పౌరులవి కాని పుర పాలక సంస్థలు

పౌరులవి కాని పుర పాలక సంస్థలు


విశ్లేషణ

పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు రావడంతోనే ఓటరు బాధ్యత ముగిసి పోతుంది. ఇకపై వారు మాట్లాడటానికి లేదు. పౌర పాలనా వ్యవహారాల్లో తాము భాగస్వాములం కామన్న నిర్ధారణకు పౌరులు దాదాపుగా వచ్చేశారు.



ముంబై సహా మహారాష్ట్రలోని పది ప్రధాన నగరాలకు త్వరలోనే ఎన్ని కలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నాకు  సికింద్రాబాద్‌ మేయర్‌గా పని చేసిన డాక్టర్‌ యశ్వంత్‌ రావు తిమ్మరాజు గుర్తుకొ స్తున్నారు. అర్ధ శతాబ్దికి ముందు ఆయన రోజుకు రెండు సార్లు ఆసుపత్రిని నడిపేవారు. ఆ మధ్యలో వీలు చేసుకుని మునిసిపల్‌ కార్యాలయానికి మళ్లి వస్తుండేవారు. అందుకు ఆయన తన సొంత కారునే వాడేవారు. అప్పట్లో పురపాలక సంస్థ అధికారులకు కార్లను ఇచ్చేవారు కాదు. అప్పట్లో సుందర నగరమైన హైదరాబాద్‌కు ప్రత్యే కంగా ఒక మునిసిపాలిటీ ఉండేది. అది సాదా సీదా  కాలం కాబట్టో ఏమో... మునిసిపల్‌ వ్యవహారాల కోసం తిమ్మరాజు పూర్తి కాలం వెచ్చించాల్సి వచ్చేది కాదు. అది రాజకీయాలకు అతీతమైన బాధ్యతగా ఉండేది. ఆశ్రితులు, రాజకీయ ప్రాపకం ఉండేవి కావు. నగరాలనుగాక,  వాటి చుట్టూ తిరిగే రాజకీ యాలను మాత్రమే పట్టించుకునే నేటి రోజుల్లో అది మహా విచిత్రమే.



మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న పది నగరాల్లో ఏదీ బాగా పనిచేస్తున్నది కాదు. సేవల విస్తృతి నుంచి నాణ్యత వరకు ప్రతి విషయంలో పౌరులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఏ సామాజిక ఆడిట్‌ జరిపినా తేలుతుంది. నగర పాలక సంస్థలు డబ్బు చేసుకునే రాజకీయాలను నడిపే వేదికలుగా మారడమే అందుకు కారణం. ఇదంతా ఆయా పార్టీల భావజాలాన్ని విస్తరింపజేయడం అనే సాకు తోనే జరుగుతుంటుంది. ఒక మామూలు మనిషి కార్పొరేటర్‌గా మొదటి రెండేళ్లు పనిచేసేసరికే సంప న్నుడై పోతాడు. తమ నగరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని పౌరులకు తెలియక కాదు. ఒక పార్టీకి ఓటు చేస్తేనో లేదా ఒక పార్టీని గద్దె దించితేనో తేడా ఉంటుందని భావిస్తున్నట్టయినా వారు నటించరు. ఏదైనా మార్పు వచ్చినా అది సాధారణంగా యథా తథ స్థితిని తెచ్చేదే. ఒకటో రెండో అరుదైన పట్ట ణాలు ఇందుకు మినహాయింపు కావచ్చు. మన నగ రాలు ఇక మారవని పౌరులు రాజీపడిపోవడం వల్లనే అవి మరింత అధ్వానంగా మారుతున్నాయి.



రాజకీయాల వంతుకు వస్తే... ప్రత్యేకించి ఈ పది నగరాల ఎన్నికల బరిలో ఉన్న పార్టీలన్నీ నగ రాన్ని అధ్వానంగా నడçపుతూ బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయని బాపతే. ప్రత్యేకించి ఇది, దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన ముంబై నగర పుర పాలక సంస్థకు మరింతగా వర్తిస్తుంది. ఎవరో నగ రాన్ని బాగు చేస్తారని ఆలోచించరు... అంతా మెరు గుపరుస్తామనే వారే. అది చేయరేమని ఎవరూ అడ గక పోవడమే విచిత్రం! పౌరులు దీన్ని రాజకీయ మల్లయోధుల క్రీడగా చూస్తుంటారనిపిస్తుంది. విజేతే మొత్తం కొల్ల సొత్తునంతా ఎగరేసుకుపోతాడు. వీక్షకులకు... పారిశుద్ధ్యం లోపించిన వీధులు, క్రమం తప్పుతూ సాగే నీటి సరఫరా, అరకొర సిబ్బందితో, సదుపాయాలు లేని ఆసుపత్రుల వంటి చిల్లర కాసు లను దులపరిస్తారు. మార్క్సిజం, లేదా హిందుత్వ లేదా ప్రాంతీయ అస్తిత్వాలు వగైరా ఏ ఇజమూ నగర పరి పాలన విషయంలో మినహాయింపు కాదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రాతినిధ్య ప్రాతిపదికపైన పని చేసేవి, పురపాలక సంస్థలు ‘‘స్వయంపాలక’’ సంస్థలు అనే విషయాన్నే మరచిపోయాం.



పోలింగ్‌ బూత్‌ నుంచి కాలు బయటకు పెట్టడం తోనే ఓటరు బాధ్యత ముగిసి పోతుంది. ఇకపై వారు మాట్లాడటానికి లేదు. వారు ఎన్నుకున్న వారు గొప్ప వారు, శక్తివంతులు అయిపోతారు. ఇక వారు అనుగ్ర హించినది పుచ్చుకోవడమే. ఎవరైనా ఏదైనా పౌర సదుపాయాన్ని కల్పించినా.. అది వారు దయదలచి చేసేదే తప్ప, వారి విధి కాదు. పౌర పాలనా వ్యవహా రాల్లో తాము భాగస్వాములం కామన్న నిర్ధారణకు పౌరులు దాదాపుగా వచ్చేశారు.



ప్రజా ప్రయోజనాల పట్ల పట్టింపు ఉన్న పౌరులు కొందరు పురపాలక ఎన్నికల్లో ‘‘పౌర అభ్య ర్థులు’’గా బరిలోకి దిగినా.. అది ముఖ్య వార్తాంశమే అవుతుంది తప్ప, తోటి పౌరులు వారిని ప్రోత్సహిం చరు. వారికి ఓటు వేయడం అంటే దాన్ని వృథా చేయడమేనని భావిస్తారు. అలాంటి స్వతంత్రులు గెలిచినా, రాజకీయ కార్పొరేటర్లు వారిని పనిచేయని స్తారా? అని విస్తుపోతుంటారు. గత దశాబ్ద కాలంలో ముంబై అలాంటి ఒకే ఒక్క స్వంతంత్రుడు, ఒక రాజకీయ పార్టీ మద్దతున్న మరో స్వతంత్రుడు కార్పొరేటర్లు కావడాన్ని చూసింది. అలాంటి పౌర సమష్టి కూటములు స్వభావ రీత్యానే నిర్ధిష్ట రూపం లేనివి. అవి ఆర్థిక సమస్యలతో సతమతమౌతాయి. అవి రాజకీయాలకు దూరంగా ఉండేవి. కాబట్టి వాటికి రాజకీయ పార్టీల ప్రాపకం లభించకపోవడం అనే అననుకూలత కూడా ఉంటుంది. ఓటర్లకు కావా ల్సింది కూడా ప్రాపకమే అనిపిస్తుంది. అక్రమ కట్టడా లను క్రమబద్ధీకరించడం లేదా కొత్త ఆక్రమణలను అనుమతించడం వంటి తమ వ్యక్తిగత కోరికల కోసం నియమ నిబంధనలను వంచడం గురించి మాట్లాడు తారు. అంతేగానీ నగరం బాగుపడటం గురించి మాత్రం కాదు.



మహేష్‌ విజాపృకర్‌

సీనియర్‌ పాత్రికేయులు

ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top