూతను సైతం ఉద్ధవ్‌ కలవలేదు. మరో నేతను కలిసినా ఎలాంటి ఫలితమూ లేకపోయింది.



ఇది, ఎంత హఠాత్తుగా మొదలైందో అంత హఠాత్తుగానే ముగిసిపోయిన ప్రధాన పరిణామం. బలహీనపడుతున్న ఎమ్‌ఎన్‌ఎస్‌ నేత వేసిన ఈ ఎత్తుగడ ఆయనలోని నిస్పృహను సూచిస్తోంది. నాసిక్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మూడొంతుల మంది కార్పొరేటర్లు, అంటే 40 మంది ఉన్న ఎమ్‌ఎన్‌ఎస్‌ ఆ సంస్థను నియంత్రిస్తోంది. కానీ అక్కడి ఆ పార్టీ ప్రతినిధులు శివసేనలోకో లేక బీజేపీలోకో ఫిరాయిస్తున్నారు. 2009లో 13గా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 2014 నాటికి ఒకటికి పడిపోయింది.



ఏ ప్రాతినిధ్య సంస్థలోనైనా ఎంత మంది ప్రజాప్రతినిధులున్నారు అనే దాన్ని బట్టే ఒక పార్టీ బలాన్ని లెక్కిస్తారు. అంతేగానీ ఏ సమస్యపైనైనా అది ఎంత ప్రభావాన్ని నెరపగలుగుతుందనేదాన్ని బట్టి కాదు. సేన, ఎమ్‌ఎన్‌ఎస్‌లకు సొంత రాజకీయ రంగ స్థలిౖయెన ముంబైలో పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కీలకమైనది. దాదర్‌ శివసేనకు కీలక ప్రాంతం. గత ఎన్నికల్లో ఎమ్‌ఎన్‌ఎస్‌ చిత్తుగా ఓడిపోయింది. ఠాక్రే కుటుంబీకులు నివసించే ది, శివసేన ఏర్పడింది, దాని ప్రధాన కార్యాలయం ఉన్నది ఆ ప్రాంతంలోనే. ఈ ఘోర పరాజయం రాజ్‌కు మింగుడు పడటం కష్టమే. ఇకపై శివసేన ఏ పార్టీతోనూ ఎన్నికలకు ముందు కలిసేది లేదని ఆ పార్టీ ముందుగానే ప్రకటించిందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం అవసరం. అయినా రాజ్‌ ఠాక్రే సర్దుబాట్ల కోసం పాకులాడారు. బీజేపీకి, సేనకు మధ్యనే ప్రధానంగా సాగే ఎన్నికల పోరులో మరాఠీ ఓట్లు చీలిపోకూడదనేదే తమ ఉద్దేశమని వివరించ డానికి ఆయన తంటాలుపడ్డారు. ఇదో చిన్నపాటి బెదిరింపే కాదు, ఆ పునాదిని నిలబెట్టుకోగలిగే ఆశలు లేవని ఎమ్‌ఎన్‌ఎస్‌ అంగీకరించడం కూడా.



అయితే రాజ్‌ ఇలా ఉద్ధవ్‌కు సంకేతాలను పంపడం అతి చాకచక్యంగా వేసిన ఎత్తు అని ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు విశ్వసిస్తున్నారు. ముంబై స్థానిక ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో శివసేన ఓడిపోతే... మరాఠీ భూమిపుత్రులతో శివసేన జూదం ఆడాలని ప్రయత్నిం చిందనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది అనేదే రాజ్‌ ఉద్దేశమని అంటున్నారు. బీజేపీని మహారాష్ట్రేతరుల పార్టీగానే చూస్తుంటారు. అది వాస్తవాలపై ఆధారపడి ఏర్పడ్డ అభిప్రాయం  కానవసరం లేదు. అయినాగానీ బీజేపీ చేతిలో ఓటమి కంటే ఎక్కువగా మరాఠీ అస్తిత్వాన్ని   గాయపరచేది మరొకటి ఉండదు.



ఒక రాజకీయ పరిణామం జరిగిన తర్వాత దానికి కారణాన్ని చెప్పడం అవసరం. శివసేన ఓటమిని వివరించడానికి జరిపే విశ్లేషణగా అది తెలివైన ఎత్తే కావచ్చు. కానీ అసలీ కాళ్లబేరంలో రాజ్‌ ఠాక్రే తాను ద్వేషించే నాయకుని పార్టీతోనే మైత్రిని కోరి తన బలహీనతను ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చిందో అది వివరించదు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్‌ఎన్‌ఎస్‌ను అది తక్కువగా చేసి చూపింది.



- మహేష్‌ విజాపృకర్‌

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top